Menu

ఇంద్ర “గ్రహణం”

ప్రముఖ నటి ఊర్వశి శారదకి మూడు సార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. మొదటి రెండూ మళయాళ సినిమాలయితే, మూడో సారి వచ్చింది తెలుగు సినిమాకి. అది బి.ఎస్. నారాయణ దర్శకత్వంలో వచ్చిన నిమజ్జనం అనే సినిమా. ఇది 1978లో అనుకుంటాను రిలీజయ్యింది. అన్ని అవార్డు సినిమాల్లాగానే ఈ సినిమా కూడా అవార్డులందుకున్నాకే పేరొచ్చింది. ఆ తరువాత రిలీజు చేసినా ఎక్కడా వారం మించి ఆడలేదు. ఏదో పెద్ద సెంటర్లో రిలీజ్ చేసారు. అక్కడే సరిగ్గా ఆడకపోయేసరికి మిగతా చిన్న వూళ్ళల్లో ఈ సినిమా రిలీజు కాలేదు.

నేను పుట్టి పెరిగింది అమలాపురం. అప్పట్లో మా వూళ్ళో కోనసీమ ఫిల్మ్ సొసైటీ అనే ఒక ఫిల్మ్ క్లబ్ ఉండేది. అందులో అవార్డు సినిమాలు వేసేవారు. మా నాన్న జర్నిలిస్ట్ కావడమూ, ఆ ఫిల్మ్ క్లబ్ కార్యవర్గంలో ఉండడం వల్లా మాకు అందులో వేసే సినిమాలు చూసే భాగ్యం నాక్కలిగింది. అలా ఓ సారి ఈ నిమజ్జనం సినిమా వేస్తే చూడ్డం జరిగింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా అయినా ఇప్పటికీ గుర్తుంది. కాశీయాత్రకని భర్తతో ఒక గుర్రబ్బండిలో బయల్దేరిన భార్యా భర్తల కథది. మూడే పాత్రలు. ఒకనొక సమయంలో గుర్రబ్బండి వాడు ఆమెను లొంగదీసుకుంటాడు. చివరికి కాశీలో గంగా స్నానానకని మునిగిన భార్య మరలా పైకి తేలదు. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పానంటే స్త్రీల శీలంపై వివిధ కోణాల్లో వచ్చాయి. అప్పటికీ ఇప్పటికీ ఆడవాళ్ళ పరిస్థ్తిల్లో కాస్త మార్పు వచ్చినా అరవై శాతం ఇంకా అణచివేతకి గురికాబడుతూనే ఉన్నారు. అవునన్నా, కాదాన్నా ఈ ప్రపంచమే పురుషాధిక్య ప్రపంచం. భారత దేశ రాష్ట్రప్రతి స్త్రీ, దేశాన్ని నడిపించేది స్త్రీ వగైరాల స్టేట్మెంట్లెన్ని బల్ల గుద్ది చెప్పినా ఇంకా స్త్రీల సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి. అనుమానం అన్న విషయం వచ్చేసరికి మన చూపూ, దృష్టీ అప్రయత్నంగా స్త్రీ వైపే వెళుతుంది. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక స్త్రీ శీలం మూఢనమ్మకాలకి అప్పట్లో ( అంటే నలభై ఏళ్ళ క్రితం ) ఎలా వస్తువయ్యేదో చెబుతూ, ప్రముఖ రచయిత చలం రాసిన “దోషగుణం” అన్న ఒక చిన్న కథని తీసుకొని కొత్తగా ఇప్పటి పద్ధతుల్లో తీసిన సినిమా గ్రహణం.

తీసిన మొదటి సినిమాకే అవార్డులూ, రివార్డులూ అందుకున్నా, అన్ని అవార్డు సినిమాల గతే ఈ సినిమాకీ పట్టింది. రిలీజు చేస్తే ఆదరించి మెచ్చుకున్న తెలుగువాళ్ళని ( నాతో సహా – అమెరికాలో ఉంటున్నానన్న కుంటి సాకు మినహాయిస్తే ) వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. ఇది మనందరం సిగ్గు పడాల్సిన విషయం. పత్రికలన్నీ ఎడా పెడా రాసేసి చేతులు దులిపేసుకున్నాయి. అసలు రాసిన వాళ్ళు ఆ సినిమా చూసారా అన్నది నా అనుమానం. ఈ సినిమా వచ్చి అయిదేళ్ళయ్యింది. “దొంగ పడిన ఆర్నెల్లకి..” అన్న సామెత చందంగా ఇప్పుడా మీరు మేల్కొన్నదని అడగచ్చు. తప్పక చూడాలి అన్న లిస్టులో వేసుకున్న సినిమా అయినా ఎప్పుడూ కుదర్లేదు. డి వీడీ కూడా రిలీజు కాకపోయేసరికి అది కాస్తా మరుగున పడిపోయింది.

అసలు గ్రహణం గురించి మాట్లాడబోయే ముందుగా నేను రాసిన “కథన విజయం – ఈరం” అన్న తమిళ సినిమాకి వ్యాఖ్య రాసి, నన్ను రెచ్చ గొట్టి ఈ సినిమా చూసేలా చేసిన రవికి ( పూర్తి పేరు తెలీదు ) కృతజ్ఞతలు. ఆయనే కాస్త ఘాటుగా వెక్కిరించకపోతే నేను గ్రహణం చూసేవాణ్ణీ కాదు, ఇలా రాసుండకపోయే వాణ్ణీ కాదు.

స్త్రీవాద రచయితగా చలంకి పరిచయం అక్కర్లేదు. ఆయన రాసిన ఒక కథని తీసుకొని సినిమాగా మలచాలన్న ఆలోచన వచ్చిన ఇంద్రగంటి మోహన కృష్ణ అభినందనీయుడు. మూల కథ “దోష గుణం”లో పాత్రలూ, కథనమూ ఆలోచింపచేసేలా చేస్తే – ఈ గ్రహణం సినిమా జుట్టు పట్టి మనసుని గుంజేస్తుంది. అంత అద్భుతంగా తెరకెక్కించాడు. కేవలం ఎనిమిది లక్షల బడ్జెట్టుతో, డిజికామ్ తీసిన సినిమాగా చెప్పారు. సినిమా చూస్తే ఎవరికీ అలా అనిపించదు.

దోషగుణం కథ మరీ పెద్ద కథ కదు. అలా అనీ చిన్న కథా కాదు. ఈ కథ ఒక యాదార్థ సంఘటనాధారంగా రాసిందని అంటారు. కథ రాసేటప్పుడొక సౌలభ్యం ఉంది. చిన్న చిన్న సంఘటనలని రెండు మూడు వాక్యాల్లో చుట్టేయచ్చు. పైగా కథకొక మూల వస్తువుంటుంది. కథ రాసేటప్పుడు అది ఎలా సహజంగా చెప్పాలీ, ఎంచుకున్న ఇతివృత్తంలోకి ఎలా ఇమడ్చాలన్న దానిమీదే రచయితల దృష్టుంటుంది. అందువల్ల కధకి కావల్సిన చిన్న చిన్న విషయాల్ని ముక్తసరిగా తేల్చేస్తారు. కథ రాసేటప్పుడు ఇంకో సౌకర్యం కూడా ఉంది. పాత్రల మనస్తత్వాలనీ, వారి స్వగతాలనీ, ఆలోచన్లనీ, అభిప్రాయాలనీ విడమర్చి రాసేయచ్చు. తద్వారా చెప్పదల్చుకున్న కథగమ్యం చక్కగా చేరిపోవచ్చు.

ఒక చిన్న కథని సినిమాగా తీయాలంటే ఒకరకంగా కష్టమే! ఎందుకంటే చెప్పదల్చుకున్న విషయం సూటిగా వున్నా, దాని చుట్టూ ఉన్న పాత్రలూ, సంఘటనల నిడివి తక్కువగా వుంటుంది. ఇవన్నీ దృశ్యంగా మలిచేటప్పుడు మూల కథ చెడకుండా జాగ్రత్తగా చూపించాలి. అవసరమైతే సంభాషణల ద్వారానో, చిన్న చిన్న సంఘటనల ద్వారానో చూపించాల్సుంటుంది. లేకపోతే చూసేవాళ్ళకి అయోమయంగా ఉంటుంది. ఎవరైనా ఒక కథ చదివి సినిమాగా మలచాలని అనుకున్నారంటే ఆ కథ ప్రభావం ఎంతగా వుందో తెలుస్తూనే ఉంటుంది. ప్రభావం ఒక్కటే చాలదు, మూల కథని చెడకుండా ఎలా దృశ్యీకరించాలీ అన్నదానిపై సరైన అవగాహనుండాలి. లేకపోతే దృశ్యం చెడిపోతుంది. ఒక దృశ్యం వంద వాక్యాలకి సమానమంటారు. ఆ వందవాక్యాల సారాన్నీ దృశ్యంగా చెప్పాలంటే ఎంతో ఆలోచనా, శ్రమా కావాలి.

దోషగుణం కథని తెరకెక్కించడంలో దర్శకుడు మోహన కృష్ణ పూర్తిగా సఫలమవ్వడమే కాకుండా, తనదైన శైలిలో కథకొక దృశ్యరూపాన్ని ఇచ్చాడు. కథా గమనాన్ని ఎంతో ఉత్కంఠగా చూపించి, చివరలో ముగింపు కూడా కొత్తగా చూపించాడు. రెంటికీ మూల కథ ఒకటే అయినా, చలం దోషగుణమూ, మోహన కృష్ణ గ్రహణమూ రెండూ దేనికవే గొప్పవి. కథ మనుసుని పిండితే, దృశ్యం రోజుల తరబడి వెంబడిస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇటువంటి సున్నితమైన విషయంపై ఒక్క సినిమా చూడలేదు. స్త్రీల కథలంటే ఏడుపులూ,పెడబొబ్బలూ ఉండి, బకెట్లకొద్దీ కన్నీళ్ళని ఖర్చు పెట్టనవసరంలేదన్నట్లు సున్నితంగా ప్రేక్షకుల్ని కదిలిస్తుంది.

అసలు కథలోకి వెళితే – డాక్టర్ రఘు ( సూర్య ) పనిజేస్తున్న ఆసుపత్రిలో ఒక పేషంటు చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్లాడుతూ ఉంటాడు. అతన్ని చూడ్డానికి తల్లి వస్తే, ఆమె కులటనీ, అది నా తల్లి కాదనీ ఆవిణ్ణి పొమ్మంటాడు. ఆవిడ ఏడుస్తూ అక్కడనుండి వెళ్ళడం చూసిన రఘు ఆవిణ్ణి అనుసరించి విషయం తెలుసుకుందామనుకుంటాడు. తీరా దగ్గరకెళితే ఆవిడ పరిచయమున్న వ్యక్తిలాగే అనిపిస్తుంది. విషయమేమిటని ప్రశ్నిస్తే అక్కడనుండి ఆమె ఏడుస్తూ వెళిపోతుంది. డాక్టర్ రఘు ఆవిణ్ణి గుర్తిస్తాడు. ఆమె మరలా ఆసుపత్రికొస్తే తనకి చెప్పమని నర్సుకి చెప్పి, తన కొలీగ్‌కి ఆవిడ గురించి కథ చెబుతాడు.

ఆ వచ్చినామె పేరు శారదాంబ. ఒక పల్లెటూరిలో నారాయణ స్వామి అనే వ్యవసాయదారుడి భార్య. వారికొక కొడుకుంటాడు. అత్తగారిని చూస్తూ, భర్తని ఎంతో ఆప్యాయంగా చూసుకునే శారదాంబ చాలా అందంగా ఉంటుంది. ఊళ్ళో అందరికీ ఏం సాయం కావాలన్నా చేస్తూ ఉంటుంది. వాళ్ళింట్లో కనకయ్య అనే ఒక అబ్బాయి వారాలు చేస్తూ ఉంటాడు. అతను బాగా చదువుతున్నాడని శారదాంబకి అతనికి డబ్బు సాయం చేస్తూ ఉంటుంది. కనకయ్య కూడా వాళ్ళింట్లో చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటాడు. ఓ సారి కనకయ్యకి తీవ్రంగా జ్వరమొస్తుంది. అది విషజ్వరం అంటారు. ఎన్ని మందులిచ్చినా ప్రయోజనముండకపోతే పక్కూళ్ళో ఉన్న భూత వైద్యుణ్ణి పిలుస్తాడు కనకయ్య తండ్రి. అతను ఈ పిల్లాడికొచ్చింది దోషగుణమనీ చెబుతాడు. దోషగుణం అనేది చిన్న వయసులో ఉన్న పిల్లాడికి తనకన్నా వయసులో పెద్దదైన స్త్రీతో కలిస్తే వచ్చే వ్యాధనీ, దానికి విరుగుడు ఆ స్త్రీ తొడలోంచి రక్తం తీసి ఆ పిలాడి కంట్లో వేయాలనీ చెబుతాడు. మొత్తానీకీ విషయం నారాయణ స్వామికి చేరుతుంది. శారదాంబ గతంలో కనకయ్యతో చనువుగా ఉన్న వైనం గుర్తొచ్చి భార్యను అనుమానిస్తాడు. శారదాంబ తను నిర్దోషనీ, ఇలాంటి పిచ్చి ఆలోచన్లు ఎలా వస్తాయనీ భర్తకి ఎదురు తిరుగుతుంది. శీలం ఆడదానికేనా, మగాడికి అవసరంలేదాని ప్రశ్నిస్తుంది. పదిమంది చెప్పింది వినీ శారదాంబ దోషనీ నారాయణ స్వామి నమ్ముతాడు. శారదాంబ రక్తం ఇచ్చి కనకయ్యని బ్రతికించిందా? నారాయణ స్వామి భార్యని ఏం చేసాడు? ఆసుపత్రిలో ఉన్న కొడుకు ఎందుకు శారదాంబని పొమ్మంటున్నాడు? ఆమె తిరిగి ఆసుపత్రికొచ్చిందా? శారదాంబని డాక్టర్ రఘూ కలిసాడా? వీటికన్నింటికీ జవాబులు తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే పైన చెప్పిన కథని మోహన కృష్ణ చాలా బాగా చిత్రీకరించాడు. ఫ్లాష్ బ్యాక్‌లూ అవీ ఎంతో జాగ్రత్తగా వాడుకుంటూ చెప్పదల్చున్న విషయాన్ని బ్రహ్మాండంగా చూపించాడు. అన్నిటికన్నా ముగింపు అద్భుతంగా ఉంది. అసలిటువంటి కథని సినిమాగా తీయడమొక సాహసమైతే, అలాంటి ముగింపు చూపించాలంటే చాలా తెగువ కావాలి. సాధారణ ప్రేక్షకుల ఊహకందదు. ఇదొక్కటే చాలు ఈ సినిమాని ఎన్నిసార్లయినా చూపించేలా చేస్తుంది. మొత్తం అయ్యాకా మిమ్మల్ని ఆలోచన్ల అగాధంలోకి తోసేస్తుంది. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ముగింపు నాకు బాగా నచ్చింది.

కథా, దర్శకత్వం పక్కన బెడితే, సినిమాకి ఆశ్చర్యకరమైన విషయం శారదాంబ పాత్ర చేసిన జయలలిత. పలు చిత్రాల్లో శృంగార వేషాలు వేసిన ఈమె శారదాంబగా అద్భుతంగా నటించింది. ఆ పాత్రలో చెప్పలేనంతగా ఒదిగి పోయింది. శారదాంబ పాత్రకి జయలలిత ఎంపిక చూస్తే శంకరాభరణ సినిమాలో తులసి పాత్ర చేసిన మంజుభార్గవి గుర్తొస్తుంది. నటించగల సత్తావుందీ. మంచి పాత్రలివ్వాలేగానే మేమూ మంచి నటులమే అన్నట్లుగా రుజువుచేసి చూపించారు. ఈ సినిమాలో జయలలిత వాచ్యం కూడా స్పష్టంగా ఎంతో సహజంగావుంది.

నారాయణ స్వామి పాత్ర తనికెళ్ళ భరణికి కొట్టిన పిండి. బాగా చెయ్యకపోతే చెప్పుకోవాలి. కనకయ్య గా వేసిన తల్లావజ్జుల మోహనీష్ బాగా చేసాడు. మిగతా నటీనటులు కూడా ఏ పాత్రనీ చెడగొట్టకుండా బాగా చేసారు. డాక్టర్ రఘుగా ( సూర్య ) నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈయన ఉచ్ఛ్హారణ మాత్రం పంటికింది రాయిలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. శారదాంబని, షారదాంబ అంటూ పలుకుతూంటే చాలా ఇబ్బందిగా ఉంది. సినిమాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు ఈ విషయమొచ్చే సరికి ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదు. మిగతా పాత్రలు శారదాంబనే అన్నా, ఈయనొక్కడూ మాత్రం ప్రత్యేకంగా షకార హింస పెడతాడు.

సినిమా మొత్తం కోనసీమలోనే తీసారు. కథ చాలా వేగంగా చెప్పాడు. ఎక్కడా అక్కర్లేని సంభాషణలూ, పనికిరాని దృశ్యాలూ లేవు. ఎన్నుకున్న విషయం సెక్సుకి సంబంధించినదయినా ఎక్కడా ఒక్క అసభ్య పదజాలం కానీ, చేష్టలు కానీ ఉండవు.

సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో తీసినా, చిత్రం చివర్లో రంగుల్లో చూపించి ఒకరకమైన భావుకతని చూపించాడు దర్శకుడు. జ్ఞాపకాలు రంగుల కలలనే భావన్ని చక్కగా చూపించాడు.

ఈ సినిమాకి సంగీతం చేసిన కె.విజయ్ ని కూడా మెచ్చుకోవాలి. ఎక్కడా వాయిద్యాల హోరుండదు. పాటలు లేని చిత్రమిది. ఎక్కడా హీరో, హీరోయిన్ల యోగాసనాల్లాంటివుండవు. అలాగే చిత్రంలో మాటలు కూడా ఎంతుండాలో అంతే ఉన్నాయి. “మా నాన్న పోయాకా మా అమ్మ నోరులేచింది. అస్తమానూ ఎవరోకరి మీద అరుస్తూనే ఉంటుంది” అని నారాయణ స్వామంటే – “ఎదురుగా వున్నది నేనే కదా, ఎంతైనా కొడుకునంటే ఊరుకోడు కదా?” అంటూ శారదాంబ జవాబిచ్చే సంభాషణలు సహజంగా ఉన్నాయి.

ఇహ సినిమాలో నాకు నచ్చని కొన్ని సన్నివేశాలున్నాయి. మూలకథని భంగ పరచవు కాబట్టి అంతగా పట్టించుకోకుండా చూసేయచ్చు. శారదాంబకి కొడుకున్నట్లు మొదట్లో చెప్పించినా, సినిమా చివర్లో కానీ అతని పాత్రని చూపించలేదు. ఇంట్లో అన్ని పాత్రలూ అంటే భర్తా, అత్తగారూ, పనిమనిషీ అందర్నీ చూపించి ఒక్క కొడుకు పాత్రని అవసరమనిపించినప్పుడు మాత్రమే చూపించాడు. ఆ పిల్లాడు కూడా అదే ఇంట్లో ఉంటాడు కదా? ముందు ఎక్కడోక్కడ ఒకసారి చూపిస్తే బావుండేది. అలాగే శారబాంబనీ, కనకయ్యనీ పనిమనిషి అనుమానంగా చూస్తూ ఉంటుంది. కానీ ఈ పాత్రని ఎక్కడా మరలా వాడుకోలేదు. కేవలం వారిద్దరినీ వేరే దృష్టితో కూడా చూడమని ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పినట్లుంది. పనిమనిషి పాత్ర అలా చూపించడంలో ప్రయోజనమేమిటో అర్థం కాలేదు. ఆ పాత్ర కథకేమీ ఉపయోగం లేదు. మిగతా పాత్రలన్నీ కథాగమనానికేదో రకంగా ఉపయోగపడ్డాయి. ఇవి చిన్న విషయాలే అయినా ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాదు. ముందు చెప్పినట్లుగా ఇవేం ఘోరమైన తప్పులు కావు. సూక్ష్మ దృష్టితో చూస్తే కలిగే ప్రశ్నలంతే!

ఒక మంచి కథని సినిమాగ తీర్చి దిద్దిన మోహన కృష్ణ అభినందనీయుడు. అందుకే చాలా అవార్డులొచ్చాయీ సినిమాకి. చాలా నవల్లు సినిమాలుగా వచ్చాయి కానీ, చిన్న కథని సినిమాగా తీసిన ప్రయత్నాన్ని అభినందించి తీరాలి. ఎంతో సున్నితమైన విషయాన్ని మరింత సున్నితంగా హృదయాలని తాకేలా తీయడం, అందునా మొదటి సినిమాగా, ప్రశంచించదగ్గ విషయం. ఇతను బుచ్చిబాబు “చివరకు మిగిలేది” నవలని కూడా సినిమాగా తీయాలన్న అభిలాషుందని ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పగా చదివాను. మంచిది. మోహన కృష్ణ లాంటి వాళ్ళే మరలా తెలుగు సాహిత్యానికీ, సినిమాకి మధ్య తెగిన లంకె పునరిద్ధరించబడుతుందేమో చూడాలి. సాహిత్యమంటే మమకారం వున్న దర్శకులు సినిమారంగానికి అవసరం.

ప్రతీ తెలుగువాడూ చూడదగ్గ చిత్రం. మంచి సినిమాలు రావడంలేదూ, తెలుగు సినిమారంగానికి గ్రహణం పట్టిందనుకునే వారికిదొక పున్నమి వెన్నెల. ఇంద్రగంటి మోహన కృష్ణ “గ్రహణం” అని దృష్టి మళ్ళించారు కానీ, నిజంగా ఇది కథాతోరణం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోహనకృష్ణ సృజనాభరణం.

–సాయి బ్రహ్మానందం గోర్తి

20 Comments
 1. రవి November 30, 2009 /
 2. parimalam November 30, 2009 /
  • krishna mohan November 30, 2009 /
 3. శి. రా. రావు November 30, 2009 /
 4. సాయి బ్రహ్మానందం November 30, 2009 /
 5. Manjula December 1, 2009 /
 6. రామ December 1, 2009 /
 7. srikanth December 1, 2009 /
 8. అబ్రకదబ్ర December 1, 2009 /
 9. రవి December 1, 2009 /
 10. Manjula December 2, 2009 /
 11. బ్రహ్మానందం December 3, 2009 /
 12. Hari Charana Prasad December 4, 2009 /
 13. chinna December 4, 2009 /
 14. prasad December 8, 2009 /
 15. LAVANYA December 28, 2009 /
 16. Round Mirror · November 13, 2010 /
 17. Madhukar February 21, 2011 /
 18. Rambabu July 11, 2011 /