నాన్ కడవుళ్ డవుళ్ వుళ్ ళ్ …
ఈ సినిమా వచ్చేసి చాలా కాలమైంది కాబట్టి ఇది సమీక్ష కాదు, దీన్ని మరీ లోతుగా తవ్వే ఓపిక నాకు లేదు కాబట్టి ఇది విశ్లేషణా కాదు .. సినిమా చూసిన ఒక సగటు ప్రేక్షకుడి ఘోష అనుకోండి.
దివినించి శివుడి జటాజూటంలోకి దూకే గంగాప్రవాహంలాంటి ఒరవడితో మొదలై, అనేక వింత వింత మలుపులు తిప్పి, ఎన్నో విచిత్రాలున్నూ చూపించి, ఆఖరికి ఇంటెనక పిల్ల కాలవలా చడీ చప్పుడూ కాకుండా ముగిసిపోయిందీ విచిత్రమైన సినిమా. కానీ ముగింపొక్కటే సినిమా విలువని తేల్చదు అని నమ్మే వాణ్ణి కాబట్టి, ఈ సినిమాలో గమనించాల్సిన మంచి విషయాలూ బాగానే ఉన్నాయి కాబట్టీనూ, ఈ సినిమా గురించి కోంచెం ఆలోచించాలని ప్రయత్నిస్తున్నా.
హెచ్చరిక SPOILER ALERT: ఈ సినిమా బాగోగులు చెప్పుకోవాలంటె టూకీగా కథ చెప్పుకోవాలి, ముగింపు గురించీ మాట్లాడుకోవాలి. ముగింపు సస్పెన్సు కాకపోయినా షాకింగు కాబట్టి, ఈ సినిమాని భవిష్యత్తులో చూడాలనుకుంటున్న వాళ్ళు ఈ వ్యాసం ఇప్పుడే చదవకుండా ఉంటే మంచిది.
టూకీగా కథ: తమిళనాడులో ఒక చిన్న పట్నంలో ఒక సామాన్య కుటుంబీకుడు. ఎప్పుడో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకుని వెదుక్కుంటూ తన (సుమారు ఇరవయ్యేళ్ళ) కూతురితోసహా కాశీకి వచ్చాడు. అక్కడ చాలా కాలంగా ఉన్న ఒక తమిళ కాందిశీకుడి కాళ్ళు పట్టుకుని, ఆయన చేత నానా తిట్లూ తిని, మొత్తానికి ఒక యువకుణ్ణి తన కొడుకే అని ఖరారు చేసుకున్నాడు. ఆ యువకుడొక అఘోరీ. మెళ్ళొ కపాలం షేపులో ఉన్న పూసల మాల, నల్లటి బట్టలు, పిచ్చిగా పెరిగిన జుట్టు, గడ్డాలు, మీసాలు, ఎప్పుడూ గంజాయి మత్తులో తేలిపోతుండే కళ్ళు, చొక్కా విప్పితే సిక్స్-పేక్ కండలు తిరిగిన బాడీ, చేతిలో ఒక మూడు కర్రలు కట్ట గట్టిన ఒక చేతి కర్ర .. ఇదీ అవతారం. ఈ తండ్రి ఆ కొడుకుని ఎట్లా ఒప్పించాడో మనకి అర్ధమయ్యే లోపలే ఆ ఇరవయ్యేళ్ల అమ్మాయి, ఒక చిన్న పెంకుటింట్లోకి పరిగెడుతూ అమ్మా, ఎవరొచ్చారో చూడు అని అరుస్తూంటుంది. మొత్తానికి ఈ అఘోరీ ఆ చిన్న తమిళ పట్నంలో ఆ చిన్న పెంకుటింట్లో ఆ దుఃఖభరిత కుటుంబంలో అడుగు పెట్టాడు.
కట్ చేస్తే ఒక మాఫియా డెన్ను. అందులో అంతా రకరకాల వికలాంగులు. అన్ని రకాల వయసుల వాళ్ళు, ఆడా, మగా, మధ్య రకం, అన్నీనీ. వీళ్ళందరి విధిరాత రాస్తున్న ఒక మొదలాలి (యజమాని, పేరు తాండవన్). మొదలాలికి నమ్మిన బంటు మురుగన్ ఒక పిచ్చి నాయాలు, అటు యజమాని అడుగులకి మడుగులొత్తుతూనే ఇటు తన అధీనంలో ఉన్న వికలాంగుల్నే తన సొంత కుటుంబంగా చూసుకుంటున్నాడు. ఈ వికలాంగులంతా అక్కడికి దగ్గర్లో ఉన్న కొండ మీది స్వామి ఆలయానికి వెళ్ళే మెట్ల మీద అడుక్కుంటూంటారు.
ఒక గుడ్డి అమ్మాయి రయిళ్ళల్లో పాటలు పాడుతూ బిచ్చమెత్తుతూ ఉంది. కోకిల కంఠం. పాతకాలపు హీరోల వేషాలు వేసి వారి పాటలు పాడుతూ అడుక్కునే ఒక బృందంలో భాగం ఈమె. ఒక పూట పోలీసులు ఈ బృందాన్ని బలవంతంగా పోలీసు స్టేషనుకి తీసుకెళ్ళి, ఒక పూటంతా తిప్పలు పెట్టి, ఆ గుడ్డమ్మాయిని మాత్రం బలవంతంగా మొదలాలి డెన్నుకి చేర్చేశారు. అక్కడ ఈ ఫిల్ల ముందు గోలు గోలున ఏడిచి, మొత్తానికి ఎలాగో తన విధితో రాజీపడి, ఆ కొండ మీదనే మిగతావాళ్ళతో కలిసి అడుక్కుంటూ ఉంది.
మన అఘోరుడు ఇంటో గంజాయి దొరక్క కొండమీద సాధువుల్తో చేరి, వాళ్ళ గంజాయి దమ్ము పీలుస్తూ అక్కడే ఒక గుహలో పడున్నాడు. ఇంతలో కేరళ నించొచ్చిన ఒక బిచ్చగాళ్ళ వ్యాపారి ఈ గుడ్డిపిల్ల మీద కన్నేసి దాన్ని ఎత్తుకు పోవాలని ప్రయత్నిస్తే ఆ పిల్ల పోయి అఘోరుడి గుహలో తలదాచుకుంది. వాడు ఈ గోలకి లేచి, తన తపస్సు భగ్నం చేశారన్న కోపంతోనో, మరెందుకనో ఆ కేరళ వ్యాపారిని నానా తన్నులూ తన్ని చంపేశాడు. పోలీసులు వీణ్ణి అరెస్టు చేసి తీసుకెళ్ళి హత్యానేరం మోపి కోర్టులో ప్రవేశ పెట్టారు. సాక్ష్యం దొరక్క కేసు కొట్టేశారు. మనోడు యధావిధిగా మళ్ళా కొండమీద చేరి దమ్ము మత్తులో ములిగి పోయాడు. ఒక వికృతాకారుడు, అతి ధనవంతుడు, ఎంత డబ్బు ఆశ చూపినా తననే స్త్రీ పెళ్ళి చేసుకోకపోవడంతో ఈ మొదలాలిని ఆశ్రయించాడు, ఆ గుడ్డిపిల్లని తనకిచ్చెయ్యమని. ఆ బిచ్చగాళ్ళ గుంపులోనే ఉన్న ఒక కొజ్జా వాడి వికృతమైన మొహం చూసి హడిలి పోయి, కొండమీదికి పరిగెత్తుకెళ్ళి ఆ గుడ్డి పిల్లని ఫారిపొమ్మని చెప్పింది. ఈ సారి గుడ్డిపిల్లని పట్టుకెళ్ళడానికి మొదలాలే స్వయంగా వచ్చాడు. వాణ్ణి కూడా మన అఘోరుడు చావబాది చంపేశాడు. అప్పటికే నరకయాతన అనుభవించిన గుడ్డి పిల్ల అఘోరుడి కాళ్ళ మీద పడి బాధ తట్టుకోలేక పోతున్నానో అని మొత్తుకుంటూ ఉంటే, “జీవితాన్ని జీవించలేని వాళ్ళకి చావుకూడా ఒక వరమే” అనుకుంటూ ఆమెకి ఆ వరం ప్రసాదించడంతో మనకి మోక్షం.
*****
పాత్రలు, చిత్రణ, నటన
సినిమా అయిపోయాక మనకి గుర్తుండి పోయేవీ, వెంటాడేవీ రెండు పాత్రలు .. గుడ్డి పిల్ల (నటి పూజ), మొదలాలి తాండవన్ (నటుడెవరో తెలీదు). ఆ అమంఆయి అద్భుతంగా చేసింది అనడం అతి చిన్న ప్రసంశ. ఇక తాండవన్ పాత్రతో మన సినిమాలో క్రౌర్యానికి ఒక కొత్త నిర్వానం ఇచ్చాడు. టైటిల్ పాత్రలో ఆర్య చూడ్డానికి బావున్నాడు గానీ, అసలు నప్పలేదనిపించింది. అంత చెత్తలో పడి పొర్లుతుండే అఘోరా జుట్టూ గడ్డమూ క్లోజప్ షాట్స్‌లో ఖరీదైన షాంపూకి ప్రకటనల్లా కనిపిస్తాయి. అసలు ఆ పాత్రతోనే వచ్చింది ఈ సినిమాలో తంటా అంతా. ఈ సినిమా కథకి ఆధారం జయమోహన్ గారి నవల అట. మరి నవల్లో కూడా ఈ పాత్ర ఇలాగే ఉందో యేమో తెలీదు. మాట్టాడితే అహం బ్రహ్మాస్మి అని కేకలు పెడుతూ ఉంటాడు. ఏవిటో వాడు తెలుసుకున్న బ్రహ్మ తత్వం అర్ధం కాదు. వాడు దుష్టుల్ని శిక్షించడమైనా, ఒక దీనురాలిని రక్షించడానికో, లేదా ఇంకేదో గొప్ప ఉద్దేశంతోనో చేసినట్టుండదు. కేవలం తన గంజాయి మత్తుని భగ్నం చేసినందుకు వాళ్ళని చితకబాదినట్టుంది. పోకిరిలో హీరో పాత్రకీ వీడికీ పెద్ద తేడా కనబళ్ళేదు నాకు. ఇదిలా ఉండగా, ఆఖరు దృశ్యంలో గుడ్డిపిల్ల ఈ బాధ భరించలేక పోతున్నానయ్యా అని రోదిస్తుంటే మరణాన్ని వరంగా ఇవ్వడం, అదేదో మహా ఉదాత్తమైనది అన్నట్టుగా చిత్రించడం నేను జీర్ణించుకోలేక పోయాను.
కథనం, చిత్రీకరణ
ముందే చెప్పానుగా, క్లైమాక్సు ఒక్కటే సినిమాని బేరీజు వేసేందుకు కొలబద్ద కాదూ అని. ఈ సినిమా విలువ అంతా కథనంలోనూ చిత్రీకరణలోనే ఉంది. కథనంలో అక్కడక్కడా లోపాలు లేకపోలేదు. ముఖ్యంగ్, కొన్ని కొన్ని పాత్రల విలువ ఏంటో అర్ధం కాదు. మొదట్లో అంత రాద్ధాంతం చేసిన తల్లీ దండ్రీ సగంనించీ కనబడరు మళ్ళీ. ఇలాంటివి ఇంకొన్ని ఉన్నాయి. లైటింగ్, కేమెరా, ఇత్యాది సాంకేతిక అంశాలన్నిటినీ సమర్ధవంతంగా, ప్రతి సీన్లోనూ తనకి కావలసిన ఎఫెక్టు రాబట్టుకునేందుకు ఉపయోగించుకున్నాడు. కొండ మీద తీసిన ఏక్షన్ దృశ్యాలు నేనీ మధ్య చూసిన సినిమాలన్నిటిలో అత్యుత్తమం అని చెప్పవచ్చు. ఈ సినిమా పూర్తిగా దర్శకుడి ప్రతిభే.
మధ్య మధ్యలో పోలీసు హాస్యం, కోర్టు సన్నివేశాలు, సినిమాకి పెద్దగా ఉపకరించకపోయినా, పరవాలేదన్నట్టు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఎంజీఆర్, శివాజీ, ఎమ్మార్ రాధా ప్రభృతుల వేషాలతో పగటి వేషగాళ్ళు అలనాటి సినిమా పాటలు పాడుతూ నటిస్తుంటే, ఈ దర్శకుడికి పాత సినిమామీద ఉన్న ప్రేమ అర్ధమవుతుంది, కొంచెం మన వంశీ, శేఖర్ కమ్ముల లాగా. ఇతని మెగాహిట్ సినిమా శివపుత్రుడులో కూడా ఒక సీన్లో కొన్ని పాత పాటల రాగమాలికకి సూర్య, సిమ్రన్ దేన్సులెయ్యడం చూపించాడు.
నా వుద్దేశంలో ఈ సినిమా సాధించిన గొప్ప విజయం .. మనకి నిత్యం కనిపించే మనుషుల్లోనే, మన కంటికి సులభంగా అగుపించని దృశ్యాలని, కోణాలని ఆవిష్కరించడం. ఉదాహరణకి ఆ బిచ్చగాళ్ళ మధ్య దృశ్యాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. అలాగే పాత హీరోల్లాగా పగటి వేషాలు వేసేవారి బృందం మధ్య సీన్లు కూడా. ఏవిటి ఈ సీన్ల ప్రయోజనం? తాండావన్ వంటి క్రూరుల చేతిలో ఈ బిచ్చగాళ్ళ కాలనీలు నడుస్తున్నాయని చెప్పడమా? అటువంటి క్రౌర్యం కూడ ఈ ప్రపంచంలో ఉన్నదని మనకళ్ళేదుట చూపించడమా? బహుశ ఇదేమీ కాదు. అలా అడుక్కునే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకీ జీవితాలున్నాయి. వాళ్ళకీ సంతోషం దుఖం హాస్యం సిగ్గు అన్నీ ఉన్నాయి మనకి లాగే .. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మనుషులే .. అని చెప్పడం. అదే నా దృష్టిలో ఈ సినిమా సాధించిన గొప్ప విజయం.
Filed Under: featured • lead • భారతీయ సినిమా • విశ్లేషణ
ఒక కథారచయితగా బాల ఈ చిత్రంలో విఫలం చెందినా, దర్శకుడిగా సఫలమయ్యాడనే అనిపిస్తుంది. తన “బ్రాండ్” చిత్రాలలో నాన్ కడవుల్ మంచి చిత్రమే.Directing actors and directing scenes విషయంలో దర్శకుడి కష్టం తెలుస్తుంది.
అప్పట్లో ఈ సినిమా చూడాలి చూడాలి అనుకుని, “భయమేసి” చూడలేదు. కొన్ని పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా – ఆ శివుడి పాట, ఈ గుడ్డి అమ్మాయి పాడే పాటా.
సంగీతం గురించి మాట్లాడనే లేదు?
మంచి వ్యాసం అందించారు, అభినందనలు.
Nenu ee cinema nu 5 saarlu choosanante nammagalara? naaku nachina cinemallo idhi kooda okati. Asalu konni scenes ni eliminate cheyyalsindhi cinemalo, likes of beggers ni torture chese scene & Tamil legends imitation scenes etc. But this movie is not for every one, those who can digest any thing can watch this movie. But the music by Maestro is ULTIMATE. Especially the background score.
నవతరంగం లో రచయితగా అడుగుపెట్టాక నాకు తెలిసిన “పాత తరంగాలు” ఏమన్నా ఉన్నాయా అని చూస్తే కనిపించిన వారిలో మీరూ ఒకరు! తీరా చూస్తే గత కొన్ని నెలలుగా మీరేమీ రాయలేదని తెలిసింది. ఇప్పుడా లోటు తీరింది. హాస్యం మేళవించి మీరు రాసే వచనం ఎప్పటిలాగే నాకు నచ్చింది. చాలా చక్కని రివ్యూ కూడా. నేను ఇళయరాజా కోసం ఈ సినిమా చూద్దాం అనుకున్నా గానీ చూళ్ళేదు.
సినిమా సంగీతం ఒక పట్టాన నా వొంటికి పట్టదు. ఇక నేపథ్య సంగీతం తెరమీద కనిపిస్తున్న సీన్లో ఎంతగా వొదిగి ఉంటే అంత మంచిదని నా అభిప్రాయం. కాశీ దృశ్యాలు చూపిస్తున్నప్పుడు వచ్చిన శివస్తుతి పాటా, తరవాత రైల్లో గుడ్డిపిల్ల ఆడుక్కుంటూ పాడే పాటా బావున్నాయి అనిపించింది సినిమా చూస్తుండగా. ఇప్పుడు గుర్తు ళేవు.
ఫణీంద్రగారు, మీ అభిమానానికి ధన్యుణ్ణి. సినిమాలు చూస్తూనే ఉన్నా, చూసిన వాటిని గురించి క్లుప్తంగా నా బ్లాగులో రాస్తూనే ఉన్నా. విశదంగా రాయాల్సిన సినిమా ఏదీ ఈ మధ్య చూడక, ఇక్కడ రాయలేదు. క్యూలో ఇంకో రెండు మంచి సినిమాలున్నాయి. త్వరలోనే వాటిని గురించి ఇక్కడ రాస్తాను.
అసలు వ్యాసం చివర్లోనే ఈ హెచ్చరిక పెడదామనుకున్నా .. కాస్త గట్టి పేగు (శుద్ధానువాదం
) ఉన్నవాళ్ళే ఈ సినిమా చూడగలరు అని ..
మాట్టాడితే అహం బ్రహ్మాస్మి అని కేకలు పెడుతూ ఉంటాడు. ఏవిటో వాడు తెలుసుకున్న బ్రహ్మ తత్వం అర్ధం కాదు.
అఘోరాల విషయానికి వస్తే ఈ సినిమాకీ అరుంధతికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది మీరు చెప్పిందానిఁ బట్టి! శివాదిషణ్మతముల గూఢముల నెఱిఁగిన వారు సినిమాలు తీస్తారని ఆశించడం నాది బుద్ధి తక్కువ!
శివాదిషణ్మతముల గూఢముల
రాకేశ్వరా, విశాఖ హోటలు గదిలో నా అంకోపరినుండి కొల్లలాడిన సంగీత సింధువు కొంచెం మనసులోకి ఇంకినట్టుందే!
Very impressed! not kidding.
నీ పోలిక సముచితంగానే ఉంది. ఈ అఘోరుడి అహం బ్రహ్మాస్మి కేకలకీ, పశుపతి అఘోరుడి నిన్నొదల బొమ్మాలీ కేకలకీ పెద్దగా తేడా లేదు.