Menu

డోర్ (2006)

Dorfilm1998లో ఒక హేండ్ కెమేరాతో 17 లక్షల అతి తక్కువ బడ్జెట్ లో ‘Hyderabad Blues(1998)’ తీసి ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిన డైరెక్టర్ నాగేష్ కుకునూర్. గడిచిన పదకొండేళ్లలో ”””’Rockford(1999), ‘Teen Deewarein'(2003), ‘Hyderabad Blues 2′(2004), ‘Iqbal'(2005), Dor(2006), Bombay to Bangkok(2008), 8×10 tasveer(2009), Aashaayein(2009) మొదలైన సినిమాలు తీసి తనదైన ఒక ముద్రను సంపాదించుకున్నడు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రేరణ పొంది, తన కధలను తనే రాసుకుని, వాటిని తన దృష్టితో ప్రేక్షకులకు చూపిస్తూంటాడీ దర్శకుడు. అతని సినిమాల్లో నన్నెంతో కదిలించిన సినిమా 2006లో అతను తీసిన “Dor”. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలక్షన్లను తేకపోయినా కొన్ని సినిమాలు చాలా నచ్చుతూంటాయి మనకి. అలాంటి ఒక చిత్రం ఇది. అవార్డ్ పొందిన మలయాళం సినిమా ‘Perumazhakkalam(2004)’ కి రైట్స్ కొనుక్కుని కధ తిరిగి రాసుకుని, రీమేక్ చేసిన ఫిల్మ్ ఇది.

“డోర్” సినిమా కధ:

ప్రేమ, స్నేహం, ఆశ, నమ్మకం, ధైర్యం మొదలైన భావోద్వేగాలకు సంబంధించిన కధ ఇది. రెండు విభిన్న సంస్కృతులలో పెరిగిన ఇద్దరు యువతులు, వారి వారి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కలుసుకుంటారు. తన ఆశయం కోసం విధిని సైతం ఎదిరించి పోరాడగల ధీర వనిత ఒకరు. జీవితంలో నిస్సహాయ స్థితిలో పోరాడినా కోల్పోవటానికి తనదంటూ ఏదీ లేని స్త్రీ ఒకరు.

హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న పల్లెటూరిలో నివసించే జీనత్ స్వతంత్ర్య భావాలూ, ధృఢ సంకల్పం గల యువతి. తల్లిదండ్రుల నెదిరించి ప్రేమ వివాహం చేసుకున్న నూతన వధువు. ఉద్యోగరీత్యా సౌదీఅరేబియా వెళ్లిన ఆమె భర్త నుంచి చాలా రోజులైనా కబురు రాదు. ఆరా తీస్తే అతను ఒక హత్య కేసులో జైలు పాలైనట్లు తెలిసి కృంగిపోతుంది. ఒక ఆఫీసరు ద్వారా, సౌదీ లా ప్రకారం చనిపోయిన వ్యక్తి తాలూకూ భార్య, క్షమాపణ పత్రం మీద సంతకం చేసి ఇస్తే భర్త ఆమిర్ విడుదలౌతాడు అని తెలుసుకుంటుంది జీనత్. చనిపోయిన శంకర్, ఆమిర్ కలిసి ఉన్న ఫొటో ఒక్కటీ పట్టుకుని రాజస్థాన్ కు ప్రయాణమౌతుంది ఆమె. అడ్రస్, పరిచయాలు ఏమీ లేకుండా, ఒక్కఫొటో ఆధారంగా భర్తను రక్షించుకోవటానికి బయలుదేరిన జీనత్ ధైర్యాన్ని, భర్త పట్ల ఆమెకున్న ప్రేమను, ఎలాగైనా అతన్ని రక్షించుకోవాలనే ఆమె పట్టుదలను చూసి మెచ్చుకోకుండా ఉండలేము.

దారిలో ఆమెకు ఒక పగటివేషగాడు పరిచయం అవుతాడు.ఎటు వెళ్ళాలో వివరాలు తెలీకుండానే ఇంత దూరం వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆమె కధ విని జాలిపడి, ఆమెకు చేతనైన సహాయం చేస్తానని మాట ఇస్తాడు. రకరకాల వేషాలు మార్చడం లోనూ, మిమిక్రి చేయటం లోనూ దిట్టైన ఆ పాత్రధారి ‘Shreyas Talpade’ (Iqbal లో అద్భుతంగా నటించినతను) తన వైవిధ్యమైన నటనతో మనలను ఆకట్టుకుంటాడు. అతని సాయంతో శంకర్ కుటుంబం రాజస్థాన్ లోని “జోధ్ పూర్” లో ఉందని తెలుసుకుని అక్కడకు చేరతారు వారిద్దరూ. ఇక్కడ సింగ్ హవేలి గురించీ, శంకర్ భార్య “మీరా” గురించి తెలుస్తుంది.

“మీరా” ఒక సాంప్రదాయ రాజస్థానీ రాజకుటుంబానికి చెందిన నవ వధువు. పెళ్లైన వెంటనే, ఆమె భర్త కూడా ఉద్యోగరీత్యా సౌది వెళ్ళిపోతాడు. కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టిన ఆమెకి ఆ రాచరికపు కట్టుబాట్లూ, రివాజులూ వింతగా తోస్తాయి. దూరదేశాలలో ఉన్న భర్తతో మాట్లాడటానికి మీరా పడే తపన ఆమె ప్రేమను, ఒంటరితనాన్ని తెలియజేస్తాయి. హఠాత్తుగా ఫొన్ కాల్స్ రావటం ఆగిపోయేసరికీ కారణాలు కనుక్కుంటారు. ఒక ముస్లిం రూమ్మేట్ తోసివేయటం వల్ల శంకర్ చనిపోయినట్లు తెలిసిన మీరా దు:ఖసాగరంలో మునిగిపోతుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు భర్త చనిపోయాకా కుటుంబపు సాంప్రదాయపధ్ధతుల ప్రకారం మీరాను వితంతువుగా మార్చిన విధానం ఆమెను మానసికంగా దెబ్బతీస్తుంది. చలాకిగా ఉండే ఆమె మౌనంగా, నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆమె ఒంటరితనం, వేదన, సాంప్రదాయపు సంకెళ్లు ఆమె చిరునవ్వుని చీకట్లోకి తొసేస్తాయి.

జీనత్ నేరుగా సింగ్ హవేలిలోనికి వెళ్ళి శంకర్ చావు యాదృచ్ఛికమని, తన భర్త నిరపరాధి అని, శంకర్ భార్య “క్షమాపణ పత్రం” పై సంతకం పెడితే తన భర్తకు ఉరిశిక్ష తప్పుతుందని వేడుకుంటుంది. కానీ కుటుంబానికి ఏకైక సంపాదన మూలమైన కొడుకు మృతికి కారణమైనవానిని క్షమించమంటారు ఆ కుటుంబసభ్యులు. ఆమె ఏకైక ఆశైన మీరా ను కలవనివ్వరు. ఛీత్కారంతో బయటకు నెట్టివేయబడుతుంది జీనత్. చాలా దూరం నుంచి, ఎంతో ఆశతో భర్తను రక్షించుకోవాలని వచ్చిన జీనత్ నిరాశపడుతూంటే పగటివేషగాడైన “శ్రేయస్” ఆమెకు ధైర్యం చెప్పి ఒక మార్గాన్ని చూపిస్తాడు. మీరా రోజూ హవేలీ లోంచి ఒక గుడికి వచ్చివెళ్తుంది. ఆ సమయంలో ఆమెతో స్నేహం చేసే ప్రయత్నం చెయ్యమంటాడు. ఆఖరి ఆశగా జీనత్ మీరాతో స్నేహ ప్రయత్నాలు చేస్తుంది.

అనుకోని విధంగా, విభిన్న ధృవాలైన ఆ స్త్రీలిద్దరూ స్నేహితులౌతారు. నిరాశా నిస్పృహలనే అంధకారంలో కొట్టుమిట్లాడుతున్న వారిద్దరికీ స్నేహమనే పట్టుకొమ్మ దొరుకినట్లవుతుంది. జీవితాన్ని కొత్త కోణాల్లోంచి చూడటం మొదలెడతారు. జీనత్ వల్ల జీవితాన్ని కొత్తగా జీవించడం నేర్చుకుంటుంది మీరా. మీరా లోని మంచితనాన్ని, అమాయకత్వాన్ని, ఆమెలోని పరిపక్వతను చూస్తుంది జీనత్. కల్మషం లేని ఆమె మనసుని చూసి జీనత్ ఆమె దగ్గర నిజం దాయలేకపోతుంది. అసలు విషయం చెప్పి క్షమాపణ పత్రం మీద సంతకం పెట్టమని, తన భర్త నిర్దోషి అని వేడుకుంటుంది. జీనత్ స్నేహంలో అప్పుడప్పుడే తన విషాదాన్ని మరస్తున్న మీరాకు అది పెద్ద నమ్మకద్రోహంలా తోస్తుంది…

మీరా జీనత్ ను క్షమిస్తుందా? సంతకం పెడుతుందా? హవేలిను దక్కించుకోవటం కోసం మామగారు పన్నిన కుట్ర నుంచి తప్పించుకోగలుగుతుందా? అమానుషమైన సాంప్రదాయపు కట్టుబాట్లను దాటుకుని కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తుందా అన్నది క్లైమాక్స్. ప్రతి ప్రేక్షకుడిని కధలో లీనం చేసుకుని, చిత్ర కధాంతానికి హర్షోల్లాసాలతో బయటకు వచ్చేలా చేయటం దర్శకుని ప్రతిభకు నిదర్శనం.

మీరా గా ‘Ayesha Takia’, జీనత్ గా ‘Gul Panag’ పోటీ పడి నటించారా అనిపిస్తుంది. ఇద్దరూ ఎంతో పరిణతి చెందిన నటన కనబరుస్తారు. 2007 లో ఇద్దరికీ వారి వారి నటనలకు అనేక బహుమతులు వచ్చాయి. Ayesha Takia కి Bengal Film Journalists’ Association Awards వాళ్ళ best actress award లభించింది. గ్లామర్ పాత్రలనే కాదు, బరువైన పాత్రలను కూడా చెయ్యగలదని నిరూపించుకుంది Takia. గంభీరమైన ఈ కధలో Shreyas Talpade నటన ఒక పెద్ద ఉపశమనం. అతని హాస్యం, హావభావాలూ, అనుకరణలు ఆద్యంతం నవ్వు తెప్పిస్తాయి. సినిమాలో Mir Ali Hussain చే రచింపబడి, Salim Merchant, Shafqat Amanat Ali Khan పాడిన ‘Yeh Hosla Kaise Jhuke, Yeh Aarzoo Kaise Ruke’ అనే పాట సాహిత్యం చాలా బాగుంటుంది.

Dor సినిమా Annual Indo-American Arts Council Film Festival మరియు Atlanta Indo-American Film Festival వద్ద ప్రదర్శింపబడినది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ‘Elahe Hiptoola’, Sudeep Chatterjee సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ చేసినది ‘Sanjib Datta’. ‘Salim-Sulaiman’ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

– తృష్ణ

25 Comments
 1. bhaskar October 14, 2009 /
 2. వీబీ October 14, 2009 /
 3. అబ్రకదబ్ర October 14, 2009 /
  • వీబీ October 14, 2009 /
   • అబ్రకదబ్ర October 14, 2009 /
   • వెంకట్ శిద్దారెడ్డి October 15, 2009 /
   • వెంకట్ శిద్దారెడ్డి October 15, 2009 /
   • Rajasekhar October 20, 2009 /
   • అబ్రకదబ్ర October 15, 2009 /
 4. కొత్తపాళీ October 14, 2009 /
  • Manjula October 15, 2009 /
 5. Bhaavana October 15, 2009 /
 6. Indian Minerva October 15, 2009 /
  • తృష్ణ October 15, 2009 /
 7. Yojini October 15, 2009 /
  • వెంకట్ శిద్దారెడ్డి October 16, 2009 /
  • తృష్ణ October 16, 2009 /
   • Indian Minerva October 16, 2009 /
  • కొత్తపాళీ October 20, 2009 /
 8. Yojini October 20, 2009 /
 9. kamal October 23, 2009 /