Menu

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-4

SPBసంగీత రాజేశ్వరులు  శ్రీ రాజేశ్వరావుగారిని 1962 లో గూడూరులో శ్రీ కాళిదాస కళానికేతన్ వారు నిర్వహించిన సంగీత పోటీల బహుమతి ప్రదాతలుగా కలిశాను. ఆ పోటీలలో నారు మొదటి బహుమతి లభించింది. అప్పుడు నా గాత్రం విని, నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో మీరు అనతికాలంలోనే గొప్ప నేపధ్య గాయకులవుతారు అని వ్రాశారాయన.

ఆయన సంగీత దర్శక్తవంలో మొట్టమొదట నేను పాడినది వీరాంజనేయలో హనుమా..పావన రుద్రతేజమున అన్న -బ్రహ్మ పాడే పద్యం,పద్యాన్ని కానడ  రాగంలో స్వరకల్పింతం చేశారు. ఆయన సన్నివేశాన్ని వివరించి, బ్రహ్మకు పాడుతున్నారు. కాస్త గంభీరంగా హుందాగా పాడమని హెచ్చరించారు. తమాషాగా,ఆయన కోరిన పద్దతిలో పాడేందుకని నాచేత  పలుమార్లు పాడించి,తన సహాయకులు శ్రీ రాజగోపాల్ గారిని,నా చేత సరిగా పాడించేందుకు నియమించి, ఆ పద్యం రికార్డ్ చేయించారు. సంగీతానికి,సాహిత్యానికి న్యాయం చేకూరుస్తూ,సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ,సన్నివేశబలానికి తగినట్టి నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల్గడమే నేపధ్య గాయకుల కర్తవ్యమని ఆయన భావిస్తారు. ఆ భావన చాలా గొప్పది. ఆయన పాటలు తేనెల ఊటలుగా ప్రజల హృదయాలలో చోటులో కల్పించుకోవడానికి ఆ భావన ప్రముఖ కారణం.

ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన పాటలలో నాకు నచ్చిన పాట ఆత్మీయులు చిత్రంలోని చిలిపి నవ్వుల నిన్ను చూడగానే పాట, అపూర్వ సంగీతవేత్త ఆయన సహచర్యం లభించడానికి నా పూర్వ జన్మ సుకృతం హేతువు.

శ్రీ పెండ్యాల

శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారి వద్ద పాడే అవకాశం నాకు చాలా కాలం వరకూ కలగలేదు. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అదృష్టం. కానీ, ఆయన వద్ద పాడడానికి కాస్త భయం ఉండేది. కారణం ఏమనగా ఆయన తాను కోరుకున్న విధంగా పాట  రూపొందేందుకు చాలా శ్రమ తీసుకుని, గాయకుల సామర్ధ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుని, సంగీత దర్శకత్వం నిర్వహించటమే. చెప్పింది విని  చెప్పినట్లుగా పాడటం నాకు కాస్త కష్టమని చెప్పాను కదా. అందుచేత నేను భయపడ్డాను. శ్రీ పెండ్యాలగారు జయభేరి,జగదేకవీరుని కథ వంటి చిత్రాలలో వినిపించిన సంగీతం ఎంత అపూర్వమైనదో,పాడేందుకు అంత కష్టమైనవి కూడా అంతటి వ్యక్తి వద్ద నాకున్న ఈ అల్ప జ్ఞానంతో పాడలేమోనని భయపడ్డాను.

చివరకి ఎస్.పి.వి.ఫిలిమ్స్ వారి పౌరాణిక చిత్రంలో మన్మధుడికి పాడే అవకాశం లభించింది.  ఆయన సంగీత దర్శకత్వంలో దేవతల కోరికపై శివునికి తపోభంగం కలిగించేందుకు మన్మధుడు బయిలుదేరగా అతని వెంట వెళ్ళేందుకు రతి సిద్దపడుతుంది. అపుడు మన్మధుడు రతిని లాలించి, మురిపించి ముచ్చటగా తప్పించుకుపోతాడు. అది ఆ సన్నివేశం. మన్మధుని గీతాలాపనకు రతిరాగాలాపనతో జవాబిస్తుంది.(ఆ రాగాలాపిత శ్రీమతి జానికి).

మన్మధుని గాత్రంలో ఉండవలిసిన లాలన,ప్రేమ,తపన నా గాత్రంలో పలికించి వలిసిన పద్దతులును వివరిస్తూ…
లోకాల మోహాల తేలించు నేను
నీ కడగంటి చూపులో కరిగిపోయాను.
అన్న ఆ పద్యాన్ని రాగేశ్వరి రాగంలో మలిచి వినిపించారు శ్రీ పెండ్యాల గారు. ఆయన చెప్పిన విధంగా పాడటానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా నా పద్దతిలో ఏదో తేడా ప్రతీసారి కనపడేది. చివరకు శ్రద్దగా పాడేందుకు ప్రయత్నించి,పాడి,ఆయన అంగీకారం పొందడం జరిగింది. బాగా వచ్చింది బాబు.. అని ఆయన అనడం వినగానే కొండెక్కినంత సంబరం కలిగింది.

తర్వాత మా నాన్న నిర్దోషి చిత్రంలో శ్రీమతి సుశీలతో పాటు పాడిన అలకలు తీరిన అన్న పాట, నింగి అంచులు వీడి అన్న గజల్ ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ..నాకు నచ్చిన పాటలు. కారణాంతరాల వలన అవి ఆ చిత్రంలో వినపడక పోయినవి. బంగారం వంటి అవకాశాలిలా వృధా కావడం నాకు చాలా బాధ కలిగింది.

మా పెండ్యాలగారి వద్ద మరిన్ని పాటలు పాడే అవకాశాలు వస్తాయని,అవి ప్రజాభిమానానికి పాత్రాలై నన్ను కృతార్ధుణ్ని చేస్తాయిని భావిస్తున్నాను.

శ్రీ అశ్వత్ధామ

శ్రీ అశ్వత్ధామగారి వద్ద పాడేందుకు వెళ్ళేంతమటుకు నాకు, ఆయన్ని తెలియదు. భవాని ఫిలిమ్స్ వారి మాయని మమత లో ఒక చిన్న పద్యమే నేను ఆయన సంగీత నిర్దేశకత్వంలో పాడిన తొలి పద్యంం. అందరు సంగీత దర్శకుల వలే హార్మోనియం మీద పాట వరసను గాయకులకు వినిపించి,గాయకులచే పాట తాలూకు సంగీతం పాడించుకోక మామూలుగా గాయకులతో మాట్లాడుతూనే ఐదు నిముషాల్లో పాట రాగం పట్టుబడేట్టు చేస్తారు.

కారులో రికార్డింగ్ స్టూడియోకు వెళ్లే దారిలోనే నేపధ్య సంగీతంతో సహా పాటను వినిపించి, స్టూడియో చేరగానే టేక్ తీసేంతటి దిట్ట ఆయన. నాతో పరిచయం ఈషణ్మాత్రమే అయినా నా గురించి ప్రోత్సాహ పూర్వకంగా నా పరోక్షంలో పదుగురిలో ముచ్చటించే ఆయన గొప్పతనానికి నేను రుణపడి ఉన్నాను.

మొదట ఆ పద్యం పాడేందుకు శ్రీ అత్వత్ధామగారు నన్ను పిలిపించిన రోజు(రికార్డింగ్ రోజు) నా గాత్రం అసలు బాగా లేదు. నా గాత్రం సరిగా లేదనిపిస్తే, అసలు పాడలేను నేను. నాడు శ్రీ అశ్వత్ధామగారిచ్చిన ప్రోత్సాహమెంతటిదని చెప్పాలంటే కష్టం. నా గాత్రం బాగానే ఉందన్న భావం నాలో కలిగించి, నా చేత చక్కగా పాడించుకున్న ఆయన  ప్రతిభ చాలా గొప్పది. ఆయనతో నా పరిచియం కొద్దిదైనా చిరస్మరణీయం,రమణీయం.

శ్రీ తాతినేని చలపతిరావు

శ్రీ తాతినేని చలపతిరావుగారు అచిరకాలంలోనే ప్రజాభిమానాన్ని సంపాదించుకొన్న సంగీత దర్శకులు. శ్రీ చలపతి రావు గారి వద్ద పాడే మొదటి అవకాశం చిరంజీవి చిత్రం ద్వారా లభించింది. నా మిత్రుడు గోపి వ్రాసిన జీవితమెంతో అన్న ఆ పాట సంగీత పరంగా ,సాహిత్య పరంగా నాకు నచ్చిన పాట.
శ్రీ చలపతిరావు గారు చక్కని అభిరుచి, సంగీతంలో ఎనలేని ఆసక్తి కల వ్యక్తి . ఆయన సంగీత దర్శకత్వంలో వెలవడిన పునర్జమ్మ,నవరాత్రి, బంగారు గాజులు మొదలైన చిత్రాలలోని సంగీతం నాకు చాలా ఇష్టం. క్రొత్త ప్రయోగాల ప్రయోక్తగా ఆయన్ని నేను అబిమానిస్తాను.

శ్రీ చలపతిరావు గారు పాడటానికి సులభమైన రీతిలో స్వరకల్పన చేస్తూ, ప్రజలను ఆకట్టుకోగల దిట్ట. ఆయన సంగీత దర్శకత్వంలో పాడేందుకు నాకు మరిన్ని అవకాశాలు రావాలనే కోరిక తీరుతుందని భావిస్తున్నాను.

తరువాత…

శ్రీ సత్యం గారితో, శ్రీ వేణు గారితో అనుభవాలు…

నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలినాటి ముచ్చట్లు పేరుతో జూలై 1970 సినిమా రంగం సంచికలో వచ్చింది. అది నడిపింది శ్రీ  జి.వి.జి గారు. ఈ ఆర్టికల్ ని ఎస్పీ గారు మిత్రులు గాయకులు తిరుపతి.పి.ఎస్.గోపాలకృష్ణ గారు సేకరించి సమర్పించినట్లుగా రాశారు.

సేకరణ: జోశ్యుల సూర్యప్రకాష్

One Response
  1. Raju December 18, 2009 /