Menu

పెళ్ళిపుస్తకం – పునర్దర్శనం

pellipustakamఅనుకోకుండా, రెండ్రోజుల క్రితం “పెళ్ళిపుస్తకం” సినిమా చూశాను. చూసిందే అయినా, ఇప్పుడు కొత్తగా అనిపించింది. ఒకప్పుడు “కాబోలు” అని వదిలేసినవి, పెళ్ళయ్యాక చూడ్డంతో, కొత్త వెలుగులో కనబడ్డాయి – భార్యా భర్తా తగాదాల వంటివి . దానితో, మరోసారి ఈ సినిమాను తల్చుకున్నట్లు ఉంటుందని, ఈ వ్యాసం.

కథ: మిస్సమ్మని తిరగేసి రావికొండల్రావుగారు ఈ కథ రాసారని ఇదివరలో నవతరంగంలోనే చదివేసి ఉంటారు కదా. మా సినిమాలు అని బాపు గారి వ్యాసాల్లో… ఈ విషయం చదివేదాకా నా బుర్రలో “ఓ ఇది మిస్సమ్మ కథే కదా..” అన్న విషయం వెలగలేదంటే, అది “పెళ్ళిపుస్తకం” అంత బా తీసినందుకే. పాత కథే అయినా, కొత్త చాయలతో. సినిమా చూస్తూ ఉంటే అనిపించింది – “పెళ్ళిపుస్తకం” ఎవర్గ్రీన్ అని. ఎప్పుడో పదిహేనేళ్ళనాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళ జీవితాలను చిత్రిస్తూ తీసిన కథ – ఇప్పుడు కూడా అది చూస్తూ ఉంటే, అతి సహజమైన, పక్కింటి ఎదిరింటి (అంతెందుకు, మనింటి) కథలాగే ఉంటే, ఎవర్గ్రీన్ అనక వేరే ఏమనను?

కథ మొదలైన పెళ్ళిచూపుల సీను – పదిహేనేళ్ళ క్రితం పెళ్ళిచూపులు అలా జరిగే అవకాశం ఎంతుందో మరి  ఇప్పుడైతే, కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు గానీ. సరే, అలా అయితే, ముందు చెప్పింది మారుస్తున్నాను – అప్పుడు ఏ గ్రీనో నాకు తెలీదు కానీ, ఇప్పుడు చూస్తే, ఎవర్గ్రీన్ అనిపించింది. అప్పటికి అలాంటి దృశ్యాలు అసహజం అనిపించి ఉండొచ్చు – నేను ప్రైమరీ స్కూల్లో ఉండేదాన్ని కనుక, ఆట్టే తెలీదు జనం స్పందనలు.
పెళ్ళిసీన్లో పాట – “శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం – ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం” అని మొదలై, “తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా…తాలి బొట్టు మెడనుకట్టి బొట్టు పెట్టినా… సన్నికల్లు తొక్కినా సప్తపది మెట్టినా… మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం…” – అని పెళ్ళి తంతుని విశ్లేషించి, “అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో.. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో… ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని…మసకేయని పున్నమిలా మనికినింపుకో…” – అని ముగించినప్పుడే, ఈ సినిమా ఫిలాసఫీ, అలాగే, పెళ్ళి కాబోతున్న వారికి కావాల్సిన తొలి ఉపదేశం చెప్పారు.

ఇదే అర్థం సినిమా ఆద్యంతమూ కనిపిస్తూనే ఉండింది. అదేలెండి, నేపథ్యంలో పాటా, సంగీతం తదనుగుణంగా వినిపిస్తూ ఉంటాయి అనుకోండి. “జగదానంద కారక” – వస్తున్నప్పుడు, గుమ్మడి ఇంట్లోకి వస్తున్నాడని కారు చప్పుడు ద్వారా తెలియగానే, ఆయన భార్య గబగబా లేచి వెళ్ళి, ఆయనకి మంచినీళ్ళందించి, క్షేమసమాచారాలడిగి, ఆ తర్వాత మళ్ళీ పన్లో పడ్డం – అదీ టిపికల్ ఇండియన్ వైఫ్! ఆయన వచ్చేంత దాకా కూడా, మనసులో కొంత ధ్యాస తలుపు వైపు, ఓ చెవి కారు శబ్దం వినేందుకు – ఒక్క డైలాగన్నా లేకుండానే, భార్య అన్న మనిషి భర్త గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పారు – నాకు చాలా నచ్చింది.

అలాగే, రాజేంద్రప్రసాద్, దివ్యవాణిల మధ్య ఉండే కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపాలే కాదు – నవ్వులు, ఆనందాలు : అన్నీ చాలా సహజంగా అనిపించాయి. సినిమాల్లో దైనందిన సంగతుల్ని చూస్తే, లాజికల్లీ స్పీకింగ్ బోరు కొట్టాలి – ఎందుకంటే, అవన్నీ మనం రోజూ చూశేవే కనుక. కానీ, ఇక్కడ బోరు కొట్టలేదు. ఎందుకంటే, చూపించింది బాపూ కనుక. రాసింది రమణ గారు కనుక 🙂 ఒక్కో చోట – కళ్ళతో సంభాషించుకోడం, మౌనం మాట్లాడ్డం – ఎంత బాగా చూపుతారంటే – అసలు మాటెందుకు మనిషికి? మాట ఉంటే మాత్రం ఇంత అందంగా సంభాషించగలదా? అనిపిస్తుంది. అలాగే, అందరిళ్ళలో కనబడే కథని, చక్కటి ఎంటర్టైనింగ్ హాస్యంతోనూ, కొంత డ్రామాతోనూ మేళవించి – మొత్తానికి సినిమా కథ గా చేశారు అనమాట. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది – ఓ కథని సినిమా తెరపై చూపాలంటే – ఎంత తతంగమో కదా..అని. అంతే కాదు, ఓ నిజజీవితపు కథని ఎంత డ్రైగా తెరపై చూపొచ్చో, అలాగే జనాల్ని కట్టిపడేశేంత పట్టుతో కూడా చూపవచ్చు అనిపిస్తుంది.

మన కథలో అన్ని రకాల పాత్రలూ. హీరో-హీరోయిన్ల మధ్య అపార్థాలు కలగడానికి కావాల్సినంత అవకాశం. శుభలేఖ సుధాకర్, రావికొండలరావులు ఒక్కో సందర్భంలో దివ్యవాణితో (పాత్రలే!) ప్రవర్తించిన పద్ధతి – అది కూడా వాస్తవ జీవితానికి చాలా దగ్గర్లో ఉన్నట్లు తోస్తుంది నాకు. అయితే, ఇదే ఇంకో రకం దర్శకుడు తీసి ఉంటే – ఒకటి: పరమ నెగిటివ్ గా, జీవితంలో ఇలాంటివి తప్ప ఏం ఉండవు అన్నట్లు చూపుతారు. రెండు – ఆశ్లీలంగా చూపిస్తారు. (అలా చూపగల దర్శకులు ఉన్నారు కానీ, నేను పేర్లు చెప్పను) కానీ, ఈ సినిమాలో అలా కాదు : కాస్త తెరకింపుగా (అలాంటి పదమేదీ లేదు) గా చూపారు. కొన్ని వాస్తవ కథనాలకి సీరియస్ నెస్ నిజంగానే అవసరం – కాదనను కానీ, ఇలాంటి కథలకి ఈ మార్కు కథనమే నప్పుతుంది అని నా అభిప్రాయం.

ఒకచోట దివ్యవాణి అంటుంది – మనం పెళ్ళి చేస్కునే ముందు ప్రేమించుకున్నామా? ఆర్థిక ఈక్వేషన్లు చూస్కున్నాం కానీ – ఇలా ఏదో. ఎంత నిజం! ఒక తరంలో ఇద్దరూ ఉద్యోగులున్న వారి మధ్య పెళ్ళిళ్ళు అధికశాతం ఇలాగే జరిగేవి. ఇప్పటికీ జరుగుతున్నాయి. జీవితాల్లో డబ్బు అవసరాలు-అభిమానాలు-స్నేహాలు-అనుమానాలూ – వీటి మధ్య ఉండే ఈక్వేషన్లు పేరామీటర్ weights మారతాయి తప్ప – ప్రతి ఒక్కరికీ ఉండేవే. గుమ్మడి-ఝాన్సీ ల మధ్య సంబంధం ద్వారా, మన హీరో-హీరోయిన్లు ఎప్పటికప్పుడు వీళ్ళ చిన్నప్పటి కథ వినడం – ఎక్కడికక్కడ పెద్దవాళ్ళు కొత్త దంపతులకి – “మా పెళ్ళైన కొత్తల్లో…” అంటూ చెప్పే అనుభవాల సారమే… అందుకే, మన పెళ్లిళ్ళ కథ ఇది. మన జీవితాల కథ ఇది.

“అమ్మకుట్టీ…”, వనభోజనాల పాట, “సరికొత్త చీర..” , “కృష్ణం కలయసఖి సుందరం”, “హాయి, హాయి శ్రీరంగ సాయి” – ఏ పాట ఐనా, దాని అందం దానిదే. ఏదీ ఒకసారి వింటే వదల్లేము, ఓసారి చూస్తే, చూడకుండా ఉండలేము. అలాగే, సినిమాలో వివిధ సందర్భాల్లో వచ్చే నేపథ్య సంగీతం – అక్కడ సంభాషణలు ఎందుకు అనవసరమో చెబుతుంది (మౌనం మాట్లాడినట్లే, సంగీతం మాట్లాడుతుందిక్కడ). ఆహా, పాడిన విధానం కానీ, చూపిన విధానం కానీ, రాసిన పదాలుకానీ, కూర్చిన సంగీతం కానీ – అద్భుతం!

ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో రావో 🙁
కథలు లేకపోడం కాదు విషయం. కథలకేమీ – బోలెడున్నాయి మన తెలుగులోనే. ఇలా తీయాలి కదా ఆ తీసేవారు…ఇలాంటి డైలాగులు రావాలి…ఇలాంటి నటులు కావాలి…ఇలాంటి సంగీతం కావాలి… టోటల్ గా ఇలాంటి టీం వచ్చి మళ్ళీ తీయాలి. వీళ్ళే తీసినా మళ్ళీ ఇలా తీయలేరేమో….

13 Comments
 1. Phanindra November 6, 2009 /
 2. Venkat Balusupati November 6, 2009 /
 3. pappu November 6, 2009 /
 4. అరిపిరాల November 6, 2009 /
 5. ప్రవీణ్ రంగినేని November 6, 2009 /
 6. Vasu November 6, 2009 /
 7. Satish Kumar Kotha November 7, 2009 /
 8. జగన్ మోహన్ April 12, 2010 /
  • pavan santhosh March 22, 2016 /
 9. v.prathap reddy February 7, 2011 /