Menu

కథన విజయం – ఈరం (తమిళ్)

మూడేళ్ళ క్రితం తిరుపతిలో నంది నాటక పోటీలు చూడ్డానికని వెళ్ళాను. ఆ పోటీలకి నేను రాసిన “పంచమ ధర్మం” అనే పద్య నాటకమొకటి కూడా ఎంపికయ్యింది. అందులో అది ప్రదర్శించారు. ఆ సందర్భంలో నాటకాలకీ, టీవీలకీ, సినిమాలకీ మధ్య కొట్టిమిట్టాడుతూ, అవకాశాల కోసం పడిగాపులు కాచే కొంతమంది వర్ధమాన రచయితలూ, దర్శకులూ పరిచయమయ్యారు. సినిమాలంటే నాకున్న ఇంట్రస్టు కొద్దీ వాళ్ళేం చేస్తూ ఉంటారూ, ఏఏ సినిమాలకి పనిజేసారనీ వివరాలు తెలుసుకున్నాను. నేను అమెరికా నుండి వచ్చానని తెలిసి ( సినిమా తీస్తాననుకున్నాడో ఏమో? ),  అందులో ఒకాయన అత్యుత్సాహంగా తాను ఎన్నో సినిమాలకి ఘోస్ట్ రచయితగా పనిజేసాననీ చెప్పి, తను ఒక సినిమాకి స్క్రిప్ట్ రాయబోతున్నాననీ చెప్పాడు. అనుకోకుండా ఆరోజు రాత్రి ఆయన్ని నేనున్న హొటల్ డిన్నర్ హాల్లో కలవడం జరిగింది. మాటల్లో తన రాబోయే సినిమా గురించి చెబుతూ చేతిలో వున్న ఒక బౌండు పుస్తకం చూపించాడు. అది ఆయన రాసిన స్క్రిప్ట్  అని మొదటి పేజీ చూడగానే అర్థమయ్యింది. చదవచ్చా అని అనుమతి తీసుకొని అక్కడక్కడ పేజీలు తిప్పాను. రెండు మూడు పేజీలు చదివి షాక్‌కి గురయ్యాను. కథలో పాత్రల పేర్లు ఎక్కడా లేవు. మొత్తం స్క్రిప్టంతా రవితేజా, త్రిషా, ఆలీ, సునీల్ ఇలాంటి పేర్లతో ఉంది. ఇది చూసి ఆశ్చర్యపోయాను. “పాత్రల పేర్లు లేవు నటుల పేర్లున్నాయేమిటని?” అడిగాను. “మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలీదు సార్! ఇక్కడ నిర్మాతలకి కథలిలా రాస్తేనే బుర్రకెక్కుతాయి. అప్పుడే వాళ్ళు దాన్ని విజుయలైజ్ చేయగల్రు” అంటూ స్క్రిప్టోపదేశం చేసాడు.

ఆయన మాటలు విన్నాక తెలుగు సినిమా పరిశ్రమ ఎంత భావ దారిద్ర్యంలో ఉందో, ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో వుందో  తెలిసింది. ఎక్కడైనా కథని బట్టి పాత్రలుంటాయి. తరువాత నటులు ప్రవేశిస్తారు. తెలుగు సినిమా దీనికి విరుద్ధం. ఇక్కడ నటులే ఉంటారు. వారి పాత్రలు ప్రతీ సినిమాలోనూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అందుకే రాసే వాళ్ళకి పాత్రల పేర్లు వెతుక్కోవలసిన శ్రమ లేదు. చక్కగా రవితేజా, త్రిషా, ఆలీ, బ్రహ్మానందం అంటూ పాత్రల్ని రాసేసుకోవచ్చు. పైన చెప్పిన సంఘటన నన్ను నిజంగానే షాక్‌కి గురిచేసింది. దాన్నుండి తేరుకోకుండానే మరో షాక్ ఇచ్చాడా రచయిత గారు. అప్పుడే విడుదలైన ఒక పెద్ద హీరో సినిమా స్క్రిప్టు మొత్తం ఇలాగే రాసారనీ, తనూ అదే స్టైల్లో రాసాననీ చెప్పాడు. ఇదంతా విని నోట మాట రాలేదు. అప్పుడర్థమయ్యింది తెలుగుసినిమాలెందుకు అంత చెత్తగా తగులడుతున్నాయోనని. కథ చెబుతానని ఆయన ఉత్సాహం చూపించినా నేను పనుందని  తప్పించుకున్నాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక మూసలో కొట్టుకుంటోంది. ఆ బావి నుండి బయటకి రావడానికెవరూ ప్రయత్నించడం లేదు. అవే కథలూ – అవే పాటలూ – అదే సంగీతమూ – అలాగే హీరోలూ-రచయితలూ- వగైరా-వగైరా. ఇందులోంచి బయట పడలేకపోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమొక్కటే ఇలా ఏడుస్తోంది. తమిళ, మళయాళ సినిమాలు లక్ష రెట్లు నయం. మంచి మంచి కథలతో, కథనాలతో ముందుకొస్తున్నారు. అవార్డులూ, రివార్డులూ తీసుకుంటున్నారు. ఈ మధ్యనే ఈరం అనే ఒక తమిళ సినిమా చూసాను. ఇది తమిళంలో పెద్ద హిట్ సినిమా. మంచి పేరొచ్చింది. కాంజీవరం సినిమా డి.వీ.డీ కని వెళితే ఇది దొరికింది. ఈ సినిమా గురించి కొద్దిగా విన్నాను. తీరా చూస్తే చాలా బావుంది. ఎంత బాగా నచ్చిందంటే ఈ సినిమాగురించి రాయాలన్నంత బాగా నచ్చింది.

పాత కథ అనే అయినా తీసిన విధానమూ, కథ నడింపించిన తీరూ రెండున్నర గంటల సేపు తల తిప్ప కుండా చూసేలా చేసాయి. తెలుగు వారికి ఎంతగానో పరిచయమున్న దర్శకుడు “శంకర్” ఈ సినిమాకి నిర్మాత. తన దగ్గర పనిజేసే ఒక సహాయ దర్శకుడి ప్రతిభని గుర్తించీ,  ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీసాడు. ఈ ఈరం సినిమాకి దర్శకుడు, అరివళగన్ ( తమిళ పేరు సరిగ్గా రాయకపొతే క్షమించాలి) అనే అతను. ఇతను ఫిల్మ్ స్కూల్‌నుండి డిగ్రీ తీసుకున్నాక శంకర్ దగ్గర చేరాడు.

ఈ సినిమా కథ అంత గొప్ప కథేమీ కాదు. అందరికీ పరిచయమున్న అంశమే! చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఒకామె చనిపోతుంది. అది పోలీసులకి కబురందుతుంది. ఆ చనిపోయిన అమ్మాయి రమ్య ( సింధు మీనన్ ) శవం బాత్రూం టబ్ నీళ్ళల్లో పడి ఉంటుంది. నిద్ర మాత్రలు మింగి చనిపోయిందనీ, ఆత్మ హత్యనీ వార్త బయటకొస్తుంది. ఈ కేసు చూడమని పోలీసు ఆఫీసర్ వాసుదేవన్‌కి ( ఆది ) అప్పజెబుతారు. తీరా అతను అక్కడికెళ్ళి చూస్తే ఆ చనిపోయిన అమ్మాయి అతని మాజీ ప్రియురాలు. దాంతో అతనికి ఆసక్తి పెరిగీ, ఎందుకిలా జరిగిందనీ వివరాలు సేకరించడం మొదలెడతాడు. రమ్యా, వాసూ ఇద్దరూ శ్రీరంగం కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. రమ్య తండ్రికి వాసూ నచ్చడు. రమ్యకీ, అతనికీ పొరపొచ్చాలొచ్చి ఇద్దరూ విడిపోతారు. రమ్యకి బాల (నంద) అనే అతనితో వివాహం జరుగుతుంది. రమ్య వాసూని పూర్తిగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. వాసు పోలీసాఫీసర్ గా చెన్నైలో స్థిరపడతాడు. రమ్య గురించి అతనూ మర్చిపోతాడు.

రమ్య చనిపోయే ముందు రోజు బాల ఆఫీసు పనిమీద వేరే ఊరెళెతాడు. దాంతో వాసూకి అతని మీద అనుమానం కలుగుతుంది. ఆ దిశగా అతను ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు. అందులో భాగంగా రమ్య ఊరెళ్ళి అతని చెల్లెల్ల్నీ, తండ్రినీ కలుస్తాడు. ఈ కేసు ముడి విడిపోతుందని అనుకుంటూండగా కొన్ని ఊహించని విషయాలు బయటకొస్తాయి. రమ్య చనిపోయిన తీరులోనే అదే అపార్టుమెంట్లో మరో రెండు హత్యలు జరుగుతాయి. చివరకి వాసూ ఈ హత్య మిస్టరీని ఎలా చేదించాడన్నది ముగింపు.

అతి మామూలు కథని అతి రసవత్తరంగా తెరకెక్కించాడు. కథలో ఎక్కడా పట్టు సడలకుండా మొత్తం సినిమానీ నడిపించాడు. పైన సూటిగా చెప్పిన కథని మలుపులూ, ఫ్లాష్ బాక్‌లతో కలిపి మరింత ఇంటరెస్టెంగా చేశాడు. సినిమా ప్రారంభించడమే హత్యతో మొదలవుతుంది. అపార్టుమెంటులో ఒక ఇంటి నుండి నీళ్ళు బయటకొస్తూ, ఆ ఫ్లోర్ మొత్తం తడిపి, రాత్రి రెండుగంటల సమయంలో చివరకి వాచ్‌మెన్ కంట పడుతుంది. అక్కడ మొదలైన కథలో, ప్రతీ పాత్ర ప్రవేశమూ ఆసక్తి కలిగించేలా కథలో కలుపుకుంటూ ముందుకెళతాడు దర్శకుడు.

రమ్య వాసూ మాజీ ప్రియురాలని మాత్రమే మొదట్లో చెప్పీ, అక్కడక్కడ సన్నివేశాన్ని బట్టీ, సందర్భానుసారంగా కొద్ది కొద్దిగా వాళ్ళ గత ప్రేమ గురించి చూపిస్తాడు. ఇదంతా ఫ్లాష్ బాక్‌లో చూపించడంవల్ల మరింత ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఈ మధ్య కాలంలో “అనుకోకుండా ఒక రోజు” తర్వాత ఇంత క్రిస్ప్ గా ఎడిటింగ్ చేసిన సినిమా చూళ్ళేదు. ఏ సన్నివేశంలో ఏ షాటెంత వరకూ చూపించాలీ అనే ప్రాథమిక సూత్రాన్ని సినిమా మొత్తమూ వాడుకొన్నారు. ఇహ ఈ సినిమాకి ఆయువు పట్టు సినిమాటోగ్రఫీ! మూడొంతుల సినిమాని ఇదే నడిపించేసింది. సినిమాటోగ్రఫీ బాధ్యత చేపట్టింది మనోజ్ పరమహంస అనే కొత్తతను. ఇదే ఇతనికి మొదటి సినిమా. సినిమా చూస్తున్నంత సేపూ పి.సి.శ్రీరాం,బాలూ మహేంద్రలు గుర్తుకొచ్చేలా తనదైన శైలిలో చూపించాడు. ముందు ముందు ఇతని చేతుల్లో చాలా మంచి చిత్రాలొచ్చే అవకాశం వుంది. ప్రతిభకల సినెమాటోగ్రాఫర్ ని ఎన్నుకోడంలోనే దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. సినిమాలో అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు కనిపించినా అవి కథనీ, కథనాన్నీ చెడగొట్టవు. అవీ ప్రత్యేకంగా పట్టి పట్టి చూస్తే గానీ గమనించలేం. సంగీతంకూడా ఎక్కడెంత అవసరమో అంతే ఉంది. ఎక్కడా మోతాదు మించి ఉండదు. మిగతా హారర్, థ్రిల్లర్ సినిమాల్లోలాగా మీ చెవులు చిల్లులు పడి కర్ణభేరి కోల్పోయే అవకాశముండదు.  క్రైం థ్రిల్లర్ లో ప్రేమనీ, మిస్టరీనీ చక్కగా ఇమిడ్చిన  సినిమా.  అలాగే కంప్యూటర్ గ్రాఫిక్సుని కధాపరంగా ఎంత చక్కగా వాడుకోవచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది..

నటీ నటులవరకొస్తే సింధు మీనన్, ఆది బాగా చేసారు. ఈ ఆది అన్నతను మృగం డబ్బింగ్ సినిమాలో హీరోగా నటించాడు. ‘బాల’గా నంద బాగానే చేసాడు. కాస్త నెగిటివ్ షేడ్సున్న పాత్రది. రమ్య చెల్లెలుగా శరణ్యా మోహన్ చేసింది. మొదటి సగంలో ఈ పాత్ర అంతగా లేకపోయినా రెండో భాగంలో ఎక్కువగానే ఉంది. సినిమా చూస్తున్నంత సేపూ దర్శకుడికిది మొదటి సినిమా అన్న ఫీలింగు మనకి కలగదు. అరివళగనే ఈ సినిమాకి కథా, స్క్రీన్‌ప్లే, మాటలూ రాసుకున్నాడు. ఇతను బాయిస్, అపరిచితుడు సినిమాలకి శంకర్ దగ్గర సహాయకుడిగా పనిజేసాడు. అతని శ్రమ ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. తెలుగులో శేఖర్ కమ్ముల్లాగా ఇతనికీ వర్షం అంటే ఇష్టం అనుకుంటాను. సినిమాలో చాలా భాగం వర్షంలోనే నడుస్తుంది. ప్రేమ సన్నివేశాలు వర్షంలో చూపించడం వల్ల ( మణి రత్నం సినిమాల్లోగా ) తెలీని నేటివిటీ వచ్చేసింది. అలాగే ఇందులో జరిగిన హత్యలకీ. నీళ్ళకీ సంబంధముంటుంది. అందుకే ఈ సినిమాకి ఈరం ( నీరు ) అని పేరు పెట్టారు.

చాలా మంచి సినిమా అనను కానీ, ఖచ్చితంగా చూడచ్చు. కనీసం స్క్రీన్‌ప్లే గురించయినా ఈ సినిమా తప్పనిసరిగా చూడచ్చనీ చెప్పగలను. మీకు తమిళం రాకపోయినా పరవాలేదు. సినిమాలో మాటలు తక్కువగానే ఉంటాయి. దృశ్యమే సగంపైగా కథని చెప్పేస్తుంది. కాబట్టి భాషతో నిమిత్తం లేకుండా హాయిగా చూసి ఆనందించవచ్చు.  సినిమా మొత్తం ఫొటోగ్రఫీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

సినిమా అభిరుచున్న అనేకమంది ఔత్సాహికులు తెలుగు సినిమారంగంలో అవకాశాలకోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారందరికీ నాదొకటే సలహా! మీకు కాస్త ప్రతిభా – అదే టాలెంటూ,  వుందన్న నమ్మకం పిసరంతున్నా తమిళ, హిందీ, మళయాళ (కన్నడ కూడా పరవాలేదు) రంగాల వైపు దృష్టి పెట్టండి. భాష రాకపోతే ఏడాదిపాటు కష్టపడి నేర్చుకోండి. అంతే తప్ప తెలుగు సినిమారంగంలో ఏదో కుళ్ళపొడిచే అవకాశమొస్తుందని ఎదురుచూస్తూంటే మాత్రం మీకు ఏవొచ్చినా రాకపోయినా ఖచ్చితంగా “పరమ ఆశాచక్ర” అనే బిరుదు వస్తుందని నా నమ్మకం.  అనుమానముంటే కృష్ణా నగర్లో ఏ చిన్న పిల్లాణ్ణైనా అడిగి చూడండి.

ఇదివరకూ నవతరంగంలో వచ్చిన ‘ఈరమ్’ చిత్ర సమీక్షను చూడండి.

–సాయి బ్రహ్మానందం గోర్తి

66 Comments
 1. పులి రాజా November 18, 2009 / Reply
 2. jatardamal November 18, 2009 / Reply
   • jatardamal November 18, 2009 /
 3. కొత్తపాళీ November 18, 2009 / Reply
 4. pappu November 18, 2009 / Reply
 5. Sai Brahmanandam November 19, 2009 / Reply
  • sankar November 19, 2009 / Reply
   • jatardamal November 19, 2009 /
   • sankar November 21, 2009 /
   • Sai Brahmanandam November 20, 2009 /
   • sankar November 21, 2009 /
  • sankar November 19, 2009 / Reply
   • పులి రాజా November 19, 2009 /
   • sankar November 21, 2009 /
  • కొత్తపాళీ November 19, 2009 / Reply
 6. అబ్రకదబ్ర November 20, 2009 / Reply
 7. శివ కిషోర్ కందుకూరి November 21, 2009 / Reply
   • sankar November 22, 2009 /
   • శివ కిషోర్ కందుకూరి November 22, 2009 /
   • శివ కిషోర్ కందుకూరి November 22, 2009 /
 8. yardstick November 22, 2009 / Reply
  • శివ కిషోర్ కందుకూరి November 22, 2009 / Reply
 9. రవి November 23, 2009 / Reply
   • శివ కిషోర్ కందుకూరి November 23, 2009 /
   • naaistamnaadi November 23, 2009 /
  • Jonathan V November 25, 2009 / Reply
 10. రవి November 23, 2009 / Reply
 11. Sai Brahmanandam Gorti November 23, 2009 / Reply
 12. naaistamnaadi November 24, 2009 / Reply
  • పులిరాజా November 24, 2009 / Reply
   • naaistamnaadi November 24, 2009 /
 13. రవి November 24, 2009 / Reply
   • Sandeep Kanchibhotla November 25, 2009 /
   • Heera November 25, 2009 /
   • Jonathan V November 25, 2009 /
   • శంకర్ November 25, 2009 /
   • Sandeep Kanchibhotla November 25, 2009 /
   • శంకర్ November 25, 2009 /
   • విజయవర్ధన్ November 25, 2009 /
   • harsha November 26, 2009 /
   • రవి November 25, 2009 /
 14. someonefromsomewhere November 25, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త November 26, 2009 / Reply
   • Sandeep Kanchibhotla November 26, 2009 /
   • harsha November 26, 2009 /
 15. Phanindra November 26, 2009 / Reply
 16. naaistamnaadi November 26, 2009 / Reply
 17. pandu gaadu November 26, 2009 / Reply
 18. రాజమౌళి November 27, 2009 / Reply
  • navdeep November 27, 2009 / Reply
 19. సుకుమార్ November 27, 2009 / Reply
 20. venu November 27, 2009 / Reply
 21. РОСС December 8, 2009 / Reply
 22. kumar December 17, 2009 / Reply
  • రవి December 17, 2009 / Reply
 23. domostroy.org December 22, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *