Menu

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్

ScanImage002సినిమా కథ గురించి చదివే ముందు ఓ నిజ జీవితపు కథని చదవండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన దేశంలో నేరస్త జాతుల చట్టం అనే చట్టం ఒకటి ఉందేది. ఆ చట్టం కింద ఉత్తర భారత దేశానికి చెందిన మీనా, పార్ధీ తదితర కులాల వాళ్ళనీ, దక్షిణ భారత దేశానికి చెందిన ఎరుకల, తెలగపాముల, ఎర్రగొల్ల తదితర కులాల వాళ్ళనీ అరెస్ట్ చేసే వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు గుంటూర్ జిల్లా స్టూవర్ట్ పురం గ్రామం దగ్గర ఎరుకల కులస్తులకి వ్యవసాయ భూములు ఇచ్చి దొంగతనాలు మానిపించారు. స్టూవర్ట్ పురం గ్రామస్తులు దొంగతనాలు మానేసినా పోలీసులు వాళ్ళని వేధించి లేనిపోని కేసుల్లో ఇరికించడం మానలేదు. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా స్టూవర్ట్ పురం గ్రామం పైన రెయిడింగ్ చేసి అమాయకులని వేధిస్తారు. అసలు దొంగలు ఎక్కడో ఉంటారు. వాళ్ళు పోలీసులకి డబ్బులు ఇచ్చి తప్పించుకుంటారు. అసలు దొంగలు చేసిన తప్పుకి అమాయకులైన స్టూవర్ట్ పురం గ్రామస్తులు బలి అవుతారు. ఫలానా వాడు ఎరుకలోడు అని తెలిస్తే అతనికి ఉద్యోగం ఇవ్వడానికి భయపడతారు. అది కూడా స్టూవర్ట్ పురం ఎరుకలోడు అని తెలిస్తే అస్సలు ఇవ్వరు. పోలీసుల బిహేవియర్ వల్ల ఎరుకల వాళ్ళు ఇలా కష్టాలు పడుతున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు స్టూవర్ట్ పురం గ్రామస్తుల కష్టాలని సినిమాలో చూపించడానికి ప్రయత్నించారు. అతను సినిమాకి కథ ఎలా కంపోజ్ చేశారో ఇప్పుడు చూద్దాం.

సినిమాలో రాణా ప్రతాప్ (చిరంజీవి) తండ్రి రామస్వామి దొంగతనాలు మానేసి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాడు. అతను దొంగతనాలు మానేసినా అతని కుటుంబాన్ని పోలీసులు వేధిస్తుంటారు. స్టూవర్ట్ పురం గ్రామస్తులు దొంగతనాలు మానేస్తే తమకి లంచాలు రాకుండా పోతాయని పోలీసుల భయం. రామస్వామి రాణాని బాగా చదివించి పోలీస్ ఆఫీసర్ ని చేస్తాడు. కొడుకు పోలీస్ ఆఫీసర్ అయితే తనకి పోలీస్ వేధింపుల బాధ ఉండదు అని కలలు కంటాడు. వెంకటేశ్వర స్వామి గుడిలో నగలు దొంగతనానికి ప్రయత్నించి సెక్యూరిటీ గార్డుని చంపిన కేసులో రామస్వామిని ఇరికించి అతన్ని చిత్రహింసలు పెట్టి బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేస్తారు పోలీసులు. కోర్టు రామస్వామికి ఉరి శిక్ష విధిస్తుంది. రాణా పోలీస్ ఆఫీసర్ అయ్యి తన తండ్రిని ఉరి శిక్ష కోసం ఉంచిన జైల్ లోనే మొదట డ్యూటీలో చేరుతాడు. రాణా సమక్షంలోనే అతని తండ్రిని ఉరి తీస్తారు. కొంత కాలం తరువాత రాణా ట్రాన్స్ఫర్ అయ్యి తన సొంత ఊరికే సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వస్తాడు. వీరదాస్ అనే ప్రముఖ సంఘ సేవకుడు సంఘసేవ ముసుగులో దొంగల ముఠా నడుపుతుంటాడు. అతను ఒక రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకో పార్టీ నాయకులని చంపుతాడు. అతనికి పోలీసుల సపోర్ట్ కూడా ఉంటుంది. వీరదాస్ మనుషులు ఏ నేరం చేసినా అందులో స్టూవర్ట్ పురం గ్రామస్తులనే ఇరికిస్తారు. వీరదాస్ మనుషులు ట్రైన్ దోపిడీ చేస్తే రాణా వాళ్ళ బావ వెంకటరావుని కూడా ఇరికిస్తారు. రాణా గ్రామస్తుల దగ్గరకి వచ్చి ఇక నుంచి మీ మీద ఎలాంటి కేసులూ ఉండవు అని అభయమిస్తాడు. ఆ ఊరిలో స్థానిక ఎం.ఎల్.ఏ. అధికార పార్టీ వాడు, ఎం.పి. ప్రతిపక్ష పార్టీ వాడు. రెండు పార్టీల వాళ్ళూ గూండాలని పెంచి పోషిస్తుంటారు. ఎం.ఎల్.ఏ.కీ, హోం మంత్రికీ వీరదాస్ తో డైరెక్ట్ సంబంధాలు ఉంటాయి. పోలీస్ ఆఫీసర్లు కూడా వీరదాస్ ఇంటికి వచ్చి మందు, బిర్యాణీ పార్టీలు ఎంజాయ్ చేస్తుంటారు. వీరదాస్ కి కుడి భుజమైన మనిషి నడి వీధిలో స్కూల్ మాస్టర్ ని హత్య చేశాడని రాణా అతన్ని అరెస్ట్ చెయ్యడం వల్ల వీరదాస్ కీ, రాణాకీ మధ్య వైరం పెరుగుతుంది. ఇలా కథలో రక్తపాతం పెరుగుతుంది. రాణా మరదలు లూఠీ రాణీ నగలు దొంగతనాలు చేసి రంగాచారి అనే ఒక నగల వ్యాపారికి అమ్ముతుంటుంది. ఒక రోజు లూఠీ రాణీ గిల్టు నగ పట్టుకుని రంగాచారి దగ్గరకి వెళ్తుంది. రంగాచారి ఆ నగని చూసి అది గిల్టుది అని వెంటనే గుర్తు పట్టేస్తాడు. ఎలా గుర్తు పట్టావు అని అడిగితే వెంకటేశ్వర ఆలయంలో గిల్టు నగలు పెట్టిన అనుభవం తనకి ఉందని నోరు జారుతాడు. ఆ సమయంలో లూఠీ రాణిని వెనుక నుంచి ఫాలో అయిన రాణా అది వింటాడు. రాణా రంగాచారిని బెదిరించగా రంగాచారి అసలు విషయం బయట పెడతాడు. రెండేళ్ళ క్రితం వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గా ఎం.ఎల్.ఏ. ఉండేవాడు, అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా ఇప్పటి హోం మంత్రి ఉండేవాడు. వాళ్ళు వీరదాస్ తో కలిసి దేవాలయంలోని నగలు మాయం చేసి, గిల్టు నగలు పెట్టారు. ఆ గిల్టు నగలు రంగాచారి చేతే తయారు చెయ్యించారు. నగల దొంగతనం చూసిన ఆలయ సెక్యూరిటీ గార్డుని హత్య చేసి అందులో రాణా తండ్రి రామస్వామిని ఇరికించారు. ఈ నిజాలు చెప్పిన రంగాచారిని వీరదాస్ మనుషులు హత్య చేస్తారు. రాణా వీరదాస్ ని హత్య కేసులో అరెస్ట్ చేస్తాడు. వీరదాస్ ని వదిలెయ్యాలని రాజకీయ నాయకుల నుంచీ, పై అధికారుల నుంచీ రాణాకి ఒత్తిడులు వస్తాయి.

రాణా లాకప్ లో నెలల తరబడి డిటెన్షన్ లో ఉన్న కొందరు స్టూవర్ట్ పురం గ్రామస్తులని విడుదల చేసి వాళ్ళ చేత ఎం.ఎల్.ఏ. ఇంటిలో ఉన్న ఆలయ నగలు దొంగతనం చెయ్యిస్తాడు. ఈ రకంగా రాణా ఆలయ నగల దొంగతనం కేసులో అసలు దొంగలని బయట పెట్టాలనుకుంటాడు. కేసు నడుస్తుండగా వీరదాస్ సపోర్ట్ ఉన్న రాజకీయ పార్టీ మనుషులు వీరదాస్ ని విడుదల చెయ్యాలని కోరుతూ గొడవలు చేస్తారు. అదే సమయంలో వీరదాస్ ని విడుదల చెయ్యకూడదు అని అభ్యంతరం చెపుతూ స్టూవర్ట్ పురం గ్రామస్తులు శాంతియుత ఆందోళనలు చేస్తారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి పై డి.ఎస్.పి. కాల్పులు జరిపిస్తాడు. కథ సెకండ్ హాఫ్ లో హింసాత్మక ఘటనలు ఇలా ఎక్కువగా కనిపిస్తాయి. కథ చివరలో వీరదాస్ మనుషులు వినాయక చవితి సందర్భంగా మత ఘర్షణలు సృష్ఠించి, అందుకు ముఖ్య మంత్రిని బాధ్యుడిని చేసి రాజీనామా చెయ్యించి, తమ సపోర్టర్ అయిన హోం మంత్రిని ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటారు. రాణా వీర దాస్ మనుషులని నిరోధించి, ఆ ప్లాన్ ని విఫలం చేస్తాడు. వీరదాస్ ని వెంటాడి కొట్టి కరెంట్ షాక్ తగిలి చనిపోయేలా చేస్తాడు. రాణా మారుమూల అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చెయ్యబడడంతో ముగింపు వస్తుంది.

ఈ సినిమాలో రాణా మరదలు లూఠీ రాణీ (నిరోషా) కారెక్టర్ లో అనవసరమైన మసాలా ఎక్కువగా ఉంది. బాత్ రూంలో కూడా రాణీ రాణాని ఊహించుకోవడం, కర్రలతో కట్టిన బాత్ రూం గోడ కూలిపోవడం వగైరా సన్నివేశాలు అనవసరమైనవనే నేను అనుకుంటాను. దొంగ నగల రంగాచారిని పట్టుకుని రహస్యాలు తెలుసుకోవడానికి మాత్రం లూఠీ రాణీ కారెక్టర్ ఉపయోగపడింది. చిరంజీవి, నిరోషాలతో తీసిన అనవసరమైన మసాలా, కొన్ని ఎక్స్ట్రా హింసాత్మక సన్నివేశాలు ఉండడం వల్ల ఈ సినిమా నాకు కొంత వరకు నచ్చకపోయినా ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ మాత్రం నాకు నచ్చింది. పోలీసులు అసలు నేరస్తుల దగ్గర డబ్బులు తీసుకుని వదిలేసి అమాయకులని ఇరికించడం చాలా చోట్ల జరుగుతున్నదే. స్టూవర్ట్ పురం గ్రామంలో పోలీస్ బాధితులు మరీ ఎక్కువగా ఉండడం వల్ల స్టూవర్ట్ పురం పేరు రాష్ట్రం అంతా మారుమోగింది. దొంగలుగా ముద్రపడిన వాళ్ళందరూ దొంగలు కారు అని సినిమా రచయిత చెప్పదలచుకున్నారు కానీ నిజజీవితపు కథని కమర్షియల్ సినిమా మోడ్ లో చూపించడం వల్ల కొన్ని అనవసరపు మసాలా, ఎక్స్ట్రా హింసతో కూడిన సన్నివేశాలు కనిపించాయి. కమర్షియల్ మోడ్ సంగతి ఎలా ఉన్నా కథ యొక్క సందేశం మాత్రం నాకు నచ్చింది.

–ప్రవీణ్ శర్మ

6 Comments
  1. నేస్తం October 25, 2009 /
  2. Praveen October 26, 2009 /
  3. jatardamal October 26, 2009 /
  4. Praveen October 26, 2009 /
    • jatardamal October 26, 2009 /
      • Vasu October 28, 2009 /