Menu

ఓ అద్భుత breathless గానా – 1

తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ:

దాదాపు 20 ఏళ్ళ క్రితం సంగతి. ప్రముఖ తమిళ కవీ, సినీ గేయ రచయితా, వైరముత్తు గారు ఒక శుభ కార్యం  ముగించుకుని స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నారు. సభలో ఇవ్వబడిన జ్ఞాపికను(gift) విప్పి చూస్తున్నాడు ఒక స్నేహితుడు. అది ఒక వెండి దీపస్తంభం. మంచి వెండా కాదా అని రుద్ది పరిక్షించాడు ఇంకొక స్నేహితుడు. దీపాన్ని ఎక్కువ రుద్దకండి; భూతం వస్తుందేమో!’ అని చమత్కారం చేశారు వైరముత్తు గారు! ఒకవేళ భూతం వస్తే ఎవరెవరు ఏమేమి అడుగుతారని ఒక తీయని కల్పన మొదలయి ఎవరికి కావలసింది వారు అడిగారు. చివరిగా ప్రశ్న వైరముత్తు గారికి వచ్చింది. కారు ఆపండి అన్నారు. చింతమాను నీడ. కాయితం అందుకోండి అన్నారు. కాయితం లేదు. ఆహ్వాన లేఖలో ఒక తెల్లటి భాగములో రాయడం మొదలుపెట్టారు వైరముత్తు గారు –

సత్తంగళ్ ఇల్లాద తనిమై కేట్పేన్ – శబ్దాలు లేని ఏకాంతం అడుగుతాను

ఇలా ప్రవాహంలా దాదాపు ఒక 50 వాక్యాలు రాశారు! ఆశువుగా ఒక చక్కని కవిత పూర్తయ్యింది. ఆ కవిత నచ్చి తమిళ సినిమా “అమర్కలం” (అజిత్, షాలినీ) లో వాడుకుంటానంటే కొన్ని మార్పులు చేసి ఇచ్చారు. ఈ సినిమాయే తెలుగులో డబ్ అయ్యి “అద్భుతం” అనే పేరుతో వచ్చింది (చిత్రంగా ఈ సినిమా రీమేక్ అయ్యి “లీలా మహల్ సెంటర్” (ఆర్యన్ రాజేష్, సదా) పేరుతో మళ్ళీ వచ్చింది కూడా). బాల్యం రేపిన గాయాల వల్ల ఒక రౌడీగా మారిన హీరో తను జీవితంలో ఏవేవి కావాలని కోరుకున్నాడో తెలుపుతూ ఆవేదనతో, ఆవేశంతో ఈ పాట పాడతాడు. రమణీ భరద్వాజ్ సంగీతంలో ఇదో చక్కని breathless song. బాలు గారు ఎంతో బాగా పాడారు. ఈ పాటని మీరు ఇక్కడ వినొచ్చు.

తెలుగులో ఈ పాటని వేటూరి అనుసృజించారు (అనుసృజించడం అంటే ఏంటి అని అడుగుతారా? అంటే, రొటీన్‌గా inspire అయ్యి ఇంగ్లీష్ ఆల్బం పాటల్ని పొట్లం కట్టి తెలుగు సినిమాల్లో వడ్డించే మ్యూజిక్ డైరక్టర్లా కాకుండా, నిజ్జంగా inspire అయ్యి, తనలోని క్రియేటివిటీని ఫైర్ చేసి కొంతైనా కొత్తగా చెయ్యడం!). కొన్ని వైరముత్తు భావాలనే రాసినా, తనదైన వాణిని వినిపించారు. వేటూరి రాసిన కొన్ని డబ్బింగ్ పాటల్లా ఈ పాట కృతకంగా ఉండదు. అచ్చమైన తెలుగు కవితలా ఆకట్టుకుంటుంది. అంతగా ఎవరికీ తెలియని ఈ పాట గురించి తెలపడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

“సినిమా పాటల్లో సాహిత్యమా? నో నో, అలా జరగడానికి వీల్లేదు!” అని నమ్మే వారిలో మీరూ ఒకరు అయితే ఈ వ్యాసం మీకు నచ్చదు! “సినిమా పాట విని సాహిత్యాన్ని నేను అర్థంచేసుకోలేనా, మళ్ళీ నీ బోడి విశ్లేషణ ఎందుకు?” అని మీరు అనుకుంటే, “కంగ్రాట్స్! మీరు ఈ వ్యాసం చదవక్కరలేదు!”.  ఈ రెండూ కాని వారైతే ఈ వ్యాసం మీకు ఉపయోగపడొచ్చు. చదివి చూడండి!

తమిళ పాట అర్థాన్నీ, పూర్వోత్తరాలని చెప్పి, ఈ వ్యాసం రాయడంలో ఎంతో సహకరించిన మిత్రులు “అవినేని భాస్కర్” గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్ధం లేనట్టి లోకం అడిగా
రక్తతరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుస్సడిగా
ఆనందాశ్రులకు ఆశ్శీస్సడిగా
మదినొప్పించని మాటను అడిగా
ఎదమెప్పించే యవ్వనమడిగా
మీరు:
“ఆగాగు, ఆ మాత్రం తెలుగు మాకూ వచ్చు! నిత్యం అంటే ఎల్లపుడూ, ఏకాంతం అంటే solitude, నిత్యం ఏకాంత క్షణం అంటే, ఎప్పుడూ ఒకణ్ణే ప్రశాంతంగా ఉండాలనా? అలా అయితే మరి ఆర్కుట్ ఎందుకు, సెల్ ఫోన్ ఎందుకు, సినిమాలెందుకు?

నేను:
దీనికి ఫిలసాఫికల్ గా అర్థం చెప్పుకోవచ్చు కానీ, చెప్పి మీకు బోర్ కొట్టించను. “శబ్దం లేని ఏకాంతం అడిగా” అన్నది తమిళ భావం. అది తెలుగులో ఇలా అయ్యింది అని మాత్రం అంటాను.

మీరు:
“సరే! తర్వాత లైన్లు చూద్దాం. “రక్త తరంగ ప్రవాహం అడిగా” అంటాడేంటయ్యా కవి? యుద్ధం వద్దంటూ వెంటనే “రక్తమే కెరటాలుగా గల ప్రవాహం అడిగాను” అనడం ఏంటి? సినిమా హీరో ఏమన్నా అపరిచితుడు టైపు స్ప్లిట్ పర్సనాలిటీ కేసా?

నేను:
“ఉరకలేసే రక్తం కావాలి” అన్న తమిళ భావం తెలుగులో కొంచెం కవిత్వం ఎక్కువై ఇలా అయ్యింది!

మీరు:
ఈ పాట సాహిత్యం గొప్పగా ఉందన్నావ్, ఇదేనా? మొదట్లోనే ఇన్ని అపార్థాలు ఉంటే ఇక కాపురం ఎలా నిలుస్తుంది? సారీ..ఈ గీతికా గోపురం ఎలా నిలుస్తుంది?

నేను:
ఆడవాళ్ళకు తొందరా, మగవాళ్ళకి హర్రీ ఉండకూడదన్నారు పెద్దలు. ఓపిక పట్టండి సార్, ముందుంది భావాల పండగ! “అనుబంధాలకి ఆయుష్షూ, ఆనంద భాష్పాలకి ఆశీస్సు అడిగాను” అంటూ తమిళంలో లేని భావాన్ని వేటూరి ఎంతో అద్భుతంగా పలికించారో కాస్త గమనించండి.

పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువోదార్చే ఓ కునుకడిగా
తలనే నిమిరే వేళ్ళను అడిగా
మీరు:
ఇవి హాయిగా అర్థమౌతున్నాయ్! బావున్నాయ్. ఇంతకీ ఈ భావాలు తమిళమా, తెలుగా?
నేను:
ఇవన్నీ దాదాపు తమిళ భావాలే. అయితే వేటూరి తనదైన సుగంధం అద్దారు. తమిళంలోని “ఉరుములు లేని మేఘం” బదులుగా “పిడుగులు రాల్చని మేఘం” అన్నారు. అలాగే “వరించు తరించు వలపు”, “మంచు ముత్యాలు” ఇవన్నీ వేటూరి తెలుగింపులు! “తలనే నిమిరే వేళ్ళని అడిగా” అన్న తమిళ భావం నాకు చాలా నచ్చింది.

మీరు:

అవును. “తలనే నిమిరే వేళ్ళని అడిగా” అదుర్స్. వైరముత్తుకి వెయ్యండి వీరతాళ్ళు!ఇంక చాలు లేవోయ్. ఆపేద్దాం. కవిత్వం అయినా కాఫీ అయినా ఎక్కువ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు! 

నేను:
తప్పకుండా! మీరు భరించలేరనే సులభ వాయిదాల పద్ధతిలో నా విశ్లేషణ భాగాలుగా అందిస్తున్నాను. నా మొదటి భాగంలో భాగస్వాములయ్యినందుకు థాంక్స్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకూ చదవుతూనే ఉండండి – నవతరంగం! చదువు, చదివించు, లైఫ్ అందించు!

(ఇంకా..ఆ…ఆ ఉంది)

ఫణీంద్ర KSM

33 Comments
 1. సౌమ్య October 15, 2009 /
 2. Vasu October 15, 2009 /
  • KSM ఫణీంద్ర October 15, 2009 /
   • Mohan October 30, 2009 /
 3. badri October 15, 2009 /
  • KSM ఫణీంద్ర October 15, 2009 /
 4. chavakiran October 15, 2009 /
 5. prasad rao October 15, 2009 /
 6. KSM ఫణీంద్ర October 15, 2009 /
  • bhaskar October 15, 2009 /
   • KSM ఫణీంద్ర October 17, 2009 /
 7. కొత్తపాళీ October 15, 2009 /
 8. నేస్తం October 15, 2009 /
  • నేస్తం October 15, 2009 /
   • KSM ఫణీంద్ర October 17, 2009 /
   • NaChaKi October 18, 2009 /
 9. సతీష్ కుమార్ కొత్త October 16, 2009 /
 10. సతీష్ కుమార్ కొత్త October 17, 2009 /
  • KSM ఫణీంద్ర October 17, 2009 /
   • సతీష్ కుమార్ కొత్త October 17, 2009 /
 11. NaChaKi October 18, 2009 /
  • nestam October 18, 2009 /
   • NaChaKi October 20, 2009 /
  • సతీష్ కుమార్ కొత్త October 18, 2009 /
   • NaChaKi October 20, 2009 /
  • నేస్తం October 18, 2009 /
   • Satish Kumar Kotha October 18, 2009 /
   • NaChaKi October 20, 2009 /
  • K.S.M.Phanindra October 18, 2009 /
 12. NaChaKi October 20, 2009 /
 13. Mohan October 30, 2009 /
 14. శ్రీనివాసమౌళి February 12, 2010 /
 15. uday ramaphani cherukupalli May 31, 2010 /