Menu

Invictus

Invictus– అతడి ప్రజలు నాయకుణ్ణి కోరుకున్నారు. అతడు అజేయుడ్ని ఇచ్చాడు.

నెల్సన్ మండేలా గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 1995 రగ్బి ప్రపంచ కప్ మరియు స్ప్రింగ్ బోక్స్ (సౌతాఫ్రికా రగ్బీ జట్టు పేరు) చుట్టూ తిరిగే చిత్రం ఇది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వుత్సవాలలో మంచి పేరు సంపాదించింది. ఒక పుస్తకం (జాన్ కార్లిన్ “ప్లేయింగ్ ది ఎనిమి“ ఆధారం చేసుకుని తీసిన చిత్రం ఇది. నెల్సన్ మండేలా గా మోర్గాన్ ఫ్రీమన్, స్ప్రింగ్ బోక్స్ కెప్టన్ గా మాట్ దమోన్ నటించారు. ప్రస్తుతం అందరు నటులలాగే మాట్ దమోన్ రగ్బి ఆటకు సంబంధించి ఏంటో తర్ఫీదు పొంది ఇందులో నటించాడు. ఒక ఆట దేశ చరిత్రను ఎంతగా ప్రభావితం చేసిందో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు దర్శకుడు మరియు నిర్మాత ఐన క్లింట్ ఈస్ట్ వుడ్. సినిమా అంతా ఎక్కువగా కేప్టౌన్, జోహన్నేస్బుర్గ్ లో తీసారు.

ఇక కధలోకి వస్తే – ఎన్నో ఏళ్ళు రాబిన్ ఐలాండ్ (ద్వీపం)లో కారాగారం లో మగ్గిన నెల్సన్ మండేలా 1990 లో విడుదల ఐన వెంటనే వర్ణ వివక్షని పూర్తిగా నిర్మూలించి, నల్ల జాతీయులు కూడా వోటు వెయ్యగలిగే సంపూర్ణ ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి విజయం సాధించడం తో సినిమా ప్రారంభం అవుతుంది. 1994 ఎన్నికలలో నెల్సన్ మండేలా(మదిబా అని అప్యాయంగా పిలుస్తారు) దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ గా ప్రమాణం చేసి దేశాన్ని తీర్చిదిద్దడం కోసం పూనుకుంటాడు. అతడికి ఎదురయ్యే మొట్టమొదటి సమస్య స్వేతజాతియుల భయం-నల్ల జాతీయుల భవిష్యత్ ఆకాంక్షలు మధ్య సమన్వయం సాధించడం. అప్పట్లో వున్న తెల్లవారికి-నల్లవారికి మధ్య వున్న అపనమ్మకాన్ని ఎంతో బాగా చూపిస్తాడు దర్శకుడు మండేలా రక్షణకు కొత్తగా వచ్చిన తెల్లవారికి నల్లవారికి మధ్య జరిగే సన్నివేశాలతో. భారత దేశం లో లాగ స్వతంత్రం వచ్చాక తెల్లవాళ్ళు దక్షిణాఫ్రికాలో దేశం విడిచి పోలేదు, నల్ల వారితోనే సహజీవనం సాగిస్తున్నారు ఇప్పటికి. ఇందులో ఎక్కడ విసుగు అనిపించే రాజకీయ సంభాషణలు, చరిత్ర, మండేలా అంతరంగ ఆవిష్కారం లాంటివి ఎక్కువ చెయ్యకుండా స్క్రీన్ ప్లే (అంటోనీ పెఖం) చాల బాగా సరళంగా సాగుతుంది.

దేశానికీ అధ్యక్షత వహించాక మండేలా దేశ సమస్యలు ఎన్నో తీర్చడంలో మునిగివుంటాడు ముఖ్యంగా నిరుద్యోగం, దోపిడిలు, హింస, జాతి విద్వేషాలు మొదలైనవి. ఒకరోజు మండేలా దక్షిణాఫ్రికా జాతీయ జట్టు ఆడే రగ్బీ ఆట చూడటానికి వస్తాడు. నల్ల జాతీయులు అందరు ఆ దేశం జట్టుకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు, ఆకుపచ్చ రంగు, శ్వేతజాతి, పూర్వ చరిత్ర వీటి ఆధారంగా ద్వేషంగా వుంటారు స్ప్రింగ్ బోక్స్ అంటే. 1995 లో దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ కి ఆతిధ్యం వహిస్తోంది అని తెలుసుకుని,మండేల అందరిని ఏదోరకంగా ఒప్పించి రగ్బీ జట్టు డ్రెస్, పేరు, రంగు అవే వుండేలా చూస్తాడు (శ్వేతజాతియులకి బాగా అనుబంధం). తరవాత దక్షిణాఫ్రికా జాతీయ జట్టు స్ప్రింగ్ బోక్స్ కెప్టన్ ఐన ఫ్రాన్స్వాని కలుస్తాడు. వారిద్దరి మధ్య జరిగే చర్చలో మండేలా తాను ఏమి కోరుకుంటోంది ఫ్రాన్స్వాకి చెప్పాడు కాని ఫ్రాన్స్వా అర్ధం చేసుకుంటాడు మండేలా అంతరంగాన్ని – స్ప్రింగ్ బోక్స్ నల్ల జాతీయుల యొక్క నమ్మకాన్ని చూరగొని, ప్రపంచకప్ లో విజయం సాధిస్తే, దేశం సంఘటితంగా మరియు వుత్తేజంగా అవుతుందని అసలైన ఇంద్రధనస్సు దేశం (రేన్బో నేషన్) కి ప్రతీకగా మారుతుంది అని.

స్ప్రింగ్ బోక్స్ జట్టు సభ్యులు అంతా బస్తీలలో, నల్ల జాతీయుల బాలలతో కలిసి ఆడి, వారికి ఆట నేర్పించి వారి అభిమానం చురగొనటానికి ఫ్రాన్స్వాకి తన జట్టు సభ్యుల నించి ముందు తిరస్కారం తరవాత సహకరిస్తారు. ప్రపంచకప్ కొద్ది రోజులో వుంది అనగా జట్టు ని అభినందించడానికి వచ్చిన మండేలా జట్టులో వున్నా ఏకైక నల్లజాతేయుడు ఐన చెస్టర్ విల్లిం ఆడడంలేదు అని తెలిసి నిరాశపడతాడు. ఇక మొదలవుతుంది గొప్ప వుద్వేగభరితమైన 1995 రగ్బీ ప్రపంచ కప్, చెస్టర్ విల్లిం కూడా అడే పరిస్తితిలో వుంటాడు, హేమ హేమిలైన జట్టులని దాటుకుని సెమి ఫైనల్ దాక వస్తే గొప్ప స్ప్రింగ్ బోక్స్ అని అనుకుంటారు. స్ప్రింగ్ బోక్స్ విజయం కోసం అందురు ప్రార్ధిస్తూ వుంటారు, జాతి విద్వేషాలు కొద్ది సేపు మరిచిపోయి…ఏంటో వుద్వేగంగా వుంటాయి ఆటలు, (dvd లో ఇంట్లో చూస్తే ఆ ఫీల్ వుండదు). అన్ని జట్టులని వోడించి చివరకు న్యుజిలాండు జట్టు తో ఫైనల్ కి పోటికి దిగుతారు స్ప్రింగ్ బోక్స్, ఆట పోటాపోటిగా సాగి …..ఏమి జరుగుతుందో వెండి తెరపై చూస్తేగాని మజా వుండదు.

మండేలాగా నటించడానికి మోర్గాన్ ఫ్రీమన్ పేరు నెల్సన్ మండేలానే సూచించారు. మోర్గాన్ ఫ్రీమన్ ఏంతో అధ్బుతంగా పాత్రలో మండేలాగా జీవించాడు. స్ప్రింగ్ బోక్స్ కెప్టన్ గా మాట్ దమోన్ కూడా బాగానే పేరు సంపాదించాడు ఈ సినిమాలో. పెద్ద పెద్ద స్టేడియంలో వేలజనాల ఆనందాతిశయంతో కూడిన రగ్బి ఆటలను ఏంతో బాగా చిత్రీకరించారు (అసలు షూటింగ్లో ఎంతమంది ప్రేక్షకులుగా పాల్గొన్నారో మీరు అంచనా వెయ్యండి). ఏంతో మంచి సంభాషణలు, కంటికి ఇంపైన రంగులతో మనసుకు మంచి వుత్తేజాన్ని, వుల్లాసాన్ని ఇచ్చే చిత్రం అని చెప్పడాని ఎటువంటి సందేహం లేదు, ఆటలు జాతిలో సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యకరమైన జాతిని ఎలా పెంపొందిస్తాయి అని అనడానికి ఇది నిదర్సనంగా నిలుస్తుంది. నేను ఎక్కువ విశ్లేషణ లేకుండా చిత్రం గురించే చెప్పే ప్రయత్నం చేశాను ఎందుకంటే ఈ సినిమాకి దక్షిణాఫ్రికా చరిత్ర తెలియక పొతే చూసే అవకాశం తక్కువ. సినిమాకి Invictus అని పేరు ఎందుకు పెట్టారో కూడా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. chak de లాంటి సినిమాలు చూసి ఆనందించగలిగే వారందరికి ఇది ఒక సారి ధియేటర్ లో చూడతగ్గ సినిమా.

దర్శకత్వం: క్లింట్ ఈస్ట్ వుడ్ (Client Eastwood)

పాత్రధారులు: మోర్గాన్ ఫ్రీమన్, మాట్ దమోన్ (Morgan Freeman, Matt Damon)

రిలీజ్: Dec 11, 2009 అమెరికా, దక్షిణాఫ్రికా ఇంకా కొన్ని దేశాలలో

–చంద్ర శేఖర్ నండూరి

3 Comments
  1. అభిమాని January 5, 2010 /
    • అభిమాని January 5, 2010 /