Menu

నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?

balance2.gif కదిలే బొమ్మలు క్రమంగా చలన చిత్రంగా రూపుదిద్దుకున్న కొద్దికాలానికే సినిమా గురించిన వార్తలు, వాణిజ్య ప్రకటనలు, క్రమంగా ప్రివ్యూలు, సమీక్షలూ మొదలయ్యాయి. కొంచెంఅటూ ఇటూగా ప్రపంచ దేశాలన్నిటిలో ఇదే క్రమం కనిపిస్తుంది. సినిమాలకు సమీక్షలు అవసరమా అంటే నూటికి తొంభై భారతీయ సినిమాలకు అవసరం లేదు. ఆమాటకొస్తే హాలీవుడ్ లో కూడా పెద్దగా అవసరం లేక పోయినా అక్కడ సినిమా సమీక్ష అనేది పెద్ద పరిశ్రమగా, వందలాది మందికి, జీవనోపాధిగా మారటంతో దాని అస్థిత్వానికి తిరుగులేకుండా పోయింది.

భారతీయ చలన చిత్రపరిశ్రమ ప్రపంచ స్థాయిలో మొదటి నాలుగైదు స్థానాలలో ఉంది. అలాగే తెలుగు సినిమా రంగం ఉత్పాదకతలో స్థూలంగా మొదటి రెండు స్థానాల్లో ఉంటూ వస్తొంది. మొత్తం మీద భారతీయ సినిమా విమర్శకులు ఎందరు? వందలమంది!!!!. వారిలో వాసికెక్కిన వారెందరు? గుప్పెడు మంది. అదే సూత్రం తెలుగు సినిమాలకూ నూరు శాతం వర్తిస్తొంది. సినిమాల గురించి రాసే వారందరూ సినీ విమర్శకులు కాదు.అలాగే సినీసమీక్షలు రాసే వారందరూ సినీ విమర్శకులు కారు. సినీ విమర్శ అనేది అసిధారావ్రతం కాగా,సినిమా సమీక్ష కూడా దాదాపు అంత అప్రమత్తంగా వ్యవహరించవలసిన బాధ్యతే. క్లుప్తంగా సినిమాను పరిచయం చేసి ఆసన్నివేశం బాగుందీ,ఇక్కడ హీరో నటన అధ్వానంగా ఉందీ ,అక్కడ ఎడిటింగ్ లో జంపులున్నాయి అంటూ రాసుకొచ్చేది సమీక్ష లాంటిదే కానీ సమీక్ష కాదు,అలాగే సినీవిమర్శ కూడా కాదు.

తెలుగు సినిమా సమీక్షలు కాలక్రమం లో అంటే ఇన్ని దశాబ్దాల తర్వాత ఎంతో పరిణితి సాధించాల్సింది పోయి,నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లు ఎందుకు తయారవుతున్నాయి? గొప్ప సమీక్షలు వచ్చేందుకు గొప్ప సినిమాలు ఎక్కడొస్తున్నాయి అనేది సాధారణమైన సమాధానం. సామాన్యమైన సినిమాలను ప్రచారమనే సాధనంతో సూపర్ డూపర్ హిట్లుగా చేయటం కొన్ని సార్లు సాధ్యమవుతోంది. అలాగే సమగ్ర సమీక్ష కొన్ని సరుకున్న సినిమాలను ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా చేయగా విమర్శ ఆ సినిమాలను పదికాలాల పాటు, ప్రజలమదిలో చరిత్రలో పదిలంగా ఉండిపోయేలా చేయగలదు. మా సినిమా చూడండహో అని నిర్మాతలు, వగైరాలు చేసుకునేది ప్రచారం కాగా, సినిమా విడుదలకు ముందు పత్రికల్లో వచ్చేది ప్రివ్యూ, సినిమా విడుదల అయ్యాక సమీక్షలు, వాటికి వెనుగ్గా కొంచెంతీరిగ్గా, వివరంగా వచ్చేవి విమర్శలు. విమర్శ అంటేనే కువిమర్శ అనే అర్ధంఎందువల్లో ప్రజాబాహుళ్యంలోస్థిరపడి పోయిఉన్నందువల్ల, విమర్శకుడంటే మనమీద చెడు చెప్పేవాడనే అర్ధం ఇంకా మనలను వదలటం లేదు. విమర్శకుడంటే మనమంచిచెడూ పరామర్శించే శ్రేయోభిలాషి. సినిమాను ఒక కళారూపంగా ఎందరో సమష్టికృషికి ప్రతిరూపంగా భావించే భావుకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు.

సమీక్షకుడు కొన్ని పరిమితులతో సినిమాను వీక్షిస్తాడు. అంటే ఏదో ఒక పత్రికలోనో, వెబ్ సైట్ లోనో, టీవి చానల్లోనో ఉద్యోగి కావచ్చు, లేక గౌరవవేతనంమీద పనిచేసే వారు కావచ్చు. ఆయా ప్రచురణసంస్థలకుండే పరిమితులు వారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. చలనచిత్ర రంగంతో వారికుండే సంబంధబాంధవ్యాలు, వ్యాపార లావాదేవీలు, అభిమానుల కోపతాపాలు సర్కులేషను మొహమాటాలు, ఇలా ఎన్నో కారణాలు మనకు మంచి సమీక్షలను దూరంచేస్తున్నాయి.

తెలుగు దిన పత్రికల్లో అత్యధిక సర్క్యులేషను గల ఈనాడు ప్రింట్ ఎడిషన్లో సినిమా సమీక్షలు ప్రచురించకపోయినా on-line ఎడిషనులో మాత్రంనిక్కచ్చి సమీక్షలు ప్రచురిస్తొంది. స్వంత నిర్మాణ సంస్థ , పంపిణీ వ్యవస్థా, స్టుడియో ఉండి కూడా వారపత్రిక సితారలోనూ, ఈనాడు లోనూ సమగ్ర సమీక్ష లను ప్రచురిస్తొన్న ఈనాడు ప్రయత్నాలు అభినందనీయం. తెలుగు దినపత్రికల్లో నిష్కర్ష గా సినిమాసమీక్షలు మాత్రం ఆంధ్రభూమి స్వంతం. భూమిలో సమీక్ష ఫలానా సినిమాను చూడొద్దంటే నిర్మొహమాటంగా మనం ఆ ఆలోచన మానుకోవచ్చు. అసలు పత్రికల్లో నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు? అనే ప్రశ్న జిజ్నాసువులను ఎప్పటినుంచో వెంటాడుతూనే ఉంది. ఎన్నోసార్లు ఎందరో ఈ సందేహనివృత్తి కోసం యత్నించారు గానీ సఫలత నొందలేక పోయారు.

బహుశా ఒకేఒక్క సంపాదకుడు మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. స్థలం: విజయవాడ, 1977 అగష్టు నెల, సందర్భం: “ఊరుమ్మడి బతుకులు “సినిమా ఉత్తమప్రాంతీయ భాషాచిత్రంగా జాతీయస్థాయిలో ఆవార్డు పొందిన సందర్భం లో జరుగుతున్న పాత్రికేయ గొష్టి. అంటే ప్రెస్ మీట్ అన్న మాట. ఆచిత్ర దర్శకుడు బియస్ నారాయణ మాట్లాడుతూ సినిమా సమీక్షలు నిష్పాక్షికంగా , మార్గదర్శకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని కొరారు. దానికి స్పందిస్తూ అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు నండూరి రామమోహనరావు, నిష్పాక్షికంగా , మార్గదర్శకంగా, నిర్మాణాత్మకంగా, సమీక్షలు రాయాలనే భావిస్తారని ,కానీ ఉన్నది ఉన్నట్లు రాస్తే నిర్మాతలు సహించజాలరని,ఫలితంగా పత్రికలకు ప్రకటనలు ఆపేస్తున్నారని,ఈపరిస్తితుల్లో ఉన్నది ఉన్నట్లు వ్రాయవలసిన పని ఏమున్నదని,ప్రశ్నించారు.పత్రికలు,నిర్మాతలు ఒకరకమైన అవినీతిలో పడి కొట్టుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

ఎప్పుడో 1977 లో నండూరి నిరసించిన పరిస్తితులే ఇంకా కొనసాగుతుండటం విషాదకరమైన వాస్తవం. అంతే కాక మరికొన్ని వైపరీత్యాలు పుట్టుకొచ్చాయి. సినిమా షూటింగు ప్రారంభమవటం ఆలస్యం ఇక ఒకటే ఊదర. ఆ గాలిదుమారంవందో రోజు వాలుపోష్టరు పడే వరకూ జనాలను ప్రలోభ పెడుతూనే ఉంటుంది. పత్రికల్లో వచ్చే సమీక్షలను కాసేపు పక్కనపెడితే గత కొంతకాలంగా వెబ్ సైట్లు ఇంకో రకమైన పద్ధతి ప్రవేశపెట్టాయి. ఒక సినిమాను విపరీతంగా ప్రమోట్ చేయటం, విదేశీహక్కులు, డివిడి హక్కులు వగైరాలు పొందేందుకు పాట్లుపడటం, ఒకవేళ వచ్చాయా, సినిమా విడుదల అయ్యాక, ఢామ్మందా, ఇక ఆసినిమా సమీక్ష మనకు ఆ సైట్లో కనిపించదు. ఈమధ్య అతిధి, గతంలో సైనికుడు ఇందుకు ప్రబల ఉదాహ రణలు.

మనకెటూ వాణిజ్య ప్రకటనలు రావనుకున్నప్పుడు వీలైనంత దుమ్ము ఎత్తి ఆ సినిమా వాళ్ళ మీద జల్లే బృందంకూడా ఒకటి తయారయ్యింది. ఈ రెండు విధానాల వల్లా ప్రేక్షకుడికి లభించేది శూన్యం. డబ్బు, సమయం, శక్తి, వృధా తప్ప ప్రయోజనం ఉండదు. గమ్మత్తేమిటంటే ఈ వెబ్ సైట్లు ఇచ్చే రేటింగులను బట్టి విదేశాలో తెలుగు ప్రేక్షకులు ఆయా సినిమాలకు ఎంతోకొంత ఆదాయ వనరులు సమకూరుస్తున్నారని విన్నప్పుడు కొంత ఆవేదన కలుగుతుంటుంది. తెలుగులో సినిమా పత్రికలు ఎన్ని అంటే గతం లో లాగా ఇప్పుడుచెప్పే పరిస్థితి లేదు. దశాబ్దాల తరబడి వస్తున్న సితార కాకుండా మరో అరడజను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండగా, అచ్చంగా అభిమానులకోసం , కొన్ని కుటుంబాల హీరోల కోసం , కొన్ని సినిమాల విడుదల సందర్భం లోనూ, మరో హీరోను అడ్డమైన తిట్లు తిట్టేందుకూ అప్పటికప్పుడు కొన్ని పత్రికలు పుట్టుకు రావటం, మళ్ళీ మాయమవటం, ఏదో తమాషాగా, బ్యానర్లు థియేటర్ల ముందు కట్టినంత సులభంగా సినిమా పత్రికలూ వస్తున్నప్పుడు వాటిలో ఎలాంటి వార్తలను, ఏస్థాయి సమీక్షలను, విమర్శలను మనం ఆశించగలం?

కొన్ని వెబ్ సైట్లలో ఇంకో రకమైన ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లీషు భాషలో వెలువడేవి, ఒక సంచలం సినిమా విడుదల కాగానే తమ అస్థాన రచయిత చేత ఒక సమీక్ష రాయిసారు. సదరు సమీక్షకుడు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, తన సమీక్షలో కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు. అంతే కొన్ని నెలలపాటు అక్కడ వీక్షకుల కామెంట్లు వెల్లువెత్తుతుంటాయి. వేల కొద్దీ జనం ఇష్టమొచ్చిన భాష, వీరంగం, ఒక్కటేమిటి ఎన్ని రకాల వికారాలు కావాలో అన్నీ అక్కడ మనకు దొరుకుతాయి. ప్రేక్షకులను వినోదింపజేసి, ఉర్రూతలూగించి, మాయజేసి, మభ్యపెట్టి, మత్తులోముంచి, ఇలా రకరకాలుగా ప్రజానీకాన్ని చైతన్యవంతుల్ని చేస్తున్నామని చెప్పుకొచ్చేది సినిమా ప్రచార రంగంకాగా, ఆసినిమాలో మంచిచెడూ విశ్లేషించి చెప్పేది సమీక్ష.

ఐతే విమర్శకుడు ఇంకా విస్తృతమైన పాత్ర పోషిస్తాడు. సదరు సినిమాలోని, బాగోగులతో పాటు, సమాజంలోని వివిధ పార్శ్వాలను , స్పృశిస్తూ సంఘం లోని తీరుతెన్నుల వల్ల, సినిమా ఎలా ప్రభావితం అవుతోంది, అదే సమయం లో సమాజాన్ని ఏవిధంగా పట్టి కుదుపుతుందో, తద్వారా, ఎన్ని రకాల ప్రకంపనలు, వినోద రంగంలో, కలుగుతున్నాయో అనే అంశాన్ని విమర్శకుడు ప్రతి సినిమాకు ప్రధానాంశంగా ఎన్నుకుంటాడు. సాహిత్యం, రాజకీయాలు, మీడియా, అంతర్జాతీయ సినిమా, తదితర రంగాల్లో సమకాలీన మార్పులతో అనుసంధానిస్తూ వివరిస్తాడు. అసలు సినిమా స్క్రిప్టు కన్నాసైజులో పెద్దగా వెలువడ్డ విమర్శలూ ఉన్నాయి.కురసోవా మీద అధ్యయనాన్ని పూర్తికాలపు పరిశోధనాంశంగా తీసుకున్నవారు ఎందరోఉన్నారు. ఏదేశం లోనూ మన సినిమా వాళ్ళు తీసుకున్నంత వ్యామోహం గానూ,ఈజీగానూ ఏదేశం వాళ్ళూ తీసుకోలేదన్నది మాత్రం నిజం.రాజకీయాలు,రియల్ ఎస్టేట్ ,ఏదైతేనేం వ్యాపారమేగా అనే ధోరణితో డబ్బు సంచులతో దిగిపోయి సినిమాలు తీసిపారేసే వాళ్ళ పాత్ర ఎంత ఉందో,ఎప్పటికప్పుడు సినిమా రంగం లోని పరిమాణాలను నిశితంగా గమనిస్తూ హెచ్చరించలేక పోయిన సమాచార సాధనాలదీ ఈ నిర్వాకం లో అంతే పాత్ర ఉంది.అలాగే మంచి సినిమాను చూడలేకపోవటం ఎంత బాధిస్తుందో, మంచి విమర్శను చదవలేకపోవటం కూడా అంతే వేధిస్తుంది. తెలుగులో ఇప్పటి వరకూ ఎక్కువ రచనలు మాయాబజార్ సినిమా గురించి వచ్చాయి.

అకడమిక్ వర్గాలు మొత్తంగా సినిమాను దూరంగా ఉంచటంలోని ఉద్దేశ్యాలను తర్వాత తీరిగ్గా చర్చించు కోవచ్చు. బెంగాలీ, తమిళ, కొంచెం కన్నడ భాషల్లో విద్యావేత్తలు, అలాగే, హిందీలో కొంతమేరకు సమకాలీన సినిమా పోకడల గురించి చర్చిస్తూనే వున్నారు. వివాదాస్పద సినిమాలు వచ్చినప్పుడు తప్ప మనకు తెలుగులో మేధావుల రచనలు చదివే అవకాశం ఉండదు. హాలీవుడ్ లో ….. హాలీవుడ్ లో చలనచిత్ర అధ్యయనం ఒక విస్తారమైన అంశం. అక్కడి సమాజంలోని ప్రతి ఒక్క రంగంయొక్క ప్రభావం సినిమాల మీద, సినిమా ప్రభావం మిగిలిన అన్ని రంగాల మీద అనివార్యంగా ఉంటుంది. ఒక్క ఆంగ్ల సాహిత్యమే కాక ప్రపంచ భాషల్లో వెలువడ్డ క్లాసిక్స్ అనదగ్గ ప్రతిరచనా హాలీవుడ్ లో సినిమాగా వెలువడింది, ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో హారీపాటర్ సంపుటాలు పుస్తకాలుగా, సినిమాలుగా ఎంత ప్రాచుర్యంపొందాయో అందరికీ తెలిసిన సంగతే. ఐతే అన్నీ క్లాసిక్స్ కూ ఏమాత్రం తెర మీద న్యాయంజరుగుతుంది అన్నది వేరే సంగతి. తద్వారా అక్కడ మీడియాలో, అకడమిక్ వర్గాల్లో చర్చ, కొంతమేరకు స్క్రీనుప్లే రచయితలకు దర్శక నిర్మాతలకు, ఐ ఓపెనర్ గా కూడా పనిచేస్తుంటుంది.

20 Comments
 1. వెంకట్ January 1, 2008 /
 2. cric January 1, 2008 /
 3. నెటిజనిత January 2, 2008 /
 4. Sai Brahmanandam Gorti January 2, 2008 /
 5. వెంకట్ January 2, 2008 /
 6. KRISHNA RAO JALLIPALLI January 2, 2008 /
 7. వెంకట్ January 2, 2008 /
 8. రాజేంద్ర కుమార్ దేవరపల్లి January 2, 2008 /
 9. kumarchowdary January 19, 2008 /
 10. రాజేంద్ర కుమార్ దేవరపల్లి January 19, 2008 /
 11. koresh September 13, 2008 /
 12. Krishna Reddy February 23, 2010 /
  • rajendra kumar devarapalli February 27, 2010 /
 13. టి.కే.వేణుగోపాల్ February 23, 2010 /
 14. అబ్రకదబ్ర February 24, 2010 /
  • Yogi February 24, 2010 /
   • G February 27, 2010 /
   • rajendra kumar devarapalli February 27, 2010 /