Menu

అవతార్-మరోవ్యూ

నవతరంగంలో ఇప్పటికే అవతార్ సినిమా గురించి ఎన్నో రివ్యూలు వచ్చాయి, ఇది మరోవ్యూ. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా కథ మౌళికంగా మనుషుల, ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాల మేధావుల పశ్చాత్తాపం అని అనుకోవచ్చు.

తాను కూర్చున్న కొమ్మను నరుకుతూ, గడిచిన కాలంలో ఈ భూమిపైనున్న ప్రకృతిని రెండు చేతులతో నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తూ వచ్చిన మనిషి, రేపటి తరాలకు ఏమి మిగులుస్తున్నాడో తెలియక, గతాన్ని చూసి బాధపడుతూ, తాను నేర్చుకున్న పాఠాలను వల్లె వేయడమే ఈ సినిమాలో చేసిన పని. ప్రకృతితో సహజీవనం చేసే తెగలను గౌరవించి, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, పొగుడుతూ అలాగే అభివృద్ధి పేరిట ప్రకృతి దహనం చేసే వారిని తెగనాడుతూ, విలన్లుగా చిత్రీకరించి, ఈ రెండు కోణాల్ని మనకు 3డిలో చూపించే ప్రయత్నం చేశారు జేమ్స్ కేమరాన్.

అవ అంటే దిగి రావడం, తార్ అంటే నక్షత్రం. అవతార్ అంటే, తార నుండి దిగి రావడం అని అర్థం. మన పుస్తకాల్లో రాముడు, కృష్టుడు అవతార పురుషులు, వాళ్ళకు నీలి వర్ణం ఎందుకు ఆపాదించారో కానీ, అవతార్ సినిమాలోని పండోరా అనబడే ఈ అద్భుతమైన గ్రహం మీద నివసించే ప్రజలు మాత్రం నిగనిగలాడే నీలి రంగు చర్మంతో ఉంటారు. వారి జాతి పేరు నేవీ, అంటే నీలి రంగు అని అర్థం.

అ నేవీలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం ఒక వైపు, వారి సంపదను దోచుకోవడానికి మరో వైపు పెట్టుబడిదారి మానవులు పన్నాగాలు చేస్తుంటారు. ఈ సందర్భంగా మన హీరో జాతిని మరచి, ధర్మం వైపు నిలిచి, హీరోయిన్ నేత్రిని వలచి పక్కా తెలుగు సినిమా కథను తలపింపజేస్తాడు. తెలుగులో చూసినవారికి డాన్సులొక్కటే తక్కువ.

ఈ సినిమాలో పాశ్చాత్య ప్రేక్షకులకు (, మన ఇంగిలిపీసు సదువుల వాళ్లకు) కొత్తగా అనిపించే మరో విషయం పరకాయ ప్రవేశం (వాక్-ఇన్). మనం చిన్నప్పట్నుంటి మాయాబజార్, విఠలాచార్య సినిమాలను చూసి పెద్దగా పట్టించుకోకపోయినా. విదేశీ ప్రేక్షకులకు వాక్-ఇన్ అన్నది చక్కగా తెలియజెప్పారు. నేను అన్నది మెదడులోని ఒక భావన, గాడిద గుడ్డు అనుకునే సగం జ్ఞానం గల సైంటిస్టులకు ఇది ఒక పాఠం, నేర్చుకునే అవకాశం.

నేడు వైజ్ఞానిక శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఒక చేత ప్రాణాన్ని కాపాడే పనిముట్లు, మరో చేత తల్లి భూమిని ముక్కలు చేసే బాంబులు రెండూ తయారుగా ఉన్నాయి. కాలుష్యం చేతులు దాటి పోయి పర్యావరణ శాస్త్రజ్ఞులు తలలు పట్టుకున్నారు. మరొకవైపు భారత, టిబెట్, దక్షిణ అమెరికాలోని షామన్ మరియు ఇతర ప్రాచీన తెగల నాగరికతలపై అసక్తి పెరిగింది. మతాలు, మిషినరీల పేరిట జరిగిని విధ్వంసాన్ని చూసి ఆవేదన పడుతున్న సమయం.

విదేశాలలోని విజ్ఞానులు పడే ఆవేదననకు అద్దం పట్టిన సినిమా అవతార్.

భారతదేశపు మహా కావ్యం రామాయణం యొక్క మూల కథ మన జేమ్సుకు తెలుసని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ నేవీ వారు చేసే ప్రార్థనలు మన సంస్కృత శ్లోకాలను గుర్తు చేస్తాయి, కాస్త దేశీయ సంగీతాన్ని కూడా వాడారు. కళ్ళున్న ప్రతీవాడు ఖచ్చితంగా చూడవలసిన సినిమా అవతార్.

–నాగన్న

11 Comments
 1. కొత్తపాళీ January 8, 2010 /
  • KumarN January 8, 2010 /
 2. కిరణ్ January 9, 2010 /
  • kiran January 20, 2010 /
 3. Krishna Reddy January 10, 2010 /
 4. nagamurali January 10, 2010 /
 5. మణి January 11, 2010 /
 6. నాగన్న January 12, 2010 /
 7. sudhakar January 19, 2010 /
 8. Sankar gongati January 21, 2010 /
 9. goka nageshwara rao January 31, 2010 /