Menu

తెలుగు చిత్రసీమ ప్రస్థుత పరిస్థితి(ఓ అభిమాని ఆక్రోశం ఆవేదన,నివేదన కూడా…)

vlcsnap-378171960-70ల దాకా మొదటి రెండో తరం నిర్మాతా దర్శకులు ఉన్నంతవరకూ ఆచితూచి అడుగులేస్తూ చక్కటి అభిరుచితో సమాజం పట్ల బాధ్యతతో నిర్మించిన సినిమాలతో తెలుగు చిత్రసీమని గర్వంగా తలెత్తుకెనేట్టు చేసిన అదే సీమ ఇప్పుడు తెలుగునీ చిత్రజగత్తునీ అంధకారంలో ముంచేస్తోంది. భవిష్య త్తేమిటో తెలీక మార్గం చూపించే దిక్కులేక ఫిలింనగర్ కూడలిలో నించుని వెర్రిచూపులు చూస్తోంది వదిలేసిన వాడిపెళ్లాం ఎవడితో లేచిపోతేనేమి అన్నట్టు ప్రవర్తిస్తూ. నాయకుడు మరణించిన సైన్యంలా సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్ళు లేక దిక్కుమాలిన బ్రతుకు ఈడుస్తోంది అనేకంటే గంగాజలమో, తులసి తీర్థమో పోసే నాధుడి కోసం అంపశయ్యమీద నిరీక్షిస్తూ చావలేక బ్రతుకుతోంది అంటే నయమేమో….

ఇవాళ్టి రోజున ఒక కొత్త సినిమా చూసేకంటే ఏదో ఒక పాత సినిమా సీడీ వేసుకుని చూస్తే కాస్త మనసుకి ప్రశాంతత చిక్కుతుందనేది నిర్వివాదాంశం.

నా జేబునిండా వెర్రిజనాల్ని కొట్టితెచ్చిన సొమ్ములున్నాయి కాబట్టి,నాకో నిక్కరు సైజులోంచి పేంటు సైజులోకి మారిన కొడుకుంటే చాలు నేను సినిమా తీస్తా బిడ్డా అనే రోజులిప్పుడు.సొమ్ములు పారేస్తే గుడ్డముక్కలంటే ఎలర్జీ ఉన్న ఆడబొమ్మలు, ఆడే తోలుబొమ్మలు(వీళ్ళని పూర్వపు రోజుల్లో ఉండే సానివాళ్ళతో కూడా పోల్చడం కుదరదు ఎందుకంటే వాళ్ళకి కూడ కొన్ని ఆచారాలు,సంప్రదాయాలు ఉండేవని చెప్పుకునేవారు కాబట్టి) ముంబాయి నించో మరెక్కడినించో కొట్టుకురావచ్చు ఎలాగు మనకి పొరుగింటిపుల్లకూర రుచే కాబట్టి.

ఇంక మన హీరో వాడికి భాషొచ్చా(ఏభాష),నటనంటే తెలుసా(అదేంటి?)అనే పిచ్చి ప్రశ్నలు వెయ్య కూడదు .దొమ్మీలు చేసేవాడిలా కండలు పెంచితే చాలు అదే ప్రధమ అర్హత.శంకరాభరణం సినిమాలో అల్లురామలింగయ్య పాత్ర చేత చెప్పించినట్టు మలేరియా జ్వరం వచ్చినవాడి లెవెల్లో ఎంతబాగా మెలికలు తిరిగిపోతే (నాట్యమనిపేరుట దీనికి)అంత బాగాపేరు వస్తుంది.ఇంక పాత్ర పరంగా వాడు తండ్రిని తల్లిని ఏకవచన సంభోదన,ఇంకా ముందుకెళ్ళి పేరుపెట్టి పిలవడం,కూర్చుని మందుకొట్టడం, అక్కచెల్లెల్లతో వావివరసలు లేకుండా ప్రవర్తించగలగడం, వయసు చదువూతో సంబంధం లేకుండా పుట్టినదగ్గర్నించి ప్రేమ పదం వల్లె వేయడం,గురువంటే పిలకపంతులో ఆడుకోడానికి పనికొచ్చే ఫుట్‌బాలో తప్ప మరెవడూ కారనే భ్రమలో ఉండడం,వీడికి వెనకాలా ఓ తొట్టి గేంగ్ కొంతమంది ఎప్పుడూ 108అంబులెన్సులాగ రెడీగా ఉండడం ఇలా సాగుతూ ఉంటుంది వ్యవహారం…

హీరోయిన్ గురించి చెప్పుకోడానికేమీ లేదు(బహుశా ఈ ఆడవారి హక్కుల గురించి పోరాడేవారికి ఈ పాత్రలు,వాటి చిత్రీకరణ,ఆ పాత్రధారులు కనిపించవేమో అనిపిస్తుంది).ఆ సినిమాలో హీరోయిన్ ఉండాలి అంతే ఉంది.వెనకాల ఒకరో ఇద్దరో చెలికత్తెలు,ఎంత చదువుకున్నా హీరో అని పేరు పెటుకున్న ఏ వెర్రి వెధవ కనిపిస్తే (వాడు వాడి మెళ్ళో తాడుకి కట్టిన బిళ్ళని పట్టుకునో,చొక్కా గుండీని పట్టుకునో హీరోయిన్ నాకేసి చూడాలి అని అనుకుంటే చాలు)వాడి వెనకాల చిత్తకార్తిలో కుక్కలా వెనకాల పడ్డానికి అన్నట్టు,ఇంక పాటల్లో అయితే ఒక చిన్న అండర్‌వేర్, పైన ఒక గోచీ గుడ్డంత గుడ్డపీలిక (మరీ బాగుండదనేమో) లేకపోతే ఐదున్నర అడుగుల శరీరానికి అడుగున్నర చింకి ముక్కో వేసుకుని ఫేషన్ అంటే అదేనిజమనుకునే వెర్రి యువత ప్చ్ వారిని అనుకరిస్తూ అలాంటివే కట్టుకుని బయటకెళితే పిచ్చి కుక్కలు కరిచెయ్యక ఊరుకుంటాయా మరి. ఆ పైన ఖాకీ తోడేళ్ళు ఆ పిచ్చి కుక్కల్ని వేటాడి వాటి ఆత్మలు సంతృప్తి పర్చుకోడం ఇదొక శాఖాచంక్రమాణం…

ప్రతీ తొక్కలో కతకి ఒక ఆడియో రిలీజ్,దానికి మళ్ళీ మీడియా కవరేజ్,దానికో మేజువాణి,భజంత్రీ దళం వెరసి సినిమా “సూ”టింగ్ మొదలు.

వచ్చీరాని,ఉఛ్చారణలేని(ఇదేంటని అడక్కండి దయచేసి)తెలుగులో వీరో సెప్తుంటాడు,ఈ కేరత్తర్ నాకో మలుపు(అదే మొదటి సినిమా విడుదలయ్యాక ఆఖరిదీను),అంతా యూత్ గురించే ఉంటాది(ఏంటో మరి), లవ్ ఫార్(?)యూత్ ఉంటాది,అండ్ మోరోవర్(బుడబుడక్కలాడి చేతుల్లా ఊపుకుంటూ)మంచి ఎనర్జీ(దేనికి)ఉంటాది,ఇంకాఆఆ ఊఊఊఉ యాఆఆఅ ఎక్సైటింగ్ ఫైట్స్ ఉంటాది,అండ్ డెఫినెట్ గా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తాది….

ఇంక వీరోయిన్ సంకర భాష లో…యా ఏక్చువల్లీ వీరో సో న్ సో గారు,డైరెక్టర్ గారు,అండ్ సో ఆన్ తొట్టిగేంగ్ చాలా కోపరేటివ్(దేంట్లో?),అండ్ (జుట్టు నుదుటిమించి వెనక్కి తోసుకోడం అది మళ్ళి మళ్ళి పడుతూనే ఉంటుంది పాపం)ఇంకా నా కేరక్టర్ ఈజ్ వెరీ గుడ్(సినిమాలోనా?)అండ్ ఇంకా ఫుల్ల్ లెంత్ ఉంటుంది(?)అండ్ ఏక్చువల్లీ ఐయాం ఇంటెరెస్టెడ్ టు డూ విత్ దిస్ వీరో,హి ఈజ్ వెరీ పాజిటివ్(?) అండ్ కోపరేటివ్…ఇదీ ప్రహసనం….

ఇకపోతే సినిమా కత…ఇది కతే మరి.మొదలెట్టిన దగ్గర్నించీ అంటే పాకే వయసు పిల్లలుగా ఉన్నప్పట్నించీ ప్రేమ (ఇది ఎటువంటి ప్రేమో మరి రాసినవాడికే తెలియాలి)మొదలయి సినిమా అయ్యేవరకూ అదేపని. చెవులు బద్దలయిపోయే సంగీతపు హోరులో,పదబంధసమాసాలు తెలీని కీర్తనల సంకరంతో ఓ నాలుగయిదు పాటలు,రెండున్నర గంటల సినిమాలో గంటన్నర పైగా దెబ్బ లాటలు (1:100 నిష్పత్తిలో అంటే హీరో ఒక్కడు వందమందితో), ఒక గూండా కన్వర్టెడ్ పొలిటిషియన్ విలన్ వాడేమయినా చెయ్యగలడు మన వీరో ఏమి చేసినా పట్టుకోలేకపోడం తప్ప,అచ్చం మన ప్రస్థుత వ్యవస్థలోని పోలీసు ఆఫీసరు(వీరో కాకపోతే మాత్రమే) ఈ బాధల్నించి తప్పించడానికి ప్రయత్నించే ఓ కమేడియనూ వాడు చేసే చిల్లర చేష్టలూ ఇలా సాగుతాయి పాత్రలు.

ఇంకా కొంతమంది దర్శకులు ముందుకెళ్ళి ఒక వర్గాన్ని(ఒకప్పటి మేధావి వర్గంగా చెలామణి అయి ప్రస్థుతానికి వయసయిపోయిన వెలయాలిలా బ్రతుకీడుస్తున్న వర్గం అనుకోవచ్చేమో, విజ్ఞులు క్షమించాలి పోలికకి) టార్గెట్ చేసుకుని ఏదో ఒక పాత్ర ద్వారానో సంభాషణల్లోనో అవమానిస్తూ వారి వారి కుతి తీర్చుకుంటూ రసోస్వాదన పొందుతుంటారు. వారికి అదొక తుత్తి…

అసలు సినిమాలో సరుకు లేనప్పుడు ఎన్ని కసరత్తులు చేస్తే ఏంటి అని…ఈ దరిద్రానికితోడు విదేశాల్లో పాటల చిత్రీకరణ (ఇంత సొమ్ము ఖర్చుపెడితే మన రాష్ట్రంలోని కొన్ని పల్లెల్ల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చెయ్యచ్చేమో? అప్పుడు తప్పకుండ స్వర్ణాంధ్రప్రదేశ్ రావచ్చేమో?).అసలు నేలలో పస వుంటే విత్తనం చల్లి, ఎరువులేసి కష్టపడి శ్రమ చేస్తే పంట పండు తుంది. అంతే కాని బుడ్డిలో పన్నీరు కావల్సినంత ఉంది కదాని బురదలో పోసి దాంట్లో పందుల్ని పొర్లిస్తే ఎలావుంటుందో అలా ఉంది ఇప్పుడు పరిస్థితి.

ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం,
ఏ కధ చూసినా ఒక యూ(బూ)తు టార్గెటెడ్ వెపన్,
ప్రతి సీనూ ఒక కామవాంఛపూరిత ప్రేమ(?)మయం,
ప్రతి పాటా ఒక వాత్సాయన కామసూత్రపు మెలకువ,కువకువ,
ప్రతి పలుకూ ఒక విషపూరిత విస్ఫులింగం,
ప్రతి పాత్రా ఒక వెన్నెముకలేని అస్థిపంజరం,
ప్రతి చిత్రీకరణా లైసెన్సుడుగా ప్రదర్శిస్తున్న అంగాంగసౌష్టవం,
నిస్సిగ్గుగా చిత్రీకరిస్తున్న కామకేళీవినోదం…
ఇదే ఇదే ప్రస్థుత సినిమా చరిత్ర,
అందుకే దీనికి ఇలాంటి అధోగతా???

కథలరువు,పాత్రలరువు,పాటలరువు,మాటలరువు,అలా అన్నీ అరువై సినిమాకి బ్రతుకు కరువై పోతోంది. జవసత్వాలిచ్చి నిలబెట్టలేని రాయలు లేక తుంగభద్రలో కొట్టుకుపోతోంది.అంటే రాసే వారిలోనూ, చేసేవారిలోనూ నైపుణ్యం లేదని కాదు కానీ వారిని సమర్థవంతంగా ఉపయోగించు కోగలిగిన నాధుడు కరువైపోయాడని చెప్పచ్చు.ఎలా సంపాదించిన సొమ్ములలాగే పోతాయని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్తూ ఉండేది.అది కష్టపడి సంపాదిస్తేనే దాని ఫలితం పూర్తిగా అనుభవిస్తావురా నాయనా, అలాగే పెట్టే ఖర్చూ ఇచ్చే దానం కూడానూ అనేది.

బంగారు పళ్ళేనికయినా గోడచేరుపు కావాలి ఎంత ప్రావీణ్యం,సమర్థతా ఉన్నా అవకాశం ఇచ్చే నాధుడు కూడా ఉండాలి.అది నిలబెట్టుకోవాలి మెల్లిగా పైకెదగాలి మళ్ళీ అక్కడ నిలబడగలగాలి అదో ప్రస్థానం.ఎంతసేపూ మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి,మా మీసాలకు సంపెంగ నూనె రాయండి మీ సొమ్ములతో అంటే అభిమానంతో వినే వెర్రి గొర్రెలు ఉండనే ఉంటాయి బక్రీద్ పండగ వస్తూనే ఉంటుంది.ఏ పండగయినా ఏడాదికో మారొస్తేనే అదొక ఆనందం లేకపోతే రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడన్న చందంగా ఉంటుంది.అప్పుడు ఆ వెర్రి గొర్రెలు కూడా పృష్ట భాగాలు చూపిస్తాయి అభిమానం పక్కన పెట్టి (సగటు ప్రేక్షకులు ఎప్పుడో చూపించారు వాటిని), అలాంటప్పుడు దిక్కుమాలిన చావు చచ్చి ఈడ్చేసే దిక్కు లేక అనాథప్రేతాల్లా ఉండిపోతారు తమ సమర్థత సరిగ్గా వినియోగించుకోపోతే ఈ వీరో లమని చెప్పుకునే జీరోలూ, జీరోయిన్లు, మిగతా కళాకారులూ వారితో తెలుగు సినిమా కూడా…

లేకపోతే పత్రికల్లో “ఇపుడేంచేస్తున్నారు శీర్షికల్లో” రాసుకోడానికో సోదిలోకో కూడా లేకుండా పోతారు. అందువల్ల ఎన్ని సినిమాల్లో నటించామని కాకుండా ఎంత చక్కటి వాటిలో నటిస్తున్నాము అని కొంచం శ్రద్ధ పెట్టి వళ్ళుదగరపెట్టుకుని తీసేవాళ్ళు,వేసేవాళ్ళు,రాసేవాళ్ళు,కూసేవాళ్ళు అందరూ సమిష్టిగా కృషిచేస్తే బాగుంటుందని ఆశిస్తూ(కొంచం ఎక్కువ ఆశిస్తున్నాననిపిస్తే మన్నించాలి ఆశాజీవులం కదా అందువల్ల)…

– శ్రీనివాస్ పప్పు

38 Comments
 1. అభిమాని December 5, 2009 /
 2. SIVARAMAPRASAD KAPPAGANTU December 6, 2009 /
 3. Bharath December 6, 2009 /
  • Kiran December 6, 2009 /
  • పులిరాజా December 6, 2009 /
   • sankar` December 8, 2009 /
  • sankar` December 8, 2009 /
  • sankar` December 8, 2009 /
   • Bharath December 8, 2009 /
 4. వెంకీ December 6, 2009 /
 5. Kiran December 6, 2009 /
 6. chandramouli December 6, 2009 /
 7. శివ కిషోర్ కందుకూరి December 6, 2009 /
 8. pappu December 6, 2009 /
  • Bharath December 6, 2009 /
 9. గీతాచార్య December 6, 2009 /
 10. brute force December 7, 2009 /
  • brute force December 7, 2009 /
   • Sarma December 7, 2009 /
   • Jingicheka December 7, 2009 /
 11. pappu December 7, 2009 /
 12. zulu December 7, 2009 /
 13. Srinivas Bale December 7, 2009 /
 14. సినిమా ప్రేమికుడు December 7, 2009 /
   • sankar` December 8, 2009 /
   • సినిమా ప్రేమికుడు December 8, 2009 /
   • heera December 8, 2009 /
   • Sarma December 8, 2009 /
   • సినిమా ప్రేమికుడు December 8, 2009 /
   • Jingicheka December 8, 2009 /
 15. Sarma December 8, 2009 /
  • Jingicheka December 8, 2009 /
 16. bambu December 8, 2009 /
 17. Sarma December 8, 2009 /
 18. jmk December 9, 2009 /
 19. Venkat Gopu April 10, 2010 /