Menu

Inglourious Basterds – మరోసారి

Ingolrious Basterds Intటరంటినో గురించి వినడమే కానీ ఎప్పుడూ అతని సినిమాలు చూడలేదు ఇప్పుడు మొదటిసారి చూసిన సినిమా – “Inglourious Basterds”. సినిమా మొత్తంగా బానే ఉంది. నిజానికి నాకు నచ్చింది. అయితే, హైపెక్కువవడం వల్ల నేను కాస్త నిరాశపడ్డాను అనే చెప్పాలి. నన్ను అడిగితే మంచి సినిమా అని చెప్తాను కానీ, అద్భుతమైన సినిమా అనను.

(స్పాయిలర్లు కలవు)
కథ: హిట్లర్ కాలం నాటి కథ. మొదటి సీనులో – “Jew Hunter” గా ముద్రపడ్డ నాజీ – Hans Landa ఒక జ్యూయిష్ కుటుంబాన్ని చంపేస్తాడు. అయితే, ఆ కుటుంబం లోని అమ్మాయి ఎలాగో తప్పించుకుంటుంది. లాండా ఆమెని ఇక వదిలేస్తాడు. తరువాత : జ్యూయిష్ అమెరికాంలైన ఎనిమిది మందితో కలిసి, నాజీల భారతం పట్టడానికి అల్డో (బ్రాడ్ పిట్) ఒక జట్టుని ఏర్పరుస్తాడు. వీళ్ళు నాజిలను ఊచకోత కోస్తూ, ప్రతిసారి తమ గొప్పదనాన్ని మిగిలిన నాజీలకు తెలిపేందుకు ఒకళ్ళిద్దరు పట్టుబడ్డ నాజీల ప్రాణాలు తీయకుండా వదిలేస్తూ, వల్ల నుదుటి పై స్వస్తిక్ గుర్తు పొడుస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉండగా, మొదటి సీన్లో తప్పించుకున్న పిల్ల నాలుగేళ్ళ తరువాత ఓ సినిమా థియేటర్ పెట్టుకుని, తన ఐడెంటిటీ మార్చుకుని, జీవిస్తూ ఉంటుంది. ఆమెకి సాటి సినిమా ప్రేమికుడైన ఓ యుద్ధ సైనికుడు పరిచయం ఔతాడు. ఆమెకి నచ్చకపోయినా ఆమె వెంటపడుతూ ఉంటాడు. అనుకోకుండా, అతనిపై తీసిన సినిమా ప్రీమియర్ తన థియేటర్ లో వేయాల్సి వస్తుంది ఈ అమ్మాయి. అవకాశం దొరికింది కనుక, తన ప్రియుడు, ఈ థియేటర్ లో ప్రొజెక్షనిస్ట్ అయిన మార్సేల్ తో కలిసి, నాజీ ప్రముఖులందరూ థియేటర్ లో ఉన్న సమయం లో దాన్ని పేల్చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇదే సమయంలో, ఇదే ప్రీమియర్ షోలో నాజీలను లేపేయడానికి బ్రిటీష్ వారు కూడా పథకం పన్నుతారు. ఆ ప్రయత్నంలోనే వాళ్ళు మన బాస్టర్డ్స్ ను, అలాగే, జర్మన్ డబల్ ఏజెంట్ అయిన ఓ నటినీ కలుస్తారు.

అయితే, అనుకోని పరిస్థితుల్లో, వీళ్ళు నలుగురు (మన నటి, ఇద్దరు బాస్టర్డ్స్, ఒక బ్రిటీష్ గూడఛారి) కలిసి మాట్లాడుకుంటున్న చోట జరిగిన గొడవలో నాటి తప్ప మిగితా వారు మరణిస్తారు. ఈ కేసు విషయమై పరిశోధనకు అక్కడికి వచ్చిన హాన్స్ అక్కడ నాటి చెప్పు ఒకటి చూసి ఆమె సంగతి అర్థం చేసుకుంటాడు. సరే, మన నాటి ఇంకో ముగ్గురు బాస్టర్డ్స్ తో కలిసి ప్రీమియర్ కి తన వద్ద ఉన్న టికెట్లతో వెళ్తుంది. అక్కడ హాన్స్ ఆమెని చంపి, ఈ ముగ్గుర్లో ఇద్దరు షో లోపల ఉంటే, ఒకడ్ని, ఇంకో బాస్టర్డ్ తో కలిపి అరెస్టు చేసి హాన్స్ వారితో చర్చలు మొదలెడతాడు. నాకు ఫలానా ఫలానా వరాలివ్వండి, నేను మీకు లొంగిపోతా, జర్మనీ ని యుద్ధం లో ఓడిపోయేలా చేద్దాం అని. ఇదిలా ఉండగా, అక్కడ థియేటర్ లో ఉన్న ఇద్దరు బాస్టర్డ్స్ హిట్లర్ సహా చాలా మందిని బాంబులతో పేలుస్తూ, తుపాకులతో కాలుస్తు లేపేస్తూ ఉంటే, థియేటర్ ను పెల్చేసే ప్లాన్ లో ఉన్న మార్కేల, థియేటర్ యజమాని Shosanna ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఆ విధంగా నాజీల నాశనం ఔతుంది. ఆ పక్క హాన్స్ వీళ్ళకి లొంగిపోగానే, అల్డో అతన్ని బందీచేస్తాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది.

నాకు ఈసినిమా కథ మామూలుగానే అనిపించింది. హిట్లర్ పై వచ్చిన చాలా సినిమాల్లో ఇదొకటి అనిపించింది – అంతే, కథాపరంగా ఇందులో ఉన్న తేడా ఒకటే – ముగింపు ఫాంటసీ ముగింపు – హిట్లర్ చనిపోడం.

(స్పాయిలర్లు అయిపోయాయి)

అయితే, నటీనటుల ప్రదర్శన మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా, నాకు అందరికంటే బాగా నచ్చిన పాత్రధారి – హాన్స్ లాండా గా నటించిన – Christoph Waltz. మెత్తగా ఉంటూనే, మరణఘంటికలు మ్రోగించే నాజీ అధికారి పాత్రలో జీవించాడనిపించింది. అలాగే, బ్రాడ్ పిట్, థియేటర్ యజమానురాలు పాత్రధారి – వీళ్లంతా చాలా బాగా నటించారు. ఈ సినిమా కథలో మరీ అంత గొప్పదనం కానీ, అంత కొత్తదనం కానీ, లేకపోయినా కూడా, దర్శకుడి తెలివితేటలల్లా ఎంచుకున్న తారాగణం లోనూ, వాళ్ళని అతను తెరపై చూపిన తీరులోనూ ఉంది అనిపించింది. సినిమాలో మొదటి దృశ్యం మొదలుకుని, చివరిదాకా – ప్రతి ఫ్రేమూ చాలా బాగా తీశారు. అలాగే, నాకు ఈ చిత్ర సంగీతం కూడా చాలా నచ్చింది.

మొత్తానికి చెప్పాలంటే – చూడదగ్గ సినిమా. థియేటర్ కి వెళ్ళి చూడవచ్చు – డీవీడీ కోసం ఎదురుచూడనక్కర్లేదు. అలాగే, కాస్తంత చరిత్ర తెలిసుంటే, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు, ఆ చరిత్ర ఎక్కువ తెలీదు కానీ, చరిత్ర తెలిసిన మనిషితో వెళ్ళాను కనుక, సందేహాలొచ్చినప్పుడు తీరిపోయాయి.

6 Comments
  1. G October 18, 2009 /
  2. Sai Brahmanandam Gorti October 18, 2009 /
    • Sowmya October 19, 2009 /
  3. Prasad October 19, 2009 /
  4. John October 20, 2009 /