Menu

పేలకుండానే తుస్సుమనేలా ఉన్న Rocket singh…

rocket-singhరన్బీర్ కపూర్ అభిమానుల సంఘంలో సభ్యత్వం ఎందుకు తీసుకున్నానో నాకింకా అర్థం కాని విషయం. నిన్నటి దాకా అతనిది నేను చూసిన ఏకైక సినిమా – ’అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ పరమ నాన్సెన్స్ అని నా అభిప్రాయం పైగా. ఆ సినిమా లో అతను, కొంత హాస్యమూ తప్ప వేరేదీ నచ్చలేదు నాకు. అయినా సరే, సిగ్గులేకుండా, రెండోరోజే వెళ్ళిపోయా – “రాకెట్ సింగ్ – సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్” కి. వెళ్ళొచ్చాక – ఈసారి మాత్రం, రనబీర్ నన్ను పరమ నిరాశ పరచాడు ఈ సినిమా ఎంపికలో – ఐనా ఇంకా నేను ఫ్యాన్ నే లెండి….

కథ విషయానికొస్తే, హర్ప్రీత్ (మన హీరో) డిగ్రీ పూర్తి చేస్కుని ఏవైఎస్ అన్న కంపెనీలో సేల్స్ మెన్ గా చేరతాడు. అనుభవరాహిత్యంలో, ఒక క్లయింట్ కి లంచం ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా కంపెనీ యజమాని ఆగ్రహానికీ, దీని వల్ల డబల్ టార్గెట్స్ బారిన పడ్డ తోటి సేల్స్మెన్ల ఆగ్రహానికీ గురౌతారు. ఇతను ఆఫీసుకి రాగానే తోటి ఉద్యోగులందరూ రాకెట్లు విసరడం ద్వారా అవమానిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా, రిసెప్షనిస్ట్ ఇతనిపై జాలిపడి, ఒక కస్టమర్ సంగతి చెబితే, ఇతను కసికొద్దీ “రాకెట్ సేల్స్ కార్పోరేషన్” అన్న కంపెనీ సృష్టించి, దాని ద్వారా ఈ కస్టమర్ ఆర్డర్ తీసుకుంటాడు. తరువాత, ఏవైయస్ కంపెనీ నుండే తన కంపెనీ పనులు చేస్కుంటూ, ఒక్కొక్కరిగా మరో నలుగురు ఏవైయస్ వారిని తన కంపెనీలో చేర్చుకుంటాడు. ఏవైయస్ యజమానికి తన కంపెనీలోనే సమాంతరంగా తనకి పోటీదారైన కంపెనీ నడుస్తోందని తెలిసాక వీళ్ళ కంపెనీ పరిస్థితి ఏమైంది? అన్నది మిగితా కథ.

మొదట: ఈ సినిమా మొదటి సగం అయ్యేసరికే, మనం కూడా సీరియస్ గా సేల్స్ కంపెనీల్లో జీవితం, స్ట్రెస్, వగైరా విషయాల గురించి సీరియస్ గా ఆలోచించడం మొదలుపెడతాం. ఒక్కొక్కరైతే మరీ ఫిలసాఫికల్ లెవెల్ కి కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. రెండో సగం కొంత నయం కానీ, మొదటి సగం అయితే, నిద్రొచ్చేస్తూ ఉండింది. కథ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంత టైమ్ తీస్కోడం అనవసరం అనిపించింది నాకు. పైగా, యాడ్లు అవీ చూసి, కామెడీ అనుకుని వెళ్ళానేమో, మరింత బోరు కొట్టింది. రెండో భాగమన్నా, ఎంతో కొంత వేగంగా సాగింది కనుక పర్లేదనిపించింది గానీ, లేకపోతేనా!

సినిమాలో ప్రధాన నటీనటులందరూ బానే చేశారు కానీ, రన్బీర్ charm ఈ సినిమాలో అంత పనిచేయలేదేమో అనిపించింది. అంటే నేననడం – అజబ్ ప్రేం కీ.. వంటి నాన్సెన్స్ సినిమా హిట్టైందంటే, ప్రధాన కారణం రన్బీరే, నా ఉద్దేశ్యంలో. He was the crowd puller. ఈ సినిమాకి ఇలా రన్బీర్ ని చూసి మురిసిపోయిన వాళ్ళు వస్తారే కానీ, బైటికెళ్ళి మీరూ చూడండి అని మిగితా వాళ్ళకి రికమెండ్ చేయరనమాట 🙂 విడుదలైన రెండోరోజు, వీకెండ్ – ఖాళీగా ఉంది థియేటరంటే ఇక ఊహించుకోండి. కామెడీ అన్నది చాలా కొద్దిగా ఉండటం ఈ సినిమాకి పెద్ద దెబ్బ.

సొంత కంపెనీ పెట్టడం – సాధకబాధకాలు, సేల్స్ పర్సన్ల జీవితం – ఈ ఇతివృత్తం మంచిదే. మంచి కథ, అలాగే, మంచి స్క్రిప్ట్ రాస్కుని ఉంటే, బాగా తీసి ఉండొచ్చు సినిమాని. “చక్దే…” తీసిన దర్శకుడేనా ఇది తీసింది? అనిపించింది. అసలు అన్నట్లు, అసలు విషయం మరిచా : హీరోయిన్ అన్న పాత్రే అనవసరం ఈ సినిమాకి. ఎందుకు పెట్టినట్లో. పెట్టినా, ఆ అమ్మాయి అంత సూటవదేమో అతని పక్కన అనిపించింది. మన సినిమాల్లో హీరోయిన్ పాత్రలు గ్లామర్ కోసమే ఉంటాయనుకోండి, కానీ, కథలో ఎంతో కొంత పాత్ర ఉంటుంది కదా వాటికి. ఒకటో అరా ముఖ్య సీన్లలో ముఖ్యమైన డైలాగు ఒకటన్నా ఉంటుంది. కనీసం – “ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేస్కున్నది” మార్కుదేదో అన్నా ఉంటుంది. ఈ సినిమాలో పాపం ఒక్కటంటే ఒక్క అత్యవసరమైన సీన్లో కూడా హీరోయిన్ అవసరం ఉండదు.

ఇంత చెప్పాక కూడా చూస్తే, మీ ఇష్టం. సినిమా కథనమన్నా కట్టిపడేయాలి… నాన్సెన్సికల్ కామెడీ అన్నా ఉండాలి – రెండూ లేవు ఈ సినిమాలో.

రన్బీర్ ఫ్యాన్ గా నిట్టూర్పు విడిచి, వచ్చే సినిమా కోసం ఎదురుచూడ్డమే.

అన్నట్లు, మధ్యలో “లవ్ ఇంపాజిబుల్” ట్రైలర్ వచ్చింది. పరమ వెరైటీగా ఉంది. సినిమా ఇంకెంత వెరైటీనో!!

6 Comments
  1. గీతాచార్య December 13, 2009 /
  2. akhil December 13, 2009 /
  3. srikanth December 13, 2009 /
  4. Saumya December 14, 2009 /
  5. Kumar November 19, 2014 /