Menu

శంకరాభరణం (1979) – నా అనుభవం

sankarabharanamఆ మధ్యోరోజు పొద్దున్నే లేచి ఏమీ తోచక సీడీలున్న షెల్ఫ్ తిరగేస్తూ ఉంటే, కనిపించింది – శంకరాభరణం అన్న పేరు. నేను ఇదివరలో ఈ సినిమాని ఒకసారి చూశాను. పూర్తిగా చూడలేదనుకుంటాను. అయితే, “దొరకునా ఇటువంటి సేవ” నేను డైలీ బేసిస్ లో తల్చుకునే పాటల్లో ఒకటి కావడం వల్ల ఈ సినిమా అంటే నాకు ప్రత్యేకాభిమానం ఉంది. ఆ కారణంచేత ఈ సినిమాను మళ్ళీ చూడటం మొదలుపెట్టాను. చూసి మూడువారాలౌతోంది. అయినా, ఇంకా ఆ వావ్ ఫీలింగ్ వదల్లేదు. అందుకనే ఈ రాత. మొదట్నుంచీ నాకీసినిమా గురించి ఒకే అనుమానం – అలా ఎలా అంత పెద్ద హిట్టైంది? శంకరశాస్త్రి అన్న పేరు అందరికీ తెలిసిన పేరుగా, సోమయాజులు అన్న మనిషికి అసలు పేరే అది అన్నట్లుగా నిలిచిపోయేంతలా జనానికి ఈ సినిమా ఎలా నచ్చింది? అని. నేను ఎవర్నీ ఏమీ అనట్లేదు కానీ, ఇలాంటి సినిమాని మన తెలుగు ప్రేక్షకులు అంతలా ఆదరించడం నాకసలు ఊహకందని విషయం. Right place at the right time – తరహాలో అంతా సరిగ్గా జరిగిందేమో మరి, ఈ సినిమాకి.

సినిమా కథ విషయానికొస్తే, సింపుల్గా ఒక్క వాక్యంలో చెప్పాలంటే – శంకరశాస్త్రి అన్న సంగీతకారుడి జీవితంలో కాలం తెచ్చిన మార్పులూ, అలాగే, ఒక యువతి తెచ్చిన మార్పులూనూ-అని చెప్పొచ్చు. యువతి-మంజు భార్గవి అనమాట. సినిమా అన్నాక – కథ కంటే కథనం చాలా ముఖ్యం, మూడు గంటలపాటు చాలామందిని ఏకకాలంలో ఒక గదిలో కూర్చోబెట్టి ఉంచాలి కనుక. కనుక, నా దృష్టిలో ఈ సినిమా గురించి చెప్పుకోడానికి ప్రధానంగా ఉన్నది – కథనం, సంభాషణలు, సన్నివేశాలు కూర్చిన తీరు. ఇక సంగీతం – మళ్ళీ మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నా వినాలనిపించదూ? ఈసారి చూడకముందు నేను “రాగం, తానం పల్లవి”, “ఓంకారనాదాను..”- వంటి పాటల్ని ఎక్కువ వినడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఈసారి చూసి, పాటలు రెండూ పూర్తిగా విని చూశాక అవి కూడా నచ్చేశాయి. పూర్తిగా లేకున్నా కూడా – “పలుకే బంగారమాయె”, “మానస సంచరరే”, “ఏ తీరుగనను దయజూచెదవో..”,”బ్రోచేవారెవరురా..” – వంటి పాటలు చాలా ఇష్టం ఈ సినిమాలో నాకు. అక్కడక్కడా సందర్భోచితంగా ఉండే నేపథ్య సంగీతం – వావ్. “సామజవరగమనా..” పాట చిత్రీకరణ, లిరిక్స్ – కరెక్టుగా ఆ దృశ్యం మూడ్ కి ఎంత బాగా సరిపోయాయో… నిజానికి నాకైతే – ఆ రెండో “బ్రోచేవారెవరురా..నిను విన…టటటట..” కూడా ఇష్టమే, లిరిక్స్ ని తీసి మామూలుగా వినడానికి.

సోమయాజులు మొదటిసారి మంజుభార్గవిని చూస్తాడే – ఆయన,వాళ్లమ్మాయీ నది దగ్గర సంగీత పాఠాలు చెప్పుకుంటున్నప్పుడు చూసి, పరవశించి మంజుభార్గవి నృత్యం చేసే దృశ్యం – అది నాకు చాలా ఇష్టం. శంకరశాస్త్రి వెళ్ళి పాశ్చాత్య సంగీతం పాడే యువకులతో మాట్లాడ్డం, పెళ్ళిచూపుల సీన్లో ఆయన కూతురుపై విరుచుకుపడడం, అప్పుచేసి మరీ దానం చేసే దృశ్యం, అక్షరాలను ముక్కలు చేసి కొత్త బాణీలు కడుతున్న దాసును మందలించడం, తులసిని తన ఇంట్లో వంట చేయమని చెప్పడం – వంటి దృశ్యాలు చాలు శంకరశాస్త్రి అంటే ఏమిటో జనానికి తెలీడానికి. శంకరశాస్త్రి తులసిని వేదికపైకి తీసుకొస్తే, ఆయన వాద్యగాళ్ళు వాక్ ఔట్ చేసే దృశ్యం, తులసి కొడుకు శంకరశాస్త్రి ఇంట్లో ప్రవేశించే దృశ్యం, చివర్లో అతను “దొరకునా ఇటువంటి సేవ” అని శంకరశాస్త్రి గొంతుకని అందుకోడం, శంకరశాస్త్రి-తులసి ఇద్దరూ ఒకేసారి మరణించడం : ఈ దృశ్యాలు చాలు కథ మొత్తం చెప్పేసి, ఒక్కో పాత్ర గురించి ఒక్కో ఆంచనాని కలిగించడానికి – కాదంటారా?

తులసి ఇంట్లో జరిగే దృశ్యాల్లో – అసలు సంభాషణలే లేకున్నా, మొత్తం కథనీ చెప్పేసారే – ఆ భాగం ఎన్నిసార్లు చూసినా ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది. ఇలాంటి సినిమాలో హాస్యం ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటాం కానీ, నేను చాలానే నవ్వుకున్నా. “నీకేం తెలీదు, నేను నీ దగ్గర పాఠం వినను” అని ఆండాళ్ళు అనే పిల్ల మన ఆధునిక సంగీతకారుడు దాసు దగ్గర్నుండి వెళ్ళిపోతున్నప్పుడు దాసు మొహం చూస్తే ఎవరికి నవ్వురాదు? అలాగే, క్లయంటుతో మాట్లాడుతూ ఉంటే, అల్లురామలింగయ్యని భార్య డిస్టర్బ్ చేయడం, ఆయన కేసు గురించి తడబడ్డం – ఆ సీక్వెన్స్ కూడానూ.

అలా ఆ సినిమా చూస్తున్నంతసేపూ రెప్పవాల్చకుండా స్క్రీను వంక చూస్తూనే ఉన్నాను, ఏమారకుండా నేపథ్య సంగీతం వింటూనే ఉన్నాను. చూసేసాక కూడా మళ్ళీ చూడాలనిపిస్తోందంటే ఏం చెప్పనూ?

ఇప్పుడది కళాఖండమా, హిట్టా, సూపర్ హిట్టా – ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెడితే – నా పరంగా ఇది క్లాసిక్కే 🙂

డైలాగులు అద్భుతం. పాటలు అత్యద్భుతం. కథనం – చాలా పట్టుతో కూడినది – నటీనటులు అంతా ఒకే అనే అనొచ్చేమో (నాకు చంద్రమోహన్ గెటప్ నచ్చదు) – ఇంకేం? సినిమా చూడబిలిటీకి ఏం తక్కువ? ఇలాంటి కథాంశాలతో, అరవైయ్యేళ్ళ హీరోతో కూడా సినిమా తీసి అందర్నీ అలరించొచ్చని నిరూపించడానికి సాహసం చేసి, నిరూపించిన దర్శక నిర్మాతలకి నమస్కారాలు.

“ఈ సినిమా ఎలా హిట్టయింది?” అన్న దిక్కుమాలిన సందేహం వచ్చింది నాకే కదూ! Only fools can ask such a question after watching this movie.

ఇలా ఈ వ్యాసం రాస్తూ ఉంటే నాకు జవాబు దొరికేసింది! (కనుక నేను ఫూల్ని కాదు అనుకుందాం).

41 Comments
 1. Manjula October 13, 2009 / Reply
 2. aswin budaraju October 13, 2009 / Reply
  • shanthi October 14, 2009 / Reply
 3. అబ్రకదబ్ర October 13, 2009 / Reply
  • రోహిత్ October 13, 2009 / Reply
 4. Sowmya October 13, 2009 / Reply
  • అబ్రకదబ్ర October 13, 2009 / Reply
   • రోహిత్ October 14, 2009 /
   • G October 14, 2009 /
  • venkataramana October 13, 2009 / Reply
   • అబ్రకదబ్ర October 13, 2009 /
   • Krishh October 14, 2009 /
 5. Phani October 13, 2009 / Reply
 6. జాన్ హైడ్ కనుమూరి October 13, 2009 / Reply
 7. RadhaKrishna October 13, 2009 / Reply
  • అబ్రకదబ్ర October 14, 2009 / Reply
  • అబ్రకదబ్ర October 14, 2009 / Reply
 8. శి. రా. రావు October 14, 2009 / Reply
 9. వేణు October 14, 2009 / Reply
 10. Sowmya October 14, 2009 / Reply
  • john October 14, 2009 / Reply
 11. RadhaKrishna October 14, 2009 / Reply
 12. RadhaKrishna October 14, 2009 / Reply
  • సౌమ్య October 14, 2009 / Reply
   • నేస్తం October 14, 2009 /
 13. thikamaka October 14, 2009 / Reply
 14. srinivas October 15, 2009 / Reply
 15. Zulu October 15, 2009 / Reply
 16. srinivas October 15, 2009 / Reply
 17. srinivas October 15, 2009 / Reply
 18. srinivas October 15, 2009 / Reply
 19. Satish Kumar Kotha October 18, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *