Menu

రొమాంటిక్ కామెడి It’s Complicated


It’s Complicated. సినిమా టైటిల్ అది కాని సమీక్ష మాత్రం సులువే. అంత కాంప్లికేటెడ్ ఏమీ కాదు. ముందు చెప్పాల్సింది ఏమిటంటే,ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. నేను మొన్ననే ప్రివ్యూ చూసాను. ఇది ఓల్డ్ ఫాషన్ టైప్ రొమాంటిక్ కామెడి. అందుకే ఈ సినిమా గురించి చెప్పటానికేమి లేదు , నవ్వటానికి తప్ప.

హాలీవుడ్ కామెడీ సినిమాలంటే చెప్పద్దు నాకు కొంచెం భయమే. మొన్ననే The Funny People అనే ఘోరమైన సినిమాకు బలై పోయాము. ఆ చేదు అనుభవం నుంచి ఇంకా బయటపడలేదు. నాకిష్టమైన Adam Sandler కదా అని ముచ్చట పడ్డాను. నేరకపోయి ఇరుక్కుపోయాను. ప్రతి డైలాగ్ లో మూడో, నాలుగో ఎఫ్….వర్డ్స్ తప్ప హాస్యం, లేదు, పాడు లేదు. అందుకే ఈసారి నుంచి కామెడి సినిమాలంటే కాస్త వొళ్ళు జాగ్రత్తలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. అనుకున్నానా, మళ్ళీ ఇవాళ చూడటానికి The Hangover తీసుకొచ్చాము. చూడాలి అదెలా వుంటుందో.

ఈ కామెడి సినిమా అంత ఘోరంగా లేదు కానీ Rated గాబట్టి డైలాగుల పరంగా కొంత వూహించుకోవచ్చు. హాలీవుడ్ సినిమాల్లో మధ్యవయస్సు మహిళల కోసం తీసే సినిమాలు తక్కువే. ఆ విషయంలో చూస్తే ” Something’s Gotta Give, The Holiday , What Women Want, The Parent Trap లాంటి సినిమాలు తీసి మంచి పేరుని సంపాదించుకున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్, screenwriter Nancy Meyers. ఖచ్చితంగా సినిమా ని ఫార్ములా ప్రకారం తీస్తుంది కాబట్టి ఆమె సినిమాలు బాక్సాఫీస్ హిట్లు సాధిస్తాయని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు.

ముగ్గురు ఎదిగిన పిల్లలతో ,విడిపోయిన భార్యభర్తల మధ్య అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ ఒక affair మొదలై ,మాజీ భార్యనే ” మరో స్త్రీ ” ( the other woman) అవుతుంది. మధ్యలో ఆర్కిటెక్ట్ లవర్ రంగప్రవేశం. There is always a chance for true love అని డైరెక్టర్ ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంది . కథలో పెద్దగా పట్టు లేదు కానీ మంచి కామెడి వుండటం వల్ల సినిమా బోరు కొట్టించదు. నాన్సీ మార్క్ సినిమాల్లోలాగానే ఈ సినిమా కూడా మరో వూహాప్రపంచం. smokepOt, hoTel room సన్నివేశాల్లోని కామెడి నవ్వు తెప్పిస్తుంది. చిత్రం చివరి అరగంటలో వున్న కామెడి కి మాత్రం పొట్టచెక్కలవ్వాల్సిందే. అదేమిటో నేను రాయను. ఎందుకు రాయలేదో, మీరు ఒకవేళ సినిమా చూస్తే మీకు కూడా అర్ధమవుతుంది.

ఈ సినిమాలో Meryl Streep, Steve Martin, Alec Baldwin ప్రధాన తారాగణం. Meryl Streep మంచి నటి. Julie and Julia లో, ఈ సినిమాలో రెండింటిలో కూడా ఆమె బాగా నటించింది. నటనలో ఆమె ప్రతిభ చూడాలంటే మాత్రం Michael Cunningham నవల ఆధారంగా తీసిన The Hours సినిమా చూడాలి. Baldwin నటన బావుంది. ఇక Pink Panther fame Steve Martin కూడా బాగా నటించినప్పటికీ అతనికి ఆ పాత్ర అంత సూట్ కాలేదెమో అనిపించింది. ఫామిలీ స్టొరీ ప్లస్ కామెడి కావాలనుకుంటే ఈ సినిమా చూడవచ్చు. మంచి screenplay, పుష్కలంగా పండిన కామెడి, నటనలో జీవించిన తారాగణం ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను వూహించిన దానికి కారణాలు.

–కల్పనారెంటాల

7 Comments
  1. భావన December 23, 2009 /
  2. Kalpana December 23, 2009 /
  3. కొత్తపాళీ December 29, 2009 /
  4. budugoy December 30, 2009 /
  5. Kalpana December 30, 2009 /
  6. Venu June 12, 2010 /