Menu

పా-త్రీ ఇడియట్స్-సీతా సింగ్స్ ది బ్లూస్

నాకు సినిమాలకీ దూరం పెరిగి చాన్నాళ్ళైనట్లుంది. అంటే, నేను చూడట్లేదని కాదు. కొత్త సినిమాలు బానే చూస్తున్నా. కానీ, ఏమిటో రాయాలి అనిపించట్లేదు. ఇవాళ ఓ సినిమా చూశాక, నాకెందుకో రాయాలనిపిస్తోంది. ఇటీవల చూసిన సినిమాలు కొన్నింటి గురించీ.

పా: జూన్ నుంచి ఎదురుచూస్తూ, ఆఖరికి సినిమా రిలీజైన నెలరోజులగ్గానీ చూడలేకపోయాను. ’చీనీకం’ సినిమా గుర్తొచ్చింది చాలాసార్లు, ఈ సినిమా చూస్తూ ఉంటే. బహుశా, దర్శకుడి శైలి వంటబట్టిందేమో నాకు. ఈ సినిమాకీ, ఆ సినిమాకీ కథాపరంగా చాలా తేడా ఉంది కదా (ఉందంటారా?), అయినా కూడా నాకు అడుగడుగునా చీనీకం గుర్తొస్తూ ఉండింది. బహుశా, బాల్కీ మార్కు కనబడకున్నా ఫీల్ అయ్యానేమో. అమితాబ్ బచ్చన్ కి జోహార్లు. ఈ వయసులో కూడా అందరిని తన చుట్టూ తిప్పుకోగలుగుతున్నాడు – దర్శకులనీ, ప్రేక్షకులనీ. ఇళయరాజా – ’ఆకాశం ఏనాటిదో…’ ట్యూన్ ని తమిళం,తెలుగుల్లో ఒక దృశ్యంలో, మలయాళ పాటలో ఇంకో నేపథ్యం (మళయాళ పాటలో ఇద్దరు చిన్నపిల్లలపై చిత్రీకరించినట్లు గుర్తు), ఇప్పుడు ’పా’ లో ఇంకో మూడ్లో… చాలా చక్కగా వాడేస్కున్నారు. నాకు చాలా నచ్చింది. ఇలా వాడటం ఆయనకేం కొత్తకాదనుకోండి, కానీ, ఆశ్చర్యపోడం నాకూ కొత్తేం కాదు. ’హిచ్కీ హిచ్కీ…’, ’ముడి ముడి..’ – నాకు రెండు పాటలూ చాలా నచ్చాయి. అరుంధతీనాగ్ ని మరికాసేపు చూపించి ఉంటే బాగుండు అనిపించింది… అంటే, నేను ’బిఖరే బింబ్’ నాటకం చూసి ఆమె ఏసీనయ్యా. దానితో మళ్ళీ కనబడేసరికి కాసేపు చూద్దామనిపించింది.

ఇక పోతే, నిజానికి, నాకు ఈ కథనం మరీ అంత నచ్చలేదు. అంటే, సినిమా చూడ్డానికి బాగుంది కానీ, చాలా విషయాలు ఒకే సినిమాలో చెప్పేసే అటెమ్ట్ అనిపించింది అప్పుడప్పుడు. ఉదాహరణకి – అభిశేక్ రాజకీయాలకి మరి కాస్త ఎక్కువ స్థానం ఇచ్చి ఉండాలేమో… ఫీల్ గుడ్ సినిమా… అలా తీద్దాం అనుకున్నప్పుడు మధ్యలో సాంఘిక సమస్య ఒకటి తెచ్చి – సగంలో వదిలేయడం ఏమిటో… బహుశా, నేనే రాంగ్ ఎస్టిమేషన్ వేసి ఉండొచ్చు ఈ విషయం గురించి – దర్శకుడు దాన్ని కథలో ఓ భాగంగానే చూశాడేమో… ఏమైనా, బాల్కీ మూడో సినిమా కోసం వెయిటింగ్.

త్రీ ఇడియట్స్ : అమీర్ఖాన్ స్కూల్లో ఐడియాలు – వీటి కోసం సినిమాని చూడొచ్చు 🙂 నాకు క్రియేటివ్ గా అనిపించాయి. అరవింద్ గుప్తా అనుకుంటా -ఐఐటీలో చదువుకుని, ఇలా ఎడ్యుకేషన్ టాయ్స్ చేయడం మొదలుపెట్టినాయన – ఆయనని స్పూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు ఈ భాగానికి. ఇకబోతే పాటలు – విడిగా విన్నప్పుడు నాకంత ఎక్కలేదు. కానీ, సినిమా చూసొచ్చాక మాత్రం – “జూబి డూబి”, “ఆల్ ఈజ్ వెల్” వెంటాడ్డం మొదలుపెట్టాయి. అయితే, నా వోటు మాత్రం… ’గివ్ మీ సమ్ సన్షైన్’. కొంతవరకూ చేతన్ భగత్ నవల లానే ఉందేమో కానీ, ఏమిటో, ఇలా ఈ సినిమా ఇంతలో అంత ఎలా సంపాదించిందో అర్థం కాలేదు. అప్పట్లో రాకెట్సింగ్ నాకంత నచ్చలేదు. ఈ సినిమా తో పోలిస్తే, అదే నచ్చింది నాకు. అదేమో పెద్ద ఆడినట్లు లేదు….

ఇక అసలు కథకి రావాలి కదా: నన్ను ఈ వ్యాసం రాయిస్తున్న సినిమా – సీతా సింగ్స్ ది బ్లూస్ – యానిమేషన్ చిత్రం. సినిమా కథ, నిర్మాణం, దర్శకత్వం, యానిమేషన్ నిర్వహణ – మొత్తం ఒకరే – నీనా పాలే అన్న అమెరికన్ కళాకారిణి. నీనా సొంత కథతో, రామాయణ కథని ఇంటర్లీవ్ చేసారు. నాకు ఈ సినిమా చాలా సృజనాత్మకంగా అనిపించింది…

హీరోయిన్, ఆమె భర్తా, వాళ్ళ పిల్లీ : వీళ్లదో చిన్న సంసారం. సాన్ ఫ్రాన్సిస్కో లో ఉంటూ ఉంటారు. ఇంతలో ఆమె భర్త ఏదో ప్రాజెక్టు పని పై త్రివేండ్రం వెళ్తాడు. వీళ్ళ మధ్య దూరం పెరుగుతుంది. కొంతకాలానికి ఉన్నట్లుండి అతను ఈమె తో సంబంధాలు తెంచేస్కుంటాడు. ఆమెకి షాక్. ఈ సమయంలోనే ’రామాయణం’ అధ్యయయనం చేస్తూ, సీత జీవితాన్ని అనలైజ్ చేసి తనని పోల్చుకుంటూ – ఇలా గడుపుతుంది. సినిమాలో – రామాయణం, సీత మనోభావాలు : వీటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. సీత పాడే పాటలున్నాయి చూశారు – చాలా టచింగ్.

పిల్లి సినిమా మొదట్లో భార్యాభర్తల్ని నిద్రలేపే సీన్ – నవ్వాగలేదు చూడగానే.

చంద్రుడు నడుస్తున్నట్లు చూపే దృశ్యాలు, లంకా దహనం, సీతా-రాముల మధ్య ’పాతివ్రత్యం’ తాలూకా సంభాషణలు, సీతా-నీనా : సోలో సాంగ్ చిత్రీకరణ – అన్నీ చాలా సృజనాత్మకంగా ఉన్నాయి. పాటల చిత్రీకరణ, పాత్రల రూపురేఖలు – అసలు నాకు విజువల్, నేపథ్య సంగీతం పరంగా సినిమా బాగుంది. గ్రాఫిక్ నవల ఒకటి రాయాల్సింది ఈ పేరుతో.

అసలు, ఈ కథ నడుస్తూ ఉంటే, తోలుబొమ్మల్లాంటి ఆకారాలు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాయి – కామెడీ. ప్రస్తుత తరం పిల్లలు ఇలాగే చర్చించుకుంటూ ఉంటారేమో… రామా అంటే, దశరథాస్ సెకణ్డ్ సన్ కదా… అని ఒకరంటే, నోనో, ఐ థింక్ హీ ఈజ్ ది ఎల్డెస్ట్ అని ఇంకోరు….

సినిమా ఓవరాల్ గా హాయిగా ఎంజాయ్ చేయగల సినిమా. రామాయణం కథని ఒక అమెరికన్ కోణంలో చెబితే ఇలాగే ఉంటుందేమో. మధ్య మధ్య – ఇలా ఎందుకు చేసినట్లు? ఇలా చేసుండకూడదేమో – ఇలాంటి చర్చలు – ఆసక్తికరంగా ఉన్నాయి సంభాషణలు.

ఈ సినిమా మంచి ప్రయోగం. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింది ఈ సినిమా ఉచితంగా డౌన్లోడ్ కి విడుదల చేశారు.

నీనా పాలే గురించి నాకు మహా క్యూరియస్ గా ఉంది. ఈవిడ తీసిన వేరే డాక్యుమెంటరీలూ, సినిమాలూ ఏవన్నా తెలిస్తే ఇక్కడ రాద్దురూ?

14 Comments
 1. Anwar January 18, 2010 /
  • Purnima January 18, 2010 /
 2. Manjula January 18, 2010 /
 3. అభిమాని January 18, 2010 /
  • సౌమ్య January 19, 2010 /
   • అభిమాని January 19, 2010 /
   • Sowmya V.B. January 20, 2010 /
   • Sowmya V.B. January 20, 2010 /
 4. sandeep January 18, 2010 /
 5. Keshavcharan January 23, 2010 /