పరిమితులే సృజనాత్మకతకి తొలి మెట్లు..!!

thumb

thumb

హాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న చిత్రం – “పారానార్మల్ ఏక్టివిటీ” (Paranormal Activity). ఓరెన్ పెలి (Oren Peli) దర్శకత్వంలో వచ్చిన ఈ “మాకుమెంటరీ” (Mocumentary) చిత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనం సృష్టించింది. కేవలం 15000 డాలర్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం ఇప్పటికే రెండు చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి, లక్షల డాలర్లు వసూలు చేస్తోంది.

స్థూలంగా కథ: కాలిఫోర్నియాలో వుండే ఒక జంట తమ ఇంటిని ఏదో అతీంద్రియ శక్తి వెంటాడుతోందన్న అనుమానంతో ఒక కెమెరా తో ఆ అసాధారణ సంఘటనలను చిత్రించే ప్రయత్నం చేస్తారు. ఆ కెమారాలో రికార్డైన విషయాలే చిత్రం మూల వస్తువు. (నేను ఇంకా ఈ చిత్రం చూడలేదు కాబట్టి, ఇంత కన్నా వివరంగా చెప్పడం సాధ్యం కాదు).

సినిమా చూడకుండా ఏం రాద్దామనుకుంటున్నాను అనే కదా మీ ప్రశ్న? అదే చెప్తున్నాను, సావధానంగా వినండి – ఈ చిత్రం ఒక నో బడ్జెట్ (No Budget) చిత్రం. ఇంత వరకూ మనం “హై” బడ్జెట్, బిగ్ బడ్జెట్ అని విన్నాం – లేదా లో బడ్జెట్ చిత్రాల గురించి విన్నాం. అసలు ఒక చిత్రం బడ్జెట్ అనుసరించి పెద్ద చిత్రమా చిన్న చిత్రమా అని చెప్పడం కష్టం. రెండు కోట్ల ఖర్చుతో ఒక కామెడీ చిత్రం తిస్తే (తెలుగులో) అది పెద్ద చిత్రం కావచ్చు. అదే రెండు కోట్లలో ఒక ఏక్షన్ చిత్రం తీస్తే అది లో బడ్జెట్ అని చెప్పవచ్చు. చెప్పొచ్చేదేమిటంటే – ఖర్చు ఆధారంగా కాక తీసిన సినిమా జెనెరా ఆధారంగా అది పెద్ద చిత్రమా చిన్న చిత్రమా నిర్ణయించడం సబబుగా వుంటుంది. అసలు ఒక కథ అనుకోగానే అనుభవమున్న దర్శకుడు/నిర్మాత ఇంత ఖర్చు అవుతుంది అని ఉజ్జాయింపు లెక్కలు వేస్తారు. అలా అనుకున్న ఖర్చు కన్నా తక్కువలో సినిమాని తీయగలిగితే (క్వాలిటీ తగ్గకుండా) ఆ దర్శకుడు ప్రతిభావంతుడని వొప్పుకోవచ్చు. అయితే అసలు బడ్జెట్టే లేకుండా సినిమా తిస్తే? సినిమా తియటానికి ఏ మాత్రం సరిపోని డబ్బుతో సినిమా తియగలిగితే? అదే నో బడ్జెట్ సినిమా – దీన్నే షూ స్ట్రింగ్ బడ్జెట్ (Shoe String Budget) సినిమా అని కూడా అంటారు.

ఇదెలా సాధ్యం?

సాధ్యమే..!! ఎలాగో చెప్పేముందు ఒక్క ప్రశ్న – ఒక (విజయవంతమైన) సినిమా తీయడానికి ఏం కావాలి? మంచి కథ? సృజనాత్మకత? మంచి నటీనటులు? మంచి స్క్రీన్‌ప్లే? ఇలాంటివి ఎన్ని వున్నా సినిమా తయారుకాదు – వీటన్నింటికి డబ్బు (పెట్టుబడి) తోడైతేనే అది సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే మంచి కథ వుండి, మంచి ప్రతిభ వుండి (నటన కానీ మరేదైనా కానీ) “ఒకే ఒక్క చాన్స్” కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు సినిమా ప్రపంచం చుట్టూ చాలామంది కనిపిస్తారు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టగలిగిన నిర్మాత..!! అయితే ఈ ఆలోచనా సరళిని ఎదిరించి – నిర్మాత అవసరంలేకపోయిన ప్రతిభతోనే “బ్రేక్” సాధ్యమని నిరూపించినవాళ్ళే ఈ నో బడ్జెట్ దర్శకులు. వీరికి “పెట్టుబడి” పరంగా వున్న అడ్డాంకులే ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశాలుగా మారాయి. పరిమితులే సృజనాత్మక పాఠాలు నేర్పాయి. “పేరానార్మల్ ఏక్టివిటీ” గురించి ఈ క్రింది విషయం చదవండి

Armed with a budget of $15,000 and a hand-held video camera and having no formal film training, Peli began shooting. The film was shot at the director’s old house in Rancho Peñasquitos, an upscale suburb of San Diego. Peli went as far as changing the floor boards and interior design elements to fit the film’s setting. The film was shot out of sequence due to the time constraints (a self-imposed 7-day shooting schedule) even though the director wanted the story to unfold for the actors as he had envisioned it. Luckily, Micah Sloat, who took most of the shots in the film between him and Katie, was a former camera man at his university’s TV station. “It was a very intense week,” Peli recalled, stating that the film would be shot day and night, edited at the same time, and would have the visual effects applied to it as the footage was being finalized by the actors whom Peli called, “unbelievably professional and smart” throughout, adding that they surpassed being actors and became true “storytellers”. One week later, filming was completed.
(వికీపీడియా సౌజన్యంతో)

ఇలాంటి చిత్రాలు గతంలో చాలా వచ్చాయి (నిజానికి సత్యజిత్‌రే తీసిన అప్పు ట్రిలొజీ మూడు చిత్రాలు ఇలాంటి తక్కువ బడ్జెట్‌తో తీసినవే. 1955లో వచ్చిన పాథిర్ పాంచాలీ చిత్ర నిర్మాణ వ్యయం 1.5 లక్షలు) హాలీవుడ్‌లో ఇంతకుముందు – ద ఫ్లవర్ తీఫ్ (The Flower Theif) (1960), ఐ వాస్ అ టీనేజ్ సీరియల్ కిల్లర్ (I Was A Teenage Serial Killer) (1963),  ద బ్లైర్ విచ్ ప్రోజెక్ట్ (The Blair Witch Project)(1999) వంటి చిత్రాలు ఎన్నో వున్నాయి. ఇలాంటి చిత్రాలు ఎక్కువగా హర్రర్ చిత్రాలు కావటం, ఎక్కువ శాతం డాకుమెంటరీ తరహాలో చిత్రీకరించడం యాదృశ్చికం కాదని నాకు అనిపిస్తుది. హర్రర్ చిత్రాలకు ఎక్కువ బడ్జెట్ అవసరం లేకపోవటం, ప్రేక్షకులకి త్వరగా “కనెక్ట్” అయ్యే జెనెరా కావటమే అందుకు కారణం కావచ్చు. ఇలాంటి చిత్రాలని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి.

1. ఇలాంటి చిత్రాలలో నటించే నటీనటులు దర్శకుడి మిత్రులో, డబ్బులు లేకపోయిన నటించడానికి సిద్ధమయ్యే ఔత్సాహిక నటులో వుంటారు.

2. ఎక్కువ శాతం సాంకేతిక శాఖలు (దర్శకత్వం, కథ-స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ వంటివి) దర్శకుడే నిర్వహిస్తుంటాడు (ఒకోసారి నిర్మాణం కూడా)

3. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ రకం మాధ్యమం మీద చిత్రీకరించబడతాయి. (సూపర్ 8 ఎం.ఎం. ఫిలిం, వీడియో టేప్ మొదలైనవి – ఇంకా ఫౌండ్ ఫుటేజ్ (Found Footage) అనే ప్రక్రియ కూడా వుంది)

4. ఇలాంటి చిత్రాలు తీయడానికి సాంప్రదాయాంగా వాడుతున్న టెక్నాలజి కాకుండా సొంతగా కనుకున్న అతి సులభమైన (ఖర్చు తక్కువైన) టెక్నాలజీ వాడటం గమనించవచ్చు. పైన వుదహరించిన కొన్ని సినిమాలలో ట్రాలీ షాట్లు తీయడానికి సూపర్‌బజార్‌లో వాడే ట్రాలీ బుట్ట వాడినట్లు తెలుస్తోంది)

ఇలా డబ్బు అనే పరిమితిని సృజనాత్మకతతో అధికమించి తీసిన చిత్రాలు చాలా వున్నా అందులో కొన్ని మాత్రమే విశేష ప్రాచుర్యం పొందాయి. ఈ వ్యాసం మొదట్లో చెప్పిన పారానార్మల్ ఏక్టివిటీ విడుదలయ్యే వరకు బడ్జెట్ – కలెక్షన్ పరంగా అత్యధిక వసూళ్ళు కలిగిన చిత్రం ది బ్లైర్ విచ్ ప్రాజెక్ట్ షుమారు 5 లక్షల డాలర్ల బడ్జెట్‌తో (విభేధాలున్నాయి) దాదాపు 248 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు రికార్డులున్నాయి. కలెక్షన్ల పరంగా కాకపోయినా అనేక చిత్రోత్సవాలలో ఇలాంటి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. పేరానార్మల్ ఏక్తివిటీ విడుదలకి రెండు సంవత్సరాల ముందే స్క్రీం ఫెస్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆ తరువాత 2008 జనవర్ 18న స్లాండాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకి నోచుకుంది. ఇదంతా విడుదలకి ముందు. విడుదల చెయ్యటానికి ఆ దర్శకుడు ఎన్నెన్ని కష్టాలు పడింది మరో కథ.

వసూళ్ళు, విడుదలలు ఆశించకపోయినా ఇలాంటి చిత్రాలు ఎన్నో పుడుతూనే వున్నాయి. ఇలాంటి చిత్రాలకు ఇంటెర్‌నెట్ మంచి మాధ్యమం అవుతోంది. ఇలాంటి దర్శకులు ఒకటిగా ఏర్పడి డీ్‌వీ్‌డీ విడుదలలు, ఇంటెర్నెట్ రిలీజులు చేస్తూనే వున్నారు. (కినో మూమెంట్ (Kino movement) ఇలాంటి వాటిలో ప్రముఖమైనది). ఇలాంటి చిత్రాలకోసం జరిగే చిత్రోత్సవాలు ప్రత్యేకంగా వున్నాయి. (ఫ్లికర్ ఫిలిం ఫెస్టివల్ (Flicker Film Festival), ది 8 ఫెస్ట్ (The 8 Fest) మొదలైనవి). ఇవన్నీ చూస్తుంటే చేతిలో హేండీకాం వుండి కొంచెం శ్రద్ధ, మరికొంచెం పట్టుదల, మరెంతో సృజనాత్మకత వుంటే “ఒక్క చాన్స్” కోసం ఎదురు చూడాల్సిన పనిలేదని అనిపించటంలేదు. ?

(అంతర్జాలంలో చదివిన అనేక వ్యాసాల ఆధారంగా.. మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ఇవ్వబడిన ఇంగ్లీషు పదాలతో గూగులమ్మని అడగండి.)

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

26 Comments to “పరిమితులే సృజనాత్మకతకి తొలి మెట్లు..!!”

  • ఇలాంటి థ్రిల్లర్, హర్రర్, సూపర్ నాచురల్ థీమ్స్ కి నేను మామూలుగా కొంచెం దూరం. అందుకే ఈ సినిమా బొమ్మలు అప్పుడప్పుడు నెట్లో కనపడ్డా పట్టించుకోలేదు. ఐతే తెరవెనుక కథ, కేవలం ఉత్సాహమే పెట్టుబడిగా ఈ సినిమా తీసారని తెలిశాక తప్పకుండా చూడాలనిపిస్తోంది. (ఇంకో విషయం కూడా తెలిసింది. ఈ సినిమాకు థియేటర్లో చూసే ముగింపే కాకుండా ఇంకోటి కూడా ఉందట. నెట్లో లభ్యం). ఈ సినిమాను పరిచయం చేసినందుకు థాంక్స్.

  • Informative and this article is one of the bests in navatarangam in recent months.

    Thanks

    • I second your comment. Recent articles have been pretty ordinary on NT.

  • మంచి inspiring సమాచారం అందించారు. ధన్యవాదాలు.

  • పరిమితుల్లో బయటపడే సృజనాత్మకతను గురించి ఎవరో ఒక కథ చెప్పేవారు…

    ఒక దర్శకుడి సినిమా పూర్తవ్వడానికి ఒక పెళ్ళి సీన్ మాత్రం మిగిలుందట. అంతలో నిర్మాత నాదగ్గర పదివేలకు మించి డబ్బులేదు పెళ్ళి సీను ఎలా షూట్ చేస్తావో నీ ఇష్టం అన్నాడట. దర్శకుడు కళ్యాణమంటపం,సెట్టు, బాజాబజంత్రీలూ,బంధువర్గాలూ ఇవేమీ లేకుండా హీరోహీరోయిన్ను ఒక పెద్ద గుట్టమీదికి తీసుకెళ్ళి “ఆకాశమే పందిరిగా..భూదేవే పీటలుగా మనం పెళ్ళి చేసుకుందాం రాధా!” అని హీరో చేత ఒక డైలాగ్ చెప్పించి తాళికట్టించి పెళ్ళిచేశాడట….అది క్రియేటివిటీ అంటే!

    పారానార్మల్ యాక్టివిటీ నిజంగా ఒక అద్భుతమైన,అత్యవసరమైన ప్రయోగం. మనమూ ఏదోఒకటి చెయ్యాలి!

  • ఇలాటివి చూసినప్పుడు మనం కూడా సినిమా తీసేయచ్చు ఆసక్తి ఉంటే అన్న నమ్మకం కలుగుతుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు (US) చాలా ఈజీగా own చేసుకుంటారు.మిగతా చోట్ల ఇది కనపడదు. ఇక ఈ కోవ లో వచ్చిన బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ నాకు అసల నచ్చలేదు, భయపెట్టలేదు. నిజంగా జరిగిన కథ (అది అవాస్తవం) అన్న హైప్ మీద బతికేసింది అనిపించింది. ప్యారానార్మల్ అలా ఉండకపోతే బావుండు.

  • చాల మంచి సమాచారం అంధించారు..ధన్యవాధాలు

  • ఇప్పుదే బొమ్మ మొదలయింది.ఇంకో రెండు గంటల్లొ నా అభిప్రాయం చెబుతా!

  • పారానార్మల్ ఏక్టివిటీ ( సినిమా కాదేమో? I prefer to call it as independent film) చాలా బాగా తీసారు. ఇది సినిమాలా తీసింటే బహుశా ఎవ్వరికి నచ్చివుండేది కాదు. ఈ ఫిల్మ్ గొప్పదనమంతా సహజత్వంలోనే వుంది.ఈ subject లో వున్న elements అన్ని మనకు తెసిన వాటిలా అనిపిస్థాయి. చివరి 15 నిమిషాలు గ్రిప్పింగ్ గా వుంది. if you don’t like horror,stay out of it.

  • మంచిఫిల్మ్ ని పరిచయం చేసినందుకు సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఏకాంతంలో ఇటువంటి సినిమాలు చూసినప్పుడు ఒక్కొసారి భయం కౌగిలిలో ఒంటరితనం బందీ ఐనట్టు వుంటుంది. ఒకరిని బయపెట్టిన సినిమా అందరికి అదే థ్రిల్ల్ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. Horror genre లో నన్ను విపరీతంగా భయపెట్టిన సినిమాలు ముఖ్యంగా The shinning, Ringoo(ఒరిజినల్),Silence of lambs.

  • ఆ బుట్ట ట్రాలీ లో కూర్చుంది ఎవరండీ? ఆ డైరెక్టరేనా ?

  • పులిరాజా,
    బుట్టలో కూర్చుంది ఆ డైరెక్టర్ కాదు..!!

  • సత్యప్రసాద్, మంచి టాపిక్ మిద రాశారు. సృజనాత్మకత అంటే కొత్త కథ కొత్తగా చెప్పడం ఒక్కటే కాదు, సులభంగా దొరకని అవకాశాల్ని అందిపుచ్చుకోవడం కూడా. ఇలాంటి పద్ధతిలో తీసే సినిమాలు విస్తృతమైన ప్రజాదరణకోసం కాదు అనేది స్పష్టం. అవి అసలు ఏమాత్రమైనా సంచలనం రేపాయి అంటేనే, అదొక విజయం.
    @సురేష్, భారద్దేశంలోనూ విదేశాల్లోనూ ఇప్పుడు ఇండిపెండెంట్ సినిమాలకి కూడా ఒక మంచి వ్యవస్థ ఏర్పడి ఉంది. సినిమా పరిభాషలో ఇండిపెండెంట్ సినిమా అంటే ఒక నిర్దిష్టమైన అర్ధంలో వాడుతున్నారు. అంచేత ఈ సినిమాల్ని ఇండిపెండెంట్ సినిమా అనేందుక్కూడా వీల్లేదు.

  • చాలా పాజిటివ్‍గా సాగుతున్న డిస్కషన్‍ చూసి ఈ సినిమా విషయంలో నా కోణాన్ని చెప్పి కొంతమందికైనా డబ్బులు మిగల్చాలని నా ఆశ, ముఖ్యంగా అమెరికాలో ఉన్న మిత్రులకు ;) …. త్వరలోనే ukకి కూడా వస్తుంది. అప్పట్లో సినిమా చూడక ముందు నేను కూడా eventfulలో ఈ సినిమాని తప్పకుండా డబ్లిన్‍లో ప్రదర్శనకు తీసుకురావాలని అర్జీ పెట్టుకున్నాను ప్చ్…

    సినిమాఅంతా వాళ్ళిద్దరూ పడుకోవడం, తెల్లవారుజామున ఏదో శబ్దాలు వినడం, తలుపులు మూసుకుపోవడం వంటి బి-గ్రేడ్ హారర్ సినిమాల హోరు అంతే, చివర్లో సినిమాని ముగించాలికాబట్టి ఏదో కెమెరాకి కనిపించని దూరంలో జరుగ్తుతుంది. ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతాఇంతాకాదు. అన్ని స్టోరీ డిస్కషన్ బోర్డులలోనూ వీటి గురించే. అయితే ఈ మధ్యే వచ్చిన పుకారు ఏంటంటే, imdb లాంటో సైట్‍లలో ఈ సినిమాకి సంబంధించినవాళ్ళే చాలా ఐడిలు సృష్టించుకొని పాజిటివ్ కామెంట్లు రాసేసుకున్నారని. అప్పట్లో వికీలో స్పీల్‍బర్గ్ కి ఈ సినిమా సీడీ పంపిస్తే సగం చూసి చాలా భయపడి తిరిగి ఇచ్చేసాడని కూడా ఉండేది. సినిమా చూసాక ఆ జోక్‍కి ఆగకుండా నవ్వొస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పెట్టుబడికి రెండొందల రెట్లు సంపాదించింది కాబట్టి మీరు మళ్ళీ ఇలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సాహపరచేందుకు డాలర్లు వృధా చేసుకోవద్దని మనవి. డివిడి అద్దెకు తెచ్చుకొని ఫార్వార్డ్ బటన్ మీద చెయ్యి సిద్ధంగా పెట్టుకుని చూసేయ్యండి. మరీ తీసిపారెయ్యాల్సిన సినిమా కాదుకానీ, చూసితీరాల్సిన సినిమా మాత్రం కాదు. 15,000 లో సినిమా ఎలా నిర్మించారా అని తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు, కానీ సినిమా చూస్తే ఆమాత్రం కూడా ఎందుకు అయ్యిందా అనిపిస్తుంది. వీకెండ్‍కి 200$కి కెమెరా అద్దెకి తెచ్చుకొని, తెలిసిన ఫ్రెండ్స్ ని నలుగుర్ని ఇంటికి పిలిచి కూడా తీసేయొచ్చు. ఈ సినిమాకి వచ్చిన వాపుని చూసి బలుపనుకుని అదే తరహాలో ఇంకెన్ని ఇండిపెండెంట్ కాపీలు తయారవుతాయో మరి.

    • పదేళ్ల కిందట బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ చూసి బుద్ధి తెచ్చుకున్నాక, ఇలాంటి సినిమాల జోలికి ఎవరు చెప్పినా వెళ్లకూడదని గాఠిగా నిర్ణయించేసుకున్నాను. మీర్రాసింది చదూతుంటే నా ఒట్టు తీసి గట్టున పెట్టనవసరం లేదనిపిస్తుంది.

      • నేను కూడా బ్లెయిర్ విచ్ నచ్చని జాబితాలో ఉన్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే హాల్ లో చూడక్కర్లేని సినిమా అన్నమాట.

    • ఒక్క విషయం ఏంటంటే కేవలం తక్కువ ఖర్చు ..

      అంతే , సినిమా అంత మీరు చెప్పినట్టే ఒక బెడ్ రూం , ఒక హాల్ , ఒక బాత్రూం , రెండు ఖాళీ రూములు ,ఇంకొన్ని అంతే …
      భయం అస్సలు కలగక పోగా విసుగు వస్తుంది …

  • శంకర్‌గారు,

    మీరు చెప్పిన విషయాలు నేను కూడా చదివాను..( స్పీల్‌బర్గ్ వగైరా). వాటి వివరాలు వుద్దేశ్శపూర్వకంగానే వ్రాయలేదు. IMBDలో ఐడీలు సృష్టించుకున్నా సినిమా రివ్యూలు సొంతగా వ్రాసుకున్నా – అది మన ఫ్లాపు తెలుగు సినిమా యూనిట్ విజయ యాత్ర, సక్సస్ మీట్ కంటే అన్యాయమేమీ కాదనుకుంటా..! ఈ వ్యాసంలో నేను చెప్పదల్చుకుంది చిన్న పాయంట్ – మనకి constraintలా కనిపించేది నిజానికి constraint కాదు.. మనం దాన్ని constraint అనుకున్నంతకాలం అక్కడే ఆగిపోతాం., కొంచెం సృజనాత్మకత వుంటే constraintని దాటవచ్చు. creativity can cross constraints. (డబ్బు లేదు అన్న constraintని అధిగమించిన కొన్ని చిత్రాల పరిచయం.)
    సినిమా చూడలేదు కాబట్టి సినిమా విషయమై మీరు చేశిన వ్యాఖ్యలు పై ఎలాటి ప్రతివ్యాఖ్య చెయ్యలేను. అంత గొప్ప సినిమా కాకపోయుండచ్చు. కాని దీన్ని చూసి మరిన్ని ఇండిపెండెంట్ సినిమాలు పుట్టుకొస్తే మంచిదే కదా..!! ఇండిపెండెంట్ “కాపీలు” అంటారా… ఈ పాటికే ఎవరో ఒక తెలుగు సినిమా దర్శకుడు ఈ సినిమా స్ఫూర్తితో కథ మొదలెట్టేసే వుంటాడు..!!

    • @అరిపిరాల గారు,

      మీ వ్యాసాన్ని తప్పుపట్టే ఉద్దేస్యంతో కాదండీ నేను వ్యాఖ్యానించింది, ఏదో ఇక్కడ డిస్కషన్‍లో ఉన్న ఉత్సాహాన్ని చూసి కొన్ని నెలల క్రితం నా పరిస్థితి గుర్తొచ్చింది. అప్పట్లో ఈ సినిమా కోసం నేను పడ్డ తపన, చూసిన తర్వాత కలిగిన నిరాశ మళ్ళీ సాటి నవతరంగం పాఠకులు కూడా ఎక్కడ అనుభవిస్తారో అనే ఆవేదనతో వ్రాసా;), అందులోనూ ఇప్పుడు ధియేటర్లో ఉంది కాబట్టి డబ్బులు ఖర్చుపెట్టుకొని మరీ!!!!

      మీ కాన్సెప్ట్ తో నేను నూరుశాతం ఏకీభవిస్తా. మీరు christopher nolan 2000 పౌండ్‍లతో నిర్మించిన following చూసారా? మీ వ్యాస శీర్షికకి సరిగ్గా సరిపోయే సినిమా అదని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ క్రియేటివిటీ ఉంది. కానీ ఈ సినిమాలోలా కెమెరాని ఎక్కడపడితే అక్కడ వదిలేసి, దాని ముందు ఇద్దరు కూర్చుని సోది చెప్పుకోవడం ఎలా క్రియేటివిటీ అవుతుందని నా ప్రశ్న. మీరు ఈ సినిమా చూస్తేకానీ నేను చెప్పాలనుకున్నది అర్ధం క్దాదు. ఈ సినిమా స్ఫూర్తితో ఇంకో పది ఇలానే తీసేసి మాకు గుర్తింపు రావడంలేదని గగ్గోలు పెట్టేవాళ్ళు త్వరలోనే తయారవ్వుతారు. మార్కెటింగ్ టెక్నిక్ తెలిసిన వాళ్ళందరూ ఇకమీదట ఇలా చెత్తంతా తీసేసి, మేం నోబడ్జెట్‍లో కళాఖండం తీసామని ప్రచారాలు చేసుకోవడం మొదలుపెడితే ఇక అంతే సంగతులు. ఇలా మాస్టర్‍పీస్ అని ఊదరగొట్టేయడం వల్ల సినిమా నచ్చనివాళ్ళు కూడా నచ్చలేదని చెప్పడానికి ఇబ్బందిపడతారు. బ్లెయిర్‍విచ్ ప్రాజెక్ట్ నచ్చింది అన్నవాళ్ళు నాకు ఇప్పటివరకు ఒక్కరు కూడా తగల్లేదు, కానీ ఆ సినిమా సృష్టించినం సంచలనం, దాని పర్యావశానంగా పదుల్లో వచ్చిన సినిమాల సంగతి తెలిసిందేకదా. ఇలాంటి సినిమాల్ని ప్రోత్సాహించడం వల్ల నాకు కలిగే బాధేంటంటే సినిమా అంటే ఇంత సుళువా అని అనిపించి దాని విలువ ఇంకా తగ్గిపోయి, ఇప్పుడున్న ఔత్సాహికులందరూ నోబడ్జెట్ సినిమా నిర్మాణానికి పూనుకున్నారనుకోండీ (అక్కడితో ఆపేస్తే పర్వాలేదు, కానీ దానిని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి టెక్నిక్‍నే వాడతారనుకుందాం), ఆ చెత్తలో నుండి ముత్యాలను ఏరుకోవడం ఎలా???

      మీరు ఈ వ్యాసం పారానార్మల్ ఏక్టివిటీ గురించి వ్రాయకపోయినా, కామెంట్లు చూసి నాకు అందరూ ఆ సినిమా గురించే ఆలోచిస్తున్నారని అనిపించి ఒక సూచన అందించానంతే….

      *************
      ఇక సినిమా నిర్మాణానికి డబ్బు అవసరమా???? అంటే ముందు బద్ధకం పక్కనపెట్టి పనిచేసే మనస్తత్వం అవసరం అంటా నేను. మిగతావన్నీ ఆ తర్వాత అవే వస్తాయి. ఎవ్వరిగగ్గర ఒక్క స్క్రిప్ట్ రెడీగా ఉండదుకానీ అవకాశం వస్తే నిరూపించేసుకోగలం అనే అపోహలకు మాత్రం కొదవ లేదు. వీటిలోనే ఓ పదేళ్ళు బ్రతికేసి (ఒక్క స్క్రిప్ట్ కూడా పూర్తిగా వ్రాయకుండా) మా టాలెంటునెవ్వరూ గుర్తించలేదు, డబ్బులు పెట్టేవాళ్ళు లేక సినిమా తియ్యలేదు వగైరా కారణాలు చెప్పి పొరపాట్లను కప్పిపుచ్చేసుకునే మహామహులున్నంతకాలం ఈ ’డబ్బు అవరోధం’ టైపు మాటలు వింటూనే ఉంటాం.

      • శంకర్ గారు, మీరు చివర చెప్పిన మాటలు చాలా విలువైనవి. అందరము ఆలోచించుకోవలసిన విషయాలు చెప్పారు.

  • ఈ వ్యాసానికి పూర్తిగా సంబంధం లేకపోయినా తక్కువ ఖర్చులో తీసిన సినిమాల లిస్టులో చేరే “లఢక్ సినిమాలు” గురించి ఈ రోజు (08.11.09) ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన వ్యాసం:
    http://eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=9&reccount=13

  • e movie vontariga choosthe baavuntundemo anipisthundi. indulo nijamaina shaots anni kooda. kaani andariki intha ga nachindante namma leka pothunnanu. antha ga theesiveyyalasina movie kooda kaadu. e movie choosenduku chaala vopika undaali(i mean wait cheyyali)

  • సోది సినిమా. ఎంత సమీక్షల్ని ద్రుష్టిలో పెట్టుకుని చూసినా సరే భయం కాదు విసుగొస్తుంది, అంతా పబ్లిసిటీ మహిమ. ఈ సమీక్ష చదివి అమెరికా లో మా ఫ్రెండు కి చెప్పా. వాడి చేతి చమురు కూడా వదిలింది

  • hai friends
    nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
    ee link lo choosi me comments teliyajeyandi.

    http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html

    • @సతీష్: మంచి ప్రయత్నం. వాయిస్ ఓవర్,డైలాగులు,పాటలతో చెప్పిందే “మళ్ళీమళ్ళీ” చెప్పినట్లు అనిపించింది. సినిమా అనేది విజువల్ మీడియం. అది గుర్తుపెట్టుకుని యాక్షన్ లో ఎంత చూపించగలము అనికూడా ఆలోచించండి. రెండవ చిత్రంకోసం ఎదురుచూస్తాం.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories