Menu

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-5

‘పాల మనసులు’  చిత్రంలోని ‘ఆపలేని తాపమాయె’  అన్న డా.నారాయణ రెడ్డి గారి గీతికను గాయని కుమారి ఎల్.ఆర్.ఈశ్వరితో పాడేందుకు శ్రీ సత్యం గారి దగ్గరనుంచి ఆహ్వానం వచ్చింది.  అదే ఆయన సంగీత దర్శకత్వంలో నే పాడిన తొలిపాట. ఆ పాట ఆయన ఆలపించిన పద్దతి ఆలకించి, అలాగే ఆలపించినా ఆయన తృప్తి పడలేదు. ఆయన పాడిన విధంగానే పాడినా ఆయనకు నచ్చలేదు. చివరకి ఆయన చిరాకుతో నా చేత పాడించవద్దనుకునేంత మటుకు వచ్చింది వ్యవహారం. ప్రక్కన ఎల్.ఆర్. ఈశ్వరి గారు ఉన్నారు. నా కళ్ళలో నీళ్లు తిరుగేంత దూరం వచ్చేసింది. దుఖం దిగమ్రింగి పాట పాడి ఓకే అనిపించుకున్నాను. ఇంతకీ ఆ పాట ఆ చిత్రంలో లేకపోయింది.
ఆ తరువాత నించి ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటిలోనూ నేను పాడుతున్నాను. ఆయన అభిమానించే గాయకులలో నేను కూడా చేరిపోయానని చెప్పుకుంటే అది సత్య దూరమూ కాదు..స్వోత్కర్ష అంతకన్నా కాదు.  ‘టక్కరి దొంగ-చక్కని చుక్క’ చిత్రంలోని ‘నడుము చూస్తే..’ అన్న పాటలో ‘ఒక కంట మంటలను..’ అన్న చోట నా గాత్రం కాస్త బొంగురుగా వినిపిస్తుంది. అది వినబడకుండా మరోసారి పాడించిన టేక్ ను విస్మరించి,ఎవరోఈ టేక్ ను ఓకే చేసేశారు. అది తలుచుకుని ఆయన,నేను ఇప్పటికీ బాధపడుతూంటాము. రాజయోగం,ప్రతీకారం,రాజసింహ మొదలైన చిత్రాలలోనూ చాలా మంచి పాటలు నాచేత పాడించారు శ్రీ సత్యంగారు.
ఆయన సంగీత నిర్ధేశకత్వంలో నే పాడిన పాటలలో నా అభిమానపాత్రమైనది ‘వారసత్వం’ లోని ‘నారీ రసమాధురీ..’ అన్న పాట. మట్టిలో మాణిక్యం,బంగారు కుటుంబం మున్నగు చిత్రాలలో నేను పాడిన పాటలు బాగున్నవని నేను భావిస్తాను.
శ్రీ వేణు
1964 వ సంవత్సరం…ఆంధ్రప్రదేశ్ లో  ఒకానొక ఊళ్ళో జరిగిన సంగీత పోటీలలో పాల్గొని, రెండవ బహుమతి(కారణాంతాల వలన) పొందాను. బహుమతి ప్రధానం కావించటానికి మద్రాసు నుండి సంగీత దర్శకులు (మాస్టర్) శ్రీ వేణు గారు,గాయని శ్రీమతి జానకి గారు వచ్చారు.  వారి ముందు బహుమానం పొందిన వారిని పాడమన్నాను. మొదటి బహుమతి సంపాదించిన వ్యక్తి.. నేను …తదితరులు పాడటం విన్న వారు నాకు రెండవ బహుమతి రావడం అన్యాయమని,నేను అన్ని విధాల మొదటి బహుమతికి అర్హడ్నని అభిప్రాయం వెల్లడించారు.(ఇది పచ్చి నిజం). అప్పుడే శ్రీ వేణు గారు నన్ను ప్రక్కకు పిలిచి,భుజం తట్టి ప్రోత్సాహపరిచి,మద్రాసుకు వచ్చినప్పుడు కలుసుకోమన్నారు. ఆ విధంగానే ఆయనను మద్రాసులో కలిసాను. ఒకానొక పౌర్ణమి రాత్రి..వారింటి మేడ మీద నేను పాడగా ఆయన దిలుబ్రా వాయించగా మేము గానామృత వర్షంలో ఓలలాడిన వైన మరువలేని మధురోదంతం. శ్రీ నౌషద్ గారి పాటలను అలవరుచుకొని పాడమని చెప్పేవారు. ఆయనకు శ్రీ నౌషధ్ గారికి ఉండే అనుబంధం సంగీతాభిమానులకు తెలిసిన విషయమే కదా.
హార్మోనియం వాయించటంలో వారికున్న ప్రతిభ అద్వితీయం. తంత్రీ వాద్యాలలో పలికే గమకాలు వీరి నోట అలవోకగా పలకటం అద్బుతం. అవి అలాగే మేము పాడలేక పోవడం మా దురదృష్టం. అందుకే ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన పాటలకు నూటికి యాభై పాళ్ళు న్యాయమే చేకూర్చినానని చింతిస్తూంటాను. ఆయన  పాడినట్లు పాడగలిగినంత జ్ఞానం రావడానికి ఎంతటి కృషి,ఎంతటి ప్రతిభ అవసరమో చెప్పలేను.  శ్రీ వేణు గారితో ఉన్న ఇంతటి పరిచయంతో వారి దగ్గర మొదటిసారిగా పాడేటప్పుడు కాస్త తేలిక అనిపించింది. ‘అర్ధరాత్రి’ చిత్రంలోని ‘ఈ  పిలుపు నీ కోసమే..’ అన్న పాట నేను ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన తొలిపాటు. కానీ,అది ఆ చిత్రంలో పూర్తిగా లేదు. తరువాత మమత చిత్రంలో శ్రీమతి జానకి గారితో కలసి పాడిన ‘మడిసి జనమ మురిపించే సిలకరా..’ అన్న జానపద గీతిక నాకు చాలా ఇష్టం. ఇటీవల ఆయన నిర్ధేశక్వంలో నేను పాడిన పాటలు విజయలక్ష్మీ మూవీస్ ఆడజన్మ,నాగేశ్వర ఫిక్చర్స్ వారి చిత్రాలులోనివి.
శ్రీ ఆదినారాయణరావు
1963 లో గూడూరు కాళిదాస కళాదాస కళానికేతన్ వారు నిర్వహించిన సంగీత పోటీలలో నాకు లభించిన మొదటి బహుమతిని శ్రీ ఆదినారాయణరావుగారి బంగరు చేతుల నుండి పొందే మహదవకాశం నాకు కలిగింది. అటు హిందీ చిత్ర రంగాన్ని,ఇటు మద్రాసు చిత్రరంగాన్ని ఉర్రూతలూగించిన సంగీత స్రష్టగా ఆయన్ని తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మృదు మధుర రాగ మాలికా స్రష్టగా వినుతికెక్కిన ఆయన వద్ద పాడాలన్న నా కోరిక  తీరేందుకు చాలా కాలం పట్టింది. ఆయన దగ్గర పాడేందుకు భయం కూడా కలిగింది.  ఆ తొలి అవకాశం వారి సంస్ధనుండి  రావడం ఆనందదాయకం.  ‘అమ్మకోసం’ లోని ‘గువ్వలా ఎగిరిపోవాలి..’ అనే పాట ఆయన వద్ద నేను పాడిన మొదటి పాట. మొదటి రోజు వాద్య బృదం సరిగా లేదని ట్రాక్ మాత్రం తీసి,మరుసటి రోజు నా గాత్రాన్ని ప్రత్యేకంగా మిక్స్ చేయించారు.  ఆయన ప్రయోగించే లయ ప్రత్యేక శోభ కలది. ఆ లయే ఆయనకు ఉత్తర దక్షిణ భారత దేశాలలో సంగీత కళానిధిగా కీర్తిని సంపాదించి పెట్టింది.  ఆయన వద్ద నేను పాడిన తొలి పాటే ప్రజానురాగం పొంది హిట్ కావటం ఆనంద దాయకం. అంతటి వారి వద్ద పాడేందుకు అవకాశం వచ్చి అందు మూలంగా నాకు ప్రఖ్యాతి రావడం అదృష్టం. ఇంతటి అపూర్వ మేధావి తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.
శ్రీ కుమార్
‘మామా చందమామా..’ పాట విన్న వారందరూ ఆ పాట సంగీత దర్శకుని గురించి నన్నడిగేవారే. ఆ పాటకు ప్రాణం పోసిన సంగీతకారుడు శ్రీ కుమార్ గారు. పుట్టుక ప్రకారం తమిళులు అయినా ‘సంబరాల రాంబాబు’ లో పాటలు విజయవంతం కావటానికి ఆయన విద్వత్తే కారణం. తమిళ చిత్రాలెన్నింటిలోనో ఆయన సంగీత దర్శకత్వంలోనే పాడినా తెలుగులో మాత్రమే నేను ఆయన వద్ద పాడినవి. ఆ చిత్రంలో లేని ‘ కాసుకు లోకం దాసోహం..’ అన్న (శ్రీ రాజశ్రీ రచన) పాట కూడా ఆ చిత్రం కోసం ఆయన నాచేత పాడించారు.  ‘సంబరాల రాంబాబు’ లో పాడేందుకు అవకాశం వచ్చినప్పుడు పాట తత్వం వివరించి నాకు సంపూర్ణ స్వేచ్చ ఇఛ్చి ప్రోత్సహించారు ఆయన. ఆ ప్రోత్సాహంతోనూ ఇనుమడించిన ఉత్సాహంతోనూ, ‘మామా చందమామా..’ పాట పాడాను నేను.
ఆ పాట ఏ విధంగా హిట్ అయిందీ చెప్పనవసరం లేదు. ఏ ఊరికి కచ్చేరికి వెళ్లినా ఆ పాట  పాడమని అడగటం రసికులకు పరిపాటి అయిపోయింది.  ఒకానొక తమిళ పత్రికలో ఆయన వ్రాసిన వ్యాసంలో రఫీ మార్గంలో పయినించే నా గాత్రం తనకు చాలా ఇష్టమనీ,దక్షిణ భారతదేశంలోని గాయకుల గాత్రాలలో తనకు నచ్చిన గాత్రం నా గాత్రమేనని వ్రాశారు. ఆయన వ్రాసిన విషయాలలోను వాస్తవికతకు నేను దూరంగా  ఉన్నాననే అనుకుంటున్నాను. ఇంత చిన్న వాడ్నే అయినా నా గురించి అంత గొప్పగా వ్రాసిన ఆయనకు నా ధన్యవాదాలు.  ‘మామా చందమామా’ పాట అందరు సంగీత దర్శకుల వద్ద నేను పాడిన పాటలలో నాకు నచ్చిన కొన్ని పాటలలో ఒకటి.
తరువాత
శ్రీ టి.వి రాజు గారితో, శ్రీ ఘంటసారి గారితో అనుభవాలు…
నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలినాటి ముచ్చట్లు పేరుతో జూలై 1970 సినిమా రంగం సంచికలో వచ్చింది. అది నడిపింది శ్రీ  జి.వి.జి గారు. ఈ ఆర్టికల్ ని ఎస్పీ గారు మిత్రులు గాయకులు తిరుపతి.పి.ఎస్.గోపాలకృష్ణ గారు సేకరించి సమర్పించినట్లుగా రాశారు.

సేకరణ: జోశ్యుల సూర్యప్రకాష్

One Response