ప్రతి వ్యక్తికి ఒక వృత్తి, ప్రవృత్తి ఉంటాయి. అలాగే పోటీలు, అసూయలు మొదలైనవి మామూలే. కాని భార్యాభర్తల మధ్య అసూయ , అభిమానం అనేది ఎంత పెద్ద అగాధాన్ని సృష్టిస్తుందో ఒక అందమైన చిత్రం ద్వారా మన కళ్లముందు ఉంచారు హృషికేశ్ ముఖర్జీ.
ఈరోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయక తప్పడంలేదు. ఇద్దరు వేరు వేరు వృత్తులలో ఉండి రాణిస్తే అంత గొడవ ఉండకపోవునేమో. కాని ఒకే వృత్తిలో పనిచేస్తున్న ఇద్దరిలో ఒకరికి లభించే పేరు ప్రఖ్యాతులు ఇంకొకరిని బాధించి వారిద్దరి మధ్య ఎన్నో కలతలు సృష్టిస్తుంది. స్త్రీ తన భర్తను అమితంగా ప్రేమిస్తుంది. అతనికోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతుంది. భర్త తన రంగంలొ గొప్ప ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకుని అందరి మన్ననలు పొందుతుంటే చూసి భార్య అది తనకే లభించినంతగా గర్వంతో పొంగిపోతుంది. కాని భార్య తనకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే (అదీ ఇద్దరు ఒకే వృత్తిలో ఉన్నప్పుడు ) ఆ భర్త భరించగలడా. ఆమె ఉన్నతిని చూసి గర్వించగలడా?ఇంకా ఉన్నత శిఖరాలు అందుకోవడానికి ఆమెకు చేయూత నివ్వగలడా?? వీటన్నింటిని ఒక అందమైన దృశ్యకావ్యంలా చూపిస్తుంది “అభిమాన్”.
ఇందులో హీరో సుబీర్ (అమితాబ్ బచ్చన్) సినీ గాయకుడు. మంచి పేరున్నవాడు . బాగానే సంపాదిస్తున్నాడు. ఒకసారి తనను పెంచి పెద్ద చేసిన మౌసీని చూడడానికి పల్లెటూరు వెళ్లిన సుబీర్ కి ఉమ అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఎత్తులు,జిత్తులు తెలీని అమాయక పల్లెపడుచు. ఆనందం , దుఖం కలిగినప్పుడు, దేవుని సన్నిధిలో తనకు తానే పాడుకుంటుంది. ఆమే కోకిల స్వరమాధుర్యానికి పరవశుడై సుబీర్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె గానకళను అందరిముందు గర్వంగా ప్రదర్శిస్తాడు. అది విన్న సినిమావాళ్లు ఆమె వెంట పడతారు. మొదట్లో భార్యను ప్రోత్సహించిన సుబీర్ మనసులో రాన్రాను ఆమే తనకంటే ఎత్తుకు ఎదగడం చూసి అసూయ మొదలవుతుంది. ఉమ గానం ఎంత ప్రసిద్ధి చెందుతుందంటే ఆమె పాట కోసం సినిమా వాళ్లు సుబీర్ కంటే ఎక్కువ డబ్బు ఇస్తామంటారు. దీనితో సుబీర్ లోని అభిమానం దెబ్బతింటుంది. అసూయ పెరిగి మగాడనే అహంకారం పెరిగిపోతుంది. అది గమనించిన ఉమ తాను పాడడం మానేస్తానంటుంది. అది కూడా తట్టుకోలేడు సుబీర్. తాగడం, భార్యను మానసికంగా హింసించడం మొదలుపెడతాడు. ఇంటికి రావడం మానేస్తాడు. ఈ మానసిక క్షోభ భరించలేక ఉమ తన పుట్టింటికి వెల్లిపోతుంది. జరిగిన సంఘటనలతో కలత చెందిన ఉమ గర్భస్రావమై తన పుట్టబోయే బిడ్డను కోల్పోతుంది. దానితో మనసు వికలం చెంది బండశిలగా మారిపోతుంది. దేనికి చలించక, నవ్వక అలా కాలం గడిపేస్తుంది. చివరికి భర్తను కూడా పట్టించుకోదు మాట్లాడదు. చివరకు భార్య పరిస్థితి చూసి చలించిపోయిన సుబీర్, మౌసీ మాటలతో తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి భార్యను క్షమించమని ప్రాధేయపడి ఇంటికి తీసుకొస్తాడు. గానం ఆమెకు ప్రాణమని తెలిసిన సుబీర్ అదే గానంతో ఆమెను మామూలు మనిషిని చేసుకుని అక్కున చేర్చుకుంటాడు.![]()
ఇది ఒక సినిమా కథ మాత్రమే కథ ఇలాంటి సంఘటనలు ఎన్నో కుటుంబాలలో జరుగుతుండొచ్చు. అలా అని అందరు మగవాళ్లు ఇలా ఉంటారని కాదు. భార్య ఎంత ప్రతిభావంతురాలైనా తనకంటే ఎక్కువ పేరు సంపాదిస్తే సంతోషించి ప్రోత్సహించే భర్తలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చునేమో. ఐనా జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల్లో ఈ ఇగో అనేది ఎందుకు? తమ భాగస్వామిని తనకు ఇష్టమైన వృత్తిలో ఎదగనిస్తే తప్పేంటి? సగటు భర్త ఎప్పుడూ భార్య తన కనుసన్నల్లో ఉండాలి. తనకంటే తక్కువే ఉండాలి అనుకుంటాడు.ఒకవేళ తనను అధిగమించిందంటే ఎక్కడ తనను గౌరవించదో? సమాజంలో అందరూ తనను అవమానకరంగా , హేళనగా చూస్తారో అనే భయం. ఇద్దరు కష్టపడేడి తమ సంసారం కోసమే కదా ?? ఇందులో హెచ్చు తగ్గులు ,అవమానాలు అని అనుకుంటే అది ఆ వ్యక్తిని రోజు రోజుకు పతనం చేస్తుంది . అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉన్న అభిమానం , ఆత్మీయత మటుమాయమైపోతాయి. సంతోషం పంచే ప్రేమతో గడపాల్సిన సంసారం యాంత్రికమవుతుంది. లేదా ఈ సినిమాలో ఉమలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తమ భాగస్వామిలోని అద్భుత ప్రతిభను గుర్తించి , ప్రోత్సహించాలి.
ఈ సినిమా నిర్మించిన హృషికేశ్ ముఖర్జీ మధ్యతరగతి జీవితాల్లొ వచ్చే మామూలు చిక్కులు, సమస్యలు సజీవంగా చిత్రించారు. భార్యాభర్తలుగా మారబోతున్న జయా, అమితాబ్ లను ఇందులో హీరో, హీరోయిన్లుగా తీసుకున్నాడు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో జీవించారని చెప్పవచ్చు. ముఖ్యంగా జయాభాదురి నటన అద్భుతం. ఇందులోని సంఘటనలు, ఆలోచనలు ప్రతి భార్యాభర్తలను నిజమేకదా అని అనుకోకుండా ఉండనీదు. ఇక ఇందులోని పాటలన్నీ సుస్వరాల మాలికలు. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ప్రతీ పాట సూపర్ హిట్. ఉదా.. “తీరీ బిందియా రే “, “”లుట్ కర్ మన్ కి నగర్”….
–జ్యోతి వలబోజు
రవి says:
అమితాబ్ సినిమా “ఆనంద్” తర్వాత అంత సున్నితమైన రీతిలో ఓ మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం అభిమాన్. ఇది తరాలుగా దాచుకోవలసిన చిత్రం.
మంచి పరిచయం.
నందమూరి బాలకృష్ణ says:
హ హ హ
ఏందీ
ఎన్నో కుటుంబాలలో జరుగుతుండొచ్చు. అలా అని అందరు మగవాళ్లు ఇలా ఉంటారని కాదు. భార్య ఎంత ప్రతిభావంతురాలైనా తనకంటే ఎక్కువ పేరు సంపాదిస్తే సంతోషించి ప్రోత్సహించే భర్తలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చునేమో
కాని అమితాబ్ ఇంట్లో ఏం జరుగుతోంది అమితాబ్ కి ఇష్టం లేకపోయినా జయ ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు
ఇప్పుడు అమర్ సింగ్ ఇంటి పెద్ద అంటే నమ్ముతారా
ఇంట్లో domination అంతా జయ దే
కొడుకు కోడలు భర్త మూసుకొని తన మాట వింటున్నారు
అందుకే సినిమాల్లో నే ఇలాంటివి చూస్తాం బయట జరిగేది వేరు
Sutti Subba Rao says:
గిదేందిరా బాలయ్యా.. మనం సినిమా గురించి మాట్లాడాలి గాని, వాళ్ళ ఇంటి వూసు మనకెందుకే.. ఊరుకో మళ్ళా..
లలిత says:
జ్యోతిగారు , మంచి సినిమా ని ఎంచుకున్నారు తెరీ బిందియారే…….పాట నాకూ ఇష్టం .
మగాడు అందవికారంగా ఉన్నా అమ్మయినయినా భార్యగా భరిస్తాడుకానీ , తనకంటే తెలివైన అమ్మయిని భార్యగా భరించలేడు . పైకి ఎన్ని చెప్పినా దెబ్బతిన్న ఇగో లోపల నివురుగప్పిన నిప్పులా ఉంటూనే ఉంటుంది. అవకాసం దొరికినప్పుడల్లా అది మాటలరూపంలోనో, చేతలరూపంలోనో ఇన్ డైరెక్ట్ గా బయటపడుతూనే ఉంటుంది. సినిమాల్లోలాగా తప్పుతెలుసుకోవటం పస్చాత్తాపపడటం అన్నది నిజ జీవితాల్లో అరుదుగా జరుగుతుంది . అది అలా సాగుతూనే ఉంటుంది. జీవితాలకి క్లైమేక్స్ తెలిసి రాదుకదా!
శివ కిశొర్ కందుకూరి says:
విడాకులైజేశన్ అవుతున్నకాలంలొ ఇలాంటి సినిమా అవసరం అనిపిస్తుంది…
మిత్రుడు says:
ఈ వ్యాసాన్ని సాక్షిలోంచి సేకరించారా మేడమ్ జో?
జ్యోతి వలబోజు says:
మిత్రుడుగారు, మా ఇంట్లో ఈ సినిమా సిడి ఉందండి.