Menu

విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు

KB1“బాలచందర్ ” ఎందుకోగాని ఈ పేరు తల్చుకోగానే మనసు దిగులుగా అయిపోతుంది.  నన్నేడిపించిన సినిమాలన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో  కళ్ళముందు  గింగిరాలు తిరుగుతాయి.  సరిత, శ్రీదేవి , జయప్రద ,జయసుధ, సుహాసిని,మాధవి, జయలక్ష్మి ( ఫటాపట్)  …చక్కనమ్మలందరూ , దిగాలుగా నాకేసి చూస్తారు. చిరంజీవి,  కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు , ప్రకాష్ రాజ్  ఆయనే లేకపోతే మేం ఎక్కడా ? అని ప్రశ్నిస్తూ  నిలదీస్తారు .బాలచందర్ సినిమాలు ఎన్ని చూసానో గుర్తులేదుకాని ….అన్ని సినిమాలూ ఏడుస్తూ చూసాను. చూసి ఏడ్చాను. ఇంకెప్పుడూ చూడకూడదనుకుంటునే  , మళ్ళీ మళ్ళీ చూస్తాను, మళ్ళీ మళ్ళీ ఏడుస్తాను . కాకపోతే చిన్నప్పుడు  ఏడ్చి, ఏడ్చి …..ముక్కూ మొఖం ఏకం చేసుకొని,  అమ్మ చీర మొత్తం పాడుచేసేదాన్ని. ఇప్పుడు ఎంతైనా పెద్దైపోయాం కదా …..అందుకే కొంగు  అడ్డం పెట్టుకుని , కళ్ళలో నీరు బయటపడకుండా బేలన్స్ చేసుకుంటూ   …..ఇంకా వీలు కాకపోతే  చానెల్ మార్చడమో,  ఓయ్….వస్తున్నా అని ఎవరొ పిల్చినట్టు లేచి వెళ్ళిపోవటమో చేస్తాను.

అయినా ఈ డైరెట్రు  ఎందుకింత ఏడిపిస్తాడు. ప్రపంచంలో ఎన్నో అందమైన అనుభవాలు ఉండగా  ఈయన కష్టాలనీ, కన్నీళ్ళనీ  ఎందుకు మనమీద గుమ్మరిస్తాడు  , సినిమా చివర్లో హీరో, హీరోయిన్లని  కలిపేసి …పెళ్ళిచేసేసి  ఊటీ హానిమూన్ కి పంపేస్తే వాళ్ళు ఇంచక్కా అక్కడ కొండలమీద గుట్టలమీద  ఎగురుకుంటూ,పాటపాడుకుంటూ  ఒకరెనకాల ఒకరు పరిగెడుతుండగా ….,శుభం , కార్డు పడిపోతే  , ఎంచక్కా అక్కడితో  హాయిగా ఆ సినిమాని మర్చిపోవచ్చు. కానీ అలా జరగదు.

Akalirajyam

‘అకలిరాజ్యం ‘లో…..  కమల్ హాసన్ ని ఢిల్లీకి  కలెక్టర్ని చేసెయ్యొచ్చుకదా !
‘మరో చరిత్ర ‘ లో …. సరితకి కొత్తచీర కొనిచ్చి , కమల్ హాసన్ కి రెండు బేండేజీలు వేసి వాళ్ళిద్దరికి పెళ్ళి చేసెయ్యొచ్చుకదా!
‘అంతులేని కధ ‘లో  గుర్రం మీద చిరంజీవి వచ్చి , జయప్రదని ఎత్తుకెళ్ళిపోవచ్చుకదా!
‘ఇది కధకాదు ‘ లొ……   చిరంజీవి మంచోడయిపోయి  జయ సుధ ని   ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చుకదా!
‘కోకిలమ్మ ‘ ….. లో సరితని సినిమా హీరోయిన్  ని చేసెయ్యచ్చు కదా!
47 రోజులు సినిమాలో తనని ఇంటర్వూ చెయ్యటానికొచ్చిన  సరిత తో “‘కావాలనుకుంటే మీ సినిమాలో నా పాత్రకి పెళ్ళి చేసెయ్యండి అంటుంది ‘ ”  అది బాలచందర్ సినిమా కాకుంటే 47 రొజులు లో జయప్రదకి కూడ  పెళ్ళి అయిపోయుండేది  కదా!   (అబ్బా.. ఏంటీ పెళ్ళి గోల , ఏం చేస్తాం! ప్రేమ… పెళ్ళి, పగ…. ప్రతీకారం …ఇంతకన్నా ఏం విషయముంటుంది సినిమాల్లో …..అలాంటి సినిమాలు చూసీ, చూసీ ఇలా అయిపోయాం. )
గుప్పెడుమనసు ‘……. లో సుజాతని ఒప్పించి , సరితకి శరత్ బాబుకీ పెళ్ళి చేసెయ్యొచ్చుకదా,  ఆయనకిద్దరు వుంటే ఏంపోయింది. అనవసరంగా చంపెయ్యటం ఎందుకు!
ఎందుకేవిటీ ………అలా..అలా….శుభం కార్డు పడుంటే  ఈపాటికి ఆ సినిమాలు ఎప్పుడో మనం మర్చిపోయి వుండేవాళ్ళం .  ఇప్పటికీ  బురదలో ఏపిల్  చూస్తే , ఆకలిరాజ్యం గుర్తొస్తుంది.తిండి విలువ తెలుస్తుంది. ఆకలి బాధ అనుభవంలోకి వస్తుంది  . బీచ్ లో బండల్ని  చూస్తే  మరోచరిత్ర క్లైమేక్స్  గుర్తొస్తుంది. రోడ్డుమీద పిల్లలతో కష్టపడుతున్న  పేద స్త్రీని  చూస్తే  కోకిలమ్మ  గుర్తొస్తుంది.  కొందరు అమ్మాయిలని చూస్తే ……..వీళ్ళ జీవితాలు అంతులేని కధ కాకూడదు అనిపిస్తుంది.

anthuleni-kadha

అనుక్షణం కళ్ళముందు కదలాడే  జీవితాన్ని …..చూడలేనంటూ  కళ్ళుమూసుకోవటం  సాధ్యమేనా …అది ఎంత కలవరపెట్టేదైనా. అందుకేనేమో  వద్దనుకుంటునే చూస్తాను . మళ్ళీ మళ్ళీ చూస్తాను.
ఇక పాటల విషయానికొస్తే……..
ఆకలిరాజ్యం లో……”సాపాటు ఎటూలేదు పాటైనా పాడుబ్రదర్……”  ఎంత హిట్టో చెప్పక్కరలేదు
“కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ…….” రొటీన్ కి భిన్నంగా సాగే డ్యుయెట్ .
అంతులేని కధలో…..”.కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు …” పాట  , కళ్ళలో నీళ్ళు తెప్పించక మానదు.
“దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ ………ఇక ఇల్లేల ఓ చెల్లెలా……,”  వేదాంతం ద్వనించే పాట.
కోకిలమ్మ……”కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నదీ…కుహు కుహు అన్నది…..”
ఇది కధకాదు …..”సరిగమలూ…గలగలలూ…..”
“జూనియర్..జూనియర్….ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందరనీకు……. “( మిమిక్రీ పాట)
రుద్రవీణ లో ……”చెప్పాలని వుంది గొంతువిప్పాలని ఉంది…..”
“చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా….. ”
“తరలిరాద తనే వసంతం  ….తనదరికి రాని వనాలకోసం …….”  ఇవన్నీ ఎంత మంచి పాటలో.
బాలచదర్ సినిమాలకి ,ఎక్కువగా  ఎం. ఎస్ .విస్వనాధన్ , ఇళయరాజా సంగీతం అందించారు .

గుప్పెడు మనసు సినిమాలో ….బాలమురళి కృష్ణ   పాడిన పాట  మౌనమె నీ భాష ఓ మూగ మనసా……. తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు…….కల్లలు కాగానే కన్నీరౌతావు …….మనసుని  అద్దంలో చూపించే ఈ పాట నాకెంతో ఇష్టమైనపాట,

మరో చరిత్రలో పాటలగురించి చెప్పాల్సిన పనేలేదు.

బాలచదర్ సినిమాల్లో పాత్రలెంత ఏడిపిస్తాయో…….పాటలు కూడా అంతే లోతుగా గాయం చేస్తాయి.
సహజత్వానికి దగ్గరగా ఉండేకధలు, కధలకు తగ్గ పాత్రలు ,పాత్రలకు ప్రాణం పోయగల నటీ నటులు , మనుషుల్లో ఉండే భావావేసాలు, మానవ సంబంధాల్లోని అనేక కోణాలూ…….  మరచిపోలేని ముగింపు , ఇవే  బాలచందర్ సినిమా ప్రత్యేకతలు  . మనచుట్టూ ఉండే సమాజికాంసాలే ఇతివృత్తాలు  .

బాలచందర్ బాణీకి  కొంచెం భిన్నంగా ఉన్న సినిమాలు……డ్యుయెట్ , ఆడాళ్ళూ మీకు జోహార్లు, బొమ్మా బొరుసు, ఇవి కాస్త కామెడీ టచ్ ఉన్న కధలు.

చిత్రానికి ,కధకు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టి, చిరంజీవి సినిమాల్లోకెల్లా బెస్ట్ గా నిలిచిన రుద్రవీణ కూడా బాలచదర్ సినిమాల్లో కాస్త ప్రత్యేకమైనదే  ( ఇందులో కధకి ఆధారమైన బలమైన  …  స్త్రీ పాత్ర లేదు కదా!)

బాలచందర్ “గొప్ప దర్శకుడు “. మట్టిలోని మాణిక్యాన్ని గుర్తించి సాన పెట్టి మెరిపించగల నేర్పరి.  నలుపు తెలుపుల్లోనే …జీవితంలోని అన్ని రంగుల్నీ  చూపించి ప్రేక్షకుల్ని మై మరపింప చేసాడు  .    ఏడిపిస్తే ఏడిపించాడు కానీ….. ఒక్కో సినిమాలో ఒక్కో జీవితాన్ని చూపించాడు. మరపురాని బాధను మిగిల్చాడు

రచన: లలిత.దాట్లనా స్పందన

43 Comments
 1. badri November 9, 2009 /
  • tamilan November 10, 2009 /
 2. padmarpita November 9, 2009 /
 3. venky November 9, 2009 /
 4. అబ్రకదబ్ర November 10, 2009 /
  • Dr.MV.Ramanarao September 7, 2010 /
 5. teja November 10, 2009 /
 6. సుజాత November 10, 2009 /
  • Sowmya November 10, 2009 /
 7. సతీష్ కుమార్ కొత్త November 10, 2009 /
  • అబ్రకదబ్ర November 10, 2009 /
  • G November 10, 2009 /
   • సతీష్ కుమార్ కొత్త November 11, 2009 /
 8. సుజాత November 10, 2009 /
  • శంకర్ November 10, 2009 /
   • G November 10, 2009 /
 9. MBS Prasad November 10, 2009 /
  • శంకర్ November 10, 2009 /
 10. అరిపిరాల November 10, 2009 /
  • Sai Brahmanandam Gorti November 11, 2009 /
   • జంపాల చౌదరి September 4, 2010 /
 11. venky November 10, 2009 /
  • G November 10, 2009 /
   • badri November 10, 2009 /
   • G November 10, 2009 /
 12. Vasu November 10, 2009 /
 13. అబ్రకదబ్ర November 11, 2009 /
 14. Sai Brahmanandam Gorti November 11, 2009 /
  • Manjula November 12, 2009 /
 15. లలిత November 11, 2009 /
 16. Srilalita November 12, 2009 /
 17. శ్రీనివాస్ September 3, 2010 /
 18. జంపాల చౌదరి September 4, 2010 /
  • విజయవర్ధన్ September 4, 2010 /
   • V. Chowdary Jampala September 7, 2010 /
   • విజయవర్ధన్ September 7, 2010 /
   • జంపాల చౌదరి September 7, 2010 /
 19. విజయవర్ధన్ September 7, 2010 /
 20. శారద September 8, 2010 /
 21. RAJA December 21, 2012 /