‘వాడే కావాలి’ సినిమా కెళితే ఓ బెనిఫిట్ ఉంది.ఇట్లాంటి చెత్త కథలుతో కూడా సినిమాలు తీస్తారా..అయితే మన దగ్గరున్న కథలను తెలుగు ఫీల్డులో అమ్మకానికి పెట్టచ్చు అనే ధైర్యం బోలెడెంత వచ్చేస్తుంది. పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ కెరీర్ బాలారిష్టాలు దాటనట్లుంది. తాజాగా ఈ సినిమా కూడా అతని వరస ఫ్లాఫుల లిష్టులో మొహమాటం లేకుండా చేరిపోయి వెక్కిరించింది. అయితే ఈ సినిమాకు ఓ విచిత్రమైన ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్ అన్న పరిస్ధితి ఉంది. ఎప్పుడో రెండున్నర ఏళ్ళ క్రిందట పూర్తయిన ఈ చిత్రం ఇన్నాళ్ళకు రిలీజ్ అవటం ఆనందపరిచే విషయం అయితే రిలీజైన మార్నింగ్ షో కే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటం బాధాకరం. అలాగే అప్పట్లో రిలీజైన ఉల్లాసంగా..ఉత్సాహంగా(కరుణాకరన్) చిత్రం కథను పూర్తి స్ధాయిలో పోలివుండటం మరో మైనస్.
అనగనగా ఓ డబ్బుండి..భాద్యతలు లేని సరదా కుర్రాడు ఆనంద్ (సాయిరాం శంకర్). అయితే అతనికి ఒకే ఒక క్లిష్టమైన పని ఉంది. చూడగానే అతని మనస్సులో గుచ్చుకుపోయే అమ్మాయిని వెతకటం. అఫ్ కోర్స్ అతని తండ్రి ఆనందరావు (నరేష్)కూడా కొడుకు ఎప్పుడన్నా ప్రేమలో పడ్డాను నాన్నా అంటే ఎగిరిగంతేద్దామని ఎదురుచూస్తూంటాడు. ఈ లోగా ఎదురుచూసిన ఆ ఆనంద క్షణాలు రానే వస్తాయి. వైజాగ్ బీచ్ లో లత (సుహాసి) తారసపడుతుంది. పడిందే తడువుగా మనవాడు ఉత్సాహంగా ఆమె వెనకపడతాడు. ఆమె అటెండయిన పెళ్లికి వెళ్ళి మాటా మంచి కలుపుతాడు(అనేదానికన్నా కెలుకుతాడు అనటం బెటరేమో) అయితే అక్కడే ఓ బీబత్సమైన ట్విస్టు. ఆమెకు మనసంతా నువ్వే ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆమె చిన్నప్పుడు తనకు ఉంగరం ఇచ్చి విడిపోయిన అభిరామ్ కోసం ఎదురుచూస్తూంటుంది. అప్పుడు మన హీరో తెలివితేటలతో ఆ అభిరామ్ ని నేనే అని చెప్పేసి ఆమె చేయి పట్టుకోవాలని చూస్తాడు. అయితే ఈలోగా ఆమెకు అసలు విషయం తెలిసి పోయి అబద్దమాడటమంటే..నాకు అసహ్యం అని విడిపోతుంది. ఇది చాలదన్నట్లు అసలు అభిరామ్ రంగంలోకి దూకేస్తాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హీరో ఆమెను ఎలా దక్కించుకున్నాడు.అభిరామ్ ఏమయ్యాడు అనేది మిగతా కథ.
తాను ప్రేమించిన అమ్మాయికి ప్రియుడుని వెతకి,సెట్ చేసి పెట్టడమనే కార్యక్రమం రెగ్యులర్ గా మన హీరోలు చాలా కాలంగా చేస్తున్నదే..మనమూ క్రమం తప్పకుండా చూస్తున్నదే. దాంతో కథలో ఏదన్నా ఊహించని ట్విస్టు..లేదా ట్రీట్ మెంట్ కొత్తగా అయినా ఉండాలని కోరుకోవటం సహజం. అయితే వాడే కావాలి కథా రచయిత అటువంటి సెంటిమెంట్స్ ఏదీ పెట్టుకున్నట్లు లేదు. ఆ తరహా ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సాదా సీదాగా సాగుతూంటుంది. ఫీల్ అనుకుని వర్కవుట్ చేసిన సీన్స్ మనం ఈ సినిమాకు ఎందుకు వచ్చామో అన్న ఫీల్ ని కలగచేస్తూంటాయి. అలాగే ఫస్టాఫ్ లో హీరోయిన్ జాతక సంభందిత పుస్తకాలు చదవటం,హీరో తండ్రి(నరేష్) కూడా అదే పుస్తకం చదువుతూ పరిచయం కావటం చూసి ముందు ముందు కథలో ఈ జాతకాల అంశంపై ఏదో ఉండే ఉంటుంది అన్న విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. అయితే మన ఊహకు అందకుండా దర్శక,రచయితలు అసలు ఆ సీన్స్ గురించి తర్వాత అస్సలు మాట్లాడరు. ఇక కథ ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రాన్ని పోలి ఉన్నా అక్కడ వర్కవుట్ అయింది ఎంటర్టైన్మెంట్..వాడే కావాలి లో మిస్సయింది అదే.
ఇక సెకెండాఫ్ లో హీరోయిన్ ప్రేమించిన కుర్రాడు పెద్ద బిల్డప్ తో రంగంలోకి దూకుతాడు. దాంతో మనం కంగారుపడతాం. అయితే మనని,మన కునికిపాట్లుని ఇబ్బందిపెట్టడం ఎందుకు అనుకున్నాడో ఏమిటో.. అస్సలు ఏమీ చేయడు. ఈ సినిమాకు సంభందం లేనట్లుగా వేరే సినిమాలో పాత్ర పొరపాటున ఈ ధియోటర్ లో దూరినట్లుగా తిరుగుతూంటాడు. అయితే హీరోకి ఓ భాద్యత ఉందికదా. అతనితో ఆమెను కలపాలని మలేషియా తీసుకుపోతాడు. దాంతో ఓహో ఇక్కడ హీరో,హీరోయిన్స్ మధ్య లవ్ జర్నీ స్టార్టవుతుందని ఫిక్స్ అవుతాం. అదీ లేదు…ఇన్ని లేదుల మధ్య నాకు నచ్చింది ఒకటే అదే..నవ్వింది మల్లెచెండు పాట రీమిక్స్. చిరంజీవి,రాధిక ఆ రోజుల్లో చేసిన ఆ పాట సంచలనం గుర్తుకు వచ్చింది. ఇక దర్శకత్వ విభాగంలాగానే డైలాగులు డల్ గానే ఉన్నాయి. మిగతా టెక్నికల్ విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సాయిరామ్ శంకర్ నటన, హీరోయిన్ అందం ఒకేలాగ ఉన్నాయి.రఘుబాబు,వేణుమాధవ్ కామెడీ రిలీజ్ ముందు చుట్టినట్లున్నారు..నవ్విద్దామా..వద్దా అన్నట్లుంది. ఉన్నంతలో ఆలీ..క్యాబ్ డ్రైవర్ గా ’ఆలీ..ఐ యామ్ జాలీ’ అంటూ కొద్దిగా కితకితలు పెట్టాడు. అలాగే మరో విషయం ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయిక్ సంగీతం. ఆయన కథ విని ఇలాంటి సినిమాకు ఇంతోటి మ్యూజిక్ చాలు అని ఫిక్సయి ఇచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తూంటుది.
ఫైనల్ గా నేను ఓ పదినిముషాలు సినిమాకు లేటుగా వెళ్ళాను. ఆ సమయమే నాకు సేవ్ అయిన ఫీలింగ్ వచ్చింది. బంపర్ ఆఫర్ రిలీజైన 50 రోజున వచ్చిన ఈ చిత్రం ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేదు సరికదా.. ఆ మాత్రం కూడా ఆడుతుందా అంటే సందేహమే. ఏదైమైనా సాయిరామ్ శంకర్ తనను తాను మార్చుకోవటమే కాక ఎంచుకునే కథల తీరు కూడా మార్చుకోవాల్సి ఉంది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్.
బ్యానర్: సద్గురు సినిమా
నటీనటులు: సాయిరామ్ శంకర్, సుహాని,హేమ,వేణుమాధవ్, రఘుబాబు,నరేష్, రవి ప్రకాష్, తదితరులు
కెమెరా:కళ్యాణ సామి
ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: రఘునాధ్ సోగి, కాసాని వీరేష్ బాబు
కథ,మాటలు: ప్రకాష్.టి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: రాజేంద్ర దర్శన్
రిలీజ్ తేది: డిసెంబర్ 11,2009
K మహేశ్ కుమార్ says:
ఈ సినిమా సంగతి ఏమోగానీ, మీ సమీక్షమాత్రం యమా..ఎంటర్టైనింగండోయ్!
సౌమ్య says:
“వేరే సినిమాలో పాత్ర పొరపాటున ఈ ధియోటర్ లో దూరినట్లుగా తిరుగుతూంటాడు”
) మీకు మీరే సాటి, ఇలాంటీ సినిమాల గురించి రాయడంలో
“సాయిరామ్ శంకర్ నటన, హీరోయిన్ అందం ఒకేలాగ ఉన్నాయి”
-
రామ says:
నాకు ఘజనిమహమ్మద్, విక్రమార్కుడు, తారకరత్న గుర్తు వస్తున్నారు సాయిరాం శంకర్ ని చూసి. వాళ్ళ అన్నయ్య సినిమాల్లో పాత్రలా (రఫ్ గా) కాకుండా కొంచెం సరిగ్గా కనిపించేలా కాస్త శరీర భాష మార్చుకుంటే తరవాతి ప్రయత్నానికి పనికివస్తాడు.
Madhuravani says:
ఈ సినిమాకు సంభందం లేనట్లుగా వేరే సినిమాలో పాత్ర పొరపాటున ఈ ధియోటర్ లో దూరినట్లుగా తిరుగుతూంటాడు.

Very entertaining review.!
గీతాచార్య says:
సాయిరామరామ! ఆఖరికి సాయిరాం శంకర్ కూడా మలేషియానా? ఇందులో ఏదో మతలబున్నట్టుంది. ఈ మలేషియా సినిమాల మీదో కన్ను వేయాలి. లేదా కిక్కి రవితేజకి చెప్పాలి. మంచి బేరమేమన్నా ఉందేమో చూసుకో అని
గీతాచార్య says:
టైటిల్ చాలా సింబాలిగ్గా ఉంది. అంత తెలిసిన మీరు ఈ సినిమాకి ఎలా వెళ్ళారండీ? ఫ్లాపు తీయాలంటే “వాడే కావాలి” అని అంత ఘాఠిగానే చెపితే?
కళాధర్ శర్మ says:
మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. నిజంగా సినీమా చూడబోయేముందు మీ రివ్యూ చదివితే చాలు.
s says:
hatsoff to you dude…how did you see the whole movie..
అనుదీప్ says:
బొన్గు లా వున్నది
zulu says:
Lol. I want to see the movie today. I have a DVD with this movie. when Watch the other movies in that, i didnt even noticed it. Today i will watch and I will post my comment tomoro.