Menu

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు..

spనా తొలి పాట రికార్డింగ్ జరిగిన రోజు దాదాపు నా సంగీత(చిత్ర)జీవితానికే తొలి నాడు. ఆ నాటి ముచ్చట్లు ఏ నాటికీ నేను మరచిపోలేని పన్నీటి జల్లులు,ఆనాడు నేను పాడేందుకు అవకాశం కలిగించినవి..ఆ నాటికి ముందు జరిగిన ఎన్నో విశేషాలు…

1964 జూన్ లో మద్రాసు సోషల్ అండ్ కల్చరర్ క్లబ్ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీలో నేను పాల్గొన్నాను. నాటి ఆ  పోటీకి మేటి సంగీతజ్ఞులు,సంగీత దర్శకులు అయిన శ్రీ ఘంటసాల, శ్రీ పెండ్యాల శ్రీ సుసర్ల దక్షిణామూర్తి న్యాయ నిర్ణేతలు. అదృష్టవశాత్తు నాకు మొదటి బహుమతి లభించింది. నాడు నా పాట విన్న శ్రీ కోదండపాణికి నా గాత్రం,నేను పాడే పద్దతి నచ్చింది. అవకాశం వస్తే,అప్పటికి ఒకింత లేతగా ఉన్న నా గాత్రం కాస్త ముదిరితే..నా చేత చిత్రాల్లో పాడిస్తానన్నారు. నేను సంగీత సాధన చేస్తూ, అడపా దడపా ఆయన్ను కలుసుకుంటూండే వాడ్ని.

శ్రీ కోదండపాణి నా కోసం వివిధ సంస్ధలలో అవకాశం కోసం ప్రయత్నించారు. దాదాపు రెండేళ్ళు నిరీక్షణలో గడిచిపోయాయి. 1966 డిసెంబర్ లో ఆయన నాకు కబురు పంపారు. వెంటనే కలుసుకోమని. అది రేఖా అండ్ మురళీ వారి తరుపున. అక్కడికి వెళ్ళాను. ఏదైనా పాట పాడమన్నారు. నేనే వ్రాసి,సంగీతం సమకూర్చుకొనిన రాగమూ-అనురాగమూ అన్న పాట పాడాను. విని, మరొకటి పాడమన్నారు. దోస్తీ లోని రఫీ పాడిన జానే వాలో జరా పాడాను. నాకు మొదటి నుంచీ ఒక బలహీనత() ఉన్నది. ఏ పాట విన్నా, విన్నది విన్నట్టు పాడక కొద్దిగా మార్చి స్వంత సంగతులు,గమకాలు వేసి నా పద్దతిలో పాడుకునే అలవాటే ఆ బలహీనత. ఆ బలహీనత ఈ పాట(దోస్తీది)లో కనపడింది. అది శ్రీ కోదండపాణికి నచ్చింది. మరొక సారి పాట పాడించుకొని విన్నారు.

ఈ లోగా శ్రీ పద్మనాభం అక్కడికి వచ్చారు. తిరిగి జానే వాలో జరా పాడమన్నారు. పాడాను. ఆ పాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చడంతో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథ చిత్రం లోని వీటూరి వ్రాసిన ఏమి ఈ వింత మోహం అన్న పాట పాడే అవకాశం వచ్చింది. మరుసటి దినం నుంచి రిహార్సల్స్. వారం రోజుల పాటు ప్రతీ రోజూ రేఖా అండ్ మురళీ వారి కార్యాలయానికి వెళ్ళడం. ఆ పాటను మొదటి నుంచి చివరి దాకా పాడటం నా కర్తవ్యం అయిపోయింది. చివరికి ఆ పాట నలుగురు పాడేదని తెలిసింది. నాతో బాటు ఎవరు పాడుతారో ఏమో నని భయం కలిగింది. ఆ పాటను మాల్కోస్,యమన్ కళ్యాణి,భాగేశ్వరి మొదలైన రాగాల మాలికగా రూపొందిచారు శ్రీ కోదండపాణి. ఆయన తత్వానికి నేనింకా కొత్త వాడ్ని. పొగిడినప్పుడు మొహం మీద ఎలా పొగిడేస్తారో,తెగడవలసి వచ్చినప్పుడు అంతే నిర్మహమాటంతో తెగుడుతారు ఆయన. అటువంటి ఆయన నేను తప్పుగా పాడితో ఏమంటారో నన్న భావం కలిగింది.

నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలినాటి ముచ్చట్లు పేరుతో జూలై 1970 సినిమా రంగం సంచికలో వచ్చింది. అప్పటి ఆ పత్రిక చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సినిమా పత్రికంటే అదేనపిస్తుంది. అది నడిపింది శ్రీ  జి.వి.జి గారు. ఈ ఆర్టికల్ ని ఎస్పీ గారి మిత్రులు (గాయకులు) తిరుపతి పి.ఎస్.గోపాలకృష్ణ గారు సేకరించి సమర్పించినట్లుగా రాశారు.

ఇక ఎస్పీ అనుభవాలు-2 త్వరలో…

8 Comments
  1. అబ్రకదబ్ర November 5, 2009 /
  2. pappu November 5, 2009 /
  3. సతీష్ కుమార్ కొత్త November 5, 2009 /
  4. వల్లి November 5, 2009 /
    • స్నేహిత్ June 2, 2010 /