Menu

2009 ఒక సమీక్ష

2009 సంవత్సరాన్ని అత్యంత దారుణమైన సంవత్సరంగా తెలుగు చిత్రపరిశ్రమ అప్రకటితంగా ప్రకటించేసుకున్నారు. ఈ విషయం ఒక ఓపన్ సీక్రెట్. ఈ సంవత్సరంలో వచ్చినన్ని ఫ్లాపులు మరే సంవత్సరంలోనూ రాలేదు. ఆలాగే ఈ సంవత్సరంలో పెట్టినంత పెట్టుబడి మరే సంవత్సరంలోనూ తెలుగు పరిశ్రమ గత 77 ఏళ్ళలో పెట్టలేదు. కలెక్షన్ల పరంగా లెక్కకు నాలుగు హిట్లు. యావరేజ్ అనే పదానికి ప్రేక్షకులు చూసినా పెట్టుబడివెనక్కురాని సినిమాగా ఒక కొత్త అర్థం వచ్చిచేరింది. ఇక ఫ్లాపులంటారా వాటిని లెక్కపెట్టాల్సిన అవసరమే లేదు. ఆ నాలుగు సినిమాల్ని,మరో మూడు సినిమాల్నీ మినహాయించి మిగిలినవన్నీ అవేకదా!

హిట్టైన సినిమాలేమైనా తెలుగు సినిమా స్థాయిని పెంచాయా అంటే అదీ లేదు. ఒకటి (అరుంధతి) గ్రాఫిక్స్ మాయాజాలాన్ని యధాశక్తి బ్రహ్మాండంగా ‘రీక్రియేట్’ చేసి జుగుప్సాకరంగా భయపెట్టగలిగితే, మరొకటి (మగధీర) పాతిక అంతర్జాతీయ సినిమాల వివిధ అంశాల్ని కలగలిపి తెలుగుమసాలా దట్టించి లెక్కకు మించిన బొక్కలతో వండివార్చింది. ఇంకొకటి (కిక్) క్రిష్ అనే హిందీసినిమా (అదే పరమ కాపీ)కు రవితేజ మ్యానరిజాన్ని అద్దకంచేసి అందించింది. ఇక నాలుగోది (బెండు అప్పారావు)అల్లరి నరేష్ చేసిన స్లాప్స్టిక్ కామెడీ. మొత్తానికి అన్నింటిలోనూ తెలుగుతనం సంగతి పక్కనబెడితే కనీసం గౌరవప్రదమైన “సినిమా”గా కూడా గుర్తించలేని దిగజారుడుతనం మాత్రమే కనిపించింది.

ప్రయోగాల పేరుతో పసలేని ‘కథ’, సాగదీతల గమ్యంలేని ‘ప్రయాణం’,పదునున్నా గురిలేని ‘బాణం’, ఏమాత్రం హృదయాన్ని కలవరపెట్టని ‘కలవరమాయే మదిలో’,సస్పెన్స్ చిత్రానికి అవసరమైన కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లే అస్సలు లేని ‘ష్..” చిత్రాలు వచ్చాయి… పోయాయి. గతసంవత్సరం ‘నచ్చావులే’అనిపించిన రవిబాబు ధ్రిల్లర్ జాన్రాలో మళ్ళీ అమరావతి ప్రయత్నించి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ‘సత్యమేవజయతే’ చిత్రంతో అంతవరకూ ఘోస్ట్ దర్శకురాలిగావున్న జీవిత, భర్త రాజశేఖర్ ను డైరెక్ట్ చేసింది. సినిమా విఫలమయ్యింది. శశిరేఖాపరిణయం,మహాత్మ చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇక తన క్రియేటివిటీ అంతమయ్యిందేమో అనే సందేహాన్ని మిగిల్చారు.

ఈ సంవత్సరంలోనే అరడబ్బింగ్ చిత్రం ‘ఆకాశమంత’ అర్బన్ ప్రేక్షకుల్ని, కూతుళ్ళున్న తండ్రుల్ని ఆకట్టుకుంది. పేరుకు తగ్గట్టుగానే ‘గోపి గోపిక గోదారి’ పసలేకపోయినా వసలపూడి కథల మహత్యమో ఏమోగానీ ఉభయగోదావరిజిల్లాలలో మాత్రం కలెక్షన్ల పరంగా విజయఢంకా మ్రోగించింది. నాగార్జున కుమారుడు నాగచైతన్య ‘జోష్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ప్రేక్షకులు మాత్రం ముఖంచాటేసారు. ఈ సినిమాతో దర్శకుడుగా చాలా హోప్స్ తో ఆరంగేంట్రం చేసిన వాసువర్మ నిరాశపరిచాడు. అదే కోవలో పరిశ్రమలో దర్శకత్వం చెయ్యకముందే కాకలుతీరిన యోధులుగా పేరుగాంచిన ఆనంద్ రంగా, డాలీ కిషోర్ లు సిద్ధార్థ దెబ్బో…లేక వాళ్ళ అసలు ట్యాలెంట్ అంతేనో తెలీదుగానీ ‘ఓయ్’,‘కొంచెం ఇష్టం- కొంచెం కష్టం’తో కలవరపాటునే మిగిల్చారు. ఇలా కొత్తగా పరిచయమైన దర్శకులు రాశిపరంగా ఇబ్బడిముబ్బడిగా ఉన్నా, వాశిమాత్రం అటకెక్కింది.

గతసంవత్సరం ఒక సఫల ప్రయోగంగా నిలచిన ‘వినాయకుడు’ దర్శకుడు ఈసారి అదే ప్రయోగాన్ని అసెంబ్లీలైన్ ప్రొడక్షన్ చెయ్యొచ్చనుకుని, ‘విలేజిలో వినాయకుడు’ తీసి బోర్లాపడ్డాడు. ‘ఆర్య’ సినిమాని ఏ అంశాల కోసమైతే ప్రేక్షకులు చూశారో వాటన్నింటినీ పక్కనబెట్టి సైకో ఫిలాసఫీతో మరో ఆర్య(ఆర్య2) ని ప్రేక్షకుల ముందుకి సుకుమార్ తీసుకొచ్చాడు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసినా, పెట్టిన పెట్టుబడిమాత్రం రికవర్ కాని తింగరి పరిస్థితుల్లో ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ రెండుసినిమాలూ తెలుగులో సీక్వెల్ తరహా సంస్కృతికి శ్రీకారం చుట్టాయి. మొట్టమొదటిసారి ఒకపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ‘సలీం’ సినిమాకు పెట్టుబడిపెట్టింది. హీరో మార్కెట్ స్థాయికో, కథ-దర్శకుల స్థాయికో బడ్జెట్ పెట్టడం మానేసి కేవలం బడాయిలకోసం అక్షరాలా 24 కోట్లు పెట్టితీసిన ఈ చిత్రం రిలీజైనరోజే ఫ్లాప్ సినిమాల రికార్డులన్నీ బద్ధలు కొట్టి, అత్యుత్తమ ఫ్లాప్ చిత్రంగా నిలబడింది. భవిష్యత్తులో ఈ కార్పొరేట్ సంస్థ తెలుగు సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి భయపడేలా చేసింది.

తెలంగాణా-సమైక్యాంధ్ర ఉద్యమాల దెబ్బకు సినిమాలుకూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికే సినీపరిశ్రమ రెండుగా చీలినట్టు తెలుస్తోంది. భవిష్యత్తు ఎలావుంటుందో కాలమే చెప్పాలి. ఈ ఉద్యమాల ఊపుకు ఝడిసి చాలా రిలీజులు వాయిదా వేసుకోవడం జరిగింది. శేఖర్ కమ్ముల ‘లీడర్’ (సురేష్ బాబు తనయుడు రానా ఈ చిత్రంతో పరిచయమౌతున్నారు) అందులో ఒకటి.

“ఏమిటీ పరిస్థితీ?” అని సర్వత్రా చర్చలు యమజోరుగా సాగుతున్నాయి. ఫలితంమాత్రం శూన్యం. ఎందుకంటే…అన్ని చర్చలూ గుడ్డుముందా పిల్ల ముందా అనే పాయింట్ దగ్గర అగ్గి మీద గుగ్గిలాలైపోతున్నాయి. 2010 లోనైనా ఏమైనా జరుగుతుంది. మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుంటాయి అనేది ఒక ఆశమాత్రమే.

అది కలలా మిగిలిపోకూడదు అనిమాత్రమే ప్రస్తుతానికి కోరుకోగలం. కోరుకుందాం. తెలుగు సినిమా వర్ధిల్లాలి!

18 Comments
 1. Sankar gongati December 28, 2009 /
 2. karthik December 28, 2009 /
 3. Vanamali December 28, 2009 /
 4. Norman Bates December 28, 2009 /
  • JD December 28, 2009 /
  • UV December 28, 2009 /
   • రాజశేఖర్ December 29, 2009 /
 5. విజయవర్ధన్ December 29, 2009 /
 6. lalita December 30, 2009 /
 7. రవి December 31, 2009 /
 8. Raana January 2, 2010 /
  • srikanth January 6, 2010 /
 9. టి.యస్.కళాధర్ శర్మ January 12, 2010 /
 10. L.HANIMIREDDY associate director in movies January 21, 2010 /
 11. చైతన్య February 3, 2010 /