Menu

ఓ అద్భుత breathless గానా – 2

(అద్భుతం సినిమాలోని “నిత్యం ఏకాంత క్షణమే” పాట గురించి రాస్తున్న వ్యాసానికి ఇది రెండో భాగం. మొదటి భాగం ఇది . రెండో భాగం అన్నాడంటే ఇంకా చాలా భాగాలు ఉన్నాయేమో అని కంగారు పడకండి. శుభవార్త ఏమిటంటే ఇదే ఆఖరి భాగం !)

నేను: welcome, welcome back!
మీరు: రెండు వెల్కంలు ఎందుకు?
నేను: మీరు కొత్త అతిథైతే welcome, నా మొదటి భాగాన్ని చదివిన వారైతే welcome back!
మీరు: అయినా పైత్యం కాకపోతే ఒక సినిమా పాట గురించి ఈ వ్యాసాలేంటయ్యా? అలా వచ్చి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోయే పాటలో సంగతులూ అవీ తెలుసుకోవాలని ఎవరికి interest ఉంటుంది?
నేను: మరుగైపోయిన పాటల్ని కొంతైనా వెలికి తీద్దామని ఏదో నాకు తోచిన ప్రయత్నం. మీబోటి వారు ఒకరిద్దరు ఉన్నా చాలు నాకు. ఇప్పుడు పాట చూద్దాం.

నెమలి ఆటకు పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
మచ్చంటు లేని జాబిలినడిగా
నక్షత్రకాంతి నట్టింటడిగా
దుఃఖం వధించు అస్త్రం అడిగా
అస్త్రం ఫలించు యోగం అడిగా

మీరు: అడక్కపోయినా ఎలాగూ ఏదో వివరణ చెప్తావ్ గా! కానీ!
నేను: తమిళ భావం “కోయిల పాటను అడిగాను” అనే. నెమలి గురించి ప్రస్తావన లేదు. అలాగే మిగతా భావాలు కూడా వేరుగా ఉన్నాయ్. కాబట్టి ఈ లైన్లు అన్నీ వేటూరి కవిత్వమనే చెప్పాలి.  ట్యూన్లో వింటే ఎంత అద్భుతమైన పదాలు వేటూరి పొదిగారో తెలిసి మనసు స్పందించిపోతుంది. “గుక్కెడు నీళ్ళు, జానెడు చోటు” అని డైమెన్షన్స్ ప్రస్తావిస్తూ చెప్పడం effective గా అనిపించింది నాకు. అలాగే “నట్టింట్లో నక్షత్ర కాంతి కావాలి” అనడం ఎంత బాగుందో! దుఖం వధించే అస్త్రం, ఆ అస్త్రం ఫలించే యోగం రెండూ కావాలనడం వేటూరిజం!
మీరు: అవును వేటూరి మురిపించాడు!
చీకటి ఊడ్చే చీపురునడిగా
పూలకు నూరెళ్ళామని అడిగా
మానవజాతికి ఒక నీతడిగా
వెతలరాత్రికే వేకువనడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒక అనురాగం ఒడిలో అడిగా
వాలని పొద్దున నెలవంకడిగా
ప్రాణముండగా స్వర్గం అడిగా
మీరు: చీపురు గురించి రాయడం ఏంటి, చీప్‌గా?
నేను: అలాగా? నాకు చాలా నచ్చింది. చీకటిని చీపురుతో విసురుగా ఊడ్చేస్తున్నట్టు ఊహించుకోండి. ఈ imagery అద్భుతంగా అనిపించింది నాకు. ఇది తమిళంలో లేని వేటూరి ప్రయోగం.
మీరు: నీ టేస్టు తగలడా! సరే! lets agree to disagree!. మిగతా వాక్యాలు బాగున్నాయ్!
నేను: “మనుషులందరికీ ఒకే మనసు అడిగా” అన్న తమిళ భావం “మానవ జాతికి ఒక నీతడిగా” అంటూ కొంత వేరుగా తెలుగులో గుబాళిస్తుంది. “వెతల రాత్రికి” అన్నది వేటూరి ప్రయోగమే. తమిళంలో “ప్రపంచం అంతా ఒకే తీరుగా వర్షం కావాలి” అని ఉన్న భావాన్ని వదిలేసి “ఒకటే వర్ణం సబబని అడిగా” అంటూ కొంత సామాజిక స్పృహ ఉండే భావం రాశారు వేటూరి. “ఆకాశం మొత్తం వెన్నెల అడిగా” అన్న తమిళ భావాన్ని “వాలని పొద్దున నెలవంక అడిగా” అని చాలా అందంగా రాయడం వేటూరి ప్రతిభే!
న్యాయం ధర్మం ఇలలో అడిగా
ఎద రగిలించే కవితే అడిగా
కన్నీరెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్రమడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపుల నిలకడనడిగా
ఎండమావిలో ఏరును అడిగా
మీరు: ఇవి బానే ఉన్నాయ్!
నేను: నాకు బానే కాదు. బాగున్నాయ్! మొదటి రెండు వాక్యాలు దాదాపు తమిళ భావాలే. మిగతావి వేటూరి భావాలు. “చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా” అన్న వాక్యాలు చాలా నచ్చాయ్ నాకు. విహంగం అంటే పక్షి అని అర్థమున్నా, ఇక్కడ స్వేచ్ఛకి సంకేతంగా వాడారని భావించొచ్చు.
మూగపాటకొక చరణం అడిగా
మౌనభాష వ్యాకరణం అడిగా
నమ్మిచెడని ఓ స్నేహం అడిగా
శాంతిని పెంచే సంపదనడిగా
వస్తే వెళ్ళని వసంతమడిగా
ఏడేడు జన్మాలకొక తోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా
మీరు:మొదటి రెండు వాక్యాలూ అదిరాయ్.
నేను: అవును! అవి వేటూరి సొంత భావాలు. తర్వాత రెండు వాక్యాలు తమిళ భావాలే అయినా, మిగతా వాక్యాలు వేటూరివే. “మంచు ముత్యాలు కావాలి” అని మళ్ళీ ఇక్కడ అడగడం గమనించాలి. అంతక ముందు “పచ్చికలో మంచు ముత్యాలు” ఆల్రెడీ అడిగాడు! ఈ పాటలో ఇలాటి రిపీట్ అయ్యిన భావాలు కొన్ని మనం చూస్తాం!
ముసిముసినవ్వుల ముగ్గులు అడిగా
ఆశల మెరుపుల జగమే అడిగా
అంధకారమా పొమ్మని అడిగా
అందరి ఎదలో హరివిల్లడిగా
మరుగైపోని మమతను అడిగా
కరువైపోని సమతను అడిగా
మీరు: ఈ లైన్లు బానే ఉన్నాయ్. కానీ అంత విశేషం ఏమీ ఉన్నట్టు లేదు.
నేను: అంత లేకపోయినా కొంత విశేషం ఉంది! ఈ భావాలన్నీ వేటూరివే! ఈ పాటలో ఇప్పటి దాకా కనిపించని thought continuity కొంత ఇక్కడ కనిపిస్తుంది. కవి ఒక కొత్త ప్రపంచం కోరుతున్నాడు ఇక్కడ. నవ్వులతో, ఆశల మెరుపులతో, అందరి మనసుల హరివిల్లులతో నిండిన జగం అది. మమత అంటే “నాది (మమ)” అనుకునే భావన. సమత అంటే “అందరూ సమానమే” అనే భావన. ఈ రెండూ అవసరమే. “మరుగు” అన్న పదానికి రెండు అర్థాలున్నాయ్ – కనిపించకుండా పోవడం (తెర మరుగయ్యాడు), మోహంలో పడడం (అతను మందు మరిగాడు). కాబట్టి “మరుగైపోని మమత” అంటే ఒక “వ్యసనంలా మమకారం మారిపోకూడదు” అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఈ మమకారం ముదిరితే, “నేనూ, నా కొడుకూ, నా వాళ్ళే బాగుపడాలి” అన్న స్వార్థం ఎక్కువై అన్యాయం వైపు అధర్మం వైపు మనసు మళ్ళే ప్రమాదం ఉంది. attachment with detachment అన్నది భారతీయ వేదాంత ఉపదేశం.
రాయలంటి కవిరాజుని అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశుపతాస్త్రం నరుడై అడిగా
మొహన క్రిష్ణుడి మురళే అడిగా
మధుర మీనాక్షి చిలకే అడిగా

మీరు: interesting lines!
నేను: basic ఐడియా తమిళం లోదే! రాయల వారినీ, బమ్మెరనీ ప్రస్తావించి వేటూరి తెలుగుదనం అద్దారు ఇక్కడ. తమిళంలో వేరే వారి ప్రస్తావన ఉంది. పోతన భక్తిని ప్రస్తావించడం పోతనపై వేటూరికి ఉన్న భక్తికి నిదర్శనం. ఇక “భారతి మెచ్చిన తెలుగు” అని రాసి వేటూరి చిన్న చమత్కారం చేశారు.  తమిళ భావం – “సుబ్రహ్మణ్య భారతి కవితని అడిగాను” అని. కవి భారతి “సుందర తెలుంగు” అని తెలుగు భాషని పొగిడారు కాబట్టి “భారతి మెచ్చిన తెలుగు” సరిపోతుంది. భారతి అంటే సరస్వతి అని అర్థం తీసుకుంటే “గొప్ప సాహితీ సంపదతో సరస్వతీ కటాక్షమై అలరారుతున్న తెలుగు” అన్న అర్థం వస్తుంది.

వున్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెక్కించే పందెం అడిగా
మల్లెలు పూసే వలపే అడిగా
మంచిని పెంచే మనసే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగుని పట్టే ఒడుపే అడిగా
ద్రోహం అణిచే సత్తానడిగా
చస్తే మిగిలే చరిత్రనడిగా
విధిని జయించే ఓరిమినడిగా
ఓరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్ళకు అడిగా
చిన్నా చితకా జగడాలడిగా
తియ్యగ ఉండే గాయం అడిగా
గాయానికి ఒక గేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా

మీరు: ఒడ్డెక్కించే పందెం అంటే ఏంటి? ఇదో తమిళ భావమా?
నేను: ఈ భావాలు చాలా వరకూ వేటూరివే. “ఒడ్డెక్కించే పందెం” అనడంలో కవి అంతరార్థం అర్థం కాలేదు కానీ మిగతావి తేలికగా అర్థమౌతాయ్.
మీరు: ఓరిమి, కూరిమి అని వాడాడు. ప్రాస కోసమా?
నేను: ప్రాస కోసమే అనుకోలేం. విధిని జయించడానికి సహనంతో పాటూ మనని అర్థం చేసుకునే ఒక నేస్తం కూడా కావాలి. ఈ విషయం చాలా మందికి అనుభవమే. దీనినే “విధిని జయించే ఓరిమి, ఓరిమిలో కూరిమి” అడిగా అని అందంగా రాశారు.
మీరు: “సహనానికి హద్దేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా”  అన్న వాక్యాలు variety గా ఉన్నాయ్. వీటికి ఎలా అర్థం చెప్పుకోవాలి? తరచుగా మనం చూసే హింసా, బస్సులు తగలబెట్టడం వీటి గురించి రాశాడా?
నేను: ఆ వాక్యాలు మణిపూసలు. ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయ్. మీరు చెప్పిన “సామాజిక వ్యాఖ్య” కూడా సరిపోతుంది.  ఎన్నో సార్లు మనం చుట్టూ ఉన్న అసమానతలు, అన్యాయాలూ, మారణహోమాలు చూసి “ఇక చాలు. ఏదైనా చెయ్యాలి” అనుకుంటాం. ఎంత వరకూ సహనం ఉండాలి, ఎప్పుడు సహనం చాలించాలి అని తేల్చుకోవడం కొంత కష్టమే! మిగతా లైన్లలో కాలం వేగం కాళ్ళకి అడిగా, పొద్దే వాలని ప్రాయం లాటి చక్కటి expressions వేటూరి ఇచ్చారు, భావాలు తమిళమే అయినా.

ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగ పెన్నే అడిగా
ఖరీదు కట్టని కరుణే అడిగా
ఎన్నని అడగను దొరకనివీ
ఎంతని అడగను జరగనివీ
ఎవ్వరినడగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటూ
కాళ్ళకు గమ్యం కాడంటూ
భగవధ్గీత వాక్యం వింటూ
మరణం మరణం శరణం అడిగా

మీరు: ఆరో వేలుగ pen అడగడం కొంచెం odd గా ఉందోయ్!
నేను: ఈ వాక్యాల్లో మూల భావం వైరముత్తుదే అయినా, వేటూరి expressions చాలా మార్చారు. తమిళంలో “పాకే వయసులో తల్లిపాలు, గంతులేసే వయసులో బొమ్మలు, ఐదో ఏట పుస్తకం” కావాలి అని ఉంది. ఆరో వేలుగా pen కావాలి అన్న వైరముత్తు భావం innovative గా ఉంది. ఐతే మొత్తం తెలుగు పదాలతో నిండిన పాటలో ఇలా english పదం రావడం కొంచెం oddగా అనిపించింది నాక్కూడా.
మీరు: కాళ్ళకి గమ్యం కాడంటూ అంటే ఏమిటి అర్థం? కాదంటూ అనాలేమో?
నేను: “కాడు” అంటే శ్మశానం. కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాడంటూ అనడంలో  “ఎన్నో కలలు కన్నాను, కానీ అవేవి తీరకుండానే పోతాను” అన్న నైరాశ్యం కనిపిస్తుంది. పైగా దీన్ని భగవద్గీతా వాక్యం అంటాడు! మరి భగవద్గీతలో ఈ నైరాశ్యం ఉందా? లేదు. మరి ఈ వాక్యాలని ఎలా అర్థం చేసుకోవాలి? కిటుకు interpretation లో ఉంది.  “జగమే మాయ, బ్రతుకే మాయ” అన్న వాక్యాల్లో కూడా నైరాశ్యం లేదు. కానీ దేవదాసు తెలిసో (తెలిస్తే వ్యంగ్యంగా) తెలియకో (తెలియకపోతే అజ్ఞానంతో) అలా పాడ్డం ద్వారా తన బాధనీ, నిరాశనీ వ్యక్తం చేస్తాడు. భగవద్గీతలో చెప్పినది ఏమిటంటే – “చావు తప్పదు. భయపడకు. నిరాశ పడకు. కార్యోన్ముఖుడివి అవ్వు. పరిపూర్ణత్వాన్ని పొందు” అని. ఇందులో negativity లేదు. ఈ భావాన్నే పాటలో హీరో ఇంకోలా వ్యాఖ్యానిస్తాడు.

మీరు: బాగుందోయ్! మంచి పాట. కానీ పొడుగు మరీ ఎక్కువైంది. ఈ సారి కొంత మాములు పాటలు అయితే బెటర్!
నేను: అలాగే. ఈ సారి మామూలు లెంగ్త్ పాటతో వస్తాను. అప్పుడు మీకూ పాట్లు తగ్గుతాయ్, నాకూ టైపింగ్ తగ్గుతుంది, రివ్యూ చేసే నవతరంగం admin కి బోరు కొట్టకుండా కూడా ఉంటుంది!

ఫణీంద్ర KSM

23 Comments
 1. nestam October 22, 2009 /
 2. సతీష్ కుమార్ కొత్త October 22, 2009 /
  • సతీష్ కుమార్ కొత్త October 22, 2009 /
   • Phanindra October 23, 2009 /
   • సతీష్ కుమార్ కొత్త October 23, 2009 /
   • Phanindra October 23, 2009 /
   • సతీష్ కుమార్ కొత్త October 23, 2009 /
 3. Sowmya October 23, 2009 /
 4. Nagarjuna Pavan Kumar October 23, 2009 /
  • Phanindra October 23, 2009 /
 5. Nagarjuna Pavan Kumar October 23, 2009 /
 6. Nagarjuna Pavan Kumar October 23, 2009 /
  • Phanindra October 23, 2009 /
 7. Vasu October 25, 2009 /
 8. Phanindra October 26, 2009 /
  • Vasu October 26, 2009 /
  • kRsNa July 23, 2010 /
 9. NaChaKi October 28, 2009 /
  • Phanindra October 29, 2009 /
 10. NaChaKi October 28, 2009 /
 11. సతీష్ కుమార్ కొత్త October 28, 2009 /
 12. అవినేని భాస్కర్ October 28, 2009 /