Menu

“సినిమా విమర్శ” – కొడవటిగంటి కుటుంబరావు

సినిమా విమర్శలు రాసేవారికి గల అర్హత లేవన్న ప్రశ్న ఒకటి ఈ మధ్యన కలుగుతున్నది. ఈ విమర్శకులందరికీ సినిమా చిత్రం నిర్మాణం గురించి,ఫొటోగ్రఫీ గురించి, డైరక్షన్ గురించి, పాత్ర పోషణ గురించీ, నటన గురించీ, ఏం తెలుసు అని కొందరడుగుతారు. సినిమా చిత్ర నిర్మాణంలోకి దిగేవారికే(కొందరికి) ఈ విషయాలు తలాతోకా తెలియనప్పుడు సినిమా విమర్శకులకు ఇవన్నీ తెలిసుండటం సాధ్యం కాదు. ఈ ప్రశ్న వేసే చిత్రనిర్మాతలు ఇంకొక విషయం కూడా మరుస్తున్నారు. నిజంగా చిత్రాలకు బతుకు నిర్ణయించేది సినిమా విమర్శకులు కూడా కారు…అంటూ 1952 లోనే ప్రముఖ సినీ విశ్లేషకులు,విమర్శకులు కొడవటిగంటి కుటుంబరావు గారు ఈనాడు తలెత్తుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆయన “సినిమా విమర్శ” పేరుతో రాసిన ఈ వ్యాసం మీకోసం…

లోక వృత్తంలో విమర్శకు ప్రాముఖ్యం ఉన్నది. ఈ పత్రికలో వారం వారం రాజకీయ విమర్శలు వెలవడతూ ఉండటం పాఠకులకు తెలిసిన విషయమై. ఈ విమర్శలు రాసేవారు హైకోర్టు న్యాయమూర్తులు కారు. వారి విమర్శలను ప్రజలు తిరిగి విమర్శించుకోవచ్చు. వారి నిర్ణయాలకు వారు రావచ్చు. ఈ విమర్శకులందరిదీ ఒకే ధృక్పధం ఉండదు. ఇందులో కొందరు ఒక రాజకీయ సిద్దాతం అవలంభిస్తారు. మరి కొందరు మరొకటి అవలంభిస్తారు. మరి కొందరు మరొకటి అవలంభిస్తారు.  మరి కొందరు నిష్పాక్షిక విమర్శ అనే నెపంతో ఏ దృకృధమూ లేకుండా అందర్నీ విమర్శించటం కద్దు.  అంటవంటి వారి విమర్శల ఆధారంతో కార్యాచరణ ఎటూ సాధ్యంగా కనిపించదు.

ఇటువంటి వైవిధ్యమే కళా విమర్శలోనూ ఉంటుంది. కొన్ని కళా సిద్దాంతాలూ,కళా ప్రయోజనం గురించి కొన్ని విశ్వసాలూ లేకుండా  కళా విమర్శసాగించడం సాధ్యం కాదు. అటువంటి విమర్శ సాగించేవారు  రాళ్ళు విసిరే గుడ్డి వాళ్ళు లాగా తయారవుతారు. కళా సిద్దాంతాలుండే వారిలో కూడా భిన్నధృక్పాలున్నాయి.  కొందరికి కళ విలాస వస్తువు. మరి కొందరికి కళాకారుడి ప్రతిభను వ్యక్తం చేసే సాధనం మాత్రమే. ఇంకొందరు కళ ద్వారా మనోవికాశం ఆశిస్తారు.  జీవితాన్ని అభ్యుదయకరంగా నిర్మించటంలో అడుగడుగునా కళ.. బలం ఇవ్వగలదనేవారు లేకపోలేదు.  అద్దం లాగా కళలు జీవితాన్ని ప్రతిభింబిస్తే చాలనని సంతోషించేవారు కూడా లేకపోలేదు.

ఇక సినిమా విమర్శ దగ్గరకి వస్తే, ఇతర కళా విమర్శలకు లేని ప్రత్యేకత దీనికి ఏర్పడుతున్నది. ఒక పుస్తకాన్ని గానీ, నాటక ప్రదర్శనాన్ని గాని విమర్శించటంలోనూ సినిమా చిత్రాన్ని విమర్శించటంలోనూ ఎంత వ్యత్యాసం ఉన్నదంటే అబ్బయ్యగారి సుబ్బయ్యను విమర్శించటంలోనూ రాజేంద్రప్రసాదును(అప్పటి రాష్ట్రపతి అయ్యుండ వచ్చు) విమర్శించంలోనూ ఉన్నంత ఉన్నది. సినిమా చిత్రం..రెండో ఆటకు జనం రానిదైనా సరే..అనేక లక్షల విలువగల వస్తువు. ఒక్క కలం విదిలింపుతో దానికి ఎంత నష్టం కలిగేదీ ఎవరు చెప్పగలరు?

ఈ కారణం చేత చాలా మంది చిత్ర నిర్మాతలకు విమర్శకుల జాతిని చూస్తేనే చెప్పరాని మంట. విమర్శ సరిగా ఉన్నా లేకపోయినా వారు సహించలేరు. వారి దృష్టిలో చిత్రాన్ని విమర్శించటమంటే నాలుగు లక్షల రూపాయల విలువగల మోటారు కారు మీద ఎవరో వచ్చి రాళ్ళు రువ్వటమని. నిజానికి ఇది సమర్ధనీయమైన మనస్తత్వం కాదు. చిత్రాన్ని విమర్శించటానికీ, కారు మీద రాళ్లు రువ్వటానికి చాలా వ్యత్యాసం ఉంది. కొత్త కారు మీద రాళ్ళు రువ్వటంలో ఎటువంటి సాంఘిక ప్రయోజనం లేదు. సరైన విమర్శ అంటూ ఉండే అవకాశం ఉంది కానీ, కారు మీద సరిగా రాయిరువ్వటమనేది లేదు.

విమర్శనుంచి చిత్ర నిర్మాత నేర్చుకోతగినది ఉంటుంది. రాళ్ళు రువ్వటం నుంచి కారు గల వాడు నేర్చుకునేదేమీ ఉండదు. వీటన్నిటికన్నా ముఖ్యమైన నైతిక విషయం ఏమిటంటే, సినిమా చిత్రం నాలుగు లక్షల రూపాయలదే కావచ్చు. దాని మీద వీలైతే నలభై లక్షల ప్రజల డబ్బు రాబదామనే చిత్ర నిర్మాత సంకల్పం. (సినిమా చిత్రం చిత్ర నిర్మాత ఉపయోగార్ధం ఉంచుకునే కారు ఎంత మాత్రం కాదు). పేద ప్రజల పావలాలు చెడ్డ చిత్రం మీద దుర్వయం కాకుండా చూడటంలో విమర్శకుడు..సరి అయిన విమర్శకుడు ..నైతికంగా మంచి పనే చేస్తున్నాడనాలి. చిత్రం మీద పెట్టుబడి చేసేదే డబ్బనీ,దానికి ప్రజల ఇచ్చుకునేది డబ్బు కాదనీ నిర్మాతలు భావించటంలో అర్ధం లేదు. ఇంతకూ,ఈ విమర్శ, అదైనా తీవ్రంగా ఉన్నప్పుడు, కొంత మంది,ప్రేక్షకులను నిరుత్సాహపరచగలదేమో గాని,చూడాలన్న ప్రేరణ వారికి ఇతరత్రా కలిగినప్పుడు సినిమా చిత్రాన్ని చూడకండా నివారించలేదు.

సినిమా విమర్శలు రాసేవారికి గల అర్హత లేవన్న ప్రశ్న ఒకటి కలుగుతున్నది. ఈ విమర్శకులందరికీ సినిమా చిత్రం నిర్మాణం గురించి,ఫొటోగ్రఫీ గురించి, డైరక్షన్ గురించి, పాత్ర పోషణ గురించీ, నటన గురించీ, ఏం తెలుసు అని కొందరడుగుతారు. సినిమా చిత్ర నిర్మాణంలోకి దిగేవారికే కొందరికి ఈ విషయాలు తలాతోకా తెలియనప్పుడు సినిమా విమర్శకులకు ఇవన్నీ తెలిసుండటం సాధ్యం కాదు. ఈ ప్రశ్న వేసే చిత్రనిర్మాతలు ఇంకొక విషయం కూడా మరుస్తున్నారు. నిజంగా చిత్రాలకు బ్రతుకు నిర్ణయించేది సినిమా విమర్శకులు కూడా కారు. వీరికున్న జ్ఞానం కూడా లేని సినిమా ప్రేక్షకులే. వారికి  సినిమా నచ్చని పక్షంలో  వందమందికి వెయ్యిమందికి ఆ చిత్రం చూడవద్దని చెబుతారు.

వీరు హాలులో నుండి వచ్చేటప్పుడు రెండో ఆటకు టిక్కెట్లు కొనబోయే వారిని క్యూలలో నుంచి రెక్కులు పట్టుకు లాక్కుపోతారు. ఈ ప్రేక్షకులకు సినిమా చిత్ర నిర్మాణం గురించి ఏం తెలుసు అని ఏ ప్రొడ్యూసరూ అడగలేదు, అడిగితే నవ్వుల పాలవుతాడు. చిత్రం యొక్క మంచి చెడ్డలు నిర్ణయించే అర్హత గల వారే దాన్ని గురించి అభిప్రాయాలు ప్రకటించాలనే పక్షంలో సినిమా ప్రేక్షకుల నోళ్ళు మూయటానికి  మూకుడు వేయిందే ఈ చిత్రాలు విడుదల చేయరాదు.
కొందరు చిత్ర నిర్మాతల ప్రజాభిప్రాయానికి తల ఒగ్గుతారు గాని సినిమా విమర్శకులను మాత్రం సహించలేరు. ప్రజల అభిరుచులకూ, సినిమా విమర్శకుల అభిరుచులకూ సంభందం లేదని వీరి వాదం.  ఫలానా చిత్రాన్ని విమర్శకులంతా ఖండించారు. ఆ చిత్రానికి  వచ్చే చచ్చే డబ్బు వచ్చింది  అని వీరంటారు. ఇది వాస్తవమే కూడా. బాలరాజు,కీలుగుర్రం లాంటి చిత్రాలను విమర్శకులకన్న ప్రజలు బాగా ఆదరించారు. షావుకారు వంటి చిత్రాన్ని ప్రజలకన్నా విమర్శకులు బాగా ఆదరించారు. విమర్శకులుకూ ప్రజలకూ  ఈ తేడా ఉండక తప్పదు.

సినిమా చిత్ర విమర్శ అనగానే చిత్రం మీద ప్రజలు ఇచ్చుకోబోయే డబ్బుకు వాటా అని గాని, విమర్శకులు చిత్రం విజయం గురించి జోశ్యం చెప్పేవారని గాని చిత్ర నిర్మాతలు భావించనవసరం లేదు.  విమర్శకుడు చిత్రంలో నుంచి ఎత్తి చూపే మంచి విషయాలు గానీ,చెడ్డ విషయాలు గాని ప్రజల దృష్టిలో పాటించదగినవి కాకపోవచ్చు. ప్రజలను ఆకర్షించే అంశాలు విమర్శకుడి కళా దృష్టిలో అల్పమైనవి కావచ్చు. చిత్రం గురించి ఒక సత్యాన్ని ఒక విమర్శకుడు బయిట పెడితే మరొక సత్యాన్ని మరొక విమర్శకుడు బయిటపెడతాడు. నీత భోదన చేసేవాడు నీత భోద లోని పరమార్ధం ఎరిగి చేస్తాడు. అధిక సంఖ్యాకులు నీతిని పాటించరు. గనుక నీతి భోధకుడు మూఢుడవటానికి వీలులేదు. చిత్ర విమర్శనా అంతే.

మిగతా భాగం …త్వరలో

ప్రముఖ సినీ విమర్శుకుడు,రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు వ్రాసిన ఈ వ్యాసం  తెలుగు స్వతంత్ర,వార పత్రిక 02-05-1952 సంచికలో వచ్చింది.

కొడవటిగంటి కుటుంబరావు గారు గురించి ఓ రచయిత మాటల్లో చెప్పాలంటే..సినిమాల అంటు,సొంటు సోకని రచయితలు అరుదు. కొడవటిగంటి కుటుంబరావు గారు సినిమా జీవి కాకపోయినా ఆయన సినిమా కళాభిమాని. అంతేకాదు తారుమారు(1941) సినిమా కథ,కథనం, మాటలు ఆయనిచ్చారు. ఆ చిత్రంలో ఆయన ఆఫీస్ మేనేజర్ గా కూడా నటించారు. అలాగే నవయుగ ప్రొడక్షన్స్ వారి జ్యోతి(1954) చిత్రానికి ఆయన మాటలు రాసారు. అంతకుముందే ఆయన ప్రసిద్ధ రచయితా,వ్యాసకర్త కూడా. ఆ మాటకొస్తే ఆయన రాసిన తొలి వ్యాసం(ఓరియంటెల్ వీక్లి-1934) పేరు సినిమా. ఇది ఇంగ్లీషులో రాసారు ఆయన.అప్పటినుంచీ,కన్ను మూసేవరకూ వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే అన్నిటికన్నా ఆయన సినిమా వ్యాసాలే ఎక్కువ రాశారు.

సేకరణ: జోశ్యుల సూర్య  ప్రకాష్

23 Comments
  • సాధారణ ప్రేక్షకుడు January 6, 2010 /
  • hero January 8, 2010 /
 1. Indian Minerva December 31, 2009 /
 2. సుజాత December 31, 2009 /
 3. సుజాత December 31, 2009 /
 4. SRRao December 31, 2009 /
 5. విమర్శ January 1, 2010 /
  • vanamali January 1, 2010 /
  • అబ్రకదబ్ర January 1, 2010 /
   • అబ్రకదబ్ర January 1, 2010 /
 6. విమర్శ January 1, 2010 /
  • vanamali January 2, 2010 /
   • విమర్శ January 2, 2010 /
  • hero January 8, 2010 /
 7. sri January 3, 2010 /
 8. అభిమాని January 3, 2010 /
   • అభిమాని January 3, 2010 /