Menu

డాక్యుమెంటరీ సినిమా-1

డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా నేడు డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే డాక్యుమెంటరీ అనే పదాన్ని మొట్టమొదటిగా Robert Flaherty నిర్మించిన ’నానూక్ ఆఫ్ ది నార్త్’ అనే చలనచిత్రం గురించి వ్రాసిన ఒక సమీక్షలో వాడడం జరిగింది. ఇంతకూ డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటి? నిజజీవితంలోని విషయాలను ఉన్నదున్నట్టుగా విజువల్ గా డాక్యుమెంట్ చేయడమే డాక్యుమెంటరీ సినిమా అని చెప్పుకోవచ్చు.

బ్రిటిష్ డాక్యుమెంటరీ సినిమాకు ఆద్యుడిగా పిలవబడే John Grierson డాక్యుమెంటరీ సినిమాకు ఉండవలసిన విలువలను సూత్రీకరించాడు.

Grierson’s principles of documentary were that cinema’s potential for observing life could be exploited in a new art form; that the “original” actor and “original” scene are better guides than their fiction counterparts to interpreting the modern world; and that materials “thus taken from the raw” can be more real than the acted article. In this regard, Grierson’s views align with the Soviet propagandist Dziga Vertov’s contempt for dramatic fiction as “bourgeois excess”, though with considerably more subtlety. Grierson’s definition of documentary as “creative treatment of actuality” has gained some acceptance, though it presents philosophical questions about documentaries containing stagings and reenactments.

Flaherty నిర్మించిన నానుక్ ఆఫ్ నార్త్ సినిమా తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల్లో డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ చలనచిత్రాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ట్రావెలాగ్స్, instruction films, సమాజం లో ఉన్న సమస్యలను తెలియచేసే సినిమాలు, propaganda films ఇలా ఎన్నో రకాల డాక్యుమెంటరీ సినిమాలు చాలా సార్లు ప్రజలను వివిధ విషయాల గురించి ప్రభావితం చేయడానికి ఉపయోగపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్త ప్రజా పోరాటాల్లో డాక్యుమెంటరీ సినిమా పోషించిన పాత్ర అమోఘం.

ప్రపంచ వ్యాప్త ప్రజాపోరాటాల్లో డాక్యుమెంటరీ సినిమా పోషించిన పాత్ర గురించి తెలుగులో ఒక పూర్తి స్థాయి పరిశోధనా గ్రంధం వెలువడిన విషయం ఎంతమందికి తెలుసు? నాకైతే ఈ మధ్యనే తెలిసొచ్చింది. జయధీర్ తిరుమలరావు రచించిన “ప్రపంచ వ్యాప్త ప్రజాపోరాటాల్లో డాక్యుమెంటరీ సినిమా” అనే ఈ పుస్తకం లో ప్రజా పోరాట సినిమా, ప్రపంచ యుద్ధంలో డాక్యుమెంటరీ సినిమా పాత్ర, లాటిన్ అమెరికా లో సినిమా ఒక ఆయుధంగా ఉపయోగించిన తీరు, మనదేశంలో డాక్యుమెంటరీ సినిమా పరిస్థుతులు, సాంస్కృతిక సమరరంగంలో రాజకీయ పాఠంగా ప్రజా సినిమా లాంటి ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో వ్యాసాలుగా ప్రచురించారు.

వరంగంల్ ఫిల్మ్ సొసైటీ సౌజన్యంతో ప్రచురించబడిన ఈ పుస్తకం లోని వ్యాసాలను నవతరంగంలో త్వరలో ప్రచురింపబోతున్నామని తెలియచేస్తున్నాము. ఈ పుస్తకంలోని వ్యాసాలను ప్రచురిస్తామని అడగ్గానే అనుమతి ఇచ్చిన శ్రీ జయధీర్ తిరుమలరావు గారికి నవతరంగం తరుపున మా ధన్యవాదాలు.

_____________________________________________________________________

ముందు మాట

రాజకీయాల్నే కళగా .. కళనే రాజకీయంగా చూపించే డాక్యుమెంటరీ

ఇవ్వాళ సినిమా మీడియాని దృఢమైన తాత్విక పునాది మీద చూడాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే సమాజం ఎన్నో సాంకేతికాభివృద్ధి దశలను మిళితం చేసుకుని ముందుకు అంగలేస్తూ పయనిస్తోంది. మనం ఆ వేగాన్నీ, స్థాయినీ అందుకోక తప్పదు.

సినిమా ప్రక్రియ మీద చాలా మందికి చాలా రకాలైన అభిప్రాయాలున్నాయి. ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నప్పటికీ చారిత్రక గుణపఠాలు తప్పనిసరిగా లెక్కలోకి తీసుకోవాలి. ఆ క్రమంలో రష్యా, చైనా, జర్మనీ, లాటిన్ అమెరికా దేశాల సినిఈ చరిత్రని చూడడం అవసరం. ఆయా విప్లవకాలాలలో సినీ మెడియాన్ని ఉపయోగించుకున్న తీరునీ, అది నిర్వహించిన పాత్రనీ, దాని ప్రభావాన్నీ తెలుసుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఇది.

విప్లవాలు దీర్ఘకాలికం, నిరంతరమూ. విప్లవం విజయవంతమైన దేశాల చరిత్రకీ, విపలవోద్యమం ఉన్న దేశాల చరిత్రకీ చాలా తేడా ఉంటుంది.

ఆలోచనా విధానంలోనూ, ఆలోచనాత్మక కృషిలోనూ సరైన దృక్పధం కలిగిన మేధావులు కళారూపాన్నీ, దాని బలాన్ని, ప్రభావాన్ని గుర్తించి అంచనాలేస్తారు. ఆచరణరీత్యా సాధ్యాసాధ్యాలను ముందే ఊహించగలిగినా అలాంటి ఏకపక్ష నిర్ణయం సరైన పద్ధతికాదు. ఎందుకంటే అది ఎన్నో పరిస్థితుల మీద, దశలమీద, వైరుధ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఐతె సినిమా మీడియం గత చరిత్రని చూడడం అందరికీ అవసరమే.

వివిధ పార్టీల పంధాలను అనుసరించి జరుగుతున్న ఉద్యమాల్లో తాత్కాలిక ప్రయోజనాల దృష్ట్యా కాకుండా, రేపు ఈ ప్రేరణతో కానీయండి. విస్తృతమయ్యే క్రమంలో కానీయండీ జరగబోయే సంపూర్ణ సామాజిక విప్లవంలో భాగస్వామిగా సినిమా ఉపయోగాన్ని చూడడం అవసరం.

ప్రజా సినిమాకీ, విప్లవ చిత్రాలకీ Expose కానివాళ్లు, దాని Positive History తెలియనివాళ్లు, వాణిజ్య సినిమా కంపు మాత్రమే చూసినవాళ్లు.. ఏ ఒక్క కోణంలోంచో చూసి చేసిన నిర్ణయాలు సరైనవి కావు. సినిమా మీడియాకున్న రెండోవైపు చూసి మంచి సినిమా తీయడం ఎందుకు సాధ్యం కాదో, ఎలా సాధ్యం కాదో, సాధ్యమైన చోట ఎందుకు సాధ్యమైందో చెప్పగలిగితే ఆ నిర్ణయాలు అందరికీ శిరోధార్యాలు.

2

ఈ మధ్య శాస్త్రవేత్తలూ, మేధావులూ సినిమాని తక్కువ అంచనా వేయకూడదనీ అధ్యయనం, పరిశీలనా జరపాలనీ భావిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయం. ఐతే సినిమా అంటే వీరి దృష్టిలో వ్యాపార చిత్రాలే కావడం శోచనీయం.

కాని సినిమా రంగంలో ఉన్న వివిధ శాఖలు (సాహిత్యం, కళలు, ఫిలిం సొసైటేలు, వ్యాపారం, ధియేటర్ యాజమాన్యం మొ..) ఆవగాహన చేసుకుని, అధ్యయనం చేయడం కష్టమైన విషయం. సినిమాలో కేవలం పెట్టుబడి, కథ మొ.. విషయాలే కాకుండా సాంకేతిక(Technical) ప్రధానమైన ప్రక్రియ. అంతే కాదు సినిమా నానాముఖాలతో కూడుకొని ఉంది. ఇందులో ఏ ఒక్కటీ దాని అసలు రూపం కదు. చాలా మంది సినిమాని పట్టించుకోకపోవడానికి ఈ జటిలత్వం ఒక కారణం కావచ్చు. సినిమా గురించిన పై రకం సమాచారం పత్రికల్లోనూ, పుస్తక రూపంలోనూ తక్కువగానే వచ్చింది. ఉబుసుపోక వార్తలే అధికం.

సినిమా అనగానే కథాచిత్రాలే అని చాలా మంది భావిస్తారు. ఫిలిం సొసైటీ సభ్యులు కూడా ఇందుకు అపవాదు కాదు.

బయస్కోపు పేరుతో జరిగిన మొదటి ప్రదర్శన కాలం నుండి సగం పాయగా కథాకథన రహిత చిత్రాలు (Non – Fiction Films ) వస్తున్నాయి. వీటిని డాక్యుమెంటరీ చిత్రాలు, చిన్న హ్రస్వ/లఘు చిత్రాలు (Short Films), వార్తా చిత్రాలు (News Films), ప్రకటన చిత్రాలు (Advt .films) అని ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఐతే డాక్యుమెంటరీ పేరే చాలా చోట్ల వాడుకలో ఉంది.

1926 లో రాబర్ట్ ఫ్లాహర్టీ తీసిన “మోనా” చిత్రాల్ని జాన్‌గ్రియర్‌లన్ డాక్యుమెంటరీ అని మొదటిసారిగా అన్నాడు. “A Creative treatment of actuality ” అని అభిప్రాయపడ్డాడు. పేరో లోరెంజ్ “A Factual film which is dramatic ” అని భావించాడు. “A Method of approach to public information” అని బేసిల్ రైట్ అన్నారు.

ఈ చిత్రాల్లో వ్యక్తుల సంఘర్షణ కాకుండా సామాజిక లేదా రాజకీయ శక్తులకు సంబంధించిన సంఘర్షణ ఉంటుంది. ఒక జాతి సమాజానికి సంబంధించి ఉంటుంది కాబట్టి దానికి పురాణ (EPIC) లక్షణం వస్తుంది. ఈ చిత్రాలు నిజమైన ప్రజల నిజమైన సమస్యల్ని మాత్రమే ప్రతిబింబించే వీలుందని విల్లార్డ్ వాన్ డైక్ అంటాడు.

డాక్యుమెంటరీ చిత్రాల్లో ప్రయోగాలు చేయవచ్చు. కొత్త వ్యక్తీకరణ పద్ధతుల్ని కనుక్కోవచ్చు. ఇందులో “నటులను” కూడా ఉండవచ్చు. అద్భుత కల్పననీ, వాస్తవ సంఘటననీ, చెప్పడానికి వీలుంది. కథ ఉండదు కాని కధన శైలి ఉంటుంది. ఒక అవసరం నిమిత్తం తీస్తారు. దర్శకుడు ఉద్ధేశించిన ప్రయోనజం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆర్ధిక రాజకీయ సామాజిక మానవ సంబంధాలకు సంబంధించిన సమస్యలను నిజాయితీతో చిత్రించి, ఆ సమస్యలకి జవాబు ఇవ్వడానికి ప్రయత్నించేదీ..

మానవ విజ్ఞానాన్నీ, ఆవగాహనానీ విశాలం చేసే కోర్కెతో కోణాల్ని లేదా ఉద్రేకాన్ని తట్టిలేపడానికి ఒక వాస్తవాన్ని వాస్తవిక చిత్రీకరణతోగానీ, కొద్దిపాటి కల్పనతోగాని చిత్రీకరిస్తే అది డాక్యుమెంటరీ అవుతుందని 1948లో “ప్రపంచ డాక్యుమెంటరీ సంస్థ” ప్రకటించింది.

రిచర్డ్ మెరాన్ బార్‌సం, “నాన్‌ఫిక్షన్ ఫిలిం” అనీ, గ్రియర్సన్, ఎరిక్ బర్నోవ్ “డాక్యుమెంటరీ ఫిలిం” అని అన్నారు. మనదేశంలోంగాని, రాష్ట్రంలోగాని కథారహిత చిత్రాల నిరమణం, ప్రసక్తాను ప్రసక్తాలు తక్కువ. ఫిలిం సొసైటేలు, తదితర ఆసక్తిగల సంస్థలు, వ్యక్తులు ఈ రంగాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాయి. కాబట్టి చిత్ర నిర్మాణరీత్యా కాకుండా సిద్ధాంతావసరంకోసం అన్ని సందర్భాల్లో డాక్యుమెంటరీ పదం సరిపోకపోయినప్పటికీ, చాలామందికి ఈ పదంతో పరిచయం ఉన్నందువల్ల మనం “డాక్యుమెంటరీ” పదాన్ని ఉపయోగించవచ్చు.

3

కథాచిత్రాల వ్యాపార రణరంగంలో కేవలం ఆర్ధికచట్రం పరిధిలో ఆలోచిస్తే కొన్ని ఆసక్తికరమైన, ఆశాజనకమైన విషయాలు తెలుస్తాయి.

సినిమా (కథాచిత్రాలు) పెట్టుబడితో ముడివడి వ్యాపారంతో భుజంకలిపి బూర్జువా సంస్కృతి అడుగులకు మడుగులొత్తుతుంది. దానినిండా పాలకవర్గం విలువలే ఉంటాయి. దాన్ని ఆధారం చేసుకుని లాభాలు ఉంటాయి. కొత్త బూర్జువా రాజకీయ వర్గాలు అధికారంలోకి (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్) వస్తాయి. అదే డాక్యుమెంటరీల్లో పై లక్షణాలేవీ ఉండవు. కాకపోతే ఈ మీడియాన్ని వాళ్లు ఉపయోగించుకుంటారు. రూపంలో ఇది ప్రజాస్వామిక గుణం కలిగి ఉంది. చరిత్రలో ఇది ప్రజల పక్షమే నిలిచింది. ప్రజారాజకీయాలను అధికార స్థానంలో నిలపడానికి తన వంతు కృషి కూడా చేసింది.

అందుకే కొందరు బూర్జువా దర్శకులు కూడా అప్పుడప్పుడు కొన్ని మంచి డాక్యుమెంటరీ చిత్రాలు తీసి ప్రజాస్వామ్యవాదులమని అనుకుంటారు. మరికొందరు గొప్ప డాక్యుమెంటరీ చిత్రాలు తీసిన డర్శకులు గొప్ప కథాచిత్ర దర్శకులుగా పేరు పొందడం కూడా గమనించవచ్చు.

డాక్యుమెంటరీల్లో ప్రజల్ని ప్రత్యక్షంగా ఒప్పించే శక్తి ఉంది. ఇందులో విషయచర్చ చేయవచ్చు. దర్శకుడు తాను వివేచన చేయడానికి అనువుగా ఉంటుంది. కథాచిత్రాల్లో ఈ పరిధి ఉండదు.

వీటిలో చారిత్రక ఘటనల్ని, దశల్ని నైపుణ్యంగానూ, నాణ్యంగానూ భద్రపరచవచ్చు. చరిత్ర, చర్చ, మానవసంబంధ మూలాలు ఇందులో కనిపిస్తాయి. సినిమా శైలులు, వస్తువు, సాంకేతిక శిల్పాలు ఈ చిత్రాలు చూడ్డం ద్వారా నేర్చుకోవచ్చు.

డాక్యుమెంటరీలు సినిమా స్వరూపానికి “Original art form” .అంతే కాదు. “and with the documentary approach the film gets back to its fundamentals” అనే విషయం ముఖ్యమైంది.

ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఏ ఉద్యోగమైనా తన అవసరానుగుణంగా ప్రక్రియల్ని వెదుక్కుంటుంది, సృష్టించుకుంటుంది. సాహిత్యంలో కనిపించే రాతకథలోని కథ చెప్పే గుణం, రంగస్థల నాటకంలోని సంభాషణా సంవాదాలు, వ్యాసంలోని వివరణ, వాగ్ధాటి రూపం ప్రజాజీవితంలో దాగిన మూలాలు. ఇవి ప్రజల్లో అనుశ్రుతంగా వస్తున్న మౌలికరూపాలు. ఈ మౌలిక లక్షణాల్ని మాత్రమే కొద్దిపాటి మార్పులతో మళ్లీ ప్రజలకు సులభంగా అందించినట్టే సినిమా మౌలిక రూపం “దాక్యుమెంటరీ”ని కూడా ప్రజలకు దగ్గరగా తీసుకునిపోవచ్చు. (చూ.పి.సి.యన్.చరిత్ర. భాష. పాండిత్యం-శాస్త్రీయవ్యాసం.1979 .పే 2)

బూర్జువా కళ్లలో కొత్తదనం లోపించిన ప్రతిసారి(వస్తువుకోసమే కాదు రూపం కోసం కూడా) ప్రజాజీవితాలలోనికి, ప్రజాకళారూపాలలోకి దృష్టి సారించినట్లే కథాచిత్రాల భావవ్యక్తీకరణరీతి పాతపడ్డప్పుడల్లా డాక్యుమెంటరీ చిత్రీకరణ విధానాన్ని ఆశ్రయిస్తారు.

ప్రజల పాటల్ని చాలామంది చాలారకాలుగా ఉపయోగించుకున్నారు. ప్రజావ్యతిరేక భావాలు కూడా అందులో జొప్పించి తరతరాలుగా సాంస్కృతిక కాలుష్యానికి గురిచేశారు. ప్రజా ఉద్యమవాదులు వాటిని ఉపయోగించుకున్నారే గాని సరైన అధ్యాయనం చేయలేదు. పాటలాగె (పాత పాటది), శక్తిమంతమైన ప్రక్రియ (ఇది కొత్తది) ఐన డాక్యుమెంటరీని పట్టించుకోలేదు. ఐతే ఇది కథాచిత్రాల పడగనీడనే ఉండిపోయింది.

4

సామాజిక వాతావరణం పునాదిగా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడో, అలజడి చెలరేగినప్పుడో డాక్యుమెంటరీ ఉపయోగపడుతుంది. తత్కాలంలో, వాస్తవంలో ప్రదేశంలో పరిసరాల్లో వాస్తవ దృశ్యాలతో అప్పటికప్పుడు తీస్తారు. సెట్లు, దుస్తులు, అలంకరణ, ఆహార్యం, రాసిన సంభాషణా, కృత్రిమ శబ్దాలు ఏవీ లేకుండా తీస్తారు.

నిజానికి ఆ చిత్రం తీసిన ప్రదేశంలో “ఉన్నట్టు” అనుభవం కలుగుతుంది. ఇందులో ఉపోద్ఘాతం, నిర్ధారణ, సొల్యూషన్ అని మూడు భాగాలు కనిపిస్తాయి.

నలుపు తెలుపులో, సహజ శబ్దాలతో తీస్తారు. అందువల్ల కళావిలువలు (?) చాలా వాటిలో కనిపించవు. కాని ఇతర అనేక(కళా) విలువలు ఉన్నాయని గుర్తించరు.

ఈ చిత్రాలు వాస్తవ ఘటనల్ని సృజనాత్మక రీతిలో తీయడానికి రెండు పద్ధతులున్నాయి. వాస్తవిక క్రమనిర్మాణం, ప్రత్యక్ష చిత్ర నిర్మాణం. ఈ రెండో రకం 1960 తరువాతే ప్రారంభమైంది. దీని మార్పు అంతా ఎడిటింగ్ టేబిలే నిర్ణయిస్తుంది.

డాక్యుమెంటరీల్లో “వస్తువు” ప్రధానం. తరువాత బలమైన చిత్రీకరణకు, శైలికి తదుపరి ప్రాధాన్యత ఉంటుంది.

వీటిలో “ఘటన” ప్రధానం చేసుకుని కూడా తీస్తారు. వీటిని FACTUAL FILMS అంటారు. వాస్తవ ఘటనల్ని కెమెరాలో బంధించవచ్చు. అవి “రోడ్డు ప్రమాద వార్త”ల్లా ఉంటయి. కొన్నింటిలో వాస్తవ ఘటనని నాటకీయంగా చెప్పడం జరుగుతుందే గాని కథని కల్పించరు.

వాస్తవ సన్నివేశం, వాతావరణం, వ్యక్తులు, ఘటనలు – ఈ సమాహారాన్ని దర్శకుడు తన అభివ్యక్తికి అనుగుణంగా ఉపయోగించుకుంటాడే గాని ప్రాధాన్యత ఇవ్వడు.

ప్రక్రియ, స్వభావ రీత్యా కథాచిత్రంలో కల్పనని, ఆ వాస్తవికతని మరో రూపంలో చిత్రిస్తారు.

డాక్యుమెంటరీ చిత్రంలో వాస్తవికతని వాస్తవంగా సత్యాన్ని సత్యంగానే చూపించే వీలుంది.

భాషలు వేరైనా దేశాలు వేరైనా డాక్యుమెంటరీ చిత్రాల్లోని సమస్యలు, జీవితం ఒక్కటే. అందుకే సమాజానికి అవసరపడిన ప్రతీసారి వీటిని ఉపయోగించుకోవచ్చు.

ప్రపంచ ప్రసిద్ధ డాక్యుమెంటరీ నిర్మాతలు తీసిన చాలా చిత్రాలు తాత్కాలికాలు కావు. అవి కాలానుగుణమైన వాస్తవికతను పుణికి పుచ్చుకొని “కాలంతో కదిలే” గుణం కలిగి ఉన్నాయి.

జర్నలిస్టుల్లాగే స్క్రీన్ జర్నలిస్టులుగా చిత్ర నిర్మాతలు కాలం వెంట పరుగుదీశారు. ఆ కాలం ప్రజల జీవితాన్ని నమోదు చేశారు. వెండితెర పత్రికా రచన లాంటిది ఈ మీడియం. ఐతే మన దేశంలో ఈ మీడియాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయామో ఆలోచించాలి.

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో “స్వాతంత్ర్యం కావాలి” అనే నినాదమే తప్ప అది ఎందుకు కావాలి? అందుకోసం ఏం చేయాలి? అని ప్రజల్లో ప్రచారం చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులకి లేకపోయింది. కమ్యూనిస్టులు పల్లెల పరిధిలోనే ఎక్కువగా పనిచేయడం జరిగింది. ఆనాటి తీవ్రవాదులు అజ్ఞాతవాసమే చేయాల్సి వచ్చింది.

రెండో ప్రపంచ యుద్ధం భారతదేశాన్ని చుట్టుముట్టలేదు. ఇతర దేశాల్లో యుద్ధకాలంలోనే అది పుట్టి పెరిగింది. “అన్ని యుద్ధాల అంతం కోసం ఈ ప్రచార యుద్ధం” అనే ఆశయంతో చిత్రాలు తీశారు.

పోరాటాల్లో “ఐక్యసంఘటన” ఉన్నచోట మాత్రమే ఈ చిత్రాలు వెలువడడానికి ఆస్కారం ఏర్పడింది.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా కొరియా, వియత్నాంతో చేసిన యుద్ధంలో అమెరికా యుద్ధ చిత్రాల్ని ప్రజలు నిరాకరించారు.

లాటిన్ అమెరికా దేశాల్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సినిమా అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది అలాంటి సమయంలో కూడా యాంత్రిక అభివృద్ధి, జానపద కళారూపాల ప్రచార పరిమిత పరిధిని దృష్టిలో పెట్టుకుని డాక్యుమెంటరీలు తీసి ఎన్నో ప్రింట్లు వేసి దేశం నలుమూలలా పంపడం జరిగింది. సినిమా ఒక ఆయుధంగా(అక్షరాలా) మారింది.(చూ.మూడో ఆధ్యాయం) నాయకులు, అధికార వర్గాలు మారవచ్చుగాక కాని వారి హయాంలో జరిగిన దారుణ హింసాకాండని, దోపిడిని ఈ చిత్రాలు నమోదు చేశాయి. అవి ప్రజల చరిత్రని పుణికి పుచ్చుకున్న డాక్యుమెంట్లుగా పేర్కొనవచ్చు. అందుకే ప్రజల కోసం, ప్రజల తరఫున పనిచేసే సినిమాని “ప్రజా సినిమా” అనవచ్చు.

ఇలాంటి సినిమా మన దేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో వివిధ రాజకీయ భావాలున్న వాళ్లు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఒక “విశాల వేదిక” మీదకు వచ్చి ప్రజా సమస్యల కోసం, వారిని చైతన్యవంతులు చేయడం కోసం ఉద్యమించాల్సి వచ్చినప్పుడు సాధ్యమవుతుందనిపిస్తుంది. కళా, సైన్సూ (సాంకేతిక విజ్ఞానం) సమ్మిళితమై మానవ జీవితాన్ని బాగు చేసేందుకు ఈ కొత్త మీడియా భవిష్యత్తులో మన దేశంలో ఉపయోగపడుతుండేమో!!

5

ఈ పుస్తకంలో డాక్యుమెంటరీ చిత్రాల చరిత్రని ఇవ్వలేదు. భారతదేశపు ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో తీసిన డాక్యుమెంటరీ చిత్రాల వివరాల జోలికి ఇంకా పోలేదు. అసలు మనకు డాక్యుమెంటరీల చరిత్రే ప్రారంభం కాలేదు. (అందుకే అనుబంధంగా తెలుగు సామాజిక సినిమా రూపురేఖలు తెలిపే వ్యాసం ఉంచాను) డాక్యుమెంటరీలు ఎక్కువగా ప్రచార సాధనాలుగానే ఉపయోగపడతాయి. అందులోని కళా విలువల గురించి ప్రత్యేకంగా రాయలేదు. కళా విలువల గురించి ఫిడేళ్ కాస్ట్రో ఇచ్చిన నిర్వచనంతో ముగిస్తాను.

For us, a revolutionary people in a revolutionary process the value of cultural and artistic creations is determined by their usefulness for the people, by what they contribute to man, by what they contribute to the liberation and happiness of man.

Our standards are political. There Cannot be aesthetic value without human content or in opposition to man, justice, welfare, liberation and the happiness of man.

-ఇంకా ఉంది

–జయధీర్ తిరుమలరావు

ఈ పుస్తకం లోని వ్యాసాలు టైప్ చేసి మనందరం చదువుకునేలా చేస్తున్నందుకు వలబోజు జ్యోతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

4 Comments
  1. ramana February 6, 2010 /
  2. Keshavcharan February 9, 2010 /
  3. మేడేపల్లి శేషు February 19, 2010 /