Menu

బాబోయ్ అవార్డు సినిమాలు-నాలుగవ భాగం

art-appఎప్పుడో ఆగిపోయిన ఈ సీరీస్ ని [మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం] మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తేవడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీలేవు. కానీ గతంలో చర్చించిన విషయాలకంటే ఈ సారి అక్కడక్కడా కళ గురించి నేను చదివిన కొన్ని విషయాలు పాఠకులతో పంచుకుందామనే లక్ష్యంతో ఈ వ్యాసం మొదలుపెడ్తున్నాను.

ముందుగా సినిమా అనేది ఒక కళ అనే విషయంలో అనుమానం లేదనుకుంటాను. అయితే ఈ కళ అధిక మొత్తంలో డబ్బులతో కూడుకున్నది కాబట్టి ఆ డబ్బులు పెట్టే నిర్మాత నెత్తిన గుడ్డ వేసుకునే పరిస్థితి రాకుండా ఉండేలా రిస్క్ లేని సినిమా తీయడం మరో రకమైన కళ అయ్యింది. అలాగే సినిమా చూడడానికి వచ్ఛేవారిలో అధిక శాతం కేవలం వినోదం కోసం వస్తారు కాబట్టి ఏదో విధంగా వారిని మైమరిపించేలా చేయడం కోసం సినిమా తీయడం మరో రకమైన కళ అయ్యింది. ఇలా వేరు వేరు రకాలుగా సినిమా అనే కళ evolve అయినప్పటికీ సినిమా అనే కళా ప్రక్రియను నిర్మాత కోసమో, ప్రేక్షకుల కోసమో లేదా మరొకరి కోసమో తదనుగుణంగా మార్చకుండా తను నమ్మిన విధంగా సినిమా తెర అనే కాన్వాస్ పై ఒక కొత్త లోకాన్ని సృష్టించి అందులో పాత్రలకు జీవం పోసే ప్రయత్నం చేసే దర్శకులూ అక్కడక్కడా ఉన్నారు.

అయితే ఇక్కడే ఒక చిక్కు ప్రశ్న. ఫలానా రకమైన సినిమా కళాత్మకమైనదనీ ఫలానా సినిమా కాదనీ ఎలా చెప్పగలము? ఇది నిజంగానే చాలా కష్టమైన ప్రశ్న. మానవులందరూ ఒకే విధంగా ఆలోచించరు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక definition తో ఇదీ కళాత్మకమైన సినిమా అని చెప్పలేము. అయినప్పటికీ కొన్ని సినిమాలు చూడగానే ఇందులో ఇసుమంతైనా కళలేదు అనే విషయం ఇట్టే చెప్పెయ్యొచ్చు. అలాగే కొన్ని సినిమాలు చూసినప్పుడు వ్యక్తము చెయ్యలేని అనుభూతికేదో గురవుతాము. అలాంటి సినిమాలు మనల్ను ఈ ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళి సినిమాలోమ్ సృష్టించిన లోకాల్లో తరలింపచేసి ఆ పాత్రల భావోద్వేగాలను మనల్నూ అనుభవింపజేసేలా చేస్తాయి. కేవలం కొన్ని సినిమాలు చూసినప్పుడు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం చర్చిద్దాం.సినిమా అనేది కళే కాబట్టి, అసలు కళా స్వరూప విచారణ చేద్దాం.

కళా స్వరూప విచారణ: తల్లావజ్ఝుల కృత్తివాస తీర్థుల వారి వ్యాస వింశతి అనే పుస్తకంలో “కళా స్వరూప విచారణ” అనే వ్యాసంలో ఈ విధంగా కళా స్వరూపం గురించి ఈ విధంగా పేర్కొన్నారు.

చక్కని కావ్యమును పఠించినను, మనోహరమైన శిల్పసౌందర్యమును తిలకించినను, కర్ణరసాయనమగు గానామృతమునాస్వాదించినపుడును, ప్రకృతియందలి రామణీయకము దర్శించినపుడును మన హృదయము పరవశమై, రెక్కలు కట్టకుని ఊహాప్రపంచ సీమలలో విహారమొనర్చి ఆవ్యక్తమగునలౌకికానంద పారవశ్యమును చవిచూచును. లౌకిక ప్రపంచమున సంభవించు నిర్జీవపు సంఘటనలు, క్షణికములై, సుఖదు:ఖాదులు మహాసముద్రంవంటి నిరంతరశాంతి, కళాస్వాదనసమయమున విస్మరణసీమలకు బోవును. ఆనందమనుభవించవలసినదే కాని వ్యక్తము చేయుటకు సులభసాధ్యము కాదు. ఆనందమనుభూతియందుండవలెను గానీ, ఇదమిద్థమని శాస్త్రఏత్తలవలె కళాస్వరూపమును నిర్వచించి, యందిది యిట్టిదని పృధక్కరణము చేయలేము. కళలను వర్ణింపవచ్చును గాని నిర్వచింపవీలు లేదు.కళ పరమ ప్రయోజనము మానవకోటికానందానుభవము కలిగించిటయే!

ఈ వ్యాసంలో రెండు విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఒకటి-“లౌకిక ప్రపంచమున సంభవించు నిర్జీవపు సంఘటనలు మర్చిపోయేలా చేసి ప్రేక్షకులను విస్మరణ సీమలకు తీసుకెళ్ళేదే నిజమైన కళ”. ఇక రెండవది-“కళ పరమ ప్రయోజమనము మానవకోటికానందానుభవము కలిగించుటయే!” అన్నది. ఈ రెండు విషయాలు ఎందుకు ఆసక్తికరమైనవన్నానో చెప్పాలంటే మనం చర్చించే విషయానికి రావాలి. అదే అవార్డు సినిమాల సంగతి. అవార్డు సినిమాలనగానే బాబోయ్ అని ఎందుకు జనాలు పారిపోతున్నారో చూద్దాం.

లౌకిక ప్రపంచంలోని ఏ నిర్జీవపు సంఘటనలు మర్చిపోదామని సినిమాకొస్తారో ఆ నిర్జీవపు సంఘటనలతో కూడిన సినిమాలే ఎక్కువ అవార్డులు పొందుతున్నాయని చాలామంది వాదన. అలాగే కళ యొక్క ప్రయోజనం ఆనందానుభవమైనప్పుడు ఆ ఆనందం కలిగించకపోగా దు:ఖమయమైన జీవితాలతో కూడిన పాత్రల కథలు ఈ అవార్డు సినిమాలకు నేపథ్యం అవుతున్నాయనేది కూడా ఇంకొక వాదన. ఈ రెండు విషయాలను బట్టి చూస్తే ఎవరైనా అవార్డు సినిమాల గురించి బాబోయ్ అని బెంబేలు పడడంలో ఆశ్చర్యం లేదు. అయితే “కళ:దాని పరమార్థము” వ్యాసంలో ఇదే రచయిత ప్రస్తావించిన మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం.

కళ: దాని పరమార్థము

బుద్ధి వైశాల్యము లేనివారికి ప్రకృతి సౌందర్యమును విప్పి చెప్పగల శక్తియుండదు. అట్టివారు కళారహస్యమును గానీ, కవి తత్త్వమును గానీ గ్రహింపలేరు. కళ యొక్క ముఖ్యాదర్శము భావనివాసము. ఆవేశము కలిగించి తద్వారా ఆనందమును జనింపజేయుట నిర్మల హృదయము లేనివానియందు ఈ నాజూకు గుణములు నశించి సౌందర్యమును గ్రహించు శక్తి హీనమైపోవును.

మనుష్యుడు చేయు ప్రతి కార్యము జీవిత విధానమున మార్పు కలిగించును. మంచిని గాని చెడును గానీ, కొత్తగా నుద్భవింపజేయును జీవితము సన్మార్గమున పోవుచున్నదా, అని పరీక్షించుకొనుటకు లోని కళాభివృద్ధియే సాక్షి. కళ అనగా ఇతర పనులను, వస్తువలను తిరిగి ప్రకటించుటకాదు, మన యనుభవములోని రహస్యమును వెల్లడించి సన్మార్గమును విశదపరచుటే

ఎలాగైతే కళా రహస్యాన్నీ, కవి తత్త్వాన్ని గ్రహించడానికి బుద్ధి వైశాల్యము అవసరమో అలాగే ఈ సో కాల్డ్ అవార్డు సినిమాలను చూసి బాబోయ్ అని పారిపోకుండా ఆయా చలనచిత్రాలలోని రహస్యాలను సౌందర్యాన్ని దర్శించాలంటే కాస్తంత పరిజ్ఞానం అవసరమని నా అభిప్రాయం. ముఖ్యంగా మన దేశంలో సినిమా అనే ప్రక్రియ కేవలం నాటకమనే ప్రక్రియను replace చేసి నాటకంలోని వివిధ అంశాలనే తిరిగి సినిమా కోసం ఉపయోగించారు కానీ సినిమా అనే ప్రక్రియలోని ఎన్నో possibilities ని explore చేసిన వాళ్ళు చాలా తక్కువ. అలా చేసిన వారిని అర్ట్ సినిమా డైరెక్టర్లనీ ఆ సినిమాలను ఆర్ట్ సినిమాలనీ వెలి వేశారు ప్రేక్షకులు. సినిమా అనే ప్రక్రియ మొదలైనప్పటినుంచీ ప్రేక్షకుల భావములు వైశాల్యము చెందక cinema going అనే అనుభవం పరిపక్వం చెందలేదని నా అభిప్రాయం.

సినిమా అనే medium అధిక శాతం కేవలం కథ చెప్పడానికి మాత్రమే వినియోగించడంలో వచ్చిన తంటా ఇది. అయితే కేవలం మంచి కథానుభవం కోసమే అయితే రేడియో నాటకాలు, రంగస్థల నాటికలు మాత్రమే సరిపోతాయి. ఇందాకే చెప్పినట్టు సినిమా అనే మీడియంకి ఉన్న possibilities వేరు. చాలా మంది ప్రేక్షకులకు ఈ possibilities గురించి అవగాహన లేకపోవడమే ఆర్ట్ సినిమాలనబడే కళాత్మకమైన సినిమాలను ఆదరించలేకపోవడానికి ముఖ్యకారణమైఉండొచ్చు.ఇక్కడే మనం రసాస్వాదన గురించి చర్చించుకోడానికి అవకాశం దొరుకుతుంది. ముందుగా ఈ విషయం గురించి తల్లావజ్ఝుల వారి అభిప్రాయం తెలుసుకుందాం.

రసాస్వాదన:

అనుభవానికి హృదయం అవసరం. ఏ కళలో మాధుర్యమైనా ఇంపుగా ఉన్నదంటే హృదయ సంవాది అయినదనే చెప్పాలి. మధురమైన అమరగానము, చైతన్యం గల శిల్ప సౌందర్యము హృదయానికి సోకుతవి. కావ్యకళగానీ, మరేకళ గామీ ఆస్వాదించడానికి హృదయమే కావాలి……మానవుడు సృష్టి అయినప్పుడే అతనిలో ప్రాతిభాసిక మైన జ్ఞానలేశము (Intuition) స్వతస్సిద్ధముగానే ఉంటుంది. అయితే ఆ జ్ఞానము బహుకొద్దిమందిలో విజృంభించి వారు జ్ఞానమూర్తులుగాను కళోపాసకులుగానూ చేస్తుంది.

అయితే మానవుడన్న ప్రతివాడికీ హృదయంలో కొద్దిగానీ గొప్పగానో పైన చెప్పిన భావాలుంటాయి. అయితే రసాసాదనకు ఈ హృదయం కంటే కూడా మరో ముఖ్యమైనది అవసరముంది. అదే జ్ఞానం. అయితే రచయిత పేర్కొన్నట్టు మన దేశములో ముఖ్యంగా మన రాష్ట్రంలో సినిమా అనే కళ కోసం తమ జ్ఞానాన్ని విజృంభింపచేసిన సినీ పండితులు పెద్దగా లేరు కాబట్టే మన దగ్గర సినీ కళోపాసకులు తక్కువ అని నా అభిప్రాయం. అందుకు కారణాలు వెతకాల్సిన అవసరం ఎంతో ఉంది.

రసాస్వాదనకు ఆటంకాలు, మన రాష్ట్రంలో ఫిల్మ్ స్టడీస్ లేమి, కళ కళ కోసమేనా లాంటి మరికొన్ని అంశాలతో త్వరలో మరో వ్యాసం