Menu

ఇష్కియా : ఆకర్షణ – ప్రేమ – మోసం

హిందీ సినిమా మారిపోయింది. ఎదిగిపోయింది. తనదైన శైలిలో హాలీవుడ్ కి ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తోంది.
ఈ మాటలకు సాక్ష్యం “ఇష్కియా”.
గత సంవత్సరం ‘కమీనే’ లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన విశాల భరద్వాజ్ నిర్మాతగా అభిషేక్ చౌబే అనే నూతన దర్శకుడు తీసిన చిత్రమిది.

ఖాలూజాన్: తుమ్ నే ఏ క్యూ కియా? ముఝే వజహ్ జాన్నా హై” –  నువ్వెందుకిలా చేసావు? నాకు కారణం కావాలి.
కృష్ణ: “ఇష్క్ బేవజా హోతీహై” – ప్రేమకు కారణాలుండవు.

డబ్బులు కొట్టేసి, నేపాల్ బార్డర్ క్రాస్ చేసి పర్మనెంటుగా పారిపోవాలనుకునే ఇద్దరు దొంగలు.ఒకడు సీనియర్ దొంగ (నసీరుద్దీన్ షా) మరొకడు జూనియర్ దొంగ (అర్షద్ వార్సీ).బార్డర్ లో ఉన్న ఒక గ్రామంలో పాత పరిచయస్తుడింట్లో తలదాచుకోవడానికి వస్తారు. అతడే తమని బార్డర్ క్రాస్ చెయ్యించగలడని నమ్ముకొని వస్తారు.వచ్చేసరికీ అతను చనిపోయాడనే వార్త తెలుస్తుంది. ఆ పరిచయస్తుడి అందమైన విధవరాలు (విద్యాబాలన్) ఒక రహస్యాన్ని గుప్పెట్లోపెట్టుకుని ఎదురుగా నిలుస్తుంది.

అంతే…ఆక్కడ్నుంచీ ముగ్గురి జీవితాలూ మారిపోతాయి. అభిమానం, ఆకర్షణ, ప్రేమ, అనుమానం, ఈర్ష,అసూయ, ద్వేషం…ఇంకా…ఇంకా…ఎన్నో ఉద్వేగాలు మన ముందుకొస్తాయి.ప్రమాదాలూ, ప్రమోదాలూ, హాస్యాలూ, అపహాస్యాలూ, వలపువలలూ, ప్రేమ అలలూ, కిడ్నాపులూ డ్రామాలూ అన్నీ మొదలౌతాయి. రోలర్ కోస్టర్ రైడ్ లాగా ప్రేక్షకుడ్ని గిరికీలు కొట్టిస్తాయి.ఇన్ని జరుగుతున్నా ప్రేక్షకుడి ముఖం మీద చిరునవ్వు దాదాపు సినిమా మొత్తం చెరగదు. అందుకే It’s a perfect black comedy అనక తప్పదు.

సాధారణంగానే పాత్రల్లో జీవించే నసీరుద్దీన్ షాకి జీవమున్న ‘ఖాలుజాన్’ పాత్ర దొరికితే చెప్పడానికి ఏముంది? చూసి “ఆహా” అనుకోవాలి. అంతే!
మున్నాభాయ్ సినిమాల్లోని సర్కిట్ పాత్ర ఛాయలనుంచీ అర్షద్ వార్సీ ఎప్పుడు బయటకొస్తాడా అని ఎదురుచూసేవారికి ఈ ‘బబ్బన్’ పాత్ర చూపించాల్సిందే. అర్షద్ వార్సీ నిజంగానే మంచి నటుడు అని చెప్పొచ్చు.

ఇక…‘కృష్ణ’ పాత్రలో విద్యాబాలన్. ఈ మధ్యకాలంలో ఇంత సంక్లిష్టమైన స్త్రీపాత్ర భారతీయ సినిమాలో రాలేదనుకుంటాను. పాత్ర ఎంత క్లిష్టమైనదో విద్యా బాలన్ నటన అంత పరిణితి చెంది ఆకట్టుకుంటుంది.భార్యగా, ప్రేమికురాలిగా, ఒంటరి విధవరాలిగా, వలపువలలు విసిరే వగలాడిగా, తన ఆకర్షణని ఎరగాచూపి మానిప్యులేషన్ చేసే వలపుగత్తెగా, గన్ పాయింట్ పైన బెదరగొట్టగలిగిన జాణగా ఎన్నో ఛాయల్లో సాఫీగా ఒదిగిపోయింది. శృంగార సన్నివేశాల్లో తను చూపిన సహజత్వం, శరీరం చేతకూడా నటింపజేయగలిగిన విద్యాబాలన్ చాతుర్యం అక్కడక్కడా నోరెళ్ళబెట్టి చూసేలా చేస్తుంది. విద్యాబాలన్ భర్తగా నటించి నూతన నటుడు (పేరు తెలీదు) కూడా గుర్తుండిపోతాడు. మిగతాపాత్రలు కూడా సినిమా నుంచీ బయటికొచ్చినా వెంటాడతాయి. కొన్ని పాత్రలు పెదవులపై  మళ్ళీమళ్ళీ నవ్వుని తెప్పిస్తాయి.

కథ-మాటలు-స్క్రీన్ ప్లే విషయంలో విశాల్ భరద్వాజ్, సబ్రినా ధవన్ ప్రమేయం ఎంత ఉన్నప్పటికీ దర్శకుడిగా అభిషేక్ చౌబే తన మార్క్ ఈ చిత్రం ద్వారా ఏర్పరుచుకున్నాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇష్కియాకి సంగీతం మరో ప్రధామైన ఆకర్షణగా నిలుస్తుంది. సందర్బోచితమైన పాటలు, లోతైన అర్థాలున్న గుల్జార్ సాహిత్యం పాటల్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. “దిల్తో బచ్చా హైజీ” పాటలో రాహత్ ఫతేఅలోఖాన్ గాత్రం, “అబ్ ముఝే కోయీ” “బడీ ధీరేజలీ” పాటల్లో రేఖా భరద్వాజ్ గానం వింటే మరోలోకాలకి వెళ్ళాల్సిందే. సినిమాలో కూడా ఈ పాటల చిత్రీకరణ అదేస్థాయిలో ఉంటుంది.

ఈ సినిమా చూడకపోతే…ఒక అనుభవాన్ని ఖచ్చితంగా కోల్పోయినట్లే. అయితే ఒక్క విషయం…పిల్లల్ని మాత్రం ఇంట్లో వదిలేసి ఈ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే, this is a coming of “age” film in true sense.

21 Comments
 1. అబ్రకదబ్ర February 5, 2010 /
   • అబ్రకదబ్ర February 5, 2010 /
   • రవి February 15, 2010 /
  • vasanth February 7, 2010 /
 2. peepudeepu February 5, 2010 /
 3. pappu February 5, 2010 /
 4. budugoy February 5, 2010 /
 5. అరిపిరాల February 6, 2010 /
 6. peepudeepu February 7, 2010 /
   • peepudeepu February 10, 2010 /
 7. Vishvak February 7, 2010 /
 8. Yogi February 9, 2010 /
 9. వనమాలి February 11, 2010 /
 10. kalyan February 13, 2010 /
 11. వినయ్ February 18, 2010 /
 12. Sowmya V.B. May 12, 2010 /
 13. కమల్ May 13, 2010 /
  • కమల్ May 13, 2010 /