Menu

Film of the year-రాకెట్ సింగ్

rocket--

First things first. మీరింకా రాకెట్ సింగ్ చూడలేదంటే అర్జెంటుగా వెళ్ళి చూసెయ్యండి. ఇప్పటికే సినిమాని ఫ్లాప్ చేసేసారు. ఇంకో వారమైనా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా మిస్సయితే మాత్రం సినీ ప్రేమికులుగా మీరు ఒక ఘోర తప్పిదం చేస్తున్నట్టే!

ఈ సంవత్సరం ఇప్పటివరకూ విడుదలయిన బాలీవుడ్ సినిమాల్లో Dev.D,లవ్ ఆజ్ కల్,కమీనే, గులాల్ లాంటి కొన్ని మంచి సినిమాలు తప్పితే మిగిలిన వాటిల్లో బావుంది అనుకునే సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే పైన చెప్పిన సినిమాలన్నీ కూడా నాకు నచ్చడానికి కారణం ఒక్కటే. వీటిల్లో కథ పెద్దగా కొత్తది కాకపోయినప్పటికీ కథను చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది. అయితే ఉన్న కథను ఉన్నదున్నట్టుగా నాన్ లీనియర్ నెరేటివ్ గట్రా లాంటివేమీ లేకుండానే కేవలం ఒకే ఒక్క పాత్ర ఆధారంగా traditional story telling పద్ధతిని నమ్ముకుని ఎటువంటి హడావుడీ హంగామా లేకుండా రెండు గంటలపాటు బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను ఆనందపరిచిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ’రాకెట్ సింగ్’ మాత్రమే అని చెప్పాలి.

కథగా చెప్పుకోవాలంటే రాకెట్ సింగ్ ది చాలా చిన్న కథ. అప్పుడే బి.కాం పూర్తి చేసుకున్న హర్ప్రీత్ సింగ్ బేడి అనే యువకుడు AYS అనే assembled కంప్యూటర్స్ అమ్మే కంపెనీలో సేల్స్ విభాగంలో సేల్స్ మ్యాన్ గా ఉద్యోగంలో చేరుతాడు. మొదట్లో కాస్త ఉత్సాహంగా పనిచేసినప్పటికీ సేల్స్ రంగంలో జరిగే అక్రమాలకు బలవుతాడు. ఆ క్రమంలో ఉన్నా లేనట్టే లాంటి ఉద్యోగంలో ఉండలేక వదలలేని పరిస్థుతుల్లో సతమతమవుతూంటాడు. అలాంటి సమయంలో ఎదురైన ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుని రాకెట్ సేల్స్ కార్పొరేషన్ అనే కంపెనీ స్థాపిస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో జరిగిన విభిన్న పరిణామాలతో కూడుకున్నదే మిగతా కథ.

గతంలో ’ఛక్ దే ఇండియా’ సినిమా కు స్క్రిప్ట్ అందించిన జైదీప్ సహాని ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించాడు. ఈ సినిమాకి స్క్రిప్టే పెద్ద బలం అని చెప్పొచ్చు. ఎక్కడో ఒకటీ రెండు చోట్ల తప్పితే (వాటి గురించి మరో సారి వివరంగా చర్చిద్దాం) మిగతా స్క్రిప్ట్ మొత్తం చాలా పకడ్బందీగా రాసుకున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమాలో ఏ రెండు మూడు నిమిషాలు తప్పితే రాకెట్ సింగ్ లేకుండా ఒక్క ఫ్రేము కూడా ఉండదు. అన్ని సీన్లూ అతనితోనే సాగుతాయి. కేవలం ఒక underdog protagonist పాత్ర journey ని ఇంత చక్కగా, ఫ్రెష్ గా వ్రాసిన హిందీ సినిమా నాకైతే మరొకటి తెలియదు. ఈ సినిమా స్క్రిప్ట్ ని చాలా చక్కగా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో షిమిత్ అమిన్ (చక్ దే ఇండియా, అబ్ తక్ చప్పన్) తన ప్రతిభ చూపించాడు. అయితే వీటన్నింటినీ కూడా రణ్బీర్ కపూర్ తన నటనతో సంపూర్ణత తేగలిగాడు. మిగిలిన పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరూ అత్యద్భుతంగా నటించారనే చెప్పాలి.

ఇంతవరకూ బానే ఉంది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాంటి పరిస్థితి ఈ సినిమాది. నాకైతే సినిమా చాలా చాలా నచ్చేసింది. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ఎలా ఫెయిలయిందో నాకు ఇంకా అర్థం కాలేదు. బహుశా పిచ్చ కామెడీ సినిమా అనుకుని వెళ్ళి సినిమా సీరియస్ గా ఉండడంతో జరిగిన ‘expectation mismatch’ అయ్యుండొచ్చేమో తప్పితే, ఏ విధంగా చూసినా రాకెట్ సింగ్ ఈ సంవత్సరంలో వచ్చిన అతికొద్ది మంచి సినిమాల్లో ఒకటి అని గట్టిగా చెప్పగలను.

దురదృష్టవశాత్తూ ఈ సినిమాకొచ్చిన నెగటివ్ రివ్యూలు కూడా ఈ సినిమాకున్న కొద్ది ఛాన్స్ ని కూడా లేకుండా చేసినట్టున్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడానికి కారణం ’సేల్స్ మ్యాన్’ అనే concept తో ప్రేక్షకులు identify చేసుకోలేకపోయారనీ, మాస్ ప్రేక్షకులకు దూరంగా ఉందనీ పలు కారణాలు చెప్పారు విశ్లేషకులు. ఇక్కడ కథ సేల్స్ మ్యాన్ ది అయినా రాకెట్ సింగ్ లాంటి పాత్ర ఏ కంపేనీ అయినా ఎలాంటి రకమైన ఉద్యోగానికయినా అన్వయించుకోదగ్గది. ఆ కథకి ఒక యూనివర్శల్ అప్పీల్ ఉంది. అయినా కూడా ఈ సినిమా జనాలకు రీచ్ కాలేదంటే చాలా నిరాశగా ఉంది. ఒక్కోసారి అసలు మనకు సినిమా చూడడం వచ్చా అనే అనుమానం కలుగుతోంది.

నాకైతే ఈ సినిమా చూస్తున్నంత సేపూ 1970-80 ల్లో హిందీలో వచ్చిన మిడిల్ సినిమా లేదా ప్యారలల్ సినిమాలే గుర్తుకొచ్చాయి. వాటిల్లోనూ అంతే రోజూ వారీ జీవితానికి చాలా దగ్గరి సంబంధం కలిగిన పాత్రలు, లో బడ్జెట్,  కొత్త నటీ నటులకు అవకాశాలు, అనవసరమైన పాటలు, డ్యాన్సులు లేకపోవడం…ఇలా ఎన్నో అంశాల్లో రాకెట్ సింగ్ ఒకప్పటి ప్యారలల్ సినిమాలను పోలివుంది. అయితే అప్పటికీ ఇప్పటికీ పోలిక లేనిది ఒకటే– ప్రేక్షకుల అభిరుచి. ఆ రోజుల్లో మంచి సినిమాలను ప్రోత్సాహించారు కాబట్టే రోజుల్లో ఎన్నో మంచి సినిమాలు (అంకుర్, దువిధ, భువన్ సోమే, సలీం లంగ్డేపే మత్ రో, ఏక్ డాక్టర్ కీ మౌత్, తమస్, గరమ్ హవా, ఇంకా ఎన్నో) రాగలిగాయి. అయితే అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ లాంటి సినిమాని హిట్ చేసిన ప్రజలు ఇలాంటి సినిమాను హిట్ చెయ్యకపోయినా ఫర్వాలేదు కానీ ప్రోత్సాహించకపోతే మనకు కేవలం meaningless escapist entertainment ఉన్న సినిమాలు మాత్రమే కోరుకుంటున్నామని చెప్పకనే చెప్పటం లేదా? అలాంటప్పుడు వైవిధ్యమైన కథలతో సినిమాలు తీయాలనుకున్న వాళ్ళు కూడా రొటీన్ ఫార్ములా సినిమాలవైపే మొగ్గేలా చేయడానికి మనం కారణం కావటం లేదంటారా?

అవును నిజమే ఈ సినిమా లో సెకండ్ హాఫ్ కాస్త నిదానంగా నడుస్తుంది. మరి పాత్ర జీవితంలో ఎదురైన సంఘర్షణ అలాంటదైనప్పుడు అక్కడ హాడావుడిగా చేసెయ్యడానికీ, విజృంభించి ఫైట్లు చెయ్యడానికి అవకాశం లేదు. క్లైమాక్స్ ఇంకో విధంగా డీల్ చేసుండొచ్చు. అలాగే స్క్రిప్ట్ లోని మొదటి సగంలో కూడా సరిదిద్దుకోగల అంశాలు కొన్నున్నాయి. అంత మాత్రాన ఈ సినిమా మరీ అంత తీసి పారేయదగ్గ సినిమా కాదు. బడ్జెట్ ఎంత అంతే వందల కోట్ల లోనే చెప్తున్న బాలీవుడ్ లో కేవలం ఐదు కోట్లకంటే తక్కువ బడ్డెట్ లో ఒక సినిమా తీయడం, ఆ సినిమాలో రన్బీర్ కపూర్ లాంటి స్టార్ నటించడం ఒక మంచి పరిణామమే అయినా ఇలాంటి సినిమాని సరైన రీతిలో మనం ఆదరించకపోవడం మాత్రం మన సినిమాలకు మంచిది కాదని నా అభిప్రాయం.

ఆలోచించకండి! ఒక మంచి సినిమా మిస్సవ్వకండి! అర్జెంటుగా వెళ్ళి రాకెట్ సింగ్ చూడండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్లద్వారాతెలియచేయండి;చర్చించుకుందాం.

13 Comments
  1. Santhosh December 15, 2009 /
  2. Saumya December 15, 2009 /
  3. అరిపిరాల December 15, 2009 /
  4. budugoy December 15, 2009 /
  5. G December 15, 2009 /
  6. G December 15, 2009 /
  7. G December 15, 2009 /
  8. వీజె December 16, 2009 /
  9. Heera December 16, 2009 /