Menu

The Blue Umbrella (2007)

blue-umbrella-3మొన్నోరోజు “ది బ్లూ అంబ్రెల్లా” సినిమా చూశాను – మళ్ళీ. మొదటిసారి చూసినప్పుడు నాకు ఓ మంచి హాయైన అనుభాతిని మిగిల్చింది ఈ సినిమా. ఇప్పుడంటే, విశాల్ భరద్వాజ్ పేరు మార్మోగిపోతోంది కానీ, మక్డీ, బ్లూ అంబ్రెల్లా – వంటి చిన్న పిల్లల సినిమాలు కూడా, ఓంకారా, కమీనే – వంటి సినిమాలు తీసిన మనిషే తీశాడంటే, కొంచెం వింతగానే ఉంటుంది నాకు ఇప్పటికీ. ఇదివరలో ఈ సినిమా గురించి ఓసారి వేరేచోట రాసాను – మొదటిసారి చూసినప్పుడు. అయినాసరే, ఇప్పుడు మళ్ళీ రాయాలనిపిస్తోంది.

(స్పాయిలర్లు కలవు)
కథ : హిమాచల్ ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో జరుగుతుంది కథంతా. ఊళ్ళోకెల్లా కాస్త డబ్బున్నవాడైన నందూ ఒక టీకొట్టు యజమాని. పర్యాటకుల రాక వీళ్ళకి ఆదాయం. పిల్లలకు చాక్లెట్లు అవీ అమ్ముతూ, వాళ్ళపై దాష్టీకం చేస్తూ, ఉంటాడు. ఊళ్ళోని ఒక అమ్మాయికి (మన కథానాయికకు) ఓ విదేశీ పర్యాటకుల గుంపు ద్వారా ఓ నీలంరంగు గొడుగు కానుకగా లభిస్తుంది. ఆ పిల్ల ఆ గొడుగు పట్టుకుని ఊర్లో తిరుగుతూ ఉంటే అందరి చూపులూ ఆమె మీదే. నందూ లాంటి వాళ్ళకి అసూయ. ఎలాగైనా ఆ గొడుగును తాను తీస్కోవాలని నందూ ఆ పిల్లని రకరకాలుగా మభ్యపెడతాడు. ఆమె లొంగదు. ఇలా ఉండగా, ఓ రోజు ఆ గొడుగును ఎవరో దొంగిలిస్తారు. ఈ అమ్మాయి నందూ పై అనుమానం వ్యక్తం చేస్తుంది. నందూ ఇల్లంతా సోదా చేసినా అది దొరకదు. దానితో అందరూ నందూ అమాయకుడని నమ్మి, క్షమాపణ అడిగి వెళ్ళిపోతారు. పంతంకొద్దీ నందూ పట్నం నుండి గొడుగు తెప్పించుకుంటాడు. ఇక అక్కడ్నుంచి నందూ ఓ వెలుగు వెలుగుతాడు ఊర్లో, ఆ గొడుగువల్ల. ఒకానొకరోజు వర్షంలో నందూ ఆ గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నప్పుడు, వర్షానికి రంగు వెలిసి పోయి, ఆ గొడుగు అసలు రంగైన నీలం రంగు బయటపడుతుంది.

అప్పుడే ఊరందరికీ తెలుస్తుంది, ఆ అమ్మాయి అనుమానం నిజమనీ, నందూ ఆ గొడుగు దొంగిలించి, దానిపై రంగు పూయించడానికి పట్నం పంపాడనీ. దీనితో గ్రామవాసులందరూ నందూని వెలివేస్తారు. కాలం గడుస్తుంది. నందూ ఒంటరివాడౌతాడు. అతని పరిస్థితి రాను రాను దిగజారుతూ ఉంటుంది. అయినా, ఎవరూ అతన్ని పట్టించుకోరు. ఇలాంటి రోజుల్లో ఒకరోజు ఆ అమ్మాయి తన గొడుగు తీసుకొచ్చి, కావాలనే అతని కొట్లో మర్చిపోయి వెళ్తుంది. దానితో నందూ మొదట ఆ గొడుగు నాశనం చేద్దాం అనుకుని, చివరికి ఆ అమ్మాయిని వెదుకుతూ వెళ్ళి గొడుగు ఆమెకి అప్పజెప్తాడు. నందూ మారాడని నమ్మిన ఆ అమ్మాయి అతనితో కలుస్తుంది. ఊరు కూడా నందూ ని క్షమిస్తుంది. దానితో, కథ సుఖాంతం ఔతుంది.

అసలు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటంటే :
1. ఫొటోగ్రఫీ. ప్రతి ఒక్క దృశ్యమూ మళ్ళీ మళ్ళీ చూడాలన్నంత అందంగా ఉంటాయి. ప్రకృతిననే కాదు, ఆ ఊరిని, ఊరు మనుష్యుల్నీ – అంతా చాలా బాగా చూపించారు.
2. సింప్లిసిటీ – కథ ఎంత సింపుల్ గా ఉంది, అలాగే, ఎంత ప్రశాంతంగా ఉంది వింటూ ఉంటే.. ఇది నిజానికి రస్కిన్ బాండ్ నవల. ఆ విషయం నేను ముందు చెప్పి ఉండాల్సింది అనుకోండి.. రస్కిన్ బాండ్ కథలు చదివిన వారికెవరికైనా అవి కలిగించే అనుభూతులెలా ఉంటాయో తెలుసు. ఈ కథ కూడా అలాంటి భావాలే కలిగిస్తుంది. ఆహ్లాదకరమైన అనుభవం ఈ సినిమా చూడటం.
౩. విశాల్ భరద్వాజ్ దర్శకత్వమే కాదు, సంగీతం కూడా అద్భుతం. ఈ సినిమా ఒక విధమైన ఆహ్లాదకరమైన అనుభూతి మిగులుస్తుందని అన్నానే, దానిలో సంగీతానికి పెద్ద పాత్ర ఉంది. గుల్జార్ రాసిన సాహిత్యం కూడా – చాలా సహజంగా ఆ పాత్రలకీ, ఆ నేపథ్యానికీ అమరింది.
4. అసలు, అన్నింటికంటే ముందు నాకు ఈ సినిమాని తల్చుకోగానే గుర్తు వచ్చేది – పంకజ్ కపూర్. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు – ఇతన్ని మించిన నటుడు ఇక పుట్టడేమో అనిపించింది – అంత అద్భుతంగా నటించాడు. సరిగ్గా అలాంటి చిన్న ఊర్లలో ధనవంతులైన దుకాణదార్లు ఎలా ఉంటారో, అంత డబ్బున్నా వారికి ఉండే అసూయ ఎలా ఉంటుందో – అతని హావభావాలు చూస్తే, వాళ్ళని చూస్తున్నట్లు ఉంటుంది కానీ, పంకజ్ కపూర్ ని చూస్తున్నట్లు ఉండదు. అలాగే,ఇతన్ని వెలివేశాక ఊర్లో తెలిసినవాళ్ళ పెళ్ళికి వెళ్ళి అవమానపడే సన్నివేశంలో – ఎంత కదిలించాడంటే – చెప్పడం కష్టం.
He was just mind blowing. ఇన్నిసార్లు తల్చుకున్నా కూడా, అతను ఉన్న ఒక్కో ఫ్రేమూ కళ్ళ ముందు అలా కదలాడుతూనే ఉంది. ఒకే మొహంలో ఎన్ని రకాల భావాలు క్షణాల తేడాలో పలికించవచ్చో – అసలు ఈ పాత్రని నటులకి కేస్ స్టడీగా ఇవ్వాలేమో.

రెండుసార్లు చూసినా కూడా హిమాచల్ యాస నాకు ఏ కాస్తో తప్ప అర్థం కాలేదు. ఈసారి కూడా సబ్ టైటిల్స్ ను ఆశ్రయించాను. అయితే, సినిమా నేటివిటీకి అదంతా బాగా సూటయింది అనుకోండి, అది వేరే విషయం.

“ది బ్లూ అంబ్రెల్లా” చిన్న పిల్లల సినిమా అని ముద్ర వేసి పెద్దవాళ్ళం మేము అని చూడ్డం మానకండి. ఈ సినిమాలో పాటలు విన్నాక, సినిమా చూశాక మీలోని చిన్నపిల్లలు బైటకి రాలేదంటే అప్పుడడగండి – నన్ను కాదు – విశాల్ భరద్వాజ్, గుల్జార్ లను.

5 Comments
  1. కొత్తపాళీ October 16, 2009 /
  2. Bhaavana October 16, 2009 /
  3. Manjula October 16, 2009 /
    • శ్రీహర్ష October 18, 2009 /
  4. శ్రీహర్ష October 18, 2009 /