Menu

ప్రోజెరియా-ఆరో-అమితాబ్ (Projeria – Auro – Amitab: PAA)

paaనిజ జీవితంలో తండ్రీ కొడుకులైన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమ తమ స్థానాలను బదిలీ చేసుకున్న సంచలన చిత్రంగా “పా” విడుదలైంది. చిత్రం పేరులో (ఆంగ్లంలో) వున్న మూడక్షరాలు (P-A-A) ప్రోజెరియా, ఆరో, అమితాబ్ అనుకుంటే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటో చెప్పేయచ్చు. ఇప్పటికే చాలా మంది పాఠకులకి తెలిసిపోయినట్లే అమితాబ్ ఇందులో ప్రోజెరియా వున్న పదమూడేళ్ళ ఆరోగా నటించాడు.

ప్రోజేరియా (P)

ఒక జన్యు లోపం కారణంగా వయసుకు మించి పెరగటం ప్రోజేరియా లక్షణం. ఎంతో అరుదుగా సంభవించే ఈ జన్యు మార్పుల కారణంగా పదిహేనేళ్ళకే నూరేళ్ళు నిండిపోయే చిన్నారులు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. ఇలాంటి అరుదైన పాత్రతో సినిమా రావటం భారతీయ సినిమాలో ఇదే మొదటిసారి. (హాలీవుడ్‌లో బ్రాండ్ పిట్ నటించిన “ఎ క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమిన్ బటన్”, రాబిన్ విలియం “జాక్” వంటివి కొన్ని వున్నాయి. ఈ హాలీవుడ్ చిత్రాలను కాపీ కొట్టకపోవటం కూడా ఓదార్పునిచ్చే విషయం). మన సినిమా కథలలో పాత్రలకి సామాన్యంగా కాన్సర్ – (అక్యూట్ లుకేమియా ఇన్ అడ్వాన్స్డ్ స్టేజ్) మాత్రమే వస్తూవుంటుంది. ఈ సినిమాలో అది ప్రోజేరియా. నిజానికి ఈ కథలో ఆరో పాత్రకి ప్రోజేరియా కాకుండా ఏ కేన్సర్ వున్నా కథలో పెద్ద తేడా రాదు. అయితే ప్రోజేరియా కావటం వల్ల కథకి ఒక కొత్త ఫీల్ వచ్చినట్లైంది.

సినిమా పాత్రకి ప్రాణాంతకమైన అనారోగ్యం వుందంటే దాన్ని బాగా మెలోడ్రామా పండించడానికి సెంటిమెంట్ కురిపించడానికి వాడటం సర్వ సాధారణం. పా చిత్రంలో ఆరో పాత్రకి ఇలాంటి సమస్య వుంది అని ఒకటి రెండు సీన్లలో తప్ప మనకి అనిపించకుండా తీయటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఒక సన్నివేశంలో ఆరో తల్లి విద్యని (అద్భుతమైన నటనతో విద్యా బాలన్) ఒకావిడ అడుగుతుంది – “ఏమైంది మీ బాబుకి” అని.

విద్య అలాంటి ప్రశ్నలు వినీ వినీ అలవాటు పడ్డట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టి, తన వైద్య పరిజ్ఞానంతో (డాక్టరు కదా!) క్రోమోజోములు, జీన్స్ వాటి కాంబినేషన్లు గురించి వివరించి చివరిగా అంటుంది – “ఎన్నో లక్షలమందిలో ఒకరికే ఇలా జరుగుతుంది. అంటే ఆరో ఎంతో లక్కీ కదా?” అని. సరిగ్గా అదే అభిప్రాయం ఈ చిత్రమంతా నిండి వుంటుంది. ఆరోతో వుండే అన్ని పాత్రలు – తల్లి, అమ్మమ్మ “బం”, స్కూల్లో ప్రిన్సిపాల్, టీచర్లు, తోటి విద్యార్థులు అందరూ ఆరోని కించపరచకుండా ఒక తెలివైన పిల్లాడిలా చూడటం వల్ల ఈ చిత్రం ఎంతో వుదాత్తమైన ఎత్తుకు ఎదిగింది. (అందుకే ఈ వ్యాసంలో జబ్బు పడ్డ పిల్లాడు, రోగి అనే పదాలు వాడదల్చుకోలేదు..!!)

ఆరో (A)
పదమూడేళ్ళ తెలివైన పిల్లాడు జన్యు పరమైన కారణాలవల్ల ఎనభై ఏళ్ళ శరీరంలో ఇరుక్కుపోయాడు. ఆ శరీరం లేకపోతే అదరిలాంటి పిల్లాడే. కానీ ఆ శరీరం కారణంగా (శరీరంతో పాటుగా వచ్చే వార్ధక్యం, వార్ధక్యపు అనారోగ్యాలు) వల్ల తనకి ఇష్టమైనవి ఏవీ చెయ్యలేడు. ఇష్టం లేకపోయినా కిచిడీ మాత్రమే తినాలి, పచ్చళ్ళు కారాలు తినకూడదు, ఆటలు ఆడకూడదు (అందుకే స్కోర్ బోర్డ్ నిర్వహిస్తుంటాడు) అయినా స్నేహితులతో సరదాగా గడిపేస్తుంటాడు, అమ్మమ్మ “బం” ని ఆటపట్టిస్తుండాడు. బాల్య చాపల్యం, వుత్సాహం, వుత్సుకత ఎక్కడికీ పోవు. ఇలాంటి వైరుధ్యాలమధ్య తయారైన పాత్ర ఇది. సినిమా అయిపోయినా మనతోపాటే ఇంటికి వచ్చి మన మనసులో నిలిచిపోయే పాత్ర.

తల్లి స్కూల్‌లో వదిలిపెట్టిన తరువాత “త్వరగా వెళ్ళిపో మిగిలిన పిల్లలు చూస్తే గేలి చేస్తారు” అని చెప్పడం, రాష్ట్రపతి భవన్‌కి వెళ్ళాలని చూపించే వుత్సాహం, వెళ్ళలేకపోయాక నిరుత్సాహం, వీడియో గేంని చూడగానే అదంతా మర్చిపోయి ఆటలో మునిగిపోవటం – ఇలాంటివి ఎన్నో ఆ పాత్రని సజీవంగా చిత్రిస్తాయి.

అమితాబ్ (A)
రోజుకి నాలుగంటల మేకప్‌తో అమితాబ్ ఆరొగా మారాడట..! ఈ నాలుగు గంటల మేకప్పుతో ముఖం పైన ముడుతలు, తొర్రి పళ్ళు, వెంట్రుకలు లేని పెద్ద తల, నీలం కళ్ళు, ఆ పైన పెద్ద పెద్ద అద్దాలతో కళ్ళజోడు చేర్చాక ముఖకవళికలతో నటించడం దాదాపు అసాధ్యం. అయినా ఆరొ పాత్ర అంత సజీవంగా వుందటే అది అమితాబ్ ప్రతిభవల్లే. రూపంతో పాటు నడక, చూపు, నవ్వు, గొంతు మార్చడం వల్ల ఎక్కడా అమితాబ్ మార్కు కనపడదు. పెద్ద నటుడన్న బేషజాలను పక్కన పెట్టి, ఇంత శ్రమతీసుకోని నటించిన అమితాబ్ నిజంగా అభినందనీయుడు.

పా చిత్రానికి ఈ మూడు మూల స్థంభాలైతే మిగిలిన నటీనటులు, సాంకేతిక శాఖలు ఒక రూపాన్ని మరింత శోభని ఇచ్చాయి. అందులో చెప్పుకోతగ్గవి వరుసగా – విద్యాబాలన్ నటన, పీ.సీ శ్రీరాం కెమెరా (ముఖ్యంగా ఆరడుగుల అమితాబ్ పదమూడేళ్ళ పిల్లాడిలా కనిపించేట్టు చెయ్యటం), ఇళయరాజా సంగీతం (అన్ని పాటలు, బాక్‌గ్రౌండ్), అరుంధతి నాగ్ నటన, తరువాత అభిషేక్ నటన. దర్శకుడు బాలకృష్ణన్ పైన చెప్పినవాటన్నింటికి కారకుడు కాబట్టి అతను పునాది.

కథ
విద్య (విద్యాబాలన్) ప్రెగ్నెన్సీ తన పొలిటికల్ కెరీర్‌కి అడ్డమని ప్రేమించిన అన్మోల్ (అభిషేక్) తప్పుకుంటాడు. గైనకాలజిస్ట్ అయిన విద్య తన కొడుకు ఆరో, తల్లి (అరుంధతి నాగ్) తో కలిసి వుంటుంటుంది. ఆరో తన కొడుకే అని తెలియకుండానే అన్మోల్ (ఇప్పుడు ఎం.పీ. అన్మోల్) అతనికి మంచి స్నేహితుడౌతాడు. అన్మోల్ తన తండ్రి – పా – అని తెలుసుకున్న తరువాత ఆరో దగ్గర అట్టే సమయం మిగిలి వుండదు. ఈ కాస్త సమయంలో తల్లీ తండ్రులని కలపడమే అతని ఆఖరి ఆశ. ఆరో ఆశ ఫలించిందా? లేదా? వెండి తెర పై చూడండి.

బాగాలేనివి
అంతా బాగున్నా పంటికింది రాయిలా అభిషేక్ పొలిటికల్ డ్రామా కుదరలేదు. పరేష్ రావెల్ పాత్ర పరిధిలో ఇరుక్కుపోయాడు. ఎడిటింగ్ అక్కడాక్కడ అటూ ఇటూ గెంతినట్టు అనిపించింది. సొంత సినిమా అని జయా బచ్చన్ చేత టైటిల్స్ బట్టీ పట్టించి చెప్పించడం అస్సలు బాగాలేదు.

చిత్రం: పా (హిందీ)
నటీ నటులు: అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్, అరుంధతి నాగ్, పరేష్ రావెల్
కెమెరా: పీ.సీ. శ్రీరాం
సంగీతం: ఇళయరాజా
“ఆరో (ప్రోస్థెటిక్) మేకప్”: క్రిస్టీన్ టిన్స్లేయ్, డోమినీ టిల్

నిర్మాణం: ఏ.బీ కార్పోరేషన్, రిలయన్స్ బిగ్ పిక్చెర్
దర్శకత్వం: ఆర్. బాల్కి

9 Comments
    • అరిపిరాల December 15, 2009 /
  1. lalita December 15, 2009 /
    • hero December 15, 2009 /
  2. Sankar gongati December 15, 2009 /
  3. రవి February 8, 2010 /
  4. రవి February 8, 2010 /
  5. Srinu Pandranki September 16, 2010 /
  6. Srinu Pandranki September 16, 2010 /