Menu

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదటి మాటల ( టాకీ ) సినిమా తీసి సుమారు 77 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలోనూ తెలుగు సినిమా అనేక సాంకేతిక హంగులు సంతరించుకొనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సినిమాలు తీసే భాషా చిత్రాల సరసన చేరింది. ఇంతవరకూ వందల కొద్దీ దర్శకులు పుట్టుకొచ్చారు. అనేక చిత్రాలు తీసారు. ఈ దర్శకుల జాబితా సరిగ్గా పరికిస్తే ఈ దర్శకుల్లో అధిక శాతం పురుషులే! నటులు వేషం మార్చి దర్శకులయ్యారు. రచయితలూ రూపాలు మార్చారు. ఫొటొగ్రాఫర్లూ సవ్యసాచులయ్యారు. కానీ నటీమణులు మాత్రం చాలా వరకూ నటనకే పరిమితమయ్యారు. అతి కొద్ది నటీమణులు మాత్రమే దర్శకత్వం వైపు దృష్టి సారించారు. అత్యంత ప్రతిభావంతులైన నటీమణులు తెలుగు సినిమాల నుండి వచ్చినా, పాటలు పాడడం, సంగీతం చేపట్టడం వరకే పరిమితమయ్యారు తప్ప దర్శకత్వం వైపు కన్నెత్తి చూడలేదు. వీటికి కారణాలూ, సమస్యలూ, పరిమితులూ అనేకం వున్నాయని అందరికీ తెలిసినా, కొంతమంది ఎంతో సాహసం చేసి తాముకూడా దర్శకత్వం చెయ్యగలమని నిరూపించారు. అలా నిరూపించడమే కాకుండా కొన్ని విజయ వంతమైన సినిమాలు తీసి చరిత్రపుటల్లోకి ఎక్కారు. ఈ 77 ఏళ్ళ చరిత్రలోనూ కేవలం ఆరుగురంటే ఆరుగు మాత్రమే తెలుగు మహిళా దర్శకులున్నారు. ఇది మాత్రం నమ్మశక్యం అనిపించదు. అసలు వీరెవరూ? ఏ ఏ సినిమాలకి దర్శకత్వం వహించారూ? ఏ ఏ రికార్డులు బద్దలు కొట్టారు? వర్ధమాన దర్శకురాళ్ళెవరూ? వంటి విషయాలు తెలుసుకుందాం.

భానుమతీ రామకృష్ణ

తెలుగు సినిమా నిఘంటువులో బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే అర్థం ఏమిటి? అని ఎవరైనా అడిగితే చటుక్కున సగటు తెలుగు సినిమా ప్రియులకి తట్టే పేరు భానుమతీ రామకృష్ణ. ఈవిడకి పేరుకి పరిచయం అక్కర్లేదు. బహుశా భారద్దేశం మొత్తంలోనూ ఇటువంటి ప్రతిభ కల సినిమా వ్యక్తి, అందులోనూ మహిళ, లేరంటే అతిశయోక్తి కాదు. కేవలం నటన మాత్రమే కాకుండా, కథా రచన, స్క్రీన్‌ప్లే, సంభాషణలూ, గానం, సంగీతం, ఎడిటింగ్, స్టూడియో నిర్వహణా, ఇలా ప్రతీ ముఖ్యమైన విభాగంలోనూ ఆవిడ తన ప్రతిభని చూపించారు. ఈవిడ తెలుగూ, తమిళం రెంటిలోనూ కలిపి సుమారు 14 సినిమాలకి దర్శకత్వం వహించారు. తమిళ సినిమాలు మినహాయిస్తే, తెలుగులో దర్శకత్వం వహించిన చండీరాణి, గృహలక్ష్మి, అంతా మన మంచికే, విచిత్ర వివాహం, అమ్మాయి పెళ్ళి, ఒకనాటి రాత్రి, రచయిత్రి, భక్త ధృవ మార్కండేయ, మనవడి కోసం వంటి జాబితా వుంది. వీటిలో కొన్ని సినిమాలు విజయవంతమయ్యాయి కూడా. ఈవిడ దర్శకత్వంలో ఎన్.టి.రామారావు కూడా నటించాడు. ఆ సినిమా పేరు అమ్మాయిపెళ్ళి. అంతగా విజయవంతంకాకపోయినా ఈ సినిమాలో ఇద్దరూ భార్యాభర్తలుగా నటించారు. మొత్తం అందరూ బాలలు నటించిన సినిమా తీసిన ఘనత కూడా ఈవిడకుంది. ఆ సినిమా భక్త ధృవ మార్కండేయ. ఈవిడకే మరో రికార్డు కూడా వుంది. భారతదేశపు మొట్ట మొదటి సారిగా మూడు భాషల్లో ( తెలుగు, హిందీ, తమిళం ) ఒకే చిత్రానికి దర్శకత్వం వహించిన రికార్డు కూడా వుంది. ఆ సినిమా చండీరాణి. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు ఈవిడ దర్శకత్వంలో నటించారు. వివిధ రంగాల్లో భానుమతికున్న ప్రతిభకి సమతూగే గలిగే పురుషులు కూడా ఎవరూ లేరనే చెప్పచ్చు. చండీరాణి సినిమా 1953లో వచ్చింది. అప్పట్లో హేమాహేమీలనబడే వ్యక్తులందరికీ ధీటుగా ఒక మహిళ దర్శకత్వం చేయడం సాహసమనే చెప్పాలి. తెలుగులో మొట్టమొదటి మహిళా దర్శకురాలిగా ఈవిడ పేరు నిలబడిపోతుంది. తను రాసిన “అత్తగారు” కథల్ని సినిమాగా తీయాలని ఉందనీ, అదొక్కటీ చేసుంటే బాగుండేదనీ, ఆవిడ చివరి రోజుల్లో పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. తెలుగు వారు గర్వించదగ్గ మహిళా దర్శకుల్లో భానుమతి స్థానం మొదటిదే! దర్శకత్వంలో మహిళా శకానికి నాందీ, పునాదీ భానుమతి. ఈవిడ అసాధ్యురాలే కాదు, పదిమందికీ ఆదర్శప్రాయం కూడా.

జి.వరలక్ష్మి

భానుమతి సినీరంగ ప్రవేశం చేసి ఓ వెలుగు వెలిగిన కాలంలోనే మరో మహిళకూడా తెలుగు, తమిళ సినిమా రంగాల్లో చాలా పేరు తెచ్చుకుంది. ఆమె జి.వరలక్ష్మి. భానుమతి లాగానే ఈవిడక్కూడా ప్రతిభలోనూ, పెత్తనం చెలాయించడంలోనూ, ధైర్యంలోనూ చాలా పేరుంది. నాటకాల ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన జి.వరలక్ష్మి నటిగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ప్రముఖ దర్శకుడు కె.యె.ప్రకాశరావు భార్య ఈమె. నటిగా వైవిధ్యమైన పాత్రలు ధరించిన ఈవిడ 1968 ప్రాంతంలో మూగ జీవులు అనే సినిమాకి దర్శకత్వం వహించింది. ఈ మూగ జీవులు సినిమాలో హీరోయిన్ సావిత్రి. ఈ సినిమా ఎక్కడా ఆడలేదు. ఈ సినిమా దర్శకత్వం చేసి అపజయం మూటకట్టుకునా, దర్శకురాలిగా బాగానే చేసిందనీ విమర్శకులందరూ మెచ్చుకున్నారు. సరిగ్గా ఆ ఏడాదే మరో ప్రఖ్యాత తెలుగు నటీమణి కూడా దర్శకత్వం వైపు దృష్టి సారించింది. ఆవిడెవరో కాదు ఆంధ్రుల ఆరాధ్య నటీ, మహానటీ.

సావిత్రి

నటనకి పర్యాయపదంగా తెలుగు సినిమా రంగంలో సావిత్రి పేరు దర్జాగా చెప్పుకోవచ్చు. తన అభినయంతో తెలుగు సినిమాకే వన్నె తెచ్చిన ఈ నటీమణి కూడా దర్శకత్వం అంటే మోజు చూపించింది. తనకున్న అసాధారణ నటనా ప్రతిభతో తనూ ఒక దర్శకురాలిని కావచ్చనీ నమ్మింది. ఆవిడ నమ్మకాన్ని ఆశీర్వదించి ప్రోత్సహించిందెవరో కాదు, మరో ఇద్దరు మహానటులు ఎస్వీ రంగారావూ, ఎన్.టి.రామారావూ, నిర్మాత డి.మధుసూదన రావూ. సుమారు 1968లో సావిత్రి చిన్నారి పాపలు అనే సినిమాకి దర్శకత్వం వహించింది. భానుమతి చండీ రాణిలా ఈ సినిమాకీ అనేక ప్రత్యేకతలున్నాయి. చిన్నారి పాపలు సినిమాకి ముఖ్యమైన సాంకేతిక విభాగాలకి (ఫొటోగ్రఫీ, పాటలూ మినహాయించి ) పనిజేసిన వారందరూ మహిళలే! మరో ప్రముఖ గాయని పి.లీల సంగీత దర్శకత్వం వహిస్తే, ఈవిడకి ఎస్.పి.కోదండపాణి సహాయం అందించారు. శ్రీమాతా పిక్చర్స్ బ్యానర్ తో వి.సరోజిని, సావిత్రి నిర్మాతలుగా చిన్నారు పాపలు సినిమా తీసారు. ఈ సినిమాకి కథ సరోజిని సమకూరిస్తే, కళా దర్శకత్వం మోహన అనే ఆవిడ చేసారు. మరో ప్రముఖనటి రాజ సులోచన నృత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించిన వి.సరోజిని రెండు పాటలు కూడా రాసారు. మిగతావి ఆరుద్ర,కొస రాజు, సి.నా.రె రాసారు. ఈ సరోజిని ఎవరో కాదు, మరో ప్రముఖ దర్శకుడు వి.మధుసూదన రావు భార్య. ఇలా పలు ప్రముఖ శాఖలూ మహిళలే చేపట్టి, సినిమా తీయడం భారత చలన చిత్రరంగంలో అదే ప్రధమం. ఇదీ ఈ సినిమాకున్న ప్రత్యేకత. ఈ సినిమాలో సావిత్రి కూడా చిన్న పాత్ర చేసింది. షావుకారు జానకి హీరోయిన్‌గా, జగ్గయ్య హీరోగా ఈ సినిమా వచ్చింది. ఇప్పటి హీరో తరుణ్ తల్లి నటి రోజా రమణి కూడా ఈ చిన్నారి పాపలు సినిమాలో నటించింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఘోరంగా అపజయం చవిచూసింది కానీ, సావిత్రికి దర్శకురాలిగా బాగా చేసిందన్న పేరొచ్చింది. మొదట్లో ఈ సినిమాకి చిన్నారి మనసులు అని పేరు పెట్టారు. అలాగే ప్రచారం కూడా చేసి, చివర్లో చిన్నారి పాపలుగా మార్చారు. యాదృచ్ఛికంగా దర్శకురాలిగా మారిన సావిత్రి ఆ తరువాత మరో నాలుగు సినిమాలకి దర్శకత్వం వహించింది. చిన్నారి పాపలు సినిమా ప్రివ్యూకి వచ్చిన ఎన్.టీ.రామారావు సావిత్రిని మెచ్చుకొని రెండో సినిమాలో తను తప్పక నటిస్తానని మాటచ్చినట్లుగా అప్పట్లో రాసారు. ఈ సినిమా తరువాత చిరంజీవి అనే సినిమాక్కూడా సావిత్రే దర్శకత్వం వహించింది. ఈ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఆతరువాత ఎన్.టి.రామారావు హీరోగా మాతృదేవత సినిమాకి దర్శకత్వం వహించింది. ఈ సినిమా బాగానే ఆడింది. మంచి పేరే వచ్చింది. ఈ సినిమాలో “మనసే కోవెలగా మమతలు మల్లెలుగా” అనే పాట అప్పట్లో అతి పెద్ద హిట్ సాంగ్. ఈ సినిమా తరువాత వింత సంసారం అనే సినిమాకి దర్శకత్వం వహించింది. ఈ సినిమా 1971 ప్రాంతంలో రిలీజయ్యింది. ఆర్థికంగానూ, కుటుంబపరంగానూ వచ్చిన చిక్కుల వల్ల సావిత్రి సినీ జీవితం కిందకు పడిపోయింది. అందువల్ల నటనకే పరిమితమయ్యి, దర్శకత్వం వైపు మరలా చూడ లేదు. ఇవి కాక తెలుగులో అతి పెద్ద హిట్ చిత్రం మూగ మనసుల్ని తమిళం లో ప్రాప్తం పేరుతో స్వీయ దర్శకత్వంలో తీసింది. ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ సినిమా తీయడానికి అయిదేళ్ళు పట్టింది. చివరికెలాగో చచ్చీచెడీ విడుదల చేసారు. అతిఘోరంగా ఈ సినిమా దెబ్బతింది. వారం రోజులు కూడా ఎక్కాడా ఆడలేదు. నటనలో ఉన్నత శిఖరాలనధిరోహించిన సావిత్రి, దర్శకత్వంలోనూ చిన్నారి పాపలు సినిమాతో తనదైన ముద్ర వేసింది. దర్శకురాలిగా కంటే నటిగానే సావిత్రిని అందరూ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే నటనకే ఆవిడ కంఠాభరణం.

విజయ నిర్మల

తెలుగులో అత్యధిక సినిమాలకి, ఆ మాటకొస్తే భారతదేశం మొత్తానికీ, ఇంకాస్త గట్టిగా అంటే – యావత్తు ప్రపంచంలోనూ అతి యెక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల పేరు చెప్పుకోవాలి. ఈవిడ పేరు గిన్నిస్ బూక్ ఆఫ్ రికార్డ్స్ లోక్కూడా ఎక్కింది. బాలనటిగా చిత్ర రంగం ప్రవేశించిన విజయనిర్మల దాదాపు నలభైకి పైగా సినిమాలకి దర్శకత్వం వహించింది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో తీసిన సినిమాలకి ఈవిడ దర్శకత్వం వహించింది. సుమారు 1965-70 ప్రాంతాల్లో తెలుగు కథా సాహిత్యంలో ఆడవాళ్ళే రాజ్యం ఏలుతున్న రోజులవి. యద్దనపూడి సులోచనా రాణి, కోడూరి కౌసల్యాదేది, మాదిరెడ్డి సులోచన, లత, రంగనాయకమ్మ వంటి ప్రముఖ రచయిత్రులు పత్రికా రంగాన్ని ఒక ఊపు ఊపు తున్న సమయంలో సులోచనారాణి రాసిన అతి ప్రాచుర్యం పొంది, సీరియల్ గా వస్తున్న మీనా నవలని తెరకెక్కించి సాహసం చేసిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల పేరు చెప్పుకోవచ్చు. మీనా సినిమా చాలా పెద్ద హిట్. ముఖ్యంగా సంగీత పరంగా కూడా చాలా పేరొచ్చింది. “శ్రీరామ నామాలు శతకోటి”, “పెళ్ళంటే నూరేళ్ళ పంట”, “మల్లె తీగ వంటిది మగువ జీవితం” వంటి మంచి పాటలున్నాయి. ఈ సినిమాకి మ్యూజికల్ హిట్ గా మంచి పేరొచ్చింది. రమేష్ నాయుడి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. మీనా విజయవంతంతో విజయనిర్మలకి బాగా పేరొచ్చింది. ఆ తరువాత శంఖుతీర్థం, కవిత, దేవుడే గెలిచాడు, సంఘం చెక్కిన శిల్పాలు, రాం రాబర్ట్ రహీం, దేవదాసు వంటి సినిమాలకి దర్శకత్వం వహించినా మీనా సినిమా కొచ్చిన పేరు రాలేదు. నలభై సినిమాలకి దర్శకత్వం వహించినట్లుగా లెక్కకి చెప్పుకోవడమే కానీ అందులో ఒకటీ అరా హిట్ సినిమాలు తప్ప దర్శకత్వంలో రాణించినట్లుగా కనిపించదు. “అంతంకాదిది ఆరంభం” సినిమా ( కన్నడ మాతృక ) తప్పించి పేరొచ్చిన సినిమాలు తక్కువే!

వీళ్ళూ ఉన్నారు

ఈ మధ్య కాలంలో టీవీ సీరియల్స్ పేరొచ్చిన మంజులా నాయుడు టీవీ నుండి చిత్ర రంగ ప్రవేశం చేసి “కనులు మూసినా నీవాయే” అనే సినిమా తీసారు. ఆ సినిమా వచ్చిందీ. వెళ్ళిందీ. ఈ విషయం అందరికీ తెలుసు. అలాగే జర్నలిస్టుగా పనిజేసీ, రచయిత్రిగా పేరు తెచ్చుకొన్న బి.జయ “చంటిగాడు” అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇలా పలానా సినిమాకి దర్శకత్వం చేసారూ, పనిజేసారూ అని లెక్కకి చెప్పుకోవడానికే తప్ప ప్రత్యేకించి చెప్పుకోడానికేం లేదు. ‘శేషు’ అనే రీమేక్ చిత్రంతో జీవితా రాజశేఖర్ దర్శకత్వానికి శ్రీకారం చుట్టింది. (వ్యాఖ్యరూపంలో జీవిత ను గుర్తుచేసిన మోహన్ రాజ్ గారికి ధన్యవాదాలు).

manjulanaidu1
Jaya100109_1c

వీళ్ళందర్నీ కలుపుకుంటే తెలుగు సినిమాలో వున్న మహిళా దర్శకులు ఏడుగురన్నమాట. తెలుగు సినిమా రంగమనే కాదు యావత్తు భారతీయ సినిమా రంగంలో కూడా అతి తక్కువగా మహిళలు దర్శకత్వం అంటే ఇష్టపడుతున్నారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన అపర్ణా సేన్, మీరా నాయర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అపర్ణా సేన్ దర్శకత్వంలో వచ్చిన “36 చౌరంఘీ లేన్” చాలా మంచి సినిమా. అనేక అంతర్జాతీయ అవార్డులు గెల్చుకుందా సినిమా. అలాగే హిందీలో మరో ప్రతిభావంతురాలైన దర్శకురాలు సాయి పరాంజపే. ఈవిడి తీసిన “చష్మే బద్దూర్”, “కథ” వంటి చక్కటి సినిమాలు తీసింది. ఈ మధ్యనే వచ్చిన “ఓం శాంతి ఓం” దర్శకురాలు ఫరా ఖాన్ కూడా అందరికీ తెలుసు.

వీళ్ళు కాకుండా మరోనటి సుహాసిని కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నా తమిళంలో (ఇందిర) దర్శకత్వం చేసారని అందరికీ తెలుసు. మరో తమిళ-తెలుగు నటి రేవతి ‘మిత్ర్ మై ఫ్రెండ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

మరో ప్రముఖ నటీమణి కళ్యాణి కూడా దర్శకత్వం చేస్తానని ఈ మధ్యే ప్రకటించారు.

కేవలం నటనతోనే సరిపెట్టుకుంటున్నారు చాలామంది నటీమణులు. కాస్త గ్లామర్ తగ్గితే వీళ్ళకి అవకాశాలు రావు. హీరోలయితే అలా కాదు. అరవయిలు దాటినా, కాలేజ్ కెళ్ళే పాత్రలు వేయడానిక్కూడా ఏమాత్రం సంకోచించరు. అయినా హీరోల్లోకూడా దర్శకత్వశాఖ వైపు ఆసక్తి కనబరుస్తున్న నటులు కూడా చాలా తక్కువేనని చెప్పచ్చు. ఏదేమయినా మహిళలు మిగతా సాంకేతిక రంగాలలో పురోగతి సాధించినట్లుగానే, ఈ సినిమారంగంలో కూడా దర్శకత్వశాఖలో బాగా రాణించే అవకాశాలున్నాయి. కాకపోతే గట్టిగా ప్రయత్నించాలంతే! సినిమా అన్నది సమిష్టి కృషి కాబట్టి అందులో ప్రతీ విభాగంలోనూ కాస్తో కూస్తో పరిజ్ఞానం లేకపోతే రాణించడం కష్టం. ఇది ఆడవాళ్ళకే కాదు. మగవాళ్ళకీ వర్తిస్తుంది. కాదని ఎవరనగలరు చెప్పండి?

–సాయి బ్రహ్మానందం గోర్తి

22 Comments
  • Vasu November 9, 2009 /
   • Vasu November 10, 2009 /
 1. VENKAT BALUSUPATI November 9, 2009 /
 2. mohanrazz November 9, 2009 /
 3. శంకర్ November 9, 2009 /
 4. మిత్రుడు November 9, 2009 /
  • మిత్రుడు November 9, 2009 /
  • jatardamal November 9, 2009 /
 5. Sai Brahmanandam Gorti November 9, 2009 /
 6. Chetana November 9, 2009 /
 7. అబ్రకదబ్ర November 9, 2009 /
 8. Sai Brahmanandam November 9, 2009 /
 9. Srinivas November 10, 2009 /
 10. Sai Brahmanandam November 10, 2009 /
 11. pappu November 11, 2009 /
 12. Sreenivas Paruchuri November 15, 2009 /
  • Sai Brahmanandam Gorti November 18, 2009 /