Menu

డాక్యుమెంటరీ సినిమా-2

రష్యా విప్లవంలో ప్రజల సినిమా

రష్యా దీర్ఘకాలిక విప్లవంలోకి నానా రకాల ప్రజలు కలిసి వచ్చారు. లెనిన్ నాయకత్వంలో అలాంటి కృషి విజయవంతంగా నెరవేరింది. ప్రజలలోని ఎన్నో రకాల కళారూపాలు , వాటిని సృష్టించిన కళాకారులూ విప్లవంలోకి కలిసి వచ్చారు. నాటకం, చిత్రకళ, సాహిత్యం, సంగీతం మొదలైన ఎన్నో కళలు కొత్త రూపమెత్తాయి. అందుకు ఒక పరిణామ క్రమం వుంది. విప్లవం కొత్త శక్తులకు పురుడు పోసింది. కొత్త చైతన్యాన్ని, సామాజిక అవసరాలనూ ముందుంచింది.

ఒక కళారూపం కొత్త రూపమెత్తటానికి ఎన్నో అనుభవ పాఠాలు అవసరం. విప్లవం గాలిలోంచి ఊడిపడనట్లే కళారూపాలు కూడా ఒక్క రోజులో గాలిలోంచి బయటపడవు. విప్లవ పరిణామదశల ప్రభావం కళారూపాలపై కూడా పడుతూ వచ్చింది.

విప్లవానంతరమే కళలు కొత్తగా ఆవిర్భవిస్తాయన్నది భ్రమ. విప్లవానికి ముందు జరిగే అనేక పోరాటాల ప్రభావం భావ ప్రచారంలోనూ ప్రజా చైతన్యంలోనూ కనిపిస్తుంది. అదే కళారూపాల మార్పుకు పునాది.

అలాగే రష్యా విప్లవ సినిమా కూడా విప్లవానికి ముందునుంచే ప్రజలకోసం పనిచేయడం మొదలు పెట్టింది. సినిమా రంగంలోకి అనేకమంది అనేక సాంస్కృతిక రంగాలనుంచి ప్రవేశించారు.

అవసరం దృష్ట్యా ప్రాధమిక దశలో కళాత్మక విలువల కోసం ప్రాకులాడలేదు. శతాబ్దాలుగా వస్తున్న కళారూపాలు ప్రజల కోసం విప్లవ కళారూపమెత్తాయి. రష్యాలో సాంకేతిక విజ్ఞాభివృద్ధిని, విప్లవక్రమాభివృద్ధిని ఏకకాలంలో జతచేసిన ఏకైక కళారూపం సినిమా. అందుకే సాంకేతికంగా సినిమాని అభివృద్ధిలోకి తెచ్చింది. ప్రపంచ సినిమాకి మార్గదర్శకత్వం వహించిందీ, పురోగామి సినిమాకు అంకురార్పణ చేసిందీ రష్యా సినిమానే. సినిమా, సినిమా ప్రేక్షకులు కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందారు.

సినిమా చరిత్రలో సినిమాని ఎక్కడా ప్రజల కోసం ఉపయోగించుకున్న దాఖలాలు లేని కాలంలో ఆ కొత్త కళారూపాన్ని ఒక భావ ప్రచార సాధనంగా ఉపయోగించారు. వారు వివిధ రంగాల్లోంచి , వివిధ వృత్తుల్లోంచి వచ్చారు. ఉదాహరణకు పుడోవ్‌కిన్ ఒక రసాయనిక శాస్త్రవేత్త. బేటిల్ షిప్ ఆఫ్ పొటెంకిన్ అనే సినిమా తీసిన సెర్జి ఐజెన్‌స్టిన్ ఇంజనీరు. ఫ్రెడ్రిక్ ఎర్‌మలెర్ ఉపాధ్యాయుడు. డోజెంకో ఒక చిత్రకారుడు.

సినిమాని మొదటిసారిగా 1895లో లుమేరి సోదరులు పారిస్‌లో ప్రదర్శించారు. ఆ వెనువెంటనే రష్యాలో కూడా ప్రదర్శనలు జరిగాయి. 1896లో “ఒడెస్సా వార్తలు” అనే పత్రికలో సైన్సుకి , ప్రజల పురోభివృద్ధికి సినిమా చేసే ఉపకారాన్ని గూర్చి రాశారు. మొదటిసారి సినిమా ప్రదర్శన చూసి వచ్చాక టాల్‌స్టాయ్ “సినిమాలోని చిత్రీకరణ వేగాన్ని హావభావ వ్యక్తీకరణల్ని నేను సాహిత్యంలో రాయలేకపోయాను అని పిచ్చిగా తలపీక్కున్నాను. చేతివేళ్లు కొరుక్కున్నాను” అని రాసుకున్నాడు.

1905 లో రష్యా విప్లవాన్ని మొట్టమొదటిసారి ఒక కెమెరామన్ చిత్రీకరించాడు. ఇందులో మొదటి విప్లవదశలో జరిగిన ఒక ఊరేగింపును చక్కగా చిత్రీకరించాడు. కాని జార్ పోలీసులు దాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల ఆ ప్రింటు ఇప్పుడు లభించడం లేదు.

ఈ కాలంలోనే ప్రభోదాత్మక (Educative) స్వభావం కలిగిన డాక్యుమెంటరీలు నిర్మించడం జరిగింది.

అంతకుముందు ప్రేక్షకులు సినిమాల్లో ఇతర కళారూపాల్లో పాలకవర్గ భావజాలాన్ని మాత్రమే చూచేవాళ్లు. ఆ తర్వాత ఈ కొత్త చిత్రాల్లో ప్రజలు, ప్రజోద్యమాలు, ఉద్యమ సంఘటనలు మొదటిసారిగా చూడటం జరిగింది. ఈ విధంగా చిత్రాలు వారి దగ్గరకు వెళ్లగలిగాయి. సినిమా చరిత్రలోనే కొత్త అధ్యాయం మొదలైంది.

సాంస్కృతిక రంగంలో పనిచేసే అభ్యుదయ కళాకారులు అప్పుడే మొగ్గ తొడుగుతున్న సినిమా ప్రక్రియని అభివృద్ధి పరిచి సినిమా ద్వారా ప్రజలకు దగ్గరగా పోవడానికి ఉద్యుక్తులయ్యారు.

రష్యా సినిమా ఈ కాలంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జార్ రష్యాలోని రాజకీయ పరిస్థితి, రష్యా సినిమా నిర్మాతలలో అనైక్యత, ఇతర దేశాల సినిమా పోటీ ఈ కారణాలన్నీ కలిసి కొత్తగా తలెత్తుతున్న సినిమాని, ముఖ్యంగా అభ్యుదయ సినిమా రంగాన్ని కొంత కష్టాలపాలు చేసింది. అయినప్పటికీ ఇలాంటి ప్రాధమిక దశలో కూడా కొన్ని మంచి చిత్రాలు వచ్చాయి.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇతర దేశాలనుండి సినిమా దిగుమతి చేసుకోవడానికి పోటీ లేకపోవడంవల్ల రష్యాలో నిర్మించిన సినిమాలకి గిరాకి పెరిగింది. నాటి సినిమాలు సామాజిక వ్యవస్థని అవహేళన చేయడం వరకే పరిమితమైనాయి. కాని బూర్జువా వ్యవస్థలోని దోషాల్ని, మూల కారణాల్ని ఎత్తి చూపలేదు.

మరొకవైపు సినిమాల్లో మిధ్యా జాతీయవాదాన్ని ప్రభుత్వ ప్రోత్సాహంతో చిత్రీకరించారు. కొందరు చాలా రియాక్షనరీ సినిమాలు కూడా తీసారు. ఈ దశ మొదటి ప్రపంచ యుద్ధం వరకే కొనసాగింది. ఈ కాలంలోనే సినిమా వ్యాపారపరమైన ఆకర్షణల్లోంచి బయటపడి ఒక ప్రజాకళగా ఆవిర్భవించసాగింది.

గోర్కి, స్టాన్విలోవ్‌స్కీ, మయకోవ్‌స్కీ మొదలైనవారంతా సినిమా కళ ఏ మేరకు, ఎలా, ప్రజలను సాంస్కృతికంగా చైతన్యవంతుల్ని చేయగలుగుతుందో తీవ్రంగా ఆలోచించారు. కళా వాస్తవికత కోసం అభ్యుదయ సినిమా నిర్మాతలు ముందడుగు వేయనారంభించారు. వీరి రాకవల్ల సినిమాకి అంతర్గతపుష్టి కలిగింది.

విప్లవానికి ముందు దశలో రచయితల కథలూ, నవలలు సినిమాకి ప్రాణమయ్యాయి.

బోల్షివిక్కుల నేతృత్వంలో అక్టోబర్ విప్లవ కాలమునుంచి సినిమాకు మంచి ఆదరణ లభించింది. చాలామంది నూతన రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేశారు.

రష్యాలో సినిమాటోగ్రఫికి పునాది వేసిన అలెగ్జాండర్ లెవిస్కీ (1885 – 1965) సుమారు 300 చిత్రాలు తీసాడు. అక్టోబరు విప్లవం మీదా, లెనిను మీదా సినిమాలు తీశాడు.

మీడియంగా సినిమా

అక్టోబరు విప్లవం సినిమాకి కొత్త పుష్టి చేకూర్చింది. లెనిన్ చెప్పిన ప్రకారం, అత్యంత ప్రాధాన్యంగల కళగా ఒక పద్ధతి ప్రకారంగా విప్లవానంతరం పనిచేసింది. ప్రపంచ దేశాలకు, సోషలిస్టు భావ ప్రచారానికి రష్యా సినిమా మార్గ దర్శకత్వం వహించింది. విప్లవానికి ముందునుండే సినిమా ప్రయోజనం గుర్తించిన ప్రముఖ మేధావులు సినిమారంగంలోకి వచ్చిన ఇతర కళారంగాల్లోని వ్యక్తులు వారి గణనీయమైన సేవ పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది.

మానవజాతి చరిత్రలో అక్టోబరు విప్లవానికి గల ప్రాముఖ్యత దాన్ని సంతరించుకొని వచ్చిన సినిమాకి కూడా ఉంది. 1919 లో జరిగిన తొమ్మిదో కాంగ్రేసులో శ్రామికుల కోసం కళల్ని – సినిమాని తీర్చిదిద్దాలని తీర్మానించారు.

సినిమా ఒక శక్తివంతమైన ఆయుధంగా గుర్తించడమే కాకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మొదటిసారిగా చెప్పినవాడు లెనిన్. “సినిమా పట్ల సరైన ఆవగాహనలేని వారి చేతిలో సినిమా ఉన్నంత కాలం అది మంచికన్నా చెడే చేస్తుంది. తన కృత్రిమాకర్షణలో పడేసుకొని జనాన్ని పెడతోవన నడిపిస్తుంది ” అంటాడు. [Lenin on Cinimaa Iskussivo, Moscow, 1973, P.116 (in Russian)]

“సోవియట్ కళని పునఃప్రారంభించాలి. కేవలం ఆనందాన్నిచ్చే కళకు (Spectacle art) ఒక నిజమైన గొప్ప (Truly great art ) కళకు మధ్య తేడాను గుర్తించాలి. శ్రామికులకు కేవలం ఆనందాన్నిచ్చే కళకాదు కావలసింది.” అని లెనిన్ క్లారాజెట్కిన్‌తో జరిపిన సంభాషణలో పునరుద్ఘాటించాడు.

లెనిన్ భావాలకనుగుణంగా జీవితం లోతుల్లోకి వెళ్లి సినిమా కళారూపాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. రష్యన్ కళాకారులు బూర్జువా నీతిని, అన్యాయాన్ని, దోపిడీని ఎత్తిచూపుతూ కొత్త విలువల్ని ప్రతిపాదించే విధంగా ఉపయోగించారు.

శ్రామిక జనానికి ప్రజా విప్లవం గురించీ , రష్యా నిర్మాణానికి సంబంధించిన పధకాల గురించీ తెలియజేయాలి. వార్తా చిత్రాలే కాకుండా ఉద్యమ చిత్రాలను ఉపయోగించుకోవాలి. పార్టీ కార్యకలాపాలు, కృషి ప్రజలకు తెలియాలి. సినిమాలు శ్రామికవర్గంలో విజ్ఞాన వికాసాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి. అంతేకాదు – సాహిత్యంలోని సాంస్కృతిక సంపదగూర్చి కూడా పరిచయం చేయాలి – అని లెనిన్ అభిప్రాయం.

రష్యాలో మొదటిసారిగా తీసిన వార్తా చిత్రాలు ఎన్నో సంక్స్లిష్ట పరిస్థితులను, సంఘటనలను తీర్చిదిద్దిన విధానాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే చిత్రాల ద్వారా చూపించి ప్రజలకు భావవికాసం కలిగించారు.

సినిమాని ఈ విధంగా ఉపయోగించుకోగలగడానికి కారణం విప్లవానికి ముందే ఆ మీడియాంలో కొంత కృషి జరగడంవల్లే అని చెప్పక తప్పదు.

ఆ కోవకి చెందిన ఒక చిత్రం :

1917 పెట్రొగ్రాడ్ కార్మికులు, కర్షకులు తీసిన ఊరేగింపు సాగిపోతూ వుంటుంది. ప్లేకార్డుల్లో “శాంతి – స్వేచ్చ ” అనే నినాదాలు స్పష్టంగా కంపిస్తూ వుంటాయి. ఓ సైనికుడు పాత మిలటరీ గుర్తుల్ని నేలపై గిరాటేసి తొక్కుతుంటాడు. జార్ ప్రభువౌల రెండు తలల ఈగిల్ పక్షి గుర్తు – ఒక దుకాణం మీద చిరిగిపోయి దీనంగా పడివుంటుంది. యుద్ధం వద్దంటూ ఒకరి నొకరు కౌగిలించుకుంటూ వుంటారు. ఏళ్ళ తరబడి యుద్ధ కందకాల్లో వున్న సైనికుల మాటలు “అలిసిపోయాం యుద్ధం వద్దు” అని వినిపిస్తుంటాయి. ఆ తరువాత యుద్ధ రంగం నేపధ్యంలో లెనిన్ ఉపన్యాసం వినిపిస్తుంటాయి. ఇది ఈనాడు తీసిన ఒక భిన్న చిత్రం.

విప్లవానికి ముందు తీసిన సినిమాలు విప్లవ కాలంలోనే కాకుండా విప్లవానంతరం కూడ జనంలో చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించదానికి ఉపయోగపడ్డాయి. విప్లవానికి ముందూ, వెనకా వచ్చిన అనేక పాత డాక్యుమెంటరీల్ని, చిన్న చిత్రాల్ని ఎడిట్ చేసి ఒక రకమైన సరికొత్త చిత్రాల్ని నెర్టోవ్ నిర్మించాదు. పరిశోధన, ప్రయోగం, సాఫల్యం ఈ మూడు అంశాల్ని జోడించి చిత్రాలు తీయడంలో విజయం సాధించాదు. స్టిల్ ఫోటోగ్రఫీ టెక్నిక్, స్లో మోషన్ మొదలైన పద్ధతుల్లో ఎంతో సృజనాత్మకతతో, ఉద్రేకంగా ఉండి ప్రజల్ని ఆకట్టుకునే రీతిలో చిత్రాలు తీసాడు. ముఖ్యంగా అతడు చేసిన ధైర్యవంతమైన కూర్పు (Editing) మెచ్చుకోతగ్గది.

ప్రొడక్షన్ స్థితిగతులు చాలా అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు వచ్చాయి. బూర్జువా సినిమా సంస్థలు – అభ్యుదయ సంస్థల సినిమాని, నిలువ చేసుకున్న సినిమా స్టాకుని నాశనం చేసేవారు. ఐనప్పటికీ లోపభూయిష్టమైన ముడి ఫిలింతోనే, పాత సినిమా పరికరాలతోనే చిత్రాలు తీసేవారు. ఫిలిం డెవలప్పింగూ, ప్రింటింగూ సగం కూలిన గదుల్లోనే చేసేవారు. అలా చిత్రాలు తీసిన చాయగ్రాహకుల ధైర్యసాహసాలు గొప్పవి. ఉన్న పరిమితుల్లోనే కొత్త పద్ధతుల్ని కనుక్కుంటూ, ఉన్న సరంజామాతోనే చిత్రాలు తీసి ప్రదర్శించడం వారి ఆసక్తిని, దానికి మించిన వారి త్యాగనిరతిని తెలియజేస్తుంది.

ఈ కాలంలో ప్రత్యేకంగా సినిమా గ్రూపులు పని చేసిన దాఖలాలు లేవు. కాని ఒకే రకం రాజకీయభావాలు కలిగిన కొంతమంది కలిసి 8 చిత్రాలు నిర్మించారు. సినిమా సమిస్థ్టి కళ. ఈ సమిష్టి కృషి, ఇతర కళారూపాలు (నాటకం, బ్యాలే, జానపద సామూహిక నృత్యాలు) ప్రదర్శించ గలిగే అనుభవం – పరస్పర సహకారంతోనూ నిర్దుష్టమైన ఆరణ క్రమంతోనూ సాధించారు. ఇలాంటి ఉద్యమ చిత్రాల్లో (Agitative Films) నాటి కాలమన పరిస్థితులకు సంబంధించిన సంఘటనల్ని, ఉద్యమ దశల్ని చిత్రీకరించారు.

వీటిని రైల్వే స్టేషన్లలో, నౌకానిర్మాణ కేంద్రాలలో ముఖ్యంగా సుదూర ప్రదేశాల్లోని ఉద్యమ కేంద్రస్థలాల్లో, రాజకీయ సభల్లో ప్రదర్శించేవారు.

తరువాతి కాలంలో ఈ చిత్రాలలో శైలి లోపించి, ఎక్కువ సూటిదనం వుందని సినిమా సమీక్షకులు భావించారు. ఐనప్పటికీ ఇలాంటి చిత్రాలు అవసరానుగుణంగా ప్రయోజనాత్మక వస్తువుని అవసరమైన కాలంలో బలంగా చూపగలిగాయి.

గ్రామాల్లో పార్టీపాలసీ, ఆర్ధిక ఆవశేషాలపై పోరాటం మొదలైన విషయాలని ప్రధానం చేసుకొని చిత్రాలు వచ్చాయి. ప్రజలకు విద్య, వైద్య సాంకేతిక పరిజ్ఞానం మొదలైన విషయాల మీద చిత్రాలు ప్రదర్శించేవారు. సినిమా అభివృద్ధి చెందే మొదటిదశలో ఈ చిత్రాలు వచ్చాయి. ఇందులో తక్కువ సాంకేతిక స్థాయి ఉన్నప్పటికీ వాటి అనన్య ప్రచార గుణాని చేసిన సేవనీ విస్మరించరాదు.

“సుత్తీ-కొడవలి” అనే పూర్తి నిడివి చిత్రం (1921). “యుద్ధం నుండి యుద్ధం” మొదలైన గొప్ప చిత్రాలు రావడానికి కారణం, విప్లవానికి ముందే సినిమా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది పొంది వుండడం. అందువల్లనే విప్లవం విజయవంతమైన తర్వాత కూడా ఎన్నో మంచి చిత్రాలు రాగలిగాయి. విప్లవానికి ముందు వచ్చిన కధాత్మక చిత్రాల్లో సామాజిక సమస్యల చిత్రణ అంత ఎక్కువగా లేదు. చిన్న చిత్రాలు, డాక్యుమెంటరీలు శక్తివంతంగా, అవసరానుగుణంగా వచ్చాయి.

విప్లవానికి ముందు వ్యక్తులే కాకుండా కొన్ని సినిమా కంపెనీలు కూడా మంచి చిత్రాలు నిర్మించాయి. ఒడెస్సా ఫిల్మ్ స్టూడియోకు చిత్రమైన గత చరిత్ర వుంది. అది విప్లవానికి ముందునుండి పనిచేస్తున్న ఒక ఫిల్మ్ స్టూడియో శిధిలాలపై కట్టబడింది. అక్కడ రచయితలు, నటులు, దర్శకులు,, నిర్మాతలు అందరూ కలిసి పనిచేసేవారు. అందులో వ్లాదిమిర్ మయకోవ్‌స్కీ, ప్కొలోవ్ స్కీ, డొవ్‌జెంకో, గార్డిన్ మొదలైన వారు ప్రముఖులు.

అధ్యయనానికి, ప్రయోగానికి, అన్వేషణకు సినీ నిర్మాతలు ఎంతో ఉత్సాహంగా పని చేసారు. పాతదై కాలం చెల్లిపోయిన ప్రతిదానితోనూ సంఘర్షించారు. గతంలోని మంచిని వాడుకుంటూ, వామపక్ష దుందుడుకు వాదాన్నీ, దిగజారిన సాంఘికాచారాల్నీ వదిలేసారు. కళా విలువల్ని అతి ప్రాధమిక స్థాయిలో అర్ధం చేసుకోవడాన్ని నిరసించారు. అందువల్ల క్రమంగా సినిమాలో నూతన కళా పద్ధతులు రూపుదిద్దుకుని, సామ్యవాద వాస్తవికతగా విస్తరిల్లాయి. కొత్త రాజకీయావసరాలు, కళాకారులకు లభించిన స్వేచ్చ రష్యా సినిమాకి ఒక కొత్త రూపాన్నిచ్చాయి. ప్రపంచ సినిమా చరిత్రకి అది ఒక మలుపు. ప్రపంచ విప్లవ సినిమాకి రష్యా పునాది వేసింది.

విప్లవానికి ముందూ, విప్లవ కాలంలోనూ జానపద కళలు, బూర్జువా కళలు వర్గపోరాటానికి అనుగుణంగా రూపుమార్చుకుని ప్రజా స్వభావాన్ని పొందుపరుచుకుని, గతి తార్కికంగా రూపం మారినట్టి సోవియట్ సినిమా కళలో మోంటేజి (MOTAGE) కూడా గతితార్కిక ప్రభావంతో శక్తివంతంగా రూపొందింది. అందుకే మయకోవ్‌స్కీ తన ప్రణాళిక (1992) లో “సినిమా మీకు కృత్రిమాకర్షణ కావొచ్చు. నాకు మాత్రం జీవితాన్ని దర్శించడానికి, విశ్లేషించడానికి అదొక విధానం. సినిమా సాహిత్య ప్రవాహం, అభివృద్ధివాహకం ” – అంటాడు. ఆయన అనేక చిత్రాల్లో నటించి, అనేక చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాసినవాడు. జీవితాంతం సినిమాపట్ల ఆసక్తి చూపుతూ కృషిచేసిన మహనీయుడు.

గోర్కీ, మయకోవ్‌స్కీ లాంతీ ప్రముఖులు సీమా కళపై ఎంతో ఆసక్తి చూపించారు. సేవ చేసారు. కాని దాని ఆకర్షణలో కొట్టుకు పోలేదు. తమ రాజకీయ దృక్పధాన్ని, సాహిత్య సృజననీ వదులుకోలేదు. పైగా మరింత పరిపుష్టం చేసుకున్నారు. దాన్నుండి వారు ప్రచారం పొందలేదు. ప్రచార సాధనంగా మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నారు.

“మనం బూర్జువా నీతిని కాదంటున్నామే కాని, బూర్జువా సంస్కృతిని కాదు. ఈ రెంటికి గల వృత్యాసాన్ని మనం గుర్తించాలి.”

“బాహ్య ప్రపంచ పరిజ్ఞానమే అధ్యయనం చేయబడి, ఆచరణలో పరీక్షించబడి శాస్త్రీయ విధానంగా రూపు దిద్దుకుంటుంది. ఈ రోజు మానవుడు దోపిడీ విధానాన్ని అంతం చేస్తున్నాడంటే అది ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఫిలితమే . మరి ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్ర మెక్కడిది? అది బూర్జువాల సృష్టి. అంటే – “పెట్టుబడిదారి విధానంలో మానవుడు సంపాదించుకున్న పరిజ్ఞానపు పునాదుల పైనే మార్క్సిజం విలబడిందని చెప్పాలి.” – అని లెనిన్ (Lenin collected works : 31-282 P) అంటాడు. అందువల్ల శ్రామికవర్గం ఈ విజ్ఞానాన్ని తోసి పుచ్చదు. బాగా అర్ధం చేసుకుని వృద్ధి చేస్తుంది. కొద్దిపాటి మార్పులు చేస్తుంది. మానవ పురోగమనానికి దోహదపడే విధంగా దాన్ని వాడుకుంటుంది. (Human Essence – George Thomson London 1978).

అయితే ఇవ్వాలిటి రష్యా సినిమా రష్యా పాలకవర్గ రాజకీయాల ప్రభావంతోనే ఉంటుంది. కాని అది స్వతహాగా సినిమా మీడియం తప్పుకాదు. దాన్ని నడిపిస్తున్న, శాసిస్తున్న రాజకీయాల్లోని తప్పుగానే మనం అర్ధం చేసుకోవాలి.

ఏది ఏమైనప్పటికీ సినిమా ఒక కళగా ఏర్పడి, ఏర్పడిన నాటినుండి విప్లవదశలో భావ ప్రచారం చేసి తనవంతు కర్తవ్యం నిర్వహించింది. రాజకీయ అవసరం, ప్రజోద్యమం అనే నేపధ్యంలోంచి సినిమా అభివృద్ధి చూస్తే, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. వాటిని మనం తెలుసుకోవాల్సి వుంది. అధ్యయనం చేయాల్సి ఉంది.

One Response
  1. Musthaq Ahmed February 19, 2010 /