పఠాభి-Rebel with a cause

pathabhi

1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు ప్రయాణం చేసి, బస్సుల్లో, రైల్లో అర్జెంటినాలో ప్రవేశించి బ్యూనస్ ఐర్స్ నుంచి కేప్ టౌన్ కి చేరుకుని అక్కడనుంచి ఒక నౌకలో బొంబాయి చేరుకున్నారాయన.

వినడానికి సినిమా కథలా ఉన్నా ఇది నిజం. జీవితంలోనే కాదు ఆయన చేసిన ప్రతిపనిలోనూ అదే సాహసం.

ఫిబ్రవరి 19, 1919 నెల్లూరులో తిక్కవరపు రామిరెడ్డి దంపతులకు సంపన్నుల కుటుంబంలో పుట్టి బెంగాళ్ లోని శాంతినికేతన్ లో చదువుకుందామని బయలుదేరి అక్కడ సప్న జోత్స్నా సంచారం చేస్తూ అనుకోకుండా కలకత్తా నగరంలోని చీకటి గదులలో పేద ప్రజల మధ్య గడిపిన సమయంలో నగరం తాలూకు ఉన్నత్త వ్యాపారసరళి, అట్టహాసపూరితమైన ప్రకటనలు, అమానుషమైన దోపిడీ, యంత్రాలాధిక్యతా, ప్రకృతిపట్ల తీవ్రమైన నిరాదరణా చూసి కదిలిపోయి శాంతినికేతన్ నుంచి బయటపడి అప్పటివరకూ చెలామణిలో ఉన్న భావకవిత్వాన్ని పక్కకి నెట్టేసి ఆధునిక కవిత్వానికి దారి చూపించారాయన. ఆయనే పఠాభి.

నా యీ వచన పద్యా
లనే దుడ్డుకర్రల్తో
పద్యాల్ నడుముల్ విరగ దంతాను చిన్నయ్ సూరి బాల
వ్యాకరణాన్ని చాల దండిస్తాను

అంటూ తిరగబడి

తగిలింపబడియున్నది జాబిల్లి
చైనా బజారు గగనములోన

మద్రాసు నగరమా! నీ మీద బ్లూబ్లాక్
సిరాలాగా పడింది రాత్రి

1939 లో అప్పటివరకూ ఆధునిక కవిత్వంలో అలవాటు కాని దృష్టితో దర్శించి సృష్టించిన ’ఫిడేల్ రాగాల డజన్’, దాని తర్వాత అచ్చయిన ’కయిత నా దయిత’ , ’పన్ చాంగం’ తో పఠాబి తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు సంఘ సంస్కారానికి ఒక వాహికగా మలుచుకోవచ్చని నమ్మి ఉత్తమ చిత్రాన్ని నిర్మించి సెన్సార్ వారితో పోరాడి, పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సినిమాను ప్రదర్శించి, లోకర్నో చలనచిత్రోత్సవంలో అవార్డులనందుకుని, ఉత్తమ భారతీయ చిత్రం జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుని కర్నాటక రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికించిన ’సంస్కార’. దాని తర్వాత నిర్మించిన ’చండమారుత’, ’శృంగార మాస’ చిత్రాలతో భారతదేశ చలనచిత్ర చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

పఠాభి సాహితీ లోకంలో అగ్రశ్రేణి కవి. సినీ రంగంలో సాహస నిర్మాత, సమాంతర సినీ పతాకం ఎగురవేసిన దర్శకుడు. అంతే కాదు ఆయన గణిత శాస్త్రవేత్తకూడా.

నెల్లూరు లో పుట్టి అటునుంచి శాంతినికేతన్ కు, అక్కడనుంచి చైనా జపాన్ ల మీదుగా అమెరికాకు, అక్కడనుండి అనేక యితరదేశాలకు, ప్రాంతాలకు ప్రయాణించి మద్రాసు వొచ్చి, మధ్యలో సర్వకళాకోవిదురాల స్నేహలతను కలిసి ఈ రెండు ఉప్పొంగే నదులు ఒక్కటై బెంగుళూరు చేరి అక్కడ ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టి, అనేక సృజనాత్మక సంఘటనలకు ఆలవాలమై, కేంద్రమై, పోరాట జీవితం గడిపి ’జీవితం మృత్యువుతో ముగిసిపోదని నా నమ్మకం’ అంటూ 2006 మే 13 న ఈ లోకాన్ని వదిలివెళ్ళినా ఎంతో మంది అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

3 Comments to “పఠాభి-Rebel with a cause”

  • మా కాలేజి(మైసూరు)లో ‘సంస్కార’ చిత్రాన్ని ప్రదర్శించే ముందు ఎవరో తెలుగుభాషాభిమాని “పఠాభి మావాడండీ” అంటే, అక్కడి కన్నడవాళ్ళు “కానీ ఎప్పుడో మావాడైపోయాడ్లెండి” అని చురక అంటించారు.

    మన తెలుగువాడు కన్నడ సమాంతరసినిమాలను ప్రారంభించిన దిగ్గజం అని గర్వించాలా లేక ఒక తెలుగోడిన తెలుగు ప్రజలే గుర్తించలేకపోయారని బాధపడాలా అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నేనాకు. ఆయన సాహిత్యం గురించి చెప్పుకుంటే అది మరో బాధ అవుతుంది. నిజానికి ఆయన కవిత్వం గురించి ఎంత మందికి తెలుసూ?

  • Nice to know more about him!
    I know nothing except “ఫిడేలు రాగాల డజను” :)

  • 1978 లో మా కోనసీమా ఫిలిం సొసైటీ ప్రారంభ చిత్రంగా పఠాభి గారి ‘ సంస్కార ‘ ప్రదర్శించారు. అప్పటికి డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న నన్ను అమితంగా ప్రభావితం చేసిన చిత్రమది. ఆయన గురించి తెలుగు వాళ్ళకు తెలిసినది చాలా తక్కువే ! పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. వీలైతే ఆయన రచనల్ని కూడా పరిచయం చెయ్యండి.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories