Menu

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

khudaa-ke-liye-2.jpg

“ఖుదా కే లియే”, “ఖామోష్ పాని” తరువాత, నేను చూసిన పాకిస్తానీ సినిమా ఇది. అంటే నా జీవితంలో చూసిన రెండవ పాకిస్తానీ సినిమా అన్నమాట. “షోయబ్ మన్సూర్” దీనికి దర్శకుడు. పాకిస్తాన్ టి.వి. లో చాలా కార్యక్రమాలు,సీరియళ్ళు తీసిన ఇతడికి ఇదే మొదటి సినిమా. 9/11 తరువాత “ముస్లిం ఐడెంటిటీ” గురించి చర్చించిన ఈ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా గుర్తించవచ్చు. ముస్లింల పట్ల మిగతా ప్రపంచం (ముఖ్యంగా అమెరికన్ల) మారిన వైఖరితోపాటు, ముస్లిం సమాజంలోనే కఠోర ముస్లింలు (fundamentalists) ఉదారవాద ముస్లింల(liberalists) మధ్యకూడా పెరిగిన అగాధాన్ని,అపనమ్మకాన్ని, విలువల ఘర్షణని ఇద్దరు అన్నదమ్ముల కధ సహాయంతో తెలియజెప్పడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రమాదం లో ఉన్న సమాజాలలో సృజనాత్మకత పెల్లుబుకుతుంది అనడానికి, ఇది ఒక ఉదాహరణ. అసలు పాకిస్తానీ సినిమాలు రిలీజుకాని (‘బాలీవుడ్’ లో పోటీపడగల సత్తా లేదని) భారతదేశం లో, ఈ సినిమా వచ్చి, అభినందనలతో పాటూ వ్యాపారపరంగా కూడా విజయం సాధించడం తో, మానవీయఅనుభూతులకు సరిహద్దులు లేవని తెలియ జెప్పినట్టైంది. సాంకేతిక పరంగా ఈ చిత్రం చెప్పుకోదగ్గది కాకపోయినా, విషయవస్తువు బలం అన్నిలోపాలనీ మరుగుపరిచేస్తుంది. మరొక్క విషయం ఏమిటంటే,ఈ చిత్రం లోని చాలా సీన్లలో, ‘ముస్లిం’ అన్నపదాన్ని ‘హిందు’ అని, ‘పాకిస్తాన్’ అన్న పదాన్ని ‘ఇండియా’ గామార్చినా, వచ్చే “ఎఫెక్టు” ఒక్కలాగే ఉంటుంది. అంటే ఈ సినిమా లో చర్చించిన సమస్య భారతీయుల సమస్యలకి ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించవచ్చు. అందుకే ‘ఖుదా కేలియే’ గొప్పచిత్రాల సరసన కాకపోయినా, “ముఖ్యమైన సినిమా”గా నిలుస్తుంది.

కథ: పాకిస్తాన్ లోని ‘లాహోర్’ లో నివసించే ఇద్దరు అన్నదమ్ముల సంగీతభరితమైన కథ ఇది. చిన్నతమ్ముడు, ‘సర్మద్'(ఇమాన్ అలి) క్రమేణా కఠోర ఇస్లాం పట్ల (దాదాపు బ్రెయిన్ వాష్ చెయ్యబడి) ఆకర్శితుడై, సంగీతం (“మౌసికి”) ఇస్లాం కు విరుద్ధమని భావించి తనలోని కళకు దూరం కావడమే కాక ఇస్లాంను కాపాడుతున్నాననే భ్రమలో, బ్రిటన్ నుండి వచ్చిన తన చిన్నాన్న కూతుర్ని బలవంతంగా (అమ్మాయి తండ్రి ప్రోద్బలంతోనే) పెళ్ళిచేసుకుని వ్యక్తిగా కూడా పతనమౌతాడు. “ముజాహుద్దీన్” లా పాకిస్తాన్-ఆఫ్గనిస్థాన్ సరిహద్దు గ్రామంలో తల్లిదండ్రులకు దూరంగా నివసించడానికి పూనుకుంటాడు.

స్వతహాగా ఉదారవాది అయిన అన్న ‘మన్సూర్'(షాన్), తన సంగీత సాధనకై చికాగో (అమెరికా) సంగీత కళాశాల లో చేరుతాడు. ఇక్కడ జెన్నీ అనే అమెరికన్ సహవిధ్యార్థిని తో ప్రేమని,జీవితాన్ని పంచుకుంటాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉదంతం తరువాత మన్సూర్ ను అనుమానంతో (ముస్లిం అన్న ఒకేకారణం వల్ల), ‘టెర్రరిస్టు’గా ముద్రవేస్తారు.

వీరిద్దరి జీవితాలు చివరికి ఏమయ్యాయి అన్నదే ఈ చిత్ర కథ.

khudakayliye.JPGవిశ్లేషణ: సినిమా 2002 లో (అమెరికా లోని) ఒక మానసిక చికిత్సాకెంద్రం లో చికిత్స పొందుతున్న ‘మన్సూర్’ ని చూడటానికి వచ్చిన ‘జెన్నీ’ తోమొదలై, కట్ చేస్తే “2000 సంవత్సరం లో లాహోర్ లో” గా అసలు కథ ప్రారంభమౌతుంది. ఇది ఫ్ల్యాష్ బ్యాకా అన్నవిషయం లో సృష్ట్రత రాలేదు,కానీ సమాంతరంగా లండనులో జరిగే `మేరీ’ (ఫద్వా అలి) కథ మళ్ళీ ‘ఇంటెర్ కట్’ తో ఫరిచయమయ్యేసరికి ఇది డైరెక్టర్స్ “నెర్రెటివ్” అని అర్థమైంది.

లండన్ లో మొదలయ్యే, ‘మేరి’ ఉపకథ ఈ చిత్రంలో చాలాకీలకం. కోన్ని కోణాలలోంచి చూస్తే, ఈ సినిమా ఇద్దరన్నదమ్ముల కథ ఎంతో, ‘మేరి’ది కూడా అంతే. పాకిస్తానీ తండ్రికి, బ్రిటిష్ తల్లికి పుట్టిన మేరీ, తల్లి విడిపోయిన తరువాత, ఇంకో బ్రిటిష్ వనితతో జీవిస్తున్న తండ్రితో ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ “ముస్లిం”గా బ్రతకని ఈ తండ్రికి, తనకూతురు ఒక శ్వేత యువకుడిని ప్రేమిస్తుందని తెలిసేసరికి మతం, దేశం గుర్తుకు వస్తాయ్. నిర్లజ్జగా తనుచెప్పే వివరణ “నా తరువాత నా వంశం ఏమైపోతుంది” అని. తెల్ల మహిళలతో జీవితం పంచుకున్న ఇతడికి, తన కూతురు ప్రేమిచినవాడు మాత్రం, “గోరాచమ్డాగాడు (తెల్లతోలు)”అయిపోతాడు. సాధారణంగా ఉండే పశ్చిమాసియా (ఇందులో భారతదేశం కూడా ఉంది) మగవాళ్ళ ‘హిపోక్రటిక్’ భావజాలానికి ప్రతీక ఇతడు. అంతటితో ఊరుకోక, కూతుర్ని పాకిస్తాన్ తీసుకువచ్చి మోసంతో “ముస్లిం యువకుడి” కిచ్చి,బలవంటంగా పెళ్ళి చేసే (లేటువయసులో మతం గుర్తుకువచ్చే) మతఛాందసవాది ఈతడు.

‘డ్రామా’ పరంగా, ఈ ఉపకథను ప్రధాన కథ తో కలిపే విధానం చాలా బాగా పడిందని చెప్పవచ్చు. ఈ లేటువయసు మతఛాందసవాదికి లాహోర్ లో ఉన్న అన్న-వదినలు, మన ‘హీరో అన్నదమ్ముల’ తల్లిదండ్రులే. వీరు పాకిస్తాన్ లో జీవిస్తున్న ఉదారవాదులు. భావస్వేచ్చ, మతపరమైన స్వేచ్చ, కళలపట్ల మక్కువ కలిగిన “మంచి ముస్లింలు”. పాకిస్తాన్ వచ్చి తన అన్న-వదినలతో ‘మన్సూర్’ తో ‘మేరీ’ పెళ్ళి ప్రస్తావన తెస్తాడు మేరీ తండ్రి, దానికి వారు, “మన్సూర్ ను ఈ పెళ్ళి గురించి ‘అడగగలం’ కాని, పెళ్లి చేసుకోమని చెప్పలేము” అంటారు. ఈ ఒక్క వాక్యం చాలు, వీరి మధ్యనున్న వైరుధ్యాన్ని తెలియపర్చడానికి. ‘మన్సూర్’ కూడా, “ఈ మోసం లొ భాగం కాలేనని” తోసిపుచ్చి తన వ్యక్తిత్వాన్ని పరిచయంచేస్తాడు.

ఇది ఇలా సాగుతుండగానే, మౌలానా తాహిరి(రషీద్ నాజ్) అనే ఒక మత గురువు బోధనలతో ‘మూఢ ఇస్లాం’ దిశగా సాగుతున్న ‘సర్మద్’, తన జీన్స్ ,టీషర్టు ని త్యజించి, ముస్లిం వేషధారి ఔతాడు. ఒక స్థితిలో, అప్పటిదాకా “హిజాబ్” (బురఖా) తోడగని తల్లిని, ఈపద్దతి పాటించమని చెబుతాడు. ఈ సందర్భం లో తన అమ్మమ్మ చెప్పే ఒక వాక్యం, తిరోగమన దిశగా ఉన్న పాకిస్తాన్ సంస్కృతికి అద్దంపడుతుంది. తను అంటుంది, “మున్నీని (ఇప్పుడు సర్మద్ అమ్మ) చిన్నతనం లో స్కూలుకు పంపుతున్నప్పుడు, తను “హిజాబ్” పాటిస్తుందా, లేదా అన్న ప్రశ్న సమాజం లేవనెత్తింది.కాని ఇప్పుడు, ఇన్నేళ్ళ తరువాత తల్లిని, కోడుకు హిజాబ్ పాటించమని అడుగుతున్నాడు, ఇంతకంటే విచిత్రం ఉందా ” అని. నిజమే! ఒక పురోగమన దశ తరువాత, మళ్ళీ క్రితం స్థాయి కి వెళ్ళాలని కోరుకోవడం విచిత్రమే. కాని, పాకిస్తాన్ లో జరుగుతున్న పరిస్థితులు అలాంటివి మరి. సర్మద్ లో పెరుగుతున్న ఈ ముస్లిం ఛాందస వ్యవహారశైలిని చూసి మేరీ తండ్రి, సర్మద్ తో మేరీ పెళ్ళి సరైనదని నిశ్చయించుకుని అడగడం జరుగుతుంది. తన గురువు తో చర్చించి, ఇలా చేస్తే ఇస్లాం కు మంచి జరుగుతుందని నమ్మి, బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడు.

అమెరికా (చికాగో) లో ఉన్న మన్సూర్ కు సహ సంగీతకారిణి అయిన జెన్నీ తో పరిచయం అవుతుంది. ఈ సీన్లో దర్శకుడు ‘సంగీతానికి సరిహద్దులు లేవని’ చాలా సున్నితంగా చెప్పాడు. పాకిస్తాన్ అనే దేశం ఎక్కడుందో, ఫింగర్ చిప్స్ తో మ్యాప్ వేసి మన్సూర్ చూపిస్తే, ఈ దేశం ఎక్కడుందో తెలియని జెన్నీ, అప్పటి వరకూ తను వింటున్న “నుస్రహ్ ఫతే అలి ఖాన్” సీడీని మన్సూర్ కు బహుమతిగా ఇస్తుంది. తరువాత వారి మ్యూజిక్ క్లాసులో జరిగే “ఫ్యూజన్ మ్యూజిక్” సాక్షిగా పేమించి, పెళ్ళి చేసుకుంటారు. కాని ఇతడి జీవితం 9/11 తరువాత అతలాకుతలమై, మానసిక చికిత్సాకేంద్రంలో తేలుతాడు.

మరోవైపు, తమ్ముడు సర్మద్, మేరీ వేసిన “బలవంతపు పెళ్ళి” కేసులో ముద్దాయిగా, పాకిస్తాన్ కోర్టులో నిలుస్తాడు. కోర్టులో, మౌలానా వలి(నసీరుద్దీన్ షా) ఇస్లాం కు చెప్పిన నిర్వచనాలు విని, మంచి ముస్లిం గా మారే ప్రయత్నంలో తను మనిషిగా ఎంతగా దిగజారాడో,పతనమయ్యాడో గ్రహించి తను క్షమార్హుడు కాదంటూ రోదిస్తాడు.

ఇక్కడ, ససీరుద్దీన్ షా “సర్ప్రైజ్ ఎంట్రీ” ఇచ్చే మౌలానా అలి పాత్ర గురించి, తను ఇస్లాం మతం గురించి ఇచ్చే విశ్లేషనలు గురించి చెప్పక తప్పదు. అసలు ఆచరణ రీత్యా, వ్యవహార రీత్యా,పెంపకం రీత్యా ఎవిధంగానూ ముస్లింకాని, మేరీని కేవలం ముస్లిం పేరు (ఆచరణలో ఇతనూ ముస్లిం కాదు) పెట్టుకున్న వ్యక్తికి పుట్టడం వల్ల ఈ మతానికి చెందినది అనడం చెల్లదంటాడు. బలవంతపు పెళ్ళి, అసలు ఇస్లాం మత విరుద్ధమని, ఈ చర్యలో భాగంపంచుకున్న అందరూ దోషులేనని, ఖురాన్ ను ఉటంకిస్తూ తేలుస్తాడు. ముస్లిం “లిబాస్” (వేష భాషల) గురించి తన తర్కం, నిజంగా ఒక కనువిప్పు. “ముస్లింలు వేసుకునే దుస్తులు, కాలమాన స్థితిగతులను బట్టేకాని, అలాస్కాలోఎవరైనా ఇస్లాం మతాన్ని పుచ్చుకుంటే, వారిని కూడా కుర్తాపైజామా తోడగమనడం హాస్యాస్పదం” అంటాడు. ఇక ఇస్లాంలో “గెడ్డం” యొక్క ప్రాముఖ్యత గూర్చి తాను తెల్పిన విధానం వింటే, ఇస్లాం లోని భక్తి తత్వం తో పాటు, గడ్డం పట్ల కూడా గౌరవం కలుగుతుంది. “భక్తి పారవశ్యాం లో ఒకస్థాయిని దాటిన తరువాత, భక్తుడు తన స్వామిని పోలి తనూ ఉండాలనుకుంటాడు,ఆ భావనతో ‘మహమ్మదు ప్రవక్త’ రూపు దాల్చే ప్రయత్నం లో, గడ్డం పెంచడం జరుగుతుంది. అంతేతప్ప, గడ్డం మంచి ముస్లిం కు “క్వాలిఫికేషన్” కాదని, భక్తిభావన ఉచ్చస్థాయి చేరిన తరువాత రావలసిన భావనని, మొదటి దశలొనే చేయమని యువతని మభ్యపెట్టడం సరైనది కాదు” అని చెబుతాడు.అంతేకాక ఇస్లాం మతంలో సంగీతానికి గల ప్రాధాన్యాన్ని కూడా తెలియజెబుతాడు.

కోర్టు కేసు గెలిచి విముక్తి పోందిన మేరీ, లండన్ వెడుతూ “every thing is not fine ” అని లాహోర్ విమానాశ్రయం నుండి వెనుదిరిగి, తను బందీగా గడిపిన ‘వజీరిస్తాన్’ లోని పిల్లలకు చదువు నేర్పడం. జెన్నీ, మతిచలించి కదలలేని స్థితి లో ఉన్న మన్సూర్ ని పాకిస్తాన్ లోని, తల్లిదండ్రుల వద్దకు పంఫడం. ఆఖరుగా ఈ పరిణామాలవల్ల చితికిపోయిన ఆ కుటుంబం గడుపుతున్న ఒక సాయంత్రం దృశ్యం, సర్మద్ జీన్స్ ప్యాంటు తో వచ్చి మసీదులో నమాజు చదవడం తో సినిమా ముగుస్తుంది. కోంత మార్పుకు అవకాశం ఇంకా ఉంది, అన్నట్టుగా పాజిటివ్ నోట్ తో సినిమా ఆఖరవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న పరిస్తితులలో అద్దంపడుతుంది.

నటన, ఇతర సాంకేతిక అంశాలు: ‘మన్సూర్’ గా ‘షాన్’ చేసిన నటనలో (నసీరుద్దీన్ షా మినహా) అందరికన్నా పరిణితి కనిపిస్తుంది. ‘సర్మద్’ గా ‘ఇమాన్ అలి’ నటన పరవాలేదనిపిస్తుంది. ఇక ‘మేరీ’గా ‘ఫద్వా అలి’ నటన ప్రధమార్థం కన్నా ద్వితీయార్థంలో వన్నెతెస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకొదగ్గ నటన ఈ ఇద్దరు మౌల్వీల(మతపెద్దల) దగ్గరనుండి వచ్చింది. ఒకరు మిలిటెంట్ ప్రభోధకర్త గా చేసిన ‘రషీద్ నాజ్’ది అయితే మరొకరు always great నసీరుద్దిన్ షా.

సంగీత ప్రధానమైన సినిమాకాక పోయినా, ఈ చిత్రంలో సంగీతం ఒక ప్రముఖ పాత్ర మాత్రం ఖచ్చితంగా పోషించింది. ఈ చిత్రానికి ‘మార్క్ బెర్లిన్’ సంగీతదర్శకత్వం వహిస్తే, అన్ని పాటలనూ దర్శకుడు ‘షోయబ్ మన్సూర్’ వ్రాశారు. ఈ చిత్రం లోని పాటలని,సంగీతాన్ని http://www.musicindiaonline.com/music/hindi_bollywood/s/movie_name.9221/ ఈ లంకెద్వారా వినచ్చు.

దర్శకత్వపరంగా, స్క్రిప్టు పరంగా కోన్ని సమస్యలు ఉన్నప్పటికి, సినిమా యొక్క ఉద్దేశం ముందు అవి అంతగా పట్టించుకోదగ్గవి కావు. ఏది ఏమైనా ఒక అత్యవసరమైన కాంటెంపరరీ సమస్యని ఈచిత్రం స్పృశించింది. తప్పక చూడవలసిన సినిమా ఇది.

14 Comments
  1. sasank May 14, 2008 /
  2. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 14, 2008 /
  3. రాజేంద్ర May 25, 2008 /
  4. raamesabaabu December 13, 2008 /
  5. అభిమాని February 26, 2010 /
  6. Rotham February 26, 2010 /
  7. saumyae February 27, 2010 /
  8. జయ November 7, 2010 /
  9. పోక ఈశ్వర్ November 8, 2010 /