Menu

అనగనగా ఓ చిన్న సందేహం!

doubtచిన్నప్పటి నుండి నేను సినిమాలు తెగ చూసేవాడిని. ఎన్.టి.ఆర్ దగ్గరనుండీ చిరంజీవి వరకూ ఆ తరవాత నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోల సినిమాలు ఇలా అందరి సినిమాలు చూసేవాడిని. అవి నా మెదడులో ఒక  సందేహాన్ని రేకెత్తించాయి.

అది, అసలు సినిమా అంటే ఏంటి?

ఇదేం ప్రశ్నరా బాబు, మా ఊళ్ళో చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు అని అనుకుంటున్నారా! నిజమే సినిమా అంటే తెలీనిదెవరికి! ప్రతి రోజు కొన్ని కోట్ల మంది వీటిని తెర మీదో, టీవి లోనో లేక కంప్యూటర్ లోనో చూస్తూనే ఉంటారు. మరి ఈ ప్రశ్న ఎందుకంటారా?

ఇలాగే కొంతమందిని అడిగితే అందులో చాలామంది, “సినిమా అంటే తెలీదా?! సినిమా అంటే…… సినిమాయే డాన్సులు, ఫైట్సు, ఇంకా కొంచెం కామెడీ సీన్సు ఇలా అన్నిటిని కలిపి చూపిస్తే అదే సినిమా” అన్నారు. “మరైతే కొన్ని సినిమాలు అవేమి లేకుండా కూడా తీస్తారు కదా” అనడిగాను నేను దానికి ఆ చాలామంది ఇచ్చిన సమాధానం “అవసలు సినిమాలే కావు” . వారి అభిప్రాయం ప్రకారం సినిమా అంటే ఇంపైన డాన్సులు, థ్రిల్లింగ్ ఫైట్సు, సూపర్ కామెడీ, ఇలా అన్నీ కలగలపి కథనాన్ని నడిపిస్తే అదే సినిమా. మరికొంతమంది “అలా ఏం కాదు, డాన్సులు, ఫైట్స్ లేకుండా కూడా సినిమా తీయొచ్చు, కాకపోతే కథాకథనాలు బాగుండాలి” అన్నారు.

అతికొద్దిమంది మాత్రం అంటే చాలామంది ఓ 65% ఉంటే, మరికొంతమంది ఓ 25% ఉంటే మిగిలిన 10% అతికొద్దిమందన్నమాట. వారు చెప్పింది  ” సినిమా అంటే భావోద్వేగాల అనుభూతి, ఆ భావోద్వేగం ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, హాస్యం కావచ్చు, కోపం కావచ్చు, జాలి కావచ్చు, భయం కావచ్చు లేదా ఇవన్నీ కలిపి ఉండొచ్చు. కాని మొత్తం మీద అది ఒక అనుభూతిని కలిగించాలి”.

అప్పుడు నాకు సినిమా మీద ఓ అవగాహన ఏర్పడింది కాని నా సందేహం మాత్రం పూర్తిగా నివృత్తి కాలేదు.

నేను:

మళ్ళీ ఆ 10% మందినే అడిగా ” మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే కొన్ని సినిమాలు అలా ఉండవు, అంటే అవి సినిమాలే కాదనా? అలా అయితే చాలామంది (65%) వాటిని ఆహా ఓహో ఏం సినిమా అంటూ తెగ పొగుడుతూ చూస్తుంటారే, అంతేనా ఒకసారి చూసి ఊరుకోరే. చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తుంటారే” అన్నాను.

అతికొద్దిమంది (10%):
” వారంతా మాస్ ప్రేక్షకులు, వాళ్ళకి అలాంటి సినిమాలే నచ్చుతాయి”.

నేను:
“మరి ఇందాక మీరు సినిమా అంటే వేరే నిర్వచనం ఇచ్చారు” అనడిగాను.

అతికొద్దిమంది (10%):
“అవును ఇప్పుడూ అదే చెప్తున్నాం, ఈ సినిమాల్లోనూ భావోద్వేగాలుంటాయి కాని కొంచెం గందరగోళంగా ఉంటాయి, అలాంటివే వాళ్ళకు నచ్చుతాయి, ఆ సినిమాలే థియేటర్లలో వందరోజులాడుతుంటాయి” అని చెప్పారు

నేను అప్పటికీ నాకర్థంకానట్లు మొహం పెట్టాను.

అతికొద్దిమంది:
“అంటే సినిమాల్లో మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు అని రెండు రకాలుంటాయన్న మాట” తేల్చి చెప్పారు

నేను:
“మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొన్ని క్లాస్ సినిమాలను కూడా మాస్ ప్రేక్షకులు (65%) చూస్తుంటారు కదా ఆ సినిమాలనేమంటారు?” అనడిగా.

అతికొద్దిమంది (10%):
కాస్త అసహనంగా మొహం పెట్టి ” చూస్తారయ్యా ఎవరికి నచ్చినవి వాళ్ళు చూస్తారు, ఇప్పుడు నీ గోలేంటి?” అని నన్ను కసురుకున్నారు

ఇలా అంతమందిని కలిసి రకరకాల ప్రశ్నలు సంధించి వారి జవాబులు విన్న పిదప, నాకు తెలీకుండానే కొన్ని విషయాలు తెలుసుకున్నాను

సినిమాల్లో క్లాసు, మాసు అన్న తేడాలు లేవని, అలాగే మంచి సినిమా చెడ్ద సినిమా అన్న తారతమ్యాలు కూడా లేవని తెలుసుకున్నాను. కాని ఒక సినిమాలో ఉన్న కళాత్మక విలువలను బట్టి ఆయా సినిమాను సరిగ్గా చిత్రీకరణ చేశారా, లేదా అన్న విషయాన్ని గ్రహించవచ్చు, తద్వారా అది సినిమాయా లేక ఆ పేరుతో జనాల మీదకు వదిలిన కొన్ని ఫిల్ముల కలగూరగంపా? అన్నది నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ అది సినిమా అయ్యుండి మనకు నచ్చకపోతే అది మన సమస్య, ఆ సినిమా తీసినవారికి దీనితో ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అది సినిమా కాకపోతే దానిని ఏమనాలి? 16mm, 35mm లేదా 70mm ఫిల్ములతో తీసిన ప్రతీ చలన చిత్రము సినిమా అవదు. సినిమాను ప్రాశ్చాత్యులు కనిపెట్టడం వలనేమో మన తెలుగులో దానికి సరైన పదం దొరకలేదు   (నాకు తెలీదు అనడం సమంజసమేమో) చాలామంది సినిమా అన్నది ఆంగ్ల పదమని, తెలుగులో చలనచిత్రము అనాలని అంటూ ఉంటారు. కాని నా ఉద్ధేశ్యంలో చలించే ఏ చిత్రాన్నైనా చలన చిత్రం అనొచ్చు. ఆంగ్లంలో ఉన్న Cinema, Documentary, Tele film మొదలగువానికి తెలుగు అనువాదము ఏంటో నాకు తెలీదు అందుకే వాటిని యథాతథంగా వాడేస్తున్నాను. అది సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంతకీ సినిమా అని దేనిని అనొచ్చు?

“సినిమా” అన్నది కళ కాదు, కాని 64 కళల సమ్మేళనం. ఇప్పుడా 64 కళలు ఏంటి అని అడగొద్దు, కొంచెం చెప్పడం కష్టం. కాని సినిమాని ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం.

1. కథ:
మనం తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడి కథావస్తువుల గురించి చెప్పుకుందాం. చెప్పడం మర్చాను, Art films, Commercial films అని ఏవో ఉన్నాయంట, వాటిని ఆ విధంగా ఎలా వర్గీకరించారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. కాని నా వరకు సినిమా అన్నది ఒక వ్యాపారపరమైన అంశం ఎందుకంటే అది కళ కాదు, కొన్ని కళల సమ్మేళనం మాత్రమే. ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంలో “సమరసింహారెడ్డి” అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా విజయవంతం కావడంతో వరుసగా అదే నేపథ్యంలో ఓ ఇరవై ఫిల్ముల వరకూ వచ్చాయి అయితే వాటిలో కొన్నింటిని పొరపాటున సినిమా అనేసారు. ఆ తరువాత కొన్నేళ్ళకు “పోకిరి” అన్న సినిమా వచ్చింది. మళ్ళీ  ఆ సినిమాలో ఉన్న ప్రధానాంశాన్ని ఉపయోగించుకుని, కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని వరుసగా ఓ పది ఫిల్ముల వరకు వచ్చాయి, వీటిలో కూడా కొన్నింటిని పొరపాటున సినిమా అని అనాల్సివచ్చింది. ఈ మధ్య “అరుంధతి” అని ఓ సినిమా వచ్చింది. దానిని చూసి అదే దారిలో ఇంకో ఫిల్ము సిద్ధం అయ్యింది. (ఓ ప్రముఖ హీరో కొడుకు నటించిన ఓ ఫిల్ము ఈ మధ్యే విడుదలై ఘనవిజయం సాధించింది, ఆ ఫిల్ము కూడా కొంతవరకు అరుంధతిని అనుసరించిందేమో అనిపిస్తుంది). ఇలా మన తెలుగు ఫిల్ములలో చాలా వరకు ఫిల్ములు అంతకుముందు విడుదలై విజయం సాధించిన ఫిల్ముల కథల ద్వారానే తయారవుతుంటాయి అందుకే ఎంత వెదికినా కొత్తదనం కనిపించదు. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలను చూస్తుంటే మన వాళ్ళ కథల్లోనూ మార్పు రావడం ఖాయమనిపిస్తోంది. అసలు కథలకోసం అంతలా inspire (వాళ్ళు అలానే అంటారు) అవ్వాల్సిన అవసరం ఏంటో? బహుశా ఎక్కువమంది రచయితలకి ఆలోచించడం ఇష్టం ఉండదేమో. నాకైతే రోజూ మనం చూసే వార్తా పత్రికల్లోనే బోల్డన్నీ కథలుంటాయనిపిస్తోంది. అంతెందుకు మన చుట్టూ ఉన్న జనాలను కాస్త దగ్గరగా పరీక్షించి చూడండి. బోలెడన్ని కథలు బుర్రలో పుట్టుకువస్తాయి. సినిమాల నుంచి సినిమా కథలు రావడం కాదు. నిజ జీవితం నుంచి నిజాయితీగా కథలను తయారుచేయాలి. కొత్తదనం, విజయం Guaranteed.

2. కథనం:
మన సినిమాల్లో Best screenplay అంటే ఓ Flashback తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటే ఆహా ఒహో అంటారు. లేకపోతే ఏంటయ్యా ఈ స్క్రీన్ ప్లే అంటారు. మధ్య మధ్యలో కొన్ని మంచి కథనాలతొ సినిమాలు వచ్చినా వాటిలో చాలా వరకు Low budget సినిమాలవడం వల్ల సరైన ప్రాచుర్యం పొందలేదు. కాని ఈ మధ్య ఇచ్చిన నంది అవార్డుల్లో ఒక నంది “గమ్యం” చిత్రానికి ఇవ్వడం ద్వారా ఓ మాదిరి ప్రోత్సాహం ప్రాచుర్యం రెండూ కలిగాయి విభిన్నమైన కథనాలకి. కథ బాగుండి కథనం సరిగా లేకపోతే సినిమా తేలిపోయే ప్రమాదం ఉంది. ప్రేక్షకుడికి సినిమా మీద సరైన ఆశక్తి కలిగించాలంటే పట్టుతో కూడిన కథనం చాలా అవసరం. కథనాల తీరుతెన్నుల మీద సరైన అవగాహన రావాలంటే ప్రపంచ సినిమా పరిచయం తప్పనిసరి. నేపథ్యంలో వచ్చే వివిధ వస్తువులతో సహా కథనాన్ని పకడ్బందీగా రాసుకుంటే సగం సినిమా అయిపోయినట్టే. అంతే కాకుండా సినిమా థీమ్ ను బట్టి Tint, color grading ని కూడా నిర్ణయించుకోవాలి. నిజ జీవితంలో ఎలా అయితే ప్రతీ వ్యక్తికి ఒ వ్యక్తిత్వం ఉంటుందో అలాగే సినిమాలో ఆయా పాత్రలకు సరైన వ్యక్తిత్వాన్ని కల్పించాలి. ఎంతో అవసరమైతే తప్ప ఆ పాత్రలు మొదటి నుంచి చివరి దాకా ఆ వ్యక్తిత్వాన్ని దాటకూడదు. ప్రేక్షకుడు సినిమాలో ఉన్న ముఖ్యమైన పాత్రలతో connect అయ్యేట్టు జాగ్రత్తవహించాలి. అనవసరమైన మరియు సినిమా థీమ్ తో సంబంధం లేని హాస్య సన్నివేశాలు లేదా రొమాంటిక్ సన్నివేశాలను చొప్పించకూడదు. అంతేకాకుండా సినిమా ఏ ప్రక్రియలోకి (genre) వస్తుందో ఆ విధంగా కథనం ద్వారా ప్రస్ఫుటంగా నిర్వచించుకోవాలి. కొంచెం బుర్రకి పదును పెడితే సినిమాలోని ప్రధాన పాత్రల ద్వారా కూడా అద్భుతమైన హాస్యాన్ని పండించవచ్చు.

3. కళ:
ప్రతి సినిమాకి ఓ నేపథ్యం ఉంటుంది. దానికి తగ్గట్టు వివిధ లొకేషన్లను ఎంచుకోవాలి. అంతే తప్ప నిర్మాత డబ్బులు పెడుతున్నాడుగా అని చెప్పి so called rich look కోసమని అనవసరమైన సెట్స్ వేయించకూడదు దాని వల్ల సినిమా థీమ్ disturb అయ్యే అవకాశం ఉంది. నేపథ్యం కోసమని ఉపయోగించే వస్తువులను ముందే సిద్ధం చేసుకోవాలి అంతే కాకుండా కథ జరిగే సమయానికి (time period of the story) ఆయా వస్తువులకి పొంతన సరిపోతుందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే నేపథ్యవస్తువుల ద్వారానే ప్రేక్షకులకి కథ జరిగే కాలంపై ఓ అవగాహన ఏర్ప్డడుతుంది. చివరికి ఆర్ట్ డైరెక్టర్ ఎంత అప్రమత్తంగా ఉండాలంటే, నటీనటుల జేబుల్లో ఉండే పెన్ను దగ్గరనుండి, సన్నివేశంలో పాత్రదారుల వెనకవైపు కనిపించే ఇతర వస్తువుల వరకూ దృష్టి పెట్టాలి. సినిమాల్లో పాటలు అసలు అవసరం లేదు. కాదు కూడదు అంటారా అలా అయితే ఆ సినిమా నేపథ్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే ఆ పాటల చిత్రీకరణ కూడా జరగాలి. అసంధర్భంగా థాయ్ లాండ్ లు స్విట్జర్లాండ్ లు వెళ్ళకూడదు.

4. ఛాయాగ్రహణం:
మన తెలుగు సినిమా రంగంలో హేమాహేమీలైన ఛాయాగ్రాహకులున్నారు. కాని వారిని సరిగ్గా ఉపయోగించుకునే దర్శకులే కొంచెం తక్కువగా ఉన్నారనిపిస్తోంది. లైటింగ్ గురించి పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా దానిని uniform గా సినిమా అంతా పాటించరు. ఛాయాగ్రాహకులు ఏవైనా అంటే నీ పని నువు చూసుకో అంటారు. ఇది నా పనే కదండి అంటే. షూట్ చేయడం వరకే నీ పని ఆ తరువాత సంగతి మేం చూసుకుంటాం అంటూ ఎడిటింగ్ గది బయటే ఆపేస్తారు. కొన్ని పిల్ముల్లో అయితే కథకి వారు ఎంచుకున్న లైటింగ్ కి అసలు సంబంధం ఉండదు. దర్శకుడు అలాంటి షాట్స్ ఎలా ఒప్పుకుంటాడో మరి?! కొంతమంది సీనియర్ దర్శకుల ఫిల్ములు అలాగే ఉంటున్నాయి. ఆ మధ్య ఓ సినిమాలో పాత్రదారులని ఓ బ్రిడ్జిమీద నుంచోబెట్టి extream long shot తీసారు. అంత దూరంలో ఉన్నారంటే ఖచ్చితంగా వారి మాటలు మనకు స్పష్టంగా వినిపించకూడదు. కాని ఆ సినిమాలో స్పష్టంగా మరియు చాలా గట్టిగా, పాత్రదారులు మన పక్కనే ఉన్నారేమో అన్నంతగా వినిపిస్తాయి. అక్క్డడ సన్నివేశం ప్రకారం పాత్రదారుల మాటలు ఖచ్చితంగా ప్రేక్షకులకి వినపడాలి, అటువంటప్పుడు అక్కడ medium shot తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటు పోతే చాలా ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం, ఛాయాగ్రహణానికి సంబంధించిన వివరాలను స్క్రిప్ట్ దశలోనే రాసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఛాయాగ్రాహకుడి సలహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

5. మేకప్:
చాలా సినిమాల్లో (మన పాత సినిమాలు కూడా) నటీనటులకి విపరీతంగా మేకప్ కొటేసి, చివరికి మామూలు జనాలు ఈ విధంగా ఉండరు అన్న అభిప్రాయాన్ని కలిగించేస్తారు ప్రేక్షకులకి. కాని అక్కడ నటీనటులు పొషించే పాత్రలు మాత్రం మామూలు జనాలవే. మరి ఎందుకు అంత మేకప్ (makeup) చేస్తారో ఓ పట్టాన అర్థం కాదు. కథానాయికలను అందంగా చూపించడం కోసం, వారి పాత్రపరిమితులను దాటి మరీ పౌడర్లు రాసేస్తారు అదేంటో! నాటకాల్లో అయితే నటుల మొహాలు మనకు సరిగా కనిపించవు కాబట్టి, వారి హావభావాలు మనకు అర్థం కావాలన్న ఉద్ధేశ్యంతో కొంచెం ఎక్కువగా మేకప్ చేసి కనుబొమ్మలను  మీసాలను  కాస్త highlight చేస్తారు. సినిమాల్లో అందరి మొహాలు స్పష్టంగానే కనిపిస్తాయి కదా, మరి అంత ఓవర్ మేకప్ ఎందుకో?!

6. సంగీతం & సౌండ్ డిజైనింగ్:
అప్పుడెప్పుడో అపరిచితుడు అనే సినిమాలో BGM లో ఓ గొంతు వెరైటీగా రాగాలాపన చేస్తుంటాది. అప్పుడు మొదలు మనవాళ్లు మార్చి మార్చి ఆ BGM తో జనాలను వాయగొడుతున్నారు. ఇంతవరకు ఇంక చాలు బాబూ మార్చండి అని చెప్పడానికి ఎవరు ఉండేవారు కాదు, ఇప్పుడు మన నవతరంగం ఉంది, అందుకే విన్నవించుకుంటున్నా! పాటలు మీ ఇష్టం కథనాన్ని కథను ఇబ్బంది పెట్టనంతవరకు ఎలాగైనా చేసుకోండి. కాని వెరైటీ కావాలనుకుంటేముందు instruments మార్చండి, sound designing మీద దృష్టి పెట్టండి. రౌడీలను హీరో కొడుతున్నపుడు వచ్చే శబ్ధాన్ని కొంచెం సహజంగా ఉండేట్టు చూడండి. మీ sound designer కి చెప్పండి, ఓ 15 కేజీల మటన్ కొని, మూట గట్టి వేలాడదీసి దాన్ని సన్నివేశంలో ఎలా అయితే హీరో రౌడీలని కొడుతుంటాడొ అలాగే కొట్టండి ఆ వచ్చే సౌండుని రికార్డు చేయండి సినిమాలో ఉపయోగించుకోండి. అత్యంత సహజంగా వస్తుంది. అంతే తప్ప అప్పుడెప్పుడొ సృష్టించిన పాత సౌండులనే మూసధోరణిలో వాడుకుంటే ఇంక కొత్తదనం ఎక్కడినుంచి వస్తుంది! కొన్ని సన్నివేశాలలో, ప్రేక్షకులని లీనం చేయడం కోసం కొన్ని సౌండులని highlight చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు  వర్షం పడుతుంది, బస్టాపులో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, అప్పుడు మనం వర్షం సౌండుని ఎక్కువ చేసి చూపించాలి. సౌండ్ ట్రాక్స్ ద్వారా దీనిని సులభంగా చేయొచ్చు. దాని ద్వారా ప్రేక్షకులు తామే వర్షంలో తడుస్తున్నామేమో అన్న అనుభూతికి లోనై dialogue వినడానికి ప్రయత్నిస్తారు. సినిమా థీమ్ ని బట్టి BGM కి కావలిసిన instruments ముందే రూపొందించుకోవాలి. అలాగే BGM intensity ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలంటే అక్కడక్కడ silence తప్పనిసరి. కథను బట్టి సంగీతానికి కూడా ఒక థీమ్ ని పాటిస్తే బాగుంటుంది. (ఉదాహరణకి గీతాంజలి సినిమా చూడండి పాట వినగానే ఆ సినిమా ఎలా గుర్తుకొస్తుందో.)

7. దర్శకత్వం:
పైన చెప్పిన ఆ శాఖలన్నిటిని సమగ్రంగా, ఉన్నతంగా పాటించి, పాటింపగలిగితే ఈ శాఖకి న్యాయం చేసినట్టే. కనీసం కొన్ని సన్నివేశాల రూపకల్పనలో  అయినా కాస్త సృజనాత్మకత చూపిస్తే చూడ్డంతో పాటు చెప్పుకోవడానికి బాగుంటుంది. దర్శకుడికి ప్రధానంగా కావల్సింది నిజాయితీ. తనకి కావాల్సింది నిజాయితీగా ఎదుటవారినుంచి రాబట్టుకోగలగాలి. కొన్నిసార్లు ఇంకేదో సినిమాలో సన్నివేశాన్ని చూసి inspire అయ్యి అలాగే తీయాలనుకుంటారు. అది అంత అవసరమైతే తీయొచ్చు తప్పులేదు కాని ఇదే విషయాన్ని మిగతా సాంకేతిక నిపుణులకు చెప్పడానికి సంకోచిస్తారు. అదేదో వారి ఆలోచన అన్నట్టు చెప్తారు. మన సొంత ఆలోచనైతే మనకు దాని మీద ఖచ్చితమైన పట్టు ఉంటుంది. సొంతం కానప్పుడు, నిపుణులడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పలేం. తద్వారా అపరిపక్వమైన ఫలితం. భేషజాలకు పోకుండా ఫలానా సనివేశాన్ని చూసి ఇలా చేద్ద్దామనుకుంటున్నాను అని మిగిలినవారికి చెబితే వాళ్ళకూ clarity వస్తుంది. ఫలితమూ బాగుంటుంది. ఒక construction project కి project manager ఎలాంటివాడో, ఓ సినిమాకి దర్శకుడు కూడా అలాంటివాడు. సినిమాకి సంబంధిచినది అంతా ముందే plan చేసుకోవాలి. Funds  ఎప్పుడూ ఓ పది శాతము ఎక్కువే పట్టుకోవాలి. ముందు నుంచి secondary source ని సిద్ధంగా ఉంచుకోవాలి. లేకపోతే కొన్ని చిన్న చిన్న కారణాలకే సినిమా షూటింగ్ వాయిదా పడటమో లేక ఆగిపోవటమో జరుగుతుంది. దర్శకునికి సహనం చాలా అవసరం. సన్నివేశం ఖచ్చితంగా వచ్చేవరకూ ఎన్ని టేక్స్ అయినా తీస్తూనే ఉండాలి. ఎందుకంటే పేపరు ఎంత తెల్లగా ఉన్న దాని మీదున్న చిన్న మచ్చ మీదే అందరి దృష్టి పడుతుంది, అలాగే సినిమా కూడా.

8. నిర్మాణం:
ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, గుణ్ణం గంగరాజుగారిని చూసి నేర్చుకోండి. (ఇది ఎటువంటి సినిమాలను నిర్మించాలి అన్న ఉద్ధేశ్యంతోనే సుమండి!)

9. ఎడిటింగ్ (కూర్పు):
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చిత్రీకరణ పూర్తి చేసుకున్నాక సాగే ఈ ప్రక్రియ సినిమాకు గుండెలాంటిది. ఎడిటింగ్ తో ఓ మాదిరిగా చిత్రీకరించిన సన్నివేశాన్ని ఒక మంచి సన్నివేశంగా మార్చొచ్చు. అలాగే ఒక మంచి సన్నివేశాన్ని పరమ చెత్తగా కూడా మార్చొచ్చు. ఈ మధ్యే ఓ ఇంటర్ వ్యూలో చూసా ఓ దర్శకుడు తమ సినిమాలో 100 కి పైగా dissolves ఉపయోగించామండి అని ఓ ఎడిటర్ తో అన్నాడట. అప్పుడా ఎడిటర్, అంటే మీ సినిమాలో 100 తప్పులున్నాయన్న మాట అన్నాడట చటుక్కున. అంటే సినిమాలో ఉన్న వంద తప్పులను కూడ ఎడిటర్ తన మాయతో మాయం చేయగలడన్న మాట. ( అలా అని dissolves ఉపయోగించిన ప్రతీసారి తప్పులున్నట్టు కాదండోయ్). ప్రేక్షకుల్లో ఆశక్తిని కలిగించడానికి ఎడిటర్, దర్శకుని అనుమతితో అవసరమైనపుడు సన్నివేశాల వరుసను కూడా మారుస్తుంటాడు. అంతెందుకు ఒక దర్శకునికి ఎడిటర్ ఓ ముఖ్య సలహాదారు లాంటివాడన్నమాట. కాని ఎడిటింగ్ ని మన తెలుగు సినీ రంగంలో అంతగా highlight చెయ్యరు ఎందుకో మరి!

ఇదేంటి చిన్న సందేహం ఉందని చెప్పి ఇలా వీటి గురించి రాసాడు అనుకుంటున్నారా! వస్తున్నా…వస్తున్నా….అక్కడికే వస్తున్నా….!

నేను పైన చెప్పినవన్నీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మందికి ఇంకా ఎక్కువగా తెలుసు, తెలిసినా అందులో ఎక్కువ మంది వాటిని పాటించరు సరి కదా మూస ధోరణిలో కలగూరగంప ఫిల్ములను (వాటిని సినిమాలు అనలేం) జనాల మీదకి వదులుతూ ఉంటారు అదే ఎందుకా అని నా సందేహం! తెలిస్తే చెప్పగలరు!!

17 Comments
 1. pmspraju December 7, 2009 /
 2. director December 7, 2009 /
  • రాజశేఖర్ December 7, 2009 /
   • director December 7, 2009 /
 3. director December 7, 2009 /
  • రాజశేఖర్ December 7, 2009 /
   • director December 7, 2009 /
 4. srikanth December 7, 2009 /
 5. Sen December 8, 2009 /
 6. సాధారణ ప్రేక్షకుడు December 9, 2009 /
  • రాజశేఖర్ December 10, 2009 /
  • రాజశేఖర్ December 10, 2009 /
   • Heera December 10, 2009 /
   • సాధారణ ప్రేక్షకుడు December 10, 2009 /
 7. pradeep December 11, 2009 /
 8. chakri. July 2, 2010 /
 9. chakri. July 2, 2010 /