Menu

అంతా మన మంచికే (1972)

bhanumati2ఒక ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకి బోరు కొడుతూ ఉన్నప్పుడు ఈ సీడీ కనిపించింది – “అంతా మన మంచికే” అని. టైటిల్స్ వివరాలు చూసి, “అంతా మన భానుమతే” అనుకున్నాను. అవును మరి – ఇది భరణీ పిక్చర్స్ చిత్రం. దర్శకత్వం భానుమతి. సంగీతంలోనూ పాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి…. ఇది కాక, ఈ సినిమాలో పాటలు కూడా పాడారని చూస్తూ ఉంటే అర్థమైంది. ఇంకా ఏమన్నా చేశారేమో తెలీదు కానీ, సినిమా మాత్రం చాలా ఎంటర్టైనింగ్. దీని గురించి రాయకుండా ఉండలేకపోతున్నా అందుకనే.

కథ విషయానికొస్తే, మన సినిమాల్లో హీరో ఓరియంటెడ్ కథలుంటాయి కదా – ఇప్పుడు ఉదాహరణకి బాలకృష్ణ సినిమాలు ఉంటాయి కదా – హీరో మహా వీర శూరుడు టైపులో, అలాంటి కథ ఇది. నాగయ్యగారికి (అంటే, సినిమాలో ఆయన పాత్ర పేరు గుర్తులేదు) ఇద్దరు కూతుళ్ళు – భానుమతి, పద్మిని. నాగభూషణం నాగయ్యతో చిన్నప్పుడు వ్యాపారం చేసి, ఆయన డబ్బుల్తో ఇప్పుడు ధనవంతుడయి ఉంటాడు. నాగయ్య ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఉంటాడు. భానుమతి ఓ ఫ్లాష్‍బ్యాక్ వల్ల పెళ్ళి చేసుకోను అని తీర్మానించుకుంటుంది. పద్మిని కి, నాగభూషణం కొడుకు కృష్ణకి ప్రేమ వ్యవహారం. ఇంతలో నాగయ్య చనిపోడంతో ఈ కుటుంబానికి కష్టాలు మొదలు. దానికి తోడు, నాగభూషణం-సూర్యకాంతం లకు తమ కొడుకు పద్మిని ని ప్రేమించడం నచ్చదు. విడదీస్తారు. ఆ అమ్మాయి పరిస్థితి కష్టాల్లో పడుతుంది. ఉన్న చెడ్డవాళ్ళు చాలనట్లు సినిమాలో కాసేపు ఋష్యేంద్రమణి, కాసేపు కృష్ణంరాజు విలన్ పాత్రలు. ఇలాంటి కొన్ని గందరగోళాల మధ్య, భానుమతి అన్ని సమస్యలనూ పరిష్కరించుకుంటూ కథను సుఖాంతం చేస్తుందన్నమాట.

అపార్థం చేస్కోకండి – నాకు భానుమతి గారి పై మంచి గౌరవం ఉంది. నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నది కథ గురించి. ఆవిడ గురించి కాదు. నాకు ఈ సినిమా చూశాక ఆవిడ చాలా నచ్చేశారు నటిగా. అసలే కామెడీ డైలాగులు – ఆమె మాట్లాడుతూ ఉంటే ఇంకా కామెడీ. అసలు ఈ మధ్య కాలంలో ఆద్యంతమూ ఇంత నవ్వుతూ చూసిన సినిమా ఏదీ తట్టట్లేదు నాకు. ఛాయాదేవి పాత్ర మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు బాగున్నాయి. ఇంకా, భానుమతి-సూర్యకాంతం మధ్య నడిచే వ్యంగ్యాస్త్రాలు ఐతే – నవ్వలేక చచ్చాను అసలు. అసలు సినిమా మొదలవడమే ఓ కాలేజీ ఫంక్షన్తో మొదలౌతుంది, అక్కడ నాగభూషణం స్పీచ్ ఇచ్చాక సూర్యకాంతం మైక్ అందుకుంటుంది. ఆమె మాటలకే నవ్వాగక పొట్టపట్టుకుంటూ ఉంటే, ఆమె పై భానుమతి తన స్పీచ్ లో వేసే సెటైర్ కు ఇంకా నవ్వొచ్చింది. డైలాగులు ఎవర్రాసారో గానీ, నాకు సినిమాలో అన్నింటికంటే హాస్యం బాగా నచ్చింది. సినిమా కథ పరంగా ఎంత బోరింగ్గా, కథనం సాగతీతగా ఉన్నా కూడా. భానుమతి ఉన్న ప్రతి ఫ్రేములోను హాస్యం బాగా పలికింది.

పాటలు – టూ గుడ్. “నేనె రాధనోయీ…” ఈ సినిమాలోది అని నాకు ఇప్పటిదాకా తెలీదు. అలాగే, భానుమతి చిన్నపిల్లలతో పాడిన పాట, మానస సంచరరే – భానుమతి గారి పాటలు అన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత నచ్చాయి. మిగితా పాటలు కూడా బానే ఉన్నాయి కానీ, ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటలు మాత్రం భానుమతిగారివే. ఆన్లైన్ లో ఈ సినిమా పాటలు వినడానికి చిమట మ్యూజిక్ సైటుకి వెళ్ళండి. “నేనే రాధనోయీ…” పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది.

ఒకరొకరుగా నటుల గురించి చెప్పడానికేముంది? భానుమతి గారు అప్పటికి ఇంకా పూర్తిగా అదో తరహా నటనలోకి దిగిపోలేదనుకుంటాను. ఇందులో ఆవిడ నటన బ్యాలన్స్డ్ గానే అనిపించింది నాకు. అసలు ఆ డైలాగులు చెప్పే పద్ధతి నాకు చాలా చాలా నచ్చింది. ఆ పదాల విరుపులు, సాగతీతలు – ఎక్కడ ఏది చెయ్యాలో సరిగ్గా చేసి, మంచి హాస్యం పలికించారు. భానుమతి గారి తర్వాత ఈ సినిమాలో నాకు బాగా గుర్తుండిపోయిన మొహం – ఋష్యేంద్రమణి గారిది (ఋష్యేంద్రమణి అంటే ఈవిడా? మిస్సమ్మలో మరి అంత సాత్వికంగా కనిపించారు?). మరి ఆ కాలంలో “కెవ్వు, కేక” అనడానికి ఏమనేవాళ్ళో నాకు తెలీదు కానీ, మంచితనం మాస్కు వేసుకున్న చెడ్డ మనిషిగా భలే చేశారు. ఇంకోళ్ళతో కలిసి చూస్తున్నాను, బాగోదని ఊరుకున్నా కానీ, రీవైండ్ చేస్కుని మరీ ఆ మామంచి చెడ్డతనాన్ని చూడాలనిపించేంత నచ్చింది నాకు ఆమె పాత్ర పోషణ. మిగితా వాళ్ళలో – సూర్యకాంతం – భలే నవ్వించారు. నాగభూషణం గారు కూడా. అసలా పాత్ర చిత్రణ చాలా వెరైటీగా ఉంది. చిన్నప్పుడు హిందీ ప్రచార సభ పరీక్షల్లో – “చరిత్ర చిత్రణ్” అనో ఏదో ఉండేది, ఓ పాత్ర గురించి వ్యాసం రాయాలి. అలా నాగభూషణం గారి పాత్ర గురించి చాలా రాయొచ్చు. ఈ సినిమా మొత్తం మీద ఒక పాత్రపై ఇన్ని రకాల భావాలు వేరే ఏ పాత్రతోనూ కలుగలేదు – ఆయన పాత్రకి తప్ప. మిగితా పాత్రలు – కృష్ణ, కృష్ణంరాజు, పద్మిని, పద్మనాభం ఇటీసీ ఇటీసీ… భానుమతి వెల్లువలో కొట్టుకుపోయినట్లే లెక్క. నాగయ్య గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఒక విధమైన అనుభూతిని కలిగిస్తుంది, ఎందుకో గానీ. ఓ విధమైన గంభీరత -ఆయనకి తప్ప ఇంకోళ్ళకి రాదనుకుంటాను. అందుకే, ఉన్నది కాసేపే అయినా,ఆయన పాత్ర భానుమతి నీడలో చిక్కలేదు.

మీరు – “భానుమతి అంటే నాకు నచ్చదు. ఆమె ఏం చేసినా నేను చూడను” – అనుకునే కేటగిరీ అయితే చూడకండి కానీ, ఆమె సినిమా మొత్తం హోల్ అండ్ సోల్ గా కంట్రోల్ తీస్కోడం భరించగలము అనుకుంటే, మరింకేమీ ఆలోచించకుండా చూసేయండి. కథ సంగతి పక్కన పెడితే, హాస్యం కోసం తప్పక చూడండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. (లాగిక్కులు పక్కన పెట్టేయాలి మరి, షరామామూలుగా మన సినిమాలకుండే వార్నింగ్గే)

12 Comments
  • vinay chakravarthi October 7, 2009 /
 1. kalyan October 5, 2009 /
 2. kalyan October 5, 2009 /
 3. అరిపిరాల October 5, 2009 /
  • Rambo October 19, 2009 /
 4. Sowmya October 5, 2009 /
 5. evadaite neekenti? October 6, 2009 /
 6. రామ October 7, 2009 /
 7. కొత్తపాళీ October 8, 2009 /
 8. vidya October 22, 2009 /
 9. goka nageshwara rao January 31, 2010 /