Menu

1000నవతరంగాలు

నవతరంగం పాఠకులకు, అభిమానులకు, సభ్యులకూ నమస్కారం.

పెద్ద పండుగ అయిపోయి మూడు రోజులయింది కానీ నవతరంగంలో మాత్రం ఈ రోజే  పెద్ద పండుగ. నేటితో నవతరంగం లో వెయ్యి వ్యాసాలు ప్రచురించడం పూర్తయ్యింది. దాదాపు రెండేళ్ళ క్రితం అనుకోకుండా వచ్చిన ఒక ఐడియాని నవతరంగం గా రూపొందించి దానిని ఇన్నాళ్ల పాటు విజయవంతంగా నడపగలిగామంటే మీ అందరి సహాయసహకారాల వల్లనే సాధ్యమైందని చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా అందరికీ మా హృదయపూరక ధన్యవాదాలు.

నవతరంగం మొదలుపెట్టేటప్పుడు ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. వెయ్యి వ్యాసాలంటే మాటలు కాదు. రెండేళ్ళపాటు ఎంతోమంది నిరంతంరంగా కృషి చేశారు కాబట్టే ఈ రోజు నవతరంగం ఆగకుండా సాగుతూనే ఉంది; కొనసాగుతుంది కూడా. అయితే కేవలం నవతరంగంలో ఆపకుండా వ్యాసాలు ప్రచురించడం మాత్రమే నవతరంగం లక్ష్యం కాదు. నవతరంగం మొదలుపెట్టినప్పుడు కొన్ని నిర్ధిష్టమైన లక్ష్యాలు, ఎజెండా తోనే మొదలయ్యాము. కానీ మధ్యలో ఎక్కడో నవతరంగం కాస్తా లక్ష్యాలకు దూరంగా నడిచిందేమో అనే అనుమానం ఈ మధ్యనే తలెత్తింది. అందుకు చాలానే కారణాలున్నాయి. వాట గురించి చర్చించేముందు అసలు నవతరంగం ద్వారా ఏం సాధించాలనుకున్నామో ముందుగా చెప్పాలి.

ప్రపంచ సినిమా పరిచయం:తెలుగు సినిమాల గురించి ఇంగ్లీషులోనూ తెలుగులోనూ వార్తలు, విశేషాలు, గాసిప్స్ ప్రచురించే ఎన్నో వెబ్ సైట్లు ఈ రోజు మనకి ఉన్నాయి. దాదాపు సంవత్సరానికి యాభైకి పైగానే ఇలాంటి వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క సైటు కూడా ప్రపంచ సినిమాని తెలుగు వాళ్ళకు పరిచయం చేసే ప్రయత్నం పెద్దగా చెయ్యలేదనే చెప్పాలి. అయితే సాఫ్ట్వేర్ పుణ్యమో లేక డివిడ్ పైరసీ పుణ్యమో నేడు ప్రపంచ సినిమా మన దేశం ఫుట్ పాథ్ ల మీదకొచ్చి పడింది. అయితే ప్రపంచ లోని వేల కొద్దీ సినిమాల్లో మంచివాటి గురించి నవతరంగం వ్యాసాలు ప్రచురించి ప్రచారం కల్పించాలనుకున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే వందకి పైగా ప్రపంచ సినిమాల గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురించాం.

విశ్లేషణ: సినిమా గురించి సమీక్షలు, టిడ్బిట్స్ కి మాత్రమే పరిమితమైన ఇతర వెబ్ సైట్లకు భిన్నంగా నచ్చిన/నచ్చని సినిమాల గురించి లోతైన విశ్లేషణాత్మకమైన వ్యాసాలు ప్రచురించాలన్నది మరో లక్ష్యం. ఒక విధంగా ఆ పని కూడా సక్రమంగానే చేశాం. ఇప్పటివరకూ నవతరంగంలో వచ్చిన విశ్లేషణలు 139.

చలనచిత్రోత్సవాలు:ప్రపంచంలో జరుగుతున్న, జరగబోయే చలనచిత్రోత్సవాలు, అక్కడ ప్రదర్శించబోయే చిత్రాలు, చివరకు ఆ ఉత్సవంలో ఎన్నికైన విజేతల వివరాలతో కూడిన సమాచారం గురించి రాయాలని మొదలుపెట్టినా ఇక్కడ మాత్రం అనుకున్నదానికంటే ఎక్కువే చేసినట్టనిపిస్తుంది. ఇలాంటి సమాచారం రాయాలనుకున్నప్పుడు ఎక్కడో ఏదో వెబ్ సైట్ లోనో వార్తా పత్రికలోనో వచ్చిన సమాచారాన్ని ఇక్కడ ప్రచురించవచ్చు. కానీ మేము ఇక్కడ ఇలాంటి సమాచారం పొందుపరుస్తున్నాం మీ చిత్రోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించరూ అని అడగాలనే ధైర్యం మాత్రం నవతరంగమే ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని లండన్ ఫిల్మ్ ఫెస్టవల్, బుకరెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, గోవా ఫిల్మ్ ఫెస్టివల్, త్రివేండ్రం ఫిల్మ్ ఫెస్టివల్, హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి నవతరంగం సభ్యులు accredited press members గా హాజరు కావడం జరిగింది. అంతే కాదు కరీంనగర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నవతరంగం ఒక భాగం అయ్యింది. గత సంవత్సరం ప్రకటించిన నవతరంగం అవార్డు ఇందుకు ఒక ఉదాహరణ అయితే ఈ సంవతర్సరం కరీంనగర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు రోజులపాటు నవతరంగం సభ్యులు సినిమాకి సంబంధించిన వివిధ అంశాల గురించి అక్కడ సెమినార్లలో ప్రసంగించనున్నారు. ఆ విధంగా చలనచిత్రోత్సవాలకి సంబధించి నవతరంగం ఎంతో ఉత్సాహంగానే ఉంది. అలాగే 50 కి పైగా వ్యాసాల ద్వారా వివిధ చిత్రోత్సవాల సమాచారం నవతరంగంలో పొందుపరచబడింది.

ఇక పోతే సినీ ఉద్యమాలు: ప్రపంచ సినిమా రూపురేఖలను ఎప్పటికప్పుడు మార్చివేస్తూ సినిమా అనే కళకు కొత్త దిశను నిర్దేశిస్తూ ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఉద్యమాల్లా సినిమాలు వెల్లువెత్తాయి. ఉదాహరణకు ఇటలీలో నియోరియలిజం, ఫ్రాన్స్ లో న్యూ వేవ్, బ్రిటన్ లో న్యూ సినిమా, మన దేశం లో ప్యారలల్ సినిమా, జపాన్ లో న్యూ వేవ్ ఇలా….ఎన్నో. వీటన్నిటి గురించిన సమాచారం ప్రచురించడంలో మాత్రం ఆలస్యం జరిగింది.

అలాగే ఫిల్మ్ క్రిటిసిజం తో ఆగకుండా నవతరంగం ద్వారా ఫిల్మ్ మేకింగ్ గురించి కూడా సమాచారం పొందుపరచాలనుకున్నాము. ఆ ప్రయత్నంలో శబ్ద గ్రహణం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే లాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వ్యాసాలు ప్రచురించాలనుకున్నాము. అయితే అనుకున్నంతగా ఈ విభాగంలో వ్యాసాలు రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా లఘుచిత్రాల విభాగంలో తెలుగు వారు తీసిన లఘు చిత్రాలను ప్రదర్శించాము. ఇంకా కొన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. నవతరంగం లో ఉన్న లఘు చిత్రాల కలెక్షన్ మాత్రం పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు.

వీటన్నిటికంటే ముఖ్యంగా నవతరంగం లో ఫోకస్ మరియు ఈ నెల సినిమా అనే రెండు శీర్షికలు నవతరంగానికే ప్రత్యేకం. ఫోకస్ శీర్షిక ద్వారా ప్రతీ నెలా ఒక ప్రముఖ దర్శకున్ని పరిచయం చేయాలన్నది మా అలోచన. అలాగే ’ఈ నెల సినిమా’ అనే శీర్షిక ద్వారా నెలకో మంచి (అంతగా ప్రాచుర్యం చెందని)సినిమాని పరిచయం చేయాలనుకున్నాం. సంవత్సరం కి పైగా ఈ శీర్షికలు కొనసాగినా ఆ తర్వాత సమాయాభావం వల్ల ఈ వ్యాసాల కొనసాగించడం జరగలేదు.

అలాగే ప్రముఖుల పరిచయాలు, పాఠకుల అభిప్రాయాలు, ప్రముఖులు రచించిన వ్యాసాలు, సినిమా సంగీతానికి సాహిత్యానికీ సంబంధించిన వ్యాసాలు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు కూడా ప్రచురించాము. అలాగే ఇతర భారతీయ భాషలకు చెందిన మంచి సినిమాల గురించి కూడా 200 దాకా వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.

అంతా మేమనుకున్నట్టుగానే జరిగింది. కాకపోతే కొద్దిగా ఎక్కడో తప్పు జరిగిపోయింది. మొదటినుంచీ తెలుగు సినిమా సమీక్షలొద్దు మొర్రో అన్నా వినకుండా మేమే మొండిగా సమీక్షలు ప్రచురించాం. దాదాపు వంద సమీక్షలొచ్చాయి. అంటే నవతరంగంలో పది శాతం. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ఇతర దేశ,భాష ల సినిమాలు మాత్రం బావుంటేనే వ్రాయడం తెలుగు సినిమాకొచ్చేసరికి మనం చూసినవాటన్నింటి గురించి వ్రాయడం జరిగింది. అయితే మన తెలుగు సినిమా 99% ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా సమీక్ష వ్రాసినా బాగోలేదనే వ్రాయాల్సి రావడంతో నవతరంగంలో వ్రాసే వాళ్ళంతా తెలుగు సినిమాని చిన్న చూపు చూస్తున్నారనే ఒక అపోహ మొదలయ్యింది. ఉత్తమ ఆశయాలతో మొదలుపెట్టన నవతరాంగం రెండేళ్ల తర్వాత చూస్తే ఈ వంద సినిమా సమీక్షలే నవతరంగం అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వంద వ్యాసలకొచ్చిన కామెంట్లు వాటి మీద జరిగిన చర్చలను మిగిలిన వ్యాసల మీద జరిగిన చర్చలతో పోలిస్తే మీకే అర్థమవుతుంది.

అలాగే నవతరంగం లో ఇప్పడు 60 కి పైగా సభ్యులున్నా అందులో active గా పని చేస్తుంది మాత్రం పదిమందికంటే తక్కువే. 60 మంది సభ్యులు నెలకి ఒక్క వ్యాసం ప్రచురించినా కూడా రోజుకి రెండు వ్యాసాల చొప్పున నవతరంగం కళకళలాడుతూ సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. అయినా కూడా అలా జరగలేదు. దాంతో నవతరంగం లో ఆగకుండా వ్యాసాలు ప్రచురించాల్సిన బాధ్యత కొద్దిమీదే పడడంతో కొంతమంది ఇబ్బందికి గురైన మాట వాస్తవం.

ఇది చరిత్ర.

ఇక భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?

ముందుగా అన్ని పండుగలకూ శెలవులిచ్చినట్టే నవతరంగంకీ ఈ రోజు నుంచీ రెండు వారాల పాటు శెలవు దినాలుగా ప్రకటించడమైనది. తిరిగి ఫిబ్రవరి 4 నుంచి నవతరంగంలో వ్యాసాలు ప్రచురింపబడతాయి. ఈ లోగా నవతరంగం భవిష్యత్తు గురించి అందరితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని మా అలోచన.

ఈ లోగా నవతరంగం సభ్యులకు ఒక ముఖ్య గమనిక.

నవతరంగం లో ఇక పై సభ్యులుగా కొనసాగకూడదనుకున్న వాళ్ళు తమ వివరాలను admin at navatarangam dot com కి మైల్ చెయ్యగలరు. మీ సభ్యత్వం తొలగించాక మీ వ్యాసాలు అతిథి వ్యాసాలుగా మార్చబడతాయి.

ఈ నెల 25 వ తేదీ లోగా మీ వివరాలు అందకపోతే ఈ క్రింది criteria ద్వారా అర్హులు కాని వారి సభ్యత్వం రద్దుచేయబడుతుంది.

గత ఆరు నెలల్లో ఒక్క వ్యాసమైనా ప్రచురించని వారు;ఆగష్టు 2009 ముందు నవతరంగంలో సభ్యునిగా నమోదు చేసుకుని ఇప్పటి వరకూ నాలుగుకంటే తక్కువ వ్యాసాలు ప్రచురించిన వారు;నవతరంగంలో కొనసాగడం ఇష్టం లేని వారు-వీరందరి సభ్యత్వం ఈ నెలాఖరులోగా రద్దుచేయబడుతుంది.

ప్రస్తుతానికి తీసుకున్న నిర్ణయాలలో ఇదొకటి. అలాగే మరొక ముఖ్య నిర్ణయం కూడా ఉంది. ఇక నుంచీ తెలుగు సినిమా సమీక్షలను నవతరంగంలో ప్రచురించకూడదని నిర్ణయించబడింది. అలా అని కొత్త తెలుగు సినిమాల గురించి అసలే వ్రాయకూడదని కాదు. ఇక నుంచీ సమీక్షలు కేవలం సినిమా బాగోలేదని చెప్పడమే కాకుండా ఏం చేస్తే ఆ సినిమా బావుండేదో తెలియచేస్తూ వ్రాసే విశ్లేషణాత్మకమైన వ్యాసాలను మాత్రమే ప్రచురిస్తాము. అలాగే ఇక పై అన్ని వ్యాసాలు మా ఎడిటోరియల్ టీం approve చేశాక మాత్రమే నవతరంగంలో వ్యాసాలు ప్రచురింపబడతాయి.

నవతరంగంలో సభ్యునిగా చేరకుండా కూడా మీ వ్యాసాలు నవతరంగంలో ప్రచురించాలంటే ఇక నుంచీ editor at navatarangam dot com కి మైల్ చెయ్యగలరు.

ఇప్పటికింతే

శెలవు (Feb 4th వరకూ). ఆ తర్వాత మళ్ళీ నూతనోత్సాహంతో విజృంభణే 🙂

38 Comments
 1. krishh January 19, 2010 /
 2. vasu January 19, 2010 /
 3. సాధారణ ప్రేక్షకుడు January 19, 2010 /
 4. Prem Raj January 19, 2010 /
 5. రాజశేఖర్ January 19, 2010 /
 6. విజయవర్ధన్ January 19, 2010 /
 7. zulu January 19, 2010 /
 8. wb January 19, 2010 /
 9. అరిపిరాల January 19, 2010 /
 10. నిషిగంధ January 19, 2010 /
 11. Purnima January 19, 2010 /
 12. p4prerana January 19, 2010 /
 13. Sarath 'Kaalam' January 19, 2010 /
 14. Sarath 'Kaalam' January 19, 2010 /
 15. Vanamali January 19, 2010 /
 16. అభిమాని January 19, 2010 /
  • హర్శ January 20, 2010 /
   • అభిమాని January 20, 2010 /
   • oh my god January 20, 2010 /
 17. Sankar gongati January 20, 2010 /
 18. j.surya prakash January 20, 2010 /
  • krishh January 22, 2010 /
 19. చదువరి January 20, 2010 /
 20. Sarath 'Kaalam' January 20, 2010 /
 21. V U M RAO January 20, 2010 /
  • శంకర్ January 20, 2010 /
 22. అభిమాని January 20, 2010 /
 23. Sankar gongati January 21, 2010 /
 24. కొత్తపాళీ January 22, 2010 /
 25. SuryaKiran January 22, 2010 /
 26. parimalam January 23, 2010 /
 27. vinaychakravarthi January 25, 2010 /
 28. టి.యస్.కళాధర్ శర్మ January 25, 2010 /
 29. sujata January 27, 2010 /
 30. Harsha February 4, 2010 /