![]()
గతంలో సినిమా చూసి బావుంది లేక బాగోలేదు అని మాత్రమే చెప్పేవాళ్లు. ఇప్పుడు ఎడిటింగ్ బావుంది..కెమెరా బావుంది,కొరియోగ్రఫి అదిరింది, ఆర్ట్ డైరక్టర్ ఎవరో గానీ సూపర్ ఇలా మాట్లాడటం కామన్ అయిపోయింది. అదే గతంలో అయితే 24 క్రాఫ్ట్స్ వంద శాతం సమన్వయంతో,సమర్ధవంతంగా పని చేసేవి కాబట్టే, సినిమా(మొత్తం)బావుంది అని మాత్రమే అనే వారు. రాను రాను కొన్ని క్రాఫ్ట్ లు బలహీనపడి,బలంగా పనిచేసిన క్రాఫ్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటం మొదలైంది . ఇది మంచి పరిణామం కాదని భావించటానికి బదులు, ప్రేక్షకులు చాలా (టెక్నికల్)గా అవేర్ అయ్యారని భావిస్తున్నాం. ఇది ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. సినిమా అంటే దృశ్య రూపంలో ఉన్న ఒక కథ.ఏ సినిమాలోనైనా ప్రేక్షకులు వెతికేది కథనే అనేది నిజం.
ఆ కథలోని వాస్తవికత,ఊహాజనిత ప్రపంచాల్లో తనకు పరిచయమున్న జీవితంతో ఐడెంటిఫై అయి దాన్ని ఆనందిస్తారు. వ్యూవర్స్ ఈ ఐడింటిఫికేషన్ ఇప్పుడొస్తున్న చాలా సినిమా కథలో కనపడటం లేదు. అందుకే అలాంటి సినిమాలు భాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి. మరి ఇంత చిన్న విషయం పరిశ్రమలో ప్రముఖులకు తెలియదా..లేక తెలియనట్లు నటిస్తున్నారా..అంటే నాకు తెలిసున్నంతవరకూ వారకీ ఈ విషయాలన్నీ అతి స్పష్టంగా తెలుసు. ఈ లోపాన్ని గమనించాక కూడా ఎందుకు ఫెయిల్యూర్ చవిచూడాల్సి వస్తోంది. కారణం ఒకటేననిపిస్తోంది. శాస్త్రీయతా లోపం.
సినిమాలు(చాలా సందర్భాల్లో)ఫెయిల్ అవుతున్నాయి. దర్శకులు కానీ,రచయితలు కానీ ..తమ మొదటి సినిమా వరకే, కొత్త దనానికి, కొత్త క్రియేషన్ కి మూలమైన, తన చుట్టూ సహజంగా ఉండే ప్రపంచానికీ,అందులోని లైఫ్ కి దగ్గరగా ఉంటున్నారు. సక్సెస్ వచ్చాక అప్పటి వరకూ ఏ ప్రపంచం నుండి నిరంతరం ప్రేరణ పొందుతూ కొత్త ఆలోచలని చేస్తూ వచ్చారో దానితో కనెక్టివిటీ తెగిపోతోంది. తద్వారా బయాస్డ్ ధింకింగ్ మొదలవుతోంది. ఈ విధంగా సినీ పరిశ్రమ జీవితంలో కనెక్ట్ విటీ పోగొట్టుకుని ఒక ఐలాండ్ లా తయారైపోయి చాలా కాలమైంది. దీన్ని బ్రేక్ చేయడానికి సినిమా పరిశ్రమ ప్రయత్నించాలి. సీరియస్ సాహిత్యాన్ని చదివేవాళ్లంటే ఎందుకో సినిమా వాళ్ళకు భలే భయం. వారిని దూరంగా పెడతారు.
సినిమాకు అంత నాలెడ్జ్ అవసరం లేదండీ అని తమ వీక్ నెస్ ని కవర్ చేసుకుంటారు. నిజానికి అలాంటి నాలెడ్జ్ ఉన్న వారే పూర్వం ఉండేవారు. అలాంటి వారి పరంపర ఎప్పుడు ఆగిపోయిందో ఆ నాటి నుండే సినిమా క్షీణించటం మొదలైంది. సినీ రచయతల్లో సత్తా తగ్గింది కనుకనే చిన్న చిన్న ఆర్టిస్ట్ కూడా దర్శక,నిర్మాతలను డామినేట్ చేస్తున్నారు. ఎప్పటికీ సినిమాకి కథే ప్రాణం,కథే హీరో . మంచి రచయితలను వెతికైన పట్టుకోవాలి లేదా తయారైనా చేసుకోవాలి. ఈ సమస్య సినిమా పరిశ్రమ అంతటిదీ. సినిమా సక్సెస్ కోసం 1500 ప్రింట్లు ఒకే సారి రిలీజ్ చేసి నిజమైన టాక్ వచ్చేలోగా డబ్బు దండుకోవాలనే ఫార్ములా ప్రక్కన పెట్టి కాస్త ఈ సమస్య మీద పరిశ్రమ కసరత్తు చేస్తే మంచిది. తెలుగు సినిమా పరిశ్రమకు అవసరమైన టాలెంట్స్ ను తయారు చేసే ఇనప్రాస్ట్రక్చర్ లేదు.
అందుకే టాలెంట్ ఉన్నా ఉపయోగపడని స్ధితి. తెలుగు సినిమాకు ఒక సోఫిస్టికేటెడ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ అవసరం. దాన్ని పరిశ్రమే ఏర్పాటు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సిడ్ ఫీల్డ్ లాంటి ప్రముఖ స్క్రీన్ ప్లే రచయితలను ఆహ్వానించి హిందీ పరిశ్రమ ఆ మధ్యన వర్క్ షాప్ పెట్టింది. అలాంటి ప్రయోగాలు కూడా తెలుగు పరిశ్రమ అప్పుడప్పుడూ చేస్తూండాలి. అప్పుడు మాత్రమే తెలుగు సినిమా గౌరవ ప్రధమైన సక్సెస్ ను మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారా కాకుండా సృజనాత్మక ప్రమాణాల ద్వారా గ్యారింటీగా పొందే అవకాశం ఉంది.కాదంటారా…?
-వసంత్
కాకినాడ
K మహేశ్ కుమార్ says:
చిన్న వ్యాసంలో చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. అభినందనలు. మరిన్ని వ్యాసాలు మీ నుంచీ వస్తాయని ఆశిస్తాను.
j.surya prakash says:
ఆర్టికల్ బావుంది..జీవితం..సినిమా కనెక్టివిటీ తెగిపోయిందనటం కరెక్టే..
సూర్య ప్రకాష్ జోశ్యుల
rayraj says:
>>అలాంటి వారి పరంపర ఎప్పుడు ఆగిపోయిందో ఆ నాటి నుండే సినిమా క్షీణించటం మొదలైంది. -నిజం. కానీ పరంపర పూర్తిగా ఆగిపోలేదు.
>>మంచి రచయితలను వెతికైన పట్టుకోవాలి లేదా తయారైనా చేసుకోవాలి. -కరెక్టు.
>>తెలుగు సినిమా పరిశ్రమకు అవసరమైన టాలెంట్స్ ను తయారు చేసే ఇనప్రాస్ట్రక్చర్ లేదు. – కరెక్టు.కాస్త వాక్యం మారిస్తే, ‘తయారు చేసే సరియైన వాతావరణమే లేదు’ అనికూడా చెప్పొచ్చు. ఒక్క ఫిల్మ్ ఇన్‍స్టిత్యుట్ వల్ల అవ్వదు. కానీ అది అవసరమే. అలాగే ఆ 1500 ప్రింట్ల ఫార్ములా ఉన్నపళంగా మారేది కాదు.
చాలా సూటిగా రాశారు. కాకపోతే, ‘శాస్త్రీయతా లోపం’ అన్న స్థానంలో ‘డిస్కనెక్టివిటీ’ అని రాస్తే, వ్యాసం కరెక్టుగా ఉండేది.ఆ ఒక్క మార్పునీ, సూచించిన పరిష్కారాన్ని మినహాయిస్తే, ఈ వ్యాసం రాసినతీరు బావుంది.’నేనిలా రాయాలి’ అనిపించింది.
vamshipulluri says:
చాల బాగుంది. కాని ఇన్కొన్ని విశ యాలు మీ దృష్టి కి తేదలిచాను.
సినిమాని సినిమా లా కాకుండా, ఇరవై నాలుగు ముక్కలు గా చూడడం, అలా మాట్లాడుకోవడం, మన టేస్ట్ కి, తెలివి కి, ప్రత్యేకత కి నిదర్శనం అనుకొనె విదంగా, మనల్ని మనం, (మన విమర్శకులు ద్వార కూడ) తయారు చెసుకున్నాం. సినిమ కథ ద్వారానే కాకుండ మరే విధంగా నైనా మన ఎమోషన్స్ కి కనేక్ట్ కావచు. అప్పుడు అది మంచి కథ కాకపోయిన పది మంది కి నచవచు. అయితే “నచవచు” నుండి మొదలు పెట్టి, కథ ని వదిలి పెడితే పూర్తగా డిస్ కనెక్ట్ అయ్యె ప్రమాదము ఉన్ది. అన్దుకే ఇన్ని కాపి సినిమా లు.
ఇనిస్టిట్యుట్ లు రక్శించలేవు. ఎంత గొప్ప వర్క్ షాప్ అయిన సరే, మనము ఇన్ని రోజులు నేర్చుకున్నాదాన్ని వదిలిన్చలేకపోతే, మనం మల్లి మొదటికే వస్తాము, కాకపోతే మరో మర్గములో, మరొ వాహనంలో.
chandramouli says:
సినిమా పరిశ్రమను తెగిడే వ్యాసాలు కూడా ఆ సినిమాల్లానే ఉంటున్నాయని భాదపడేవాణ్ణీ…..
కొద్ది లైన్స్ లో చెప్పినా… పెద్ద లైన్స్ నే చెప్పారు….. మీరు ఇలా వ్యాసాలు నవతరంగానికి రాస్తారని ఆశిస్తాను…
Sankar gongati says:
వసంత్ గారు
నెటి తెలుగు సినీ తత్వాన్ని ఒక ముక్కలొ చెప్పారు. థ్యాంక్స్.
m s naidu says:
hi. interesting doubts and suggestions. if you can deal elaborately a particular dimension of any of your sincere sentences regarding film related analysis, we may get good articles from you. best of luck.