Menu

Luck by Chance – మరో వ్యాసం!

luck“లక్ బై ఛాన్స్” సినిమా వచ్చినప్పటి నుంచీ చూద్దాం అనుకుంటూ ఇన్నాళ్ళకి చూశాను. సినిమా ఇండస్ట్రీ మీద వచ్చిన కథలు నేను చూసినవి తక్కువే. చివరి సినిమా – “వెళ్ళితిరై” (తమిళం) అనుకుంటాను. అయితే, ఈ సినిమా మాత్రం, నేను చూసిన ఆ తరహా సినిమాలు అన్నింటిలోకీ బాగా తీసినట్లు అనిపించింది. ( ఈ సినిమా గురించి ఇదివరలో రెండు వ్యాసాలొచ్చాయి నవతరంగంలోనే. అయినప్పటికీ, నా ధోరణి నాదే – రాయాలనిపించింది, రాసేస్తున్నా…అంతే)

కథ: విక్రం (ఫర్హాన్ అఖ్తర్) నటుడు కావాలన్న కోరికతో ఢిల్లీ నుండి ముంబై వస్తాడు. తన స్నేహితుల పక్కింట్లో ఉంటున్న పెద్ద నటి కావాలని కలలు కంటున్న ప్రస్తుతపు చిన్న నటి సోనా (కొంకణాసేన్ శర్మ) తో ప్రేమ వ్యవహారం ఓ పక్క మొదలైనప్పుడే, అనుకోకుండా హీరో అవకాశం వస్తుంది. ఓ పెద్ద నటి నీనా (డింపుల్) కూతురు హీరోయిన్గా ఓ పెద్ద ప్రొడ్యూసర్ (రిషి కపూర్) తీస్తున్న చిత్రంలో. ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరో-హీరోయిన్లు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులౌతారు. విక్రం -సోనా ల మధ్య దూరం పెరుగుతుంది. నీనా వీళ్ళిద్దర్నీ అనుమానించి హెచ్చరించినా లాభం ఉండదు. ఓ సినీపత్రికలో పనిచేస్తున్న సోనా స్నేహితుడు వీళ్ళిద్దరి పై రాసిన కథనంతో వీళ్ళ మధ్యా, తర్వాత విక్రం-సోనాల మధ్యా గొడవౌతుంది. కాలక్రమంలో సినిమా హిట్టై, విక్రం స్టార్ ఔతాడు. ఓ పార్టీలో షారుఖ్ ఖాన్ ను కలుస్తే, అక్కడ ఖాన్ ఇతనికి పాత స్నేహాల్నీ స్నేహితుల్నీ మరువకని హితవు చెబుతాడు. అంతా విని సోనా వద్దకు వెళ్తాడు విక్రం. ఈపాటికి ఆమె టీవీనటిగా పాపులర్ ఔతుంది. “అపరాధ భావన” తో వచ్చావ్ కానీ, ఇంకెందుకూ కాదని, ఆమె అతన్ని కాదని అలాగే ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది – అదీ కథ.

సినిమా మొదట్నుంచి చివరి దాకా – మొత్తం సినిమా వాతావరణమే. అయితే, చాలా సినిమాల్లో చూపించినట్లు కాక – ఈ సినిమా మొత్తం చాలా సహజంగా ఉండింది. సినిమావాళ్ళే ఎంతో మంది – అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఓబెరాయ్, అక్షయ్ ఖన్నా – ఇలా తమ నిజ జీవిత పాత్రలే వేశారు. అలాగే, హృతిక్ రోషన్, డింపుల్ కపాడియా, రిషి కపూర్, జూహీ చావ్లా – ఇలా వీళ్ళంతా సినిమాలో ముఖ్య పాత్రలేసారు. కనుక సినిమా మొత్తం తారల మెరుపులే. ఒక దృశ్యంలో జావెద్ అఖ్తర్-షబానా ఆజ్మీ కనిపిస్తారు. ఇక దర్శకత్వం జోయా అఖ్తర్ – మొత్తం జావెద్, ఆయన పిల్లలు – కుటుంబ చిత్రం అనమాట 🙂

ఫర్హాన్ అఖ్తర్ – నటనా? అని “రాక్ ఆన్” చూసేముందు అనుకుని, అరే, బానే చేశాడే, అనుకున్నా చివరికి. ఈ సినిమాలో నాకు ఆ సినిమా మీద మెరుగుపడ్డట్లు అనిపించాడు. కొంకణాసేన్ శర్మ – ఎప్పట్లాగే, డీసెంట్ పర్ఫామెన్స్. నాకు వీళ్ళందరికంటే, రిషికపూర్, డింపుల్ కపాడియా లు చాలా నచ్చేశారు ఈ సినిమాలో. ముఖ్యంగా డింపుల్ – ఈ సినిమాలో ఆమెకు వచ్చినన్ని విభిన్న భావోద్వేగాలున్న దృశ్యాలు మరే పాత్రకీ రాలేదంటే తప్పేమీ కాదేమో – పాత తరం నటి, తొలి సినిమా చేస్తున్న కూతురి తల్లి, అభిమాని (అసలో నకిలీయో అన్నది వేరే కథ) మాటలకి మురిసిపోయే నటి, అవసరమొస్తే, కఠినంగా ఉండగల హీరోయిన్ తల్లి, మళ్ళీ అదే అవసరం వస్తే – ఎవరితో మాట్లాడొద్దని అందో, అతన్నే మళ్ళీ కలవమని పోత్సహించే అవకాశవాదం, ఎందుకు తను ఇలా ఉందో చెబుతూ తన చిన్నప్పటి కష్టాల్ని చెప్పినప్పటి ఆవేశం – ఒకటా రెండా – నాకైతే ఆమె ఈ చిన్న పాత్రలో చాలా ఎమోషన్స్ చూపారనిపించింది. జూహీ- ఒకప్పుడు చూసిన నవ్వుల జూహీ ఇప్పుడు టోటల్లీ డిఫరెంట్ గా ఉంది. అసలా పాత్ర మేకప్ ఇంకోలా ఉంటే బాగుండేదనిపించింది.

కథా గమనం పరంగా – ఈ సినిమాలో చాలా కథలున్నాయి అంతర్లీనంగా. అందుకే, నాకు ఇలాంటి పిట్టకథల్ని కలుపుకుంటూ, కథ అల్లిన పద్ధతి చాలా నచ్చింది. ఎటొచ్చీ, ముగింపే అంత నచ్చలేదు. ఆ చివరి సీన్ ఒక్కటే చూస్తే, ఇది హీరోయిన్ సెంట్రిక్ అనిపించే అవకాశం లేకపోలెదు. నిజానికి, నాకర్థమైనంతలో ఈ సినిమా స్టోరీ సెంట్రిక్. అలాగే, ఈ చివరి సీన్ వద్దనే – ఫర్హాన్ అఖ్తర్ పాత్ర అర్థాంతరంగా ఆపేసినట్లు అనిపించింది. చివర్లో, కొంకణాసేన్ సింగిల్ గా హాయిగా ఉంది – అన్నది నొక్కి చెప్పడం ఈ సినిమా కథకి ఎందుకు అవసరమో మాత్రం నాకర్థం కాలేదు. ఆ కాన్సెప్ట్ వేరే సినిమా గా తీయొచ్చు అసలుకైతే 🙂

ఇక, కామెడీ సంగతి. కొంతవరకూ డ్రై కామెడీ అనే చెప్పాలి. అయితే, కథ సీరియస్ ఐనప్పటికీ, రిషికపుర్ హావభావాలు, హీరోయిన్ డైలాగులు చెప్పే తీరు, ఎక్కడికక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీపై సెటైర్లు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్లాసు, హృతిక్ అద్దంలో చూస్తూ చెప్పే డైలాగు – ఇలాంటి వాటి వల్ల, మరీ అంత సీరియస్ గా అనిపించదు. “వెళ్ళితిరై” చూసినప్పుడు నాకున్న ఏకైక సమస్య ఇదే – కామెడీ లేకపోవడం. అప్పుడు అనుమానమొచ్చింది – ఇలాంటి కథలు – ఇండస్ట్రీ ని కథాంశంగా తీసుకుని తీస్తే, కామెడీ పెట్టడం కష్టమా? అని. ఈ సినిమా కాదని నిరూపించింది. ఓయా..ఇంత స్టోరీ చెప్పి సంగీతం గురించి మాట్లాడలేదు – ఇండిపెండెంట్ గా ఈ పాటలు బాగున్నట్లే అనిపించాయి గత ఏడాది చివర్లో ఎప్పుడో (లేక ఈ ఏడాది మొదట్లోనో) మూవీ రిలీజ్ కు ముందు విన్నప్పుడు. కానీ, సిట్యువేషనల్ గా బాగున్నాయి, మామూలుగా విన్నప్పటి కంటే. సంభాషణలు – జావెద్ అఖ్తర్ సంగతి చెప్పాలా??

నన్ను అడిగితే – తప్పక చూడమంటాను. నాకు జోయా అఖ్తర్ స్క్రిప్ట్ చాలా నచ్చేసింది. అయితే, ముగింపు గురించి చెప్పినట్లు – ఒకట్రెండు చోట్ల నాకు నచ్చని అంశాలు లేకపోలేదు. అయినా, నేనైతే, దీనికి మంచి సినిమా అనే వోటేస్తాను.

జోయా అఖ్తర్ మళ్ళీ ఏ సినిమా తీసినా మరో ఆలోచన లేకుండా చూసేస్తా నేను 🙂

ఇదివరలో వచ్చిన మిగితా రెండు సమీక్షలు ఇక్కడ మరియు ఇక్కడ.

One Response
  1. rayraj December 8, 2009 /