Menu

అవతర్ – నాఽవీ నేవీల సంగ్రామం

avatar-poster1 నేను ఇప్పటివఱకూ మొదటిరోజు మొదటి ఆటకు వెళ్ళలేదు. తెలుఁగులో ఆంగ్ల సినిమాలూ చూడలేదు. తొలిప్రేమ తరువాత ఒక్కణ్ణే ఒంటిగా ఏ సినిమాకూ వెళ్ళలేదు. ఈవాళ ఈ మహాకార్యాలూ చేసి అవతార్ సినిమా చూడడం జరిగింది. ఇప్పటికే నవతరంగంలో రెండు సమీక్షలు వచ్చాయి, ఇక మూఁడవది ఎందుకంటే; కష్టపడి రాజమండ్రి ఊ.మే.రం కీ వెళ్ళి అక్కడ అర మైలు పొడవున్న వరుసలో నుంచొని, టిక్కెట్లు దొరక్క పోతే నల్ల టిక్కెట్టు కొని మఱీ వెళ్ళిన నా శ్రమ ఫలాలని పంచుకోవాలనే ఆనందాన్ని కాదనకండి. నేను చెప్పదలచుకుంది మన మహేశ్ గారు చెప్పేసే వున్నారు. అయినా ఇంకో సారి.

ట్రెయిలర్ చూస్తే కథ తెలిసిపోతుంది, పూర్తి కథ. చివరి వరకూ. కాబట్టి సినిమా చూస్తే గ్రాఫిక్సు కోసం చూడాలి లేదా కథలోని ఆహా కోసం చూడాలి. గ్రాఫిక్సు గుఱించి నేను పెద్దగా చెప్పలేను. నేను చూసింది, ఒక మాదిరి రకం థియేటరు, బాల్కనీ అంటే ఎక్కడో అర మైలు దూరంలో వుండే రకం. టైటానిక్కులో వున్న ఆహా వుందా అంటే, ఖచ్చితంగా లేదు. ఈ సినిమా కంటే మీ సగటు ఐరోపా సినిమాలో ఆహా ఎక్కువుంటుంది. బయటకి వచ్చాక పెద్ద గొప్ప సినిమా చూసాము, లేదా మానవ జీవితానికి ఏం అద్దం పట్టాడు అని మాత్రం మనకు ససేమిరా అనిపించదు. పై రెండూ చెప్పాక, ఇక మీరు సినిమాని చూస్తే మాంచి 3D థియేటరులో చూడాల్సిందే, అదీ కథనుండి పెద్దగా ఆశించకుండానే.

అందునా మళ్ళీ… కొత్త లోకాన్ని సృష్టించాడు, ఎన్నో అద్భుతాలు, వింతలు, ఎన్నో అందమైన వృక్షాలు చెట్లు, దేఁవుని సృష్టికి ప్రతి సృష్టి అని కూడా అంటున్నారు.  కానీ దేఁవుని సృష్టిలో భాగమైన మనము ఆయని సృష్టికి ప్రతిగా రెండు గంటలైనా ఒక సినిమా తీయగలమా అంటే, నాకు నమ్మకం లేదు. ఆ పువ్వుల వాసనా మనకు రాదు, ఆ  ఆకుల నునుపూ మనకు అంటదు. ఈ విషయంలో కూడా సినిమాటాగ్రాఫీకి పెద్ద పీట వేసే ఐరోపా సినిమాలూ , ఇరానీ సినిమాలు, మన వంశీ సినిమాలూ కలిగించే ఒక రకమైన ఆః ఈ సినిమాకు రాదు. దానికోసం మీరు పెర్షియన్ కార్పెట్ సినిమాలు చూసుకోవడం నయం, ఉదా- Gabbeh. లేదా గోదారి గట్టుకెళ్ళడం ఇంకా నయం.

కానీ అవతార్ నిజంగా ఎందుకు గొప్ప అంటే,

ఇది మహాభారతంలాగా ఒక పురాణం లాంటిది. చెడు పై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది, కాబట్టి మీరు సరైన పక్షాన వుండాలి అని హెచ్చరించే ఒక నీతి కథ. ఈనాడు మానవాళికి అది పెద్ద సమస్యగా పరిగణించింది పర్యావరణ పరిరక్షణ. మన అదృష్టమో దురదృష్టమోగాని, ఇక్కడ రావణుడూ రాముడూ ఇద్దరూ మనలోనే వున్నారు. అమెరికా వారు exploit చేస్తున్నారు, పేద దేశాలని మింగుతున్నారు అని, అలా ఈ సినిమాలో వినల్లు వారనీ అనడం కాస్త అపరిపక్వతే అవుతుంది.

ప్రలోభానికి అమెరికావారు చిహ్నమైతే కావచ్చు, కానీ వారి కంటే పెద్ద గనిబాబులు మన దగ్గరా వున్నారు. ఈ సినిమాని మీరు చూసారంటేనే మీరా వ్యవస్థలో ఒకరు. సినిమాని తీయడానికి పట్టిన 1200 కోట్లు, ఎక్కడి నుండి వస్తాయి భూమినుండేగా? ఈ సినిమాకూడా భూమికి అంత పెద్ద బొక్కా పెట్టినట్టేగా. నిజమైన నాఽవీ పక్షానికి అవతార్ యొక్క హైపు గుఱించి తెలియదు. కాబట్టి మనము నేవీ పక్షానికే వస్తాము.

ఈ సినిమాలో రెండు పక్షాలుంటాయి కౌరవులుగా భూగ్రహ అగ్రరాజ్యపు శక్తిమంతమైన సేన (Navy నేవీ). పాండవులుగా ప్రకృతి ప్రేమ గల గ్రహాంతర ఆదివాసీలు (Na’vi నాఽవీ). మామూలుగా ఈ రెండు వర్గాలూ పోరాడుకొని వారు నగ్గి మనము ఓడి పోతే, భారతీయ యుద్ధ సినిమాకు పాకిస్తాన్ గెలిచినట్టు ముగింపు ఇచ్చినట్టుంటుంది. అందుకే మన దర్శకుఁడు, జేమ్సు, మనకు  మన ప్రతినిథైన కథానాయకుని ద్వారా మనం ఏ పక్షాన చేరాలి అన్న నిర్ణయాన్ని మనకే వదిలాడు. ఈ విషయంలో రెండో ఆర్యఁడు సాడిష్టో కాడో తెల్చుకోలేక పోయిన దర్శకులు, ప్రేక్షకులను కథానాయకునితో మమేకం చేయడం(empathize) ఎట్లానో నేర్చుకోవచ్చును.

కోపన్‌హాగన్లో జురుగుతున్న సమావేశాల సమయానికి ఈ సినిమా విడుదల చేయడం కాకతాళీయమో కాదో తెలియదు గాని, పర్వావరణ పరిరక్షణా సందేశాన్ని తిఱిగి ఇంత భారీ స్థాయిలో ఇంత గట్టిగా ప్రపంచమంతా చాటిన జేమ్సుని అభినందించాల్సిందే. ఆ సందేశం మాత్రమే వున్న సినిమానైతే ఇంకా బాగానే తీయవచ్చుఁ. ఆ పని చేయడానికి ఏ నాషనల్ జీయోగ్రాఫిక్ పరిశోధకుడో సరిపోతాడు. అలాంటి రెండు వీడియోలు ఇక్కడ మఱియు ఇక్కడ చూడవచ్చుఁ. కానీ వాటికి 1200 కోట్ల ఊహాలోకం జోడించి అబ్బుర పఱచేటట్టుగా అందరికీ చెప్పడం గొప్ప.

మెసేజ్ కావాలంటే పోష్టు కార్డులో వేస్తాను అని నమ్మే దర్శకులకు ఈ సినిమా ఒక గుణపాఠం.

వాళ్ళకు కావలసింది, మనమివ్వగలిగిందీ ఏమీ లేదు. ఏమిస్తాము మనము వాళ్ళకు? బీర్? జీన్స్?

*విండోసు-౭ లేని వారికి నాఽవీ అనే పదం సరిగా కనబడడానికి పోతన ఖతి అవసరం రావచ్చుఁ.

22 Comments
 1. Sankar gongati December 18, 2009 /
 2. Manjula December 18, 2009 /
 3. అబ్రకదబ్ర December 18, 2009 /
 4. $hankar December 18, 2009 /
 5. గోపి గాడు December 19, 2009 /
 6. Chandramouli December 19, 2009 /
   • రవి December 20, 2009 /
   • Chandramouli December 20, 2009 /
  • అబ్రకదబ్ర December 20, 2009 /
 7. రవి December 20, 2009 /
 8. rayraj December 21, 2009 /
  • అబ్రకదబ్ర December 23, 2009 /
   • rayraj December 23, 2009 /
 9. rayraj December 21, 2009 /
 10. rayraj December 23, 2009 /
 11. కొత్తపాళీ December 29, 2009 /