Menu

అవతార్ : ఒక కథ, ఒక నిజం, ఒక సత్యం…ఒక సినిమా

avatar_photo

ఒక కథ:
అనగనగా ఒక అడవి.
ఆ అడవిలో ప్రకృతితో కలిసి బ్రతికే కోయజాతి ప్రజలు.
ఒక పారిశ్రామికవేత్త అక్కడొక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటాడు. లేదా అక్కడదొరికే ఖనిజసంపదను దోచెయ్యాలనుకుంటాడు.
అలాచెయ్యాలంటే కోయోల్లని అక్కడ్నించీ తరిమెయ్యాలి.
అప్పుడు… కోయవాళ్ళకు మంచిచేసి, మచ్చికచేసుకుని, మోసం చెయ్యడానికి ఒకడ్ని నియమిస్తాడు.
అతడే హీరో…
ఆ హీరో విలన్ కోసం అక్కడికి వెళ్ళినా, త్వరలోనే ఆ కోయోళ్ళ ప్రకృతి ప్రేమని, అమాయకత్వాన్నీ అర్థం చేసుకుంటాడు.
పనిలోపనిగా కోయదొర కూతురు (హీరోయిన్)తో ప్రేమలో పడతాడు.
వచ్చింది మోసం చెయ్యడానికే అయినా, జరిగిన కనువిప్పుతో విలన్ కు వ్యతిరేకంగా పోరాడి హీరో అనిపించుకుంటాడు.

ఒక నిజం:
అనగనగా ఒక అమెరికా.
ఆ దేశానికి ఎక్కడలేని వనరులూ కావాలి.
అందుకే, ప్రపంచంలో ఏ మూల అమ్యూల్యమైన వనరులున్నా అభివృద్ధి నెపంతో అక్కడ తిష్టవేస్తారు.
చదువులు చెప్పిస్తారు. డబ్బులు అప్పుగా ఇస్తారు. మంచిమంచి మాటలు చెబుతారు. తాము చెప్పినదారిలో నడుచుకుంటే అభివృద్ధి జరుగుతుందని నమ్మింపజేస్తారు.
వీలైనన్ని వనరులు దోచుకుని దేశాన్ని ఖాళీచేస్తారు.
మాటవినకపోతే… వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయన్జెప్పి దాడిచేసైనా సరే వనరుల్ని బలవంతంగా తిష్టవేసిమరీ దోచేస్తారు.
వాళ్ళదేశం కాని ఏదేశమైనా వాళ్ళకదొక వెధవదేశం, నాగరికతా సభ్యతాలేని కొండోళ్ళ దేశం, ఆ దేశ ప్రజల్ని జంతువుల కంటే హీనంగా నలిపెయ్యడానికి, కార్పెట్ బాంబింగ్ చేసి చంపెయ్యడానికీ వెనుకాడరు.
వారికి ఎదురొడ్డి ఎన్నోదేశాలు భౌతికంగా పోరాడుతున్నాయి, మరెన్నోదేశాలు సైద్దాంతికంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇది బలమైన దేశం. ప్రపంచాన్నంతా నాశనం చేసైనాసరే తమ మనుగడను నిలుపుకే కసాయి దేశం.

ఒక సత్యం:
మనుషుల అత్యాశను భరించలేని భూమి,ప్రకృతి బీడుబారిపోతున్నాయి.
కొన్నేళ్ళతరువాత ఇక్కడ ఏదీ మిగలదు.
అప్పుడు ఏ మార్సో, యురేనస్ లోనో, లేకపోతే మరే దిగంతాల్లోనో భూమిలాంటి ప్రదేశం కనుక్కున్నాం.
అక్కడి ప్రజలు మనకోసం వాళ్ళభూమిని ఖచ్చితంగా ఇవ్వమంటారు..
ఎక్కడికెళ్ళినా ప్రకృతిని నాశనం చేసే ప్రవృత్తి ఉన్న మనుషులను తప్పకుండా వ్యతిరేకిస్తారు.
వాళ్ళతో యుద్దంచేసి, ఆ లోకల్ జాతులను నాశనం చేసైనా ఆ భూమిని దక్కించుకోవాలని మనుషులు ప్రయత్నిస్తే!

ఒక సినిమా:
స్థానికంగానైనా, అంతర్జాతీయ స్థాయిలోనైనా అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజల సంస్కృతి,ప్రకృతి,సాంప్రదాయాలపై జరిగే దాడికి సినిమారూపం అవతార్. మైనింగ్ కోసం పారిశ్రామీకరణ కోసం జరిగే displacement process కు అద్దం అవతార్. పెద్దపెద్ద కంపెనీలు, ఇంకాపెద్దపెద్ద దేశాలు కేవలం బలవంతులన్న ఒక్క కారణంచేత భూమిని, ప్రకృతినీ, వనరులనూ మానభంగం చేసి, బలహీనులకు ఏమీ మిగలకుండా, ప్రజల అవసరాలకన్నా తమ లాభాలే ముఖ్యమనుకునే పోకడకు ప్రతీక అవతార్. ప్రకృతితో మమేకమైన మానవుడే సరైన ప్రగతికి చిహ్నమవుతాడని అన్యాపదేశంగా చెప్పిన సినెమా మాయాజాలం అవతార్.

ఈ సినిమాకు దర్శకుడెవరూ, ఈ సినిమా సాంకేతిక ప్రమాణాలేమిటి,అనేవి అప్రస్తుతాలు. ఈ సినిమా చూడచ్చా చూడకూడదా అనేవి చొప్పదంటు ప్రశ్నలు. ఈ సినిమా ఒక వింత లోకం. కానీ, ఆ వింతలోకంలో మన నిజమైన ప్రపంచానికి చెందిన ఎన్నో చర్చలూ, ఆలోచనలూ, ప్రశ్నలూ ఉన్నాయి. ఈ ఒక్క కారణం చాలు సినిమా చూడటానికి. ఈ కారణంతో పాటూ ఒక అద్భుతమైన అనుభవం పెద్ద బోనస్ అంతే! జస్ట్ ఎంజాయ్!!


29 Comments
 1. pappu December 18, 2009 /
 2. $hankar December 18, 2009 /
 3. Swapna December 18, 2009 /
 4. శివ కుమార్... December 18, 2009 /
 5. Sankar gongati December 18, 2009 /
 6. అభిమాని December 18, 2009 /
 7. సాధారణ ప్రేక్షకుడు December 19, 2009 /
 8. Chandramouli December 19, 2009 /
 9. రవి December 20, 2009 /
 10. సుజాత December 20, 2009 /
  • hero December 20, 2009 /
   • గీతాచార్య December 22, 2009 /
 11. vasu December 20, 2009 /
 12. సాధారణ ప్రేక్షకుడు December 20, 2009 /
 13. నాగన్న December 20, 2009 /
 14. భావన December 21, 2009 /
 15. భావన December 21, 2009 /
 16. radhika December 21, 2009 /
  • rayraj December 21, 2009 /
 17. ram December 21, 2009 /
 18. గీతాచార్య December 22, 2009 /
 19. sankar December 23, 2009 /
 20. కొత్తపాళీ December 29, 2009 /
 21. budugoy January 7, 2010 /
 22. శరత్ January 11, 2010 /
 23. vijay April 2, 2010 /
 24. vijay April 2, 2010 /