Menu

యాతమేసి తోడినా-ఈ పాట మీరు విన్నారా?

నమస్కారం, నవతరంగం పాఠకులకి అందిస్తున్న మరో శీర్షిక, “ఈ పాట మీరు విన్నారా?” కి స్వాగతం. “ఈ పాట విన్నారా?” అనే ఆలోచన నాది కాదు, ఆర్కుట్లోని “తెలుగు పాట” అనే కమ్యూనిటీలో ఒక వ్యక్తి మొదలుపెట్టిన “దారం” అదేనండీ “త్రెడ్”. అది చూసిన నాకు, మన నవతరంగంలో ఈ శీర్షిక నిర్వహిస్తే బాగుండనిపించింది. కనుక “ఇందులో నా గొప్పేమీ లేదు” అని నాకు నేనే కొట్టుకుంటున్న ఢంకాని వినగలరు, గమనించగలరు. మంచి సాహితీ విలువుండీ కొన్ని కారణాల వల్ల ప్రేక్షకులకి అంతగా పరిచయంలేని కొన్ని ఆణిముత్యాలని ఈ శీర్షిక ముఖతా మీ ముందుకు తీసుకురావలనే మా ఈ ప్రయత్నం.ఆపాత మధురాలు కావచ్చు, జానపదాలకు సారూప్యంగా ఉన్న బాణీలు కావచ్చు, ఆధునిక బాణీలలో కొట్టుకుపోయిన గీతాలు కావచ్చు, ఇలా శిల్పవస్తువేదైనా కావచ్చు, ఇక్కడ చర్చించుకుందాం, కొత్త సంగతులను తెలుసుకుందాం, ఆలోచనలు పంచుకుందాం.తప్పులుంటే సవరించగలరు. మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకంతో… మీ సతీష్ కుమార్ కొత్త.

pranam-kareedu-poster

“ప్రాణం ఖరీదు”, 1978లో విడుదలైనా ఈ చిత్రం దర్శకనిర్మాతలకి డబ్బు తెచ్చిపెట్టకపోయినా, మంచిపేరు తెచ్చిపెట్టాయి. నేటి మెగాస్టార్ చిరంజీవి గారికి, విడుదలైన చిత్రాల్లో ఇది మొట్టమొదటిది, తెలుగు సినీలోకానికి కోటా శ్రీనివాసరావు గారిని అందించిన సినిమా కూడా ఇదే. మనలో చాలామందికి జాలాది రాజారావు గారి పేరు ఒక్కసారిగా గుర్తురాకపోవచ్చు, ఆయనా చాలా మంచి పాటలు వ్రాసినా, ప్రేక్షకలోకానికి ఆయన పేరు అంతగా గుర్తులేదని నా అభిప్రాయం, ఏమిటీ? మీకూ తెలియదా? సరే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకి సాహిత్యం రాసినా,ఆయన రచనల్లో ప్రజాదరణ పొందిన కొంతపాతబడినా అందరికీ తెలుసనుకుంటున్న ఓ ఉదాహరణ, “మేజర్ చంద్రకాంత్” సినిమాలోని “పుణ్యభూమి నా దేశం” అనే పాట, గుర్తుపట్టారా? అవునండీ ఈ పాట రాసింది జాలాదివారే.

ఆయన కలం నుండి జాలువారిని ఈ “యాతమేసి తోడినా” అనే గీతం చూడండి, పదాలని జానపద ఫక్కీలో పొదిగి సామాన్యుడికి దగ్గరగా వ్రాశారు.మన తెలుగులో ప్రకృతినీ, సమాజాన్నీ పోలుస్తూ రాసిన కవుల్లో ఒకరు వేమనగారు, జాలాదిగారి ఈ రచనలో వేమన ప్రభావం కనిపిస్తుంది. ఈ పాటలో కవి మానవుడు చేసే తప్పులనీ, పక్షపాత దోరణినీ ఎత్తిచూపటానికి ప్రకృతిని(పశుపక్ష్యాదులను కలుపుకుని)మార్గదర్శకంగా ఎంచుకున్నారు. చిత్రంలో ఈ పాటలో కైకాల సత్యనారాయణగారు నటించారు.

పల్లవి:

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే దీపముండదు
దీపముండదు

||యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు||

ఓసారి పల్లవి గమనించండి, “యాతం వేసి ఎంత తోడినా ఏరు ఎలా ఎండదో, మనలోని కల్లోలానికి ఎన్ని అశృధారలు పోసినా అది శాంతించదు,మనసులోని బాధలు ఏరు లాంటివి ఎన్నినీళ్ళు తోడి పారబోసినా అది ఎండదు, బాధా తీరదు. ఎంతటివారైనా ఈ కష్టాలకి అతీతులు కారు అనే ఉద్దేశ్యాన్ని మనం పల్లవి నుండి అర్ధం చేసుకోవచ్చు.”

చరణం 1:

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇత్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

||యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు||

మొదటి చరణంలో మనిషి యొక్క పక్షపాత వైఖరిని తలదించుకునేలా చూపించారు, స్త్రీని పశువులా చూసే సమాజాన్ని అసహ్యించుకుంటూ, స్త్రీయొక్క త్యాగశీలతను పొగడకనే పొగిడారు. ఆ పోలిక చూడండి ఎంత భావుకంగా రాశారో, “ఆడదాన్నీ తాళిబొట్టు తాడు కట్టీ, పాడి ఆవుని పలుపుతాడేసి ఇంటికి తెస్తాము, ఆవుకి కుడితినీళ్ళు పోసినా పాలిస్తుంది, ఆడదానికి కడుపుకోస్తే బిడ్డకి జన్మనిస్తుంది, మరో మనిషికి జన్మనిస్తుంది, ఆడాదాన్ని పశువుగా చూసి తూలనాడే రోజున ఓ సారి నీ పుట్టుక తలుచుకో” అలాగే రెండో చరణంలో,

చరణం 2:

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

||యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు||

సమాజంలోని పేద ధనిక వర్గాలపట్ల ఉండే వ్యత్యాసాన్ని గూర్చి బాధని వ్యక్తపరిచారు. “గొప్పవారైనా, పేదవారైనా, ప్రయాణ సాధనాలు వేరుకావొచ్చు కానీ ప్రయాణ దూరమొక్కటె ఆ దారీ ఒక్కటె, అలానే రంగులోనూ, అలంకరణలోనూ తేడా ఉన్నా శరీరమొక్కటె, బ్రతికున్నప్పుడు ఎంత భోగంగా బ్రతికినా తుదకు చనిపోయాకా అందరినీ మోసేది పాడే, శాస్వత చిరునామా వల్లకాడే అనీ, డబ్బు ఉండి కాస్త మాట నేర్చిన గొప్పవారిని కోకిలలనీ, ఆకలేసి ఆర్తనాదాలు పెడుతున్న పేదలని కాకులనీ పరిగణించటం ఎంత వరకూ న్యాయం? కాకి, కోకిలా వేరు వేరు పక్షులైనా రంగు ఒక్కటే, పేదా ధనికా వర్గాలు బ్రతుకుతీరు వేరైనా మనుషులమే కదా”….ఈ రెండో చరణం వింటే నాకు అన్నమాచార్య వ్రాశిన “బ్రహ్మమొక్కటే…పరబ్రహ్మమొక్కటే” గుర్తొస్తుంది.

జాలాది గారి సాహిత్యానికి, చక్రవర్తిగారి బాణీ, బాలూగారి ఆర్ధ్ర గాత్రం చేరి ఈ శిల్పాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దాయి.మొదటిసారి ఈ సరళ భావావేశాన్ని  విన్నప్పుడు మనసు ద్రవించి కళ్ళు చమర్చుతాయి..ఈ పాట మీరు విన్నారా? వినకుంటే తప్పక వినండి.

“యాతమేసి తోడినా ఏరు ఎండదూ, ఎన్నిసార్లు విన్నా తనివితీరదూ…”

ఈ పాటయొక్క వీడియోని యూట్యూబ్ లో పెట్టినందుకు “amritar83” చానెల్ వారికి నా కృతజ్ఞతలు, నన్ను “ఈస్నిప్స్”లో పెట్టకుండా ఆపుతున్న సాంకేతికకారణాలకు నా అక్షితలు.43 Comments
  • సతీష్ కుమార్ కొత్త October 21, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త October 21, 2009 / Reply
 1. MURALI RAVIKANTI October 21, 2009 / Reply
 2. పులి రాజా October 21, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త October 21, 2009 / Reply
   • rajasekhar October 21, 2009 /
   • పులి రాజా October 21, 2009 /
 3. గీతాచార్య October 21, 2009 / Reply
 4. K.S.M.Phanindra October 21, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త October 21, 2009 / Reply
 5. నేస్తం October 21, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త October 21, 2009 / Reply
 6. K.S.M.Phanindra October 21, 2009 / Reply
 7. రామ October 22, 2009 / Reply
  • Satish Kumar Kotha October 22, 2009 / Reply
  • నేస్తం October 22, 2009 / Reply
   • amrutha October 22, 2009 /
   • నేస్తం October 22, 2009 /
   • రామ October 22, 2009 /
 8. amrutha October 22, 2009 / Reply
 9. సతీష్ కుమార్ కొత్త October 22, 2009 / Reply
 10. సుజాత October 22, 2009 / Reply
  • నేస్తం October 22, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త October 23, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త October 23, 2009 / Reply
 11. సతీష్ కుమార్ కొత్త October 26, 2009 / Reply
 12. సుజాత October 26, 2009 / Reply
  • సతీష్ కుమార్ కొత్త October 26, 2009 / Reply
 13. సుజాత October 26, 2009 / Reply
 14. NaChaKi October 28, 2009 / Reply
 15. Srinivas March 14, 2010 / Reply
 16. Ram Cheruvu March 14, 2010 / Reply
 17. essemCHELLURU November 11, 2010 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *