Menu

అవతార్

కథలో కొత్త ఆలోచనలు గానీ సరికొత్తగా ప్రతిపాదించిన సూత్రాలు కానీ ఏవీ లేవు గానీ అవతార్ సినిమా రెండున్నర గంటల సేపు కళ్ళకీ మనసుకీ విందు చేసిందనే నాకనిపించింది.

సృష్టిలో అన్నిటినీ కలిపి ఉంచే మూల సూత్రం ఒకటున్నదనీ, ఒక అంతస్సూత్రం ఉన్నదనీ, దాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా కనీసం దాని ఉనికిని గుర్తించి దానితో (లిటరల్‌గా)”టచ్” లో ఉంటే, మనము మన చుట్టూతా ఉన్న ఈ సృష్టితో ఒక సమతుల్యతలో ఉండవచ్చునని అనేక ప్రాచీన మానవ నాగరికతలు ఉద్ఘోషించినదే. సనాతన ధర్మంలో తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది సూత్రాలలోని అంతస్సూత్రం ఇదే. శతరుద్రీయం లాంటి వేద మంత్రాలు చెబుతున్నదీ ఇదే.

ఇదిలా ఉండగా, ఎవడో పైనించి వచ్చి మన ప్రాంతాన్ని దురాక్రమణ చేసి మన ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసి మన వనరుల్ని కొల్లగొట్ట జూస్తుంటే .. మనం ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటున్న మన మాతృభూమిని వాడు క్షణిక సుఖాన్నిచ్చే పడుపుగత్తెలా చూస్తుంటే .. స్వతహాగా శాంతిస్వరూపులమైన మనం పోరాడాలా? కురుక్షేత్రంలో అర్జునుణ్ణి వేధించిన ప్రశ్న. పోరాడాలన్నా ఏ ఆయుధంతో? మెషిను గన్నుల మీదనా విల్లంబుల ప్రతాపం? కానీ పోరాడాలి, వేరే దిక్కు లేదు. చేతికందిన ప్రతి ఆయుధంతోనూ పోరాడాలి, అది రాయైనా సరే. ఆఖరి శ్వాస దాకా పోరాడాలి.

ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వాడు, నిజానికి ఆ ప్రాంతీయుడు కాక దండెత్త వచ్చిన జాతివాడయితే? ఆ దండెత్తే దుండగీళ్ళు మన మానవులే అయితే?

ఇవీ అవతార్ సినిమా ప్రేక్షకుల ముందుంచే కొన్ని సమస్యలు. సినిమాలు బాగా చూసేవళ్ళకీ, పుస్తకాలు, ముఖ్యంగా నవల్లు బాగా చదివే వాళ్ళకీ ఇవి కొత్త ప్రశ్నలు కావు. హాలీవుడ్ నించే ఇంతకు మునుపు కెవిన్ కాస్నర్ తీసిన డేన్సెస్ విత్ ద వుల్వ్స్ Kevin Costner’s Dances With the Wolves, డిస్నీ వారి పోకహాంటాస్ Disney’s Pocahontas ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో వచ్చిన సినిమాలు. ఐతే అక్కడ తెల్లజాతి వారు అమెరికా ఖండాన్ని ఆక్రమించుకునే క్రమంలో స్థానిక అమెరికన్ (మరో భాషలో చెప్పాలంటే రెండిండియన్) తెగలవారిని మారణహోమం చెయ్యబూనడం కనిపిస్తుంది. కాస్నర్ సినిమాలోనయితే కాస్నర్ వేసిన పాత్ర, ఒక తెల్లజాతి సైనికుడు, అక్కడి తెగవారితో కలిసిపోయి, వారితో తెగలోకి స్వీకరించబడి, వారితోనే మమేకమైపోయి, చివరిలో దండెత్త వచ్చిన తెల్లజాతి సైన్యంపై విరుచుకు పడ్డం చూస్తాం, అచ్చం అవతార్ లో జేక్ సల్లీ లాగానే. చాలా సామ్యాలున్నాయిలాంటివి. ఇక సైన్సు ఫిక్షను సాహిత్యంలోనైతే కోకొల్లలు.

ఈ సినిమాలో నన్ను చాలా ఇబ్బంది పెట్టిన మొదటి విషయం పాత్రల స్టీరియోటైపింగు. కథలో కొత్తదనం లేకపోవడమే కాదు, పాత్రలన్నీ కూడా సజీవంగా కాకుండా సూత్రధారుడు కీ ఇచ్చి నడిపిస్తున్న చెక్కపడీ బొమ్మల్లా ఉంటాయి .. లాభాలు తప్ప ఇంకేవీ కనబడని ఒక కార్పొరేటు ఏజెంటు, శరీరపు అణువణువులో టెస్టోస్టీరోను బుసకొడుతున్న ఆర్మీ కల్నల్, గీకుతనం వోడుతున్న ఒక లాబ్ అసిస్టెంటు .. అలాగే .. నావీ తెగవారిలో కూడా వారి వారి వేషాలు, అలంకారాలు, మతప్రార్ధనలో చేసే కదలికలు … ఇవన్నీ స్థానిక అమెరికను లేదా ఆఫ్రికను తెగల పద్ధతులని పోలి .. ఇదంతా కొంచెం అతిగా ఉండి జుగుప్స కలిగించింది. The whole thing is one big cliche. ఇబ్బండి పెట్టిన రెండో విషయం డయలాగులు .. అతి కీలకమైన సున్నితమైన సన్నివేశాల్లో కూడా పేలవమైన నీరసమైన డయలాగులు. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ఇబ్బంది పెట్టే మూడో విషయం కథ ప్లాట్లో లొసుగులు .. ఇంచుమించు మగధీరలో ఉన్నంత లొసుగులు.

ఇన్ని వైరుధ్యాల క్లిషేల చికాకు పెట్టే విషయాల నడుమకూడా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాన్నేను. ముఖ్యంగా ఆర్టు డైరెక్టరు సృష్టించిన పండోరా ప్రపంచం .. ఆకాశాన్ని సగం ఆక్రమించి ఉండే ఒక గ్రహపు దృశ్యన్నించి ప్రతి కీటకం, పక్షి, జంతువు, మొక్క, వృక్షం .. అన్నీ విడివిడిగా స్పష్టంగా అందంగా ఉన్నాయి, అన్నీ కలిసి సమగ్రంగా అద్భుతంగా ఉన్నాయి. నేయ్తిరి ఇక మీదట ఫెమినైన్ బ్యూటీకి నా ప్ర్మాణం. అలాగే మానవుల కేంపులో కూడా, ఆయుధాలూ, ఎగిరే యంత్రాలూ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదుగానీ మిగతా టెక్నాలగీ రూపాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నిటికంటే నాకు విపరీతంగా నచ్చేసిన విషయం .. నావి తెగవారే. కేవలం ఆ రూపాల్ని ఊహించి అలా తీర్చి దిద్ది వాటికి ప్రాణం పోసినందుకు ఇవ్వచ్చు ఎన్ని ఎవార్డులైనా. సినిమా ముగిసిపోయాక ఒక అద్భుతమైన ఎంతో అందమైన లోకాన్నించి ఒక్క దెబ్బతో బయటపడిపోయిన ఫీలింగ్.

తమాషాగా, నావీ తెగ నాయకుడిగా వేసిన వెస్ స్తుడి ఒక్కడే నిజంగా స్థానిక అమెరికన్ తెగలకి చెందిన మనిషి మొత్తం నటవర్గంలో. ఏలియన్ చిత్రాల వెటరన్ నటి సిగోర్నీ వీవర్ డా. ఆగస్టీన్ పాత్రలో బాగా నప్పింది. ఆశావహమైన ముగింపుకూడా బాగుంది, ఆ ముగింపు ఎంత కృత్రిమంగా ఉన్నా.

11 Comments
  1. Rakesh December 29, 2009 /
  2. Vanamali December 29, 2009 /
  3. Sarath 'Kaalam' December 30, 2009 /
  4. కొత్తపాళీ January 11, 2010 /
  5. sarath January 11, 2010 /
  6. కొత్తపాళీ January 13, 2010 /
    • vara January 13, 2010 /
  7. Chilakapati Srinivas January 13, 2010 /
  8. sudhakar January 19, 2010 /