Menu

నాకు నచ్చిన “గ్రహణం”

మొన్నీ మధ్యనే సూర్యగ్రహణం అయ్యినప్పుడు, అందరూ ఆ అబ్బురాన్ని సంబరంలా ఆనందిస్తుంటే, “అయ్యో పాపం, సూర్యునికి గ్రహణం, మనకు వినోదం” అని అనుకుంటూ ఉన్నాను. ఈ రోజు “గ్రహణం” సినిమా చూశాక ఏదో తెలీని ఆనందం నన్ను కమ్మేస్తుంది. I’m in awe of the film.. it’s a beauty!

ఈ మధ్యకాలంలో సవాలక్ష కారణాల వల్ల తెలుగు సినిమాలు చూడ్డం ఎక్కువైపోయింది. సినిమా చూసి బయటకొచ్చే ప్రతీ సారీ ఓ గమ్మత్తైన సన్నివేశాన్ని ఊహించుకుంటుంటాను – రోడ్డుపై నడుస్తూ నా చేతిలో ఉన్న డబ్బు కట్ల నుండి నోట్లు తీసి విసురుకుంటూ నడుస్తున్నట్టు. కాకపోతే నిజానికి టికెట్ డబ్బులకోసం కాదు నా బాధ. అసలు బాధ ఉన్న కాస్తంత తీరికనూ అలా విచ్చలవిడిగా వ్యర్థం చేస్తున్నాననే. థియేటర్‍లో ఎటూ సమయం దండగ, బయటకొచ్చాక దాన్ని గురించి గొంతు చించుకోవడం మరీ అనవసరమనిపించి, అవతలి వాళ్ళని విమర్శించడానికి, వెక్కిరించడానికి ఒక నవ్వును సంధిస్తున్నాను. ఇవ్వాళ సంగీత్ సాగర్‍లో ఏవో మ్యూజిక్ సిడీలు యాధాలాపంగా కలెక్షన్ చూస్తుంటే, “గ్రహణం” సినిమా డివిడి కనపడింది. “హట్కే” మూవీగా దీని గురించి వినుండడం వల్లానూ, పైగా అడపాదడపా తెలుగులో వచ్చే ప్రయోగాలని విస్మరించి తెలుగు సినిమా గురించి ఆవేశంగా ఉపన్యాసాలు ఇవ్వడం సబబు కాదనీ, డివిడి తీసుకున్నాను.

అవార్డు సినిమా కదా, నిడివి తక్కువుండి కాస్త త్వరగా అయ్యిపోతుందన్న నమ్మకంతో మొదలెట్టాను, పూర్తిగా చూస్తానన్న నమ్మకం లేకుండానే. ఆద్యంతం ఒక “awe”తో చూశాను. డివిడి కవర్ పైనున్న కథ సారాంశమే మొదటి సగం అంతా నిండి ఉన్నా, ఎక్కడా ఆపాలనిపించలేదు. కథనం ప్రస్తుతానికి, గతానికి మధ్య ముందుకీ, వెనక్కీ పోతూ ఆసక్తికరంగా సాగింది. “ఇంతకీ ఏం జరిగిందీ?” అన్న ఉత్సుకత చివర దాకా వీడలేదు. సినిమా అయ్యిపోయాక, “ఎందుకిలా జరిగింది?” అన్న ప్రశ్న, అలా జరగటానికి కారణాలు ఏంటి? ఎవర్ని నిందించాలి? ఎవర్ని సమర్థించాలి? జరిగిన అన్యాయానికి, వృధా అయిపోయిన జీవితానికి, అగాధాల్లోకి పడిపోయిన బంధాలకి నిందితునిగా ఎవర్ని నిలబెట్టాలి? మనుషులా? మనుషులు సృష్టించుకున్న కట్టుబాట్లా? లేక నిజానిజాలను నిర్ధారణ విషయంలో మనిషికున్న నిస్సహాయత? ఎవర్ని అనాలి? దేన్ని ప్రశ్నించాలి? అని బోలెడు ప్రశ్నలు.

మానవసంబంధాలను అద్భుతంగా అద్దం పట్టగల ఏ కళ అయినా లేవదీసే ప్రశ్నలివి. జీవన ప్రవాహంలో పడికొట్టుకుపోతున్న మనల్ని ఓ క్షణం స్తంభింపజేసి, కొన్ని వేల ప్రశ్నల్ని మన నెత్తిన గుమ్మరించేసి, ఆలోచనల్లో ఉక్కిరిబికిరి చేస్తాయి.

చలం రాసిన “దోషగుణం” ఆధారంగా ఈ చిత్రం తీసారట. నేనా కథ చదవలేదు. చలంది ఆ కథే కాదు, ఆయన సాహిత్యమేదీ నేనంతగా పట్టించుకోలేదు. ఈ ముక్క అన్న ప్రతీసారి, “అదేంటి?” అన్న ప్రశ్న వినిపిస్తుంటుంది. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడది అప్రస్తుతం.

ఈ సినిమా కథలోకి వెళ్తే: ఓ డాక్టర్, ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఒక రోగి “అతడి తల్లినం”టూ వచ్చిన స్త్రీని దుర్భాషలాడి బయటకి పంపేయడం చూసి, ఆమెను అనుసరించి, వివరాలు కనుక్కొందామని ఆరా తీసేసరికి ఆ ముదుసలి కంగారుగా వెళ్లిపోతుంది. ఆమెను చూడగానే డాక్టర్‍కు ఎవరో పరిచయస్తులని చూసినట్టు అనిపిస్తుంది. వెంటనే ఆసుపత్రిలో ఉన్నవారిని ఆమె తాలూకు విషయాల గురించి ఆరా తీస్తే అరకొర సమాచారం తెలుస్తుంది. ఆ పూట, సహోద్యోగైన స్నేహితున్ని ఇంటికి పిల్చి కాఫీ ఇచ్చి ఓ కథ చెప్పటం మొదలెడతాడు. అతని కథ ప్రకారం, అతను పుట్టి పెరిగిన ఊర్లో ఒక భూస్వామి ఉండేవాడు. ఆ భూస్వామి భార్య సద్గుణ సంపన్నురాలు, అన్నపూర్ణ, అందగత్తె. అత్తగారినీ, భర్తనీ, దానధర్మాల విషయాలనూ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ ఇంటిలో కనకయ్య అనే అబ్బాయి, కటిక పేదకుటుంబానికి చెందినవాడు వారాలకి కుదురుతాడు. చురకైన, తెలివైన ఆ కుర్రాడంటే భూస్వామికీ, అతడి భార్యకీ కూడా మక్కువే! భార్య అతన్ని లాలనగా, చనువుగా చూసుకుంటూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ కుర్రాడు జబ్బు పడతాడు. ఊర్లో ఉన్న వైద్యునికి చూపిస్తారు. గుణం కనిపించకపోగా, జబ్బు ముదురుతుంది. తల్లిదండ్రులు కంగారుపడి, బంధువు సాయంతో పక్కూర్లో ఉన్న వైద్యుణ్ణి తీసుకొస్తారు. అతడూ ఏదో మందిచ్చి, “మామూలు జ్వరం కాదు, దీని పేరు దోషగుణం. తనకన్నా వయస్సులో పెద్దదైన స్త్రీతో కలవడం ద్వారా ఈ జబ్బు వస్తుంది. దీనికి ఒకటే విరుగుడు, ఆమె రక్తంతో చేసిన మందు కంటిలో పెడితే నయం అవుతుంది” అని ముక్కు సూటిగా చెప్పేస్తాడు. ఇది విన్న కుటుంబ సభ్యులు హతాశులవుతారు. ఎవరో ఆ స్త్రీ అని ఎలా కనుక్కోవాలో తెలీదు. ఆ రాత్రి నిద్రలో కుర్రాడు, భూస్వామి భార్య పేరు పలవరిస్తాడు. బంధువు “ఆమేనేమో?!” అన్న అనుమానపు అగ్గిపుల్ల గీసి వదుల్తాడు. తన బిడ్డకు పట్టెడన్నం పెట్టి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న దంపతులపై అలాంటి నింద వేయడానికి కుర్రాడి తల్లిదండ్రులు వెనకాడుతారు. జబ్బు ముదురుతుంది. ఇహ, రేపో, మాపో అన్న స్థాయిలో ఉంటుంది. తల్లిదండ్రులకి ఏం తోచదు. ఆవిడ మీదే నింద వేయడానికి పూనుకుంటారు. భూస్వామికి కూడా తన భార్య మీద అనుమానం కలుగుతుంది. అంతా కల్సి ఆమెదే పాపం అని నిర్ణయించేసుకొని ఆమె రక్తం తీసి ఇచ్చేదాకా ఊరుకోరు. ఆ మందు వేయగానే కుర్రాడికి నయం అయ్యిందా? అవ్వలేదా? జబ్బు నయం కావటాన్ని బట్టి వారిద్దరి మధ్య సంబంధం ఉన్నట్టా? – ఇవ్వన్నీ సినిమా చూడాల్సిందే!

ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు:

౧. చలం కథ ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం కథను ఒక న్యూటల్ వ్యూతో చెప్పినట్టు అనిపించింది. ఇది చలం కథ, అందులో ఒక స్త్రీని అనుమానించటం ఉన్నందున నేను దీన్ని ఒక స్త్రీ perspectiveతో చెప్పిన కథ అయ్యుండచ్చు అనుకున్నాను. సినిమా చూశాక మాత్రం, అందులోని అన్ని పాత్రలకీ సరైన న్యాయం చేశారనిపించింది.
౨. ఇందులో తనికెళ్ళ భరణి గారు భూస్వామిగా నటించారు. పాత్ర పెద్దది కాకపోయినా ఆయన నటన అమోఘం. భార్యని కొట్టి, ఆమెకి స్పృహ తప్పిపోగానే ఆమె తొడ కోసి రక్తం తీసిచ్చి వచ్చి, ఆమె కాళ్ళ దగ్గర కూర్చోని మధనపడ్డం – మహాద్భుతంగా ఉంది. భార్య అంటే ఎంతో ఇష్టం ఉన్నా, కుటుంబ పరువుకోసం, ఆమె తప్పు చేసే ఆస్కారాలని పూర్తిగా కాదనలేకపోవటం, ఇన్నేళ్ళ సహచర్యం ఆమెపై ఏర్పడ్డ గౌరవాభిమానాలు – ఇన్నింటి మధ్య నలిగే విధానాన్ని చక్కగా నటించారు.
౩. సినిమా మొత్తం నలుపు-తెలుపుల్లో ఉంటుంది. ఒక్క ఊహ / కల లాంటి సన్నివేశం మాత్రం రంగుల్లో ఉంటుంది. ఎందుకలా తీసారో అర్థం కాలేదు కానీ, చూడ్డానికి బాగా అనిపించింది.
౪. ముగింపు కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే దాని గురించి మాట్లాడలేను. సినిమా చూడబోయేవారి ఆనందాన్ని పాడుచేయలేను.

ఈ సినిమాలో నాకు నచ్చని అంశాలు:

౧. భూస్వామి భార్యగా నటించిన జయలలిత. ఈవిడ చాలా అందంగా ఉంటారు. కాకపోతే నటించిన తీరు నన్ను నిరాశపరిచింది. పట్టి పట్టి చేస్తున్నట్టు అనిపించింది. ఏ జయసుధో, రేవతిలాంటి వారో ఉంటే బాగుణ్ణు అని అనిపిస్తూనే ఉంది.
౨. కథలో భూస్వామి భార్య పాత్రకి యూనిటీ లోపించిందని అనిపించింది. అప్పటి దాకా శాంతంగా, సహనంగా తన పని తాను చేసుకొని పోయే స్త్రీ, తనని అనుమానించినప్పుడు బాధ కన్నా ఎక్కువ ఉక్రోషం చూపిస్తుంది. భర్తని “నీ తప్పులు ఎవడు చూడొచ్చాడు” అన్నట్టు మాట్లాడుతుంది. ఈ ట్రాన్సిషన్ ని సరిగ్గా చూపించలేకపోయారనిపించింది. భర్త నమ్మకం పొందలేని భార్య ముందుగా తీవ్ర మనస్థాపానికి గురైన తర్వాతే ఆగ్రహం వ్యక్తం చేస్తుందని నేను భావించటం వల్ల కూడా కావచ్చు.
౩. కొన్ని సన్నివేశాలను ఇంకా బా చూపించాల్సింది అనిపించింది. ఉదా: తనని ఎంతో వాత్సల్యంతో చూసుకునే అమ్మగారిని తన వల్ల నిందించారు అని తెల్సుకున్నప్పుడు ఆ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి కుండ బద్దలుకొడతాడు. ఇంతకన్నా అతడి కోపాన్ని, అంతకన్నా అయోమయాన్ని బాగా చిత్రీకరించి ఉండాల్సింది.

మొత్తానికి ఇదొక మంచి చిత్రం. ఒక మంచి ప్రయత్నం. నిజానిజాలని నిర్ధారించే వీలు లేనప్పుడు తన అశక్తికి మనిషి ఎలా బలి అవుతాడన్న అంశంతో తీసినట్టు అనిపించింది. కేవలం స్త్రీ తరఫున వాకాల్తా పుచ్చుకునే కథగా కాక, మనుషులనీ, వారి బంధాలని బాగా చూపించారు. సినిమాను కళగా ఆరాధించి, తమలో ఉన్న టాలెంట్‍కి సరైన మార్గం చూపిస్తే ఇలాంటి సినిమాలు మరెన్నో రావచ్చు.

మీరు చూడకపోయుంటే.. తప్పక చూడండనే చెప్తాను!

–పూర్ణిమ తమ్మిరెడ్డి

28 Comments
 1. sowmya February 24, 2010 /
  • Ashok February 27, 2010 /
 2. naresh Nunna February 24, 2010 /
 3. రవి February 24, 2010 /
  • Purnima February 24, 2010 /
 4. మేడేపల్లి శేషు February 24, 2010 /
 5. sowmya February 24, 2010 /
 6. budugoy February 24, 2010 /
 7. విష్ణుభొట్ల లక్ష్మన్న February 24, 2010 /
  • శశిపాల్ రెడ్ది రాచమల్ల February 25, 2010 /
 8. శశిపాల్ రెడ్ది రాచమల్ల February 25, 2010 /
 9. sowmya February 25, 2010 /
  • shashipal reddy March 7, 2010 /
 10. vasu February 25, 2010 /
 11. మైత్రేయి February 25, 2010 /
 12. మైత్రేయి February 25, 2010 /
 13. Srinivas February 26, 2010 /
  • GopiCM February 26, 2010 /
 14. రమ్య March 9, 2010 /
 15. chakri July 8, 2010 /
 16. v.prathap reddy February 7, 2011 /
 17. Praveen Sarma February 7, 2011 /
 18. Praveen Sarma February 7, 2011 /
 19. Praveen Sarma February 7, 2011 /
 20. Praveen Sarma April 30, 2011 /
 21. Praveen Sarma April 30, 2011 /
 22. Praveen Sarma April 30, 2011 /