Menu

“యాంగ్రీ మిడిల్ క్లాస్” సినిమాలు

70 వదశకాన్ని మన భారతీయ సినీ చరిత్రలో ‘యాంగ్రీయంగ్ మెన్’ దశకంగా సినీచరిత్రకారులు అభివర్ణిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాల అనంతరంకూడా కొనసాగుతున్న, సామాజిక అసమానతలు. వ్యవస్థీకృత అణచివేత. ధనికులుచేసే చట్టాల ఉల్లంఘన. పేదలకు జరిగే అన్యాయాలు మొదలైన సామాజిక రుగ్మతల నేపధ్యంలో, చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకుని న్యాయంచేసే ఒక సూపర్ హీరో భారతీయ సినిమా(ముఖ్యంగా బాలీవుడ్)లో ఉదయించాడు. హిందీనటుడు అమితాబ్ బచ్చన్ ఈ సూపర్ హీరో పాత్రకి రూపమిచ్చాడు. ఇదే మూసలో వివిధభారతీయ భాషల్లో సినిమాల వెల్లువ సాగింది.

మసాలానింపిన సామాజిక స్పృహని  హిందీలో సలీం-జావేద్ లు అందిస్తే, మన తెలుగులో వామపక్షభావజాలంతో ప్రేరేపించబడిన రవయితలూ,సినీదర్శకులూ వ్యవస్థపై తమకోపాన్ని తమ హీరోల ద్వారా తెరకెక్కించారు. తెలుగులో మాదాలరంగారావు,శివకృష్ణలను మొదటి యాంగ్రీ యంగ్ మెన్లు అనుకుంటే, ఆ తరువాత సుమన్,భానుచందర్ ,రాజశేఖర్లు. హిందీలో పోలీసు,చట్టం,ధనికులూ,అసాంఘిక శక్తులూ వ్యవస్థలో సమస్యలుగా కనబడి హీరోచేత మట్టుబెట్టించబడితే, మన తెలుగులో ఫ్యూడలిజం అన్ని సమస్యలకూ మూలంగా చిత్రించబడింది.

80లలో మనమందరం సమస్యల్ని చాలావరకూ మరిచిపోయి, హాయిగా entertainment సినిమాప్రవాహంలో కొట్టుకుపోయాము. 90 లలో గ్లోబలైజేషన్ ప్రారంభమై కొత్త మధ్యతరగతి ఉధ్బవించడం మొదలయ్యింది. వీరికి సరదాతోపాటూ సామాజిక సమస్యలపట్ల కొంత fashionable జ్ఞానం అవసరమయ్యింది. అప్పట్లో ఒకవైపు పంజాబ్ తీవ్రవాదం, మరోవైపు కాశ్మీర్ ఉగ్రవాదం నేపధ్యంగామారి, బోలెడన్ని తీవ్రవాద/దేశభక్తి సినిమాలు వచ్చిపడ్డాయి. ఆ తరువాత ఈ ఆవేశం కొంతచల్లబడింది. ప్రపంచీకరణ పుణ్యమా అని, విదేశలకివెళ్ళే మన జనాలు పెరగటం, అక్కడున్నవారికి మన విలువలు బలంగా గుర్తుకురావడంతో, feel good cross cultural family  సినిమాలు కొన్నాళ్ళు రాజ్యమేలాయి. కొన్నాళ్ళకి ఈ సరదా సినిమాలలోని  విషయవైవిధ్యంకూడా నశించింది.

మధ్యతరగతి సైజు పెరిగినతరువాత, కొంత మసాలాకలిపిన సామాజిక స్పృహకూడా మనకుకావాలన్న సత్యం కొంతమంది సినీదర్శకుల మదిలో మెదిలింది. అప్పుడు పుట్టుకొచ్చిన సినిమాలే లంచగొండితనం, రాజకీయ స్థబదతకు ప్రజల సమాధానం, వ్యవస్థ నిర్లక్ష్యానికి ప్రతిగా చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకునే “యాంగ్రీ మిడిల్ క్లాస్ సినిమాలు”.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు,ఒకేఒక్కడు, అపరిచితుడు,శివాజి లంచగొండితనంపట్ల మధ్యతరగతిలో వున్న ఏహ్యాభావానికి తగిన రంగులద్దిన aspirational సినిమాలే! ఇక్కడ వైరుధ్యమేమిటయ్యా అంటే, నిజంగా ఈ లంచాల్ని పెంచిపోషించే మధ్యతరగతి, తమ గిల్టీ ఫీలింగ్ (feeling of guilt) ని హీరోద్వారా ప్రక్షాళన చేసేసుకుని “అబ్బ ఈ విధంగా సమాజం మారిపోతే ఎంతబాగుంటుందికదా!” అనుకుని సినిమాను సుపర్ హిట్ చేసెయ్యటం. ఈ సినిమాలలోని magnanimity, supernaturality ఏకోశనకూడా అసలు సమస్యకు సమాధానాలు కావు. అయినా, మనం మాత్రం చిన్నపిల్లాడికి దొరికిన తాయిలంలాగా ధియేటర్లలో  ఈ సినిమాలలోని సూపర్ హీరోల హీరోయిజంద్వారా మన అసమర్ధతను విజయవంతంగా కప్పిపుచ్చుకుని సంతృప్తిపడిపోయాం.

ఈ కోవలోవచ్చిన మరో గొప్ప(ప్రమాదకరమైన) సినిమా ‘రంగ్ దే బసంతి’. నాతోసహా ఈ సినిమాని చూసి అభిమానించి, ఆరాధిస్తూ మాట్లాడనివారు చాలా అరుదుగా కనబడతారు. కథా,కథనం,నటన మరియూ సాంకేతికపరంగా ఈ సినిమాని ఏవిధంగానూ తప్పుబట్టలేము. అన్నీ top notch. కాకపోతే, ఈ చిత్రం క్లైమాక్స్ లో ఈ సినిమా చెప్పబూనిన సందేశం, చట్టాన్ని చేతుల్లోకితీసుకుని “న్యాయం చెయ్యటం”. ఆ విధిలో భాగంగా ‘షహీద్’(త్యాగమూర్తులు) అవ్వడం. కథాపరంగా, తీవ్రవాద దేశభక్తులైన (militant nationalists) భగత్ సింగ్, ఆజాద్ వంటివారి స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితులలో మార్పును ఆశించే యివత చేసే ప్రయత్నం కనుక, ముగింపు పొయటిక్ గా అలాగే ఉండాలేమో! కానీ, ఇక్కడ ఆలోచించవలసింది, ఈ సినిమాను మధ్యతరగతి ఇంత సహృదయంతో నెత్తికెత్తుకున్న కారణాలగురించి.

ఒకటి పైన చెప్పిన ముగింపైతే, రెండవది ఈ సినిమాలో చూపించిన (క్యాండిల్ లైట్ విజిల్స్ వంటి) మధ్యతరగతి token activism అని నా అభిప్రాయం. జస్సికాలాల్ హత్య కేసులో ఢిల్లీ,ముంబై వంటి నగరాల్లో మధ్యతరగతి ప్రదర్శించిన నిరసనల నమూనా ఈ చిత్రంలో ప్రదర్శితమై “ఇది మన సినిమానే” అన్న భావన కలిగించింది. అంతేకాక,  బాదరబందీ లేని upper middle class యువత సమూహం, అన్యాయం తమ తలుపుతట్టేసరికీ దేశం గురించి ఆలోచిస్తారు. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపుతారు. తాము నేర్చుకున్న చరిత్రని తామే మళ్ళీ enact చేసిచూపిస్తారు. ఆపోరాటంలో ప్రాణాలు త్యాగం చేస్తారు. ఈ విధంగా చూస్తే, ఈ చిత్రం ఒక స్థాయిలో పరమ escapist సినిమా. విశ్లేషణాత్మకంగా చూస్తే, మధ్యతరగతి ఆశయాలకూ,కలలకూ,భావనలకూ అద్దం పట్టిన సినిమా. దేశభక్తులూ, సంఘసంస్కర్తలూ పక్కింట్లో పుడితే ఆనందించి, హారతులిచ్చి నెత్తికెత్తుకుని, ‘మనింట్లో ఇలాంటివాళ్ళు పుట్టకూడదని’ మనసారాకోరుకునే భారతీయ మధ్యతరగతి చక్కగా identify చేసుకోగలిగే సినిమా. అందుకే, ఈ చిత్రం మల్టిప్లెక్స్ ప్రేక్షకుల మనసులకు హత్తుకోవడంలో విజయం సాధించింది.

ఈ మధ్యవచ్చిన సినిమా ‘A Wednesday’ కూడా ఈ విధమైనదే. వరుస బాంబుపేలుళ్ళ నేపధ్యంలో ప్రభుత్వ విధానాలతో విసిగి, ఎమీ జరగడం లేదన్న నిరాశలో,ఏదైనా జరగాలనో కోరికతో వున్న మధ్యతరగతి ఆకాంక్షల్ని చక్కగా ఎత్తిచూపిన చిత్రం ఇది. “ఎవరోఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకూ అటో.. ఇటో..ఎటోవైపు” అనే desperation లో ఉన్న మనకిచ్చిన sugar coated pill ఇది. ఇదివరకు చెప్పిన పాటలో  ఉటంకించినట్టు “అటో..ఇటో” కాకుండా, “ఎటో” నడిపించి ప్రేక్షకులను ఒప్పించిన చిత్రం ఇది. అందుకే ఇంత “realistic” గా సమస్యకు లోపభూయిష్టమైన అంగీకారాత్మక సమాధానం ఇవ్వడం ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఒక్కోస్థాయిలో చౌకబారు సినిమాలకన్నా, ఇలాంటి సినిమాలు సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశాలు ఎక్కువ.

“ఇలా ఎవడోఒకడు చేస్తేగానీ, ప్రభుత్యానికి బుద్దిరాదు” అంటూ సగటు ప్రేక్షకుడు సినిమా నుంచీ బయటకొచ్చాడంటే, లోపాయకారిగా ప్రస్తుతం వున్నవ్యవస్థని ప్రేక్షకుడు నిరసించి, ఇలాంటి మిలిటెంట్ చర్యల్ని సమర్దించినట్టే లెక్క. అది ఎంతవరకూ సమంజసం అనేది పక్కనబెడితే, మధ్యతరగతిలో పేరుకుపోయున్న నిరసనను ఈ సినిమా ఎత్తిచూపి వారి aspirational projection కు అనుకూలంగా ఈ సినిమా నిలబడిందనేది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరవల్సిందే.

‘సినిమాకు ఒక సామాజిక ప్రయోజనం ఉంది’ అనుకుంటే, ప్రేక్షకుల/ప్రజల ఆంకాంక్షల్ని ప్రతిఫలించడంకూడా అందులో ఒకటి. ఈ యాంగ్రీ మిడిల్ క్లాస్ చిత్రాలు ఆంకాంక్షల్ని ప్రతిఫలించడంలో సఫలమైనా, అదొక escapist దారిలో, సాధారణ చిత్రాల మూసలో జరిగిందిగా అనిపిస్తుంది. అంటే, యష్ చోప్రా తీసే ప్రేమకథలకీ వీటికీ, విషయవస్తువులొతప్ప (కలల్ని అమ్మటం అనే) ఆశయ ధోరణిలో పెద్ద మార్పులేదనే అనుకోవాలి. ఏదిఏమైనా ఇవి సమాజంలో ఒక కొత్త వర్గానికి ప్రాతినిధ్యం వహించి,వారి కోపాన్ని,అసహనాన్నీ, ఆశయాల్నీ,ఆలోచనల్నీ మనముందుంచాయి. “యాంగ్రీ మిడిల్ క్లాస్ సినిమాలు”ఆనే ఒక కొత్త ఒరవడిని ధియేటర్లోకి తీసుకొచ్చాయి.

29 Comments
 1. కొత్తపాళీ October 22, 2008 /
 2. chandramouli October 22, 2008 /
 3. ravi October 22, 2008 /
 4. రవి October 23, 2008 /
 5. గీతాచార్య October 23, 2008 /
 6. jaya January 2, 2009 /
 7. chaitanya March 5, 2009 /
 8. vinay April 15, 2009 /
 9. Manjula February 22, 2010 /
  • hero February 22, 2010 /
 10. hero February 22, 2010 /
   • hero February 23, 2010 /
 11. రవిచంద్ర February 22, 2010 /
 12. baatasari February 22, 2010 /
   • baatasari February 22, 2010 /
   • baatasari February 23, 2010 /
   • vinaychakravarthi February 22, 2010 /
 13. ramana February 22, 2010 /
 14. Surya February 22, 2010 /
 15. చదువరి February 22, 2010 /
 16. Sankar gongati February 26, 2010 /