మిస్సవుతున్నాం అని గుర్తుచేసే “మిస్సమ్మ NRI”

missamma1
వలస వెళ్ళిన పక్షులు సైతం  సీజన్ అయిపోగానే తిరిగి తమ సొంత గూటి వైపు ప్రయాణం పెట్టుకుంటాయి. కానీ మనం మాత్రం…? అనే పాయింట్ ఎప్పటికీ హృద్యమైనదే..హత్తుకునేదే. ఎన్నారైలు తమని తాము ఆ పాత్రలలో ఐడింటిఫై అయి తమ గుండె తడిని తడముకుంటే…ఇక్కడ(ఇండియాలో)వాళ్లు తమని వదిలి దేశాలకు వెళ్ళిన పిల్లలని,స్నేహితులని,సన్నిహితులను తలుచుకుని జ్ఞాపకాల్లోకి అలవోకగా వెళ్ళటం సహజంగా జరిగేదే. సరిగ్గా ఇలాంటి ఎమోషన్ ని తట్టి లేపే  ప్రయత్నం చేసింది..కొందరు ఎన్నారైలు చేసిన ఈ “మిస్సమ్మ ఎన్నారై ” చిత్రం. తొలి ప్రయత్నం అయినా తడబడకుండా తీయటం బాగుందనిపిస్తే,చెప్పాల్సిన పాయింటుని ఎక్కడో క్లైమాక్స్ దాకా నాన్చటం కొద్దిగా కష్టమనిపిస్తుంది.అయితే  పరిమిత వనరులు,కొత్త నటీనటులు,సాంకేతిక వర్గంతో చేసారు..కొన్ని లోపాలు ఉంటాయి..సర్దుకుపోవాలి  అంటారా..అయితే సరైన కథ తయారు కావటానికి ప్రత్యేక వనరులు(మేధస్సు ,సృజనాత్మకత లు కాదు)  పెట్టుబడి అవసరం లేదు కదా అని అనాలనిపిస్తుంది.

ముందుగా ఈ సినిమాదొక ట్రెయిలర్ చూసెయ్యండి….

ఓకే… ఇలాంటి పాయింటుతో గతంలో సూపర్ హిట్ డిడిఎల్ జె(షారూఖ్,కాజల్) చూసాం..అయినా మిస్సమ్మ(ఎన్టీఆర్,సావిత్రి) అంటూ పాతసినిమా గుర్తు చేస్తున్నారు..ఏమిటీ వీరి కథ అంటే… న్యూయాక్క్ లో ఓయస్ ఓవర్ తో కథను పరిచయం చేస్తూ చిత్రం ప్రారంభం అవుతుంది. సినిమా మొదట్లో సూరి (సుశిక్షిత్ బిళ్లా) తన తల్లికి ఫోన్ చేసి జరిగిపోయిందానికి మీరు బాధ పడద్దు అని బాదగా చెప్తాడు. ఆ తర్వాత తన చేతికి ఉన్న వెడ్డింగ్ రింగ్ ని తీసి నీళ్ళలోకి విసిరేసి ఆసక్తి రేపుతాడు..ఆ రింగ్ అంత కాస్ట్ ది కదా అయినా ఎందుకు పడేసాడు అంత కష్టం ఏమొచ్చిందని..(కష్టం వస్తే రింగ్ ని తాకట్టు పెట్టుకునే బాపతు టాపిక్ కాదు )..ఇంట్రస్టింగ్ ..మంచి ఓపినింగ్ . ఆ తర్వాత (భయపడొద్దు మొత్తం సీన్ బై సీన్ చెప్పను)..వర్క్ ప్రమ్ హోమ్ మీద ఓ సెటైర్ వేసుకుని ముందుకువెళ్తాడు. నెక్ట్స్ సీన్ లో మనకి రివిల్ అయ్యేది సూరి ఎందుకంత విషాదం మూడ్ లో ఉన్నాడు అంటే అతని ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయ్యింది. పెళ్ళికూతురు తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. దాంతో ఓ రెండేళ్ల వరకూ పెళ్ళి గిళ్లీ వంటివి జాన్తా నై అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. కానీ ఇండియాలో ఉన్న అతని తండ్రి(దేవదాస్ కనకాల) ఊరుకోడు. ఆ కాన్సిల్ అయిన పెళ్ళి కూతురు కన్నా గొప్ప సంభందం తెస్తానని కంకణం కట్టుకుట్టుకుంటాడు.

వెంటనే న్యూ జర్శీలో ఉండే అమ్మాయిని తల్లి తండ్రులతో మాట్లాడి ఆమె ఫొటోని కొడుక్కి మెయిల్ చేస్తాడు. ఆమే మహిత(శిల్ప)…సూరి ఉంటున్న అపార్టమెంట్ లోనే క్రింద పోర్షన్ లో ఉంటుంది( అయితే సూరి ఎప్పుడూ చూసి ఉండడనుకోండి). ఇక ఆమెకీ ఓ సమస్య. ఆమెది హైదరాబాద్(అది సమస్య కాదు). రెండేళ్ళ క్రితం ఎమ్.ఎస్ మాస్టర్స్ చేయటానికి ఎఫ్.1 వీసాతో ఇక్కడికి వస్తుంది. అనుకోని స్ధితిలో ఆమె వీసా రిజక్టు అవుతుంది. ఇండియా తిరిగి వెళ్ళిపోవాల్సిన స్ధితి. ఆమె ఓ లాయిర్ ని కన్సల్ట్ చేస్తే అక్కడుంచే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే సమస్య తీరుతుందని చెప్పుతుంది. అయితే ఆమెకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. కట్ చేస్తే మన హీరో,హీరోయిన్స్ ఇద్దరూ పెద్దల పంపిన వివరాలు ద్వారా ఒకరికొకరు పరిచయం అవుతారు. ఆ తర్వాత విడివిడిగా అనుకోకుండా మిస్సమ్మ(ఎన్టీఆర్,సావిత్రి) సినిమాని టీవీలో చూస్తారు. అది చూసి ప్రేరణ చెందిన ఇద్దరూ తాము కూడా పెళ్ళి నాటకం ఆడాలని నిర్ణయించుకుంటారు. తద్వారా సూరి తన తండ్రి పెళ్లి చేసుకో అనే పీకుడు నుంచి తప్పించుకోవచ్చు. మహితకు వీసా సమస్య తీరి కెరీర్ ను ముందుకు తీసుకెళ్లటానికి అవకాశం కలుగుతుంది.
అలా నాటకంగా ప్రారంభించిన వారి జీవితంలో ఏం జరిగింది అనేది మిగతా కథ.

ఇక పై కథకూ,మనం మొదట చెప్పుకున్న పాయింటు(వలస)కూ సంభందం లేదనది మీరు గమనించే ఉంటారు. అదే ఈ ఫీచర్ ఫిల్మ్ కు పెద్ద మైనస్ (అయితే నస ఎక్కడా లేకుండా తీయటం ఈ చిత్రానికున్న పెద్ద ప్లస్). ఎత్తుకున్న పాయింట్ ఎన్నారైలు మిస్సమ్మ నాటకం ఆడాలని నిర్ణయించుకోవటం చాలా బాగుంది. అయితే ఆ నాటకాన్ని కొనసాగిస్తూ తద్వారా వచ్చే సమస్యలు,వారి నుంచి వారు ఎలా తప్పించుకుంటారు అన్న దిశలో ఫన్ వస్తుంది..ఆ రకంగా కథ నడుపుతారని ఊహించటం జరిగింది. అంటే పాత మిస్సమ్మ కథలో కూడా అలాగే జరుగుతుంది. నాకు తెలిసిన రొమాంటిక్ కామిడీలన్నిటిలోనూ ఇదే తరహా కథనం నడుస్తుంది.అయితే అక్కడే నా ఆలోచనలకు దెబ్బ పడింది.

దర్శక,రచయితల అంతిమ లక్ష్యం తమ తాత్కాలికి లక్ష్యం కోసం ఇతర దేశాలు వలస వచ్చిన వారి మనోభావాలు చెప్పటం. అయితే ఆ పాయింటు చుట్టూ సీన్స్ అల్లలేదు. కేవలం క్లైమాక్స్ లో ఓ సన్నివేశం పెట్టారు(ఈ సీన్ బాగా పండింది)..మధ్యలో కొన్ని డైలాగులు పెట్టారు ..అంతే. దాంతో ఎత్తుకున్న ఎన్నారై మిస్సమ్మ అన్న ఐడియా డవలప్ కాలేదు..చెప్పుదామనుకున్న పాయింట్ ఎగ్జిక్యూట్ కాలేదు. నిజానికి చెప్పాలనుకున్న పాయింటుకీ,అల్లుకున్న డ్రామాకు సంభంధంలేకపోవటంతో ఈ సమస్య తలత్తింది. అయితే దర్శకుడు ఇలా కథ,కథన విషయంలో ఇబ్బంది పడ్డా…తాను కొత్త వాడైనా కొత్త నటీనటులు నుంచి మంచి నటన రాబట్టుకుని మార్కులు వేయించుకున్నాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టైటిల్ సాంగ్ చాలా బాగున్నాయి. అయితే సీన్స్ లో లాగ్ లు చాలా ఉన్నాయి. ఎడిటర్ లోపమో,డైరక్టర్ సమస్యో గానీ ఇది విసుగించే అంశమే. అలాగే సెల్ ఫోన్స్ సంస్కృతి ఎక్కువుగా ఉన్నమాట నిజమేగానీ ప్రతీ క్యారెక్టర్ ని(అవకాశం ఉంటే సీన్ ని) ఫోన్ లో మాట్లాడటంతో ప్రారంభించటం బాగోలేదు. ఇక సీన్స్ లో దర్శకుడు నటీనటుల నటన సహజంగా అనిపించాలని వారి చేత ఏదో పని చేయిస్తూ డైలాగులు చెప్పించాడు..కానీ అవి సినిమాటిక్ గానే మిగిలిపోయాయి.అలాగే సీన్స్ లో చాలా చోట్ల ఏం చెప్పుతున్నామనే క్లారిటీ మిస్సయిన ఫీలింగ్ వచ్చింది. సాధారణంగా అలా జరిగితే సీన్స్ రిపీట్ అయినట్లు అనిపిస్తూంటాయి. నిజానికి ఇవి ఎత్తి చూపతగ్గ లోపాలేమీ కాదు. అయితే ఈ దర్సకుడుకి ఇదే చివరి సినిమా కాదని నమ్మకం కుదరటంతో.. రాయటం జరుగుతోంది.

కెమెరా మూడ్ కి తగినట్లు బాగానే ఉంది. ఇక లొకేషన్స్ సెలక్షన్ చాలా బావుంది. నటీనటుల దగ్గరకు వస్తే హీరో,హీరోయిన్స్ (సినిమా బాషలో చెప్పాలంటే వారు ఆ మెటీరియల్ కాకపోయినా) బాగా నటించారు. హీరోయిన్ స్నేహితురాలు సిమ్రాన్ గా చేసిన అమ్మాయి కూడా పెద్ద పాత్ర కాకపోయినా న్యాచురల్ గా చేసింది. ముఖ్యంగా హీరో స్నేహితుడు మనోజ్ గా వేసిన సాయి చాలా బాగా చేసారు. ఎంతబాగా అంటే నా పరిచయస్ధులు(సినిమావాళ్ళు) ఈ చిత్రం (డీవిడి)చూసి అయన ఎడ్రస్ అడిగేంతలా. ఆయనకి ప్రత్యేక అబినందనలు. అలాగే ఈ ప్రయత్న వల్ల కమర్షియల్ గా ఏమీ ఒరగదని తెలిసినా పెట్టబడి పెట్టిన నిర్మాత మీను ఆనంద్ గారిని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ఇలాంటి వారు పూనుకోకపోతే టాలెంట్ లు ఎలా బయిటపడతాయి చెప్పండి.

ఫైనల్ గా శేఖర్ కమ్ముల సినిమాలు మన ఎన్నారైలను దర్శకులగా మార్చటానికి ఉత్సాహమిస్తున్నాయిని ఈ చిత్రం చూస్తే తప్పనిసరిగా అనిపిస్తుంది.ఏదైమైనా మంచి ప్రయత్నం..ఈ టీమ్ ఈ సారి కమర్షియల్ వెంచర్ తో ముందుకురావాలని ఈ నూతన సంవత్సరం రోజున నవతరంగం కోరుకుంటోంది. కొత్త నీరు వస్తేనే కదా..పాచి పట్టిన పాత నీరు నుండి విముక్తి కలిగేది.బెస్టాఫ్ లక్.

బ్యానర్ : ఎ డ్రీమ్స్ ‘ఎన్’ డ్రీమ్స్ ప్రొడక్షన్
నటీనటులు: శిల్ప, సుశిక్షిత్ బిళ్లా, సాయి, సిమ్రాన్, శ్రీ కొల్ల, మద్దూరి మంజీర, దేవదాస్ కనకాల తదితరులు.
కెమెరా: మురళి పల్లెకొండ
సంగీతం,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శ్రావణ్ కుమార్
ప్లే బ్యాక్ సింగర్స్ : సరస్వతి,దీపు
లిరిక్స్ : చక్రవర్తుల
ఎడిటింగ్: ఎన్.పి.సతీష్
స్క్రీన్ ప్లే,మాటలు : కె.శరత్ చంద్ర,యవనాష్ మద్దూరి
పబ్లిసిటీ డిజైనర్ : తరుణ్ (నాని)
నిర్మాత,సమర్ఫణ: మీనూ ఆనంద్

రచన,దర్శకత్వం : కె.శరత్ చంద్ర

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

13 Comments to “మిస్సవుతున్నాం అని గుర్తుచేసే “మిస్సమ్మ NRI””

  • ట్రైలర్ బాగోలేదు. nothing new and routine. పబ్లిసిటీ కోసం NRI అంటూ ఇదో fashion అయిపొయింది.వాళ్ళు మనుషులే కదా. కొండనుంచి ఎమైనా ఊడిపడ్డారా ?

    • @విమర్శ: సినిమా పేర్లో NRI ఉంది. తీసింది అమెరికాంధ్రులు.సినిమాలో కథ అక్కడే జరుగుతుంది. ఇందులో పబ్లిసిటీకోసం NRI అనుకోవడమేమిటో…మీ అసలు సమస్యేమిటో అస్సలు అర్థం కావడం లేదు.

    • picha lite undi trailer…editin, music bagundi…..poorthi cinema ekkada dorukunu prabhu…

      • ఈ చిత్ర నిర్మాతలు త్వరలో మెయిన్ స్ట్రీం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే కొంత వెయిట్ చేస్తే దగ్గర్లో ఉన్న థియేట్లర్లోనో లేకపోతే ఏదో ఒక టీవీ ఛానల్లోనో ఈ సినిమా మీరు చూడొచ్చు.

  • హెలో ఈ చిత్రమ్ ట్రెయిలర్లో వచ్చిన పాట రచయిత మనకి (నవతరన్గమ్) తెలిసిన వ్యక్తే చక్రవర్తుల (కిరణ్ చక్రవర్తుల) గారు. చాలా బాగా వ్రాసారు పాటని.వారికి అభినన్దనలు, మన్గిడీలు.

  • How do you even watched the trailer guys…forget about the movie itself…

  • లిరిక్స్ మ్యూజిక్ బావుంది. BOL for team.

  • ప్రచారం చెయ్యచ్చో లేదోనని వ్రాయలేదు అంతకు ముందు… but anyway, here I am!

    తమ్ముడు సతీశ్ చెప్పినట్టు ఆ గీతరచయితని నేనే! :-) తమ్ముడూ అశ్విన్, నీకూ పాట నచ్చినందుకు నెనఱ్లు.

    మహేశ్‌కుమార్ గారు పైన చెప్పినట్టు… ప్రస్తుతం YouTube Rentals-లో ఈ చిత్రం చూడచ్చు USA వాస్తవ్యులు మాత్రం. త్వరలో ఇతర దేశాల్లో కూడా మఱో రకంగానైనా చూసే వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. http://www.missammanrimovie.com అన్న websiteలో అన్ని వివరాలూ ఉన్నాయి, పాట audioతో సహా.

    • నచకి గారూ, మీరు ఇచ్చిన లంకె ప్రస్తుతం పనిచెయ్యడం లేదు
      పేరెంట్ సైటుకి రీడైరెక్టు అవుతోంది – గమనించగలరు. నెనర్లు.

      • నాకు అవుతోంది, స్నేహిత్ (మంచి పేరు!) గారూ… కానీ అందులో పాటని వెతికి పట్టడం అంత సులభం కాదేమో… http://urlm.in/evra/ అన్న లంకె నేఱుగా పాట ఉన్న పుట దగ్గఱకు చేఱుస్తుంది.

        • NaChaKi gaaru,

          mee e mail id ivvandi

          surya

          • nachaki_gmail_com (@ and . peTTukOnDi madhyana.)

  • http://www.youtube.com/watch?v​=DZw0jv3s5zY – ఇప్పుడు అందఱూ పూర్తి చిత్రాన్ని యిక్కడ చూడవచ్చు. :)

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories