Menu

గడుగ్గేయకారుడు: వేటూరి-మొదటి భాగం

తెలుగు సినిమా ఒక అందమైన తోట…

అందులో ఒక పాటల చెట్టు…

ఆ చెట్టులోని కొమ్మకొమ్మకో సన్నాయిలను పూయించి… రాగాల పల్లకిలో ప్రేక్షకులను- ఊయలూగించిన పదాల మాంత్రికుడు… వేటూరి సుందరరామమూర్తి!
తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన!

తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేసి ఆకుచాటు పిందెను, కొండమీద చందమామను పదాలతో సాక్షాత్కరించజేసిన పదచిత్రకారుడు వేటూరి.
ఆకాశదేశాన… ఆషాఢమాసాన, నవమి నాటి వెన్నెలని చూపించి రగులుతున్న మొగలిపొదలో చిలక్కొట్టుడు చిన్నదాన్ని మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లిన గేయ చక్రవర్తి – వేటూరి.

నరుడి బతుకులోన నటనని చినుకులా రాలి… నదులుగా సాగించి… శంకరున్ని భక్తావశకరున్ని చేసి రాలిపోయే పువ్వుకి రాగాలద్దిన సినీ గీతకారుడు – వేటూరి.
మాస్, క్లాసికల్‌, ఫిలసాఫికల్‌, రొమాంటిక్‌, భక్తి ఇలా అన్ని రకాలతో కూడిన సినీ కళామతల్లి కంఠంలోని పాటల హారానికి… పదాల వజ్రాలను అందంగా, అలంకారంగా పొదిగిన సొగసైన పదశిల్పి – వేటూరి.

“గతమంతా శ్రుతం నాది… ప్రస్తుతానికి అది పునాది” అని తనలోని భావాభివ్యక్తికి… గేయానురక్తికి, గీతసృష్టికి… తనకన్నా ముందరి పాటల రచయితల దీవెనలే కారణమని చెప్పిన వినయ సంపన్నుడు -వేటూరి.

సత్‌ బ్రాహ్మణకుటుంబంలో 1936 జనవరి 29న జన్మించారు వేటూరి సుందరరామమూర్తి.నిత్యం వేదఘోషల మధ్య… సంస్కృత మంత్రోచ్ఛారణల నడుమ పెరిగిన బాల వేటూరికి అచేతనంగానే ఆ సాహిత్యం… అందులోని లయ… పదగాంభీర్యత ఆకట్టుకున్నాయి. ఇలా పుట్టిన వ్యక్తి ఆ తర్వాత కాలంలో తెలుగు ప్రేక్షకలోకానికి పాటల నైవేద్యం పెట్టే పదార్చకుడిగా మారుస్తుందని వేటూరి సైతం ఊహించలేదు.

వేటూరి కారణజన్ముడు…తెలుగు సినీ సరస్వతికి పాటల మాలలు అల్లడం కోసం ఈ నేలపై జన్మించిన సృజనశీలి-వేటూరి. అందుకే ఆయన జననం తెలుగు సినిమా పాటకు కొత్త జన్మదినం అయింది. జానపదానికి.. మాస్‌ పదానికి జ్ఞానపదం అయింది.

హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను ఆర్పించిన వాక్య వైద్యుడు – వేటూరి. ఆత్రేయలోని భావసౌందర్యాన్ని, సి.నారాయణరెడ్డిలోని భాషా పటిమను… శ్రీశ్రీ లోని సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చిన మూర్తి… వేటూరి సుందరరామమూర్తి. ప్రేక్షకుల మనోభావాలకు తగ్గట్టుగా పాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి.

వేటూరి కెరీర్‌- మొదట జర్నలిస్ట్‌గా మొదలైంది. వార్తా రచన, రిపోర్టింగ్‌లోని సైతం ఆయన భావగర్భితమైన ప్రయోగాలు చేసేవారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో ఆయన పాత్రికేయ జీవితం… కళాతపస్వి కె.విశ్వనాథ్‌- పిలుపుతో సినీగేయ రచయితగా కొత్త మలుపు తిరిగింది. అలా సుందరరాముడు- ‘ఓ సీత కథ’ సినిమా ద్వారా… విశ్వనాథుడు అంటే శివుడి నిర్దేశకత్వంలో పాటని పరవళ్లు తొక్కించాడు. వేటూరి కలం సోకిన సినీ సంగీత నాదం ఝమ్మంది. పాదం సయ్యంది. ప్రేక్షకుల తనువులు ఆ నాదంతో పాటే ఊగాయి.

1970 దశకంలో తెలుగు సినిమా పాటల ప్రపంచానికి పిల్ల తెమ్మరలా వచ్చి… ప్రభంజనమై వీచి… సునామీలా చుట్టుముట్టినవాడు – వేటూరి. కృషి + క్రియేటివిటీ కలసిన ఆయన గీతర్షి అయ్యారు. మహాపురుషుడయ్యారు. తెలుగునేల మీద తరతరాలకూ తరగని పాటల నిధి అయ్యారు.

తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన సంవత్సరం. మాస్‌ సినిమాకు మాస్ పాటలకు పట్టం కట్టిన నిర్ణాయక వత్సరం. ఆ టైంలో ఆ గౌరవాన్ని పొందిన సినిమాలే అడవిరాముడు, యమగోల. ఈ సినిమాల్లో వేటూరి రాసిన పాటలు ప్రేక్షకుల హృదయాలను పారేసుకునేలా చేశాయి. అమ్మతోడు అబ్బతోడు పాట… ఓలమ్మి తిక్కరేగిందా పాటలు నేలబారుగా ఉన్నాయనే విమర్శలను ఎదుర్కొన్నాయి. కానీ అవే… నేలక్లాసు మాస్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందాయి. ఆ తరంలో వేటూరి రాసిన చిలక్కొట్టుడు పాట ట్రెండ్ సెట్టరే అయ్యింది.

ప్రేక్షకుల మనోభావాలను చదివినట్లుగా వారు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారో ఏ సరసాన్ని, ఏ శృంగారాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలను మేలి ముసుగు భావనలతో తన పాటలో పలికించడంలో వేటూరికి వేటూరే సాటి. ఈ పాటల వేటగాడు- ఆకుచాటు పిందె లోని అందాలను రమ్యంగా వ్యక్తీకరించి వానపాటల ట్రెండ్‌కు నాంది పలికాడు.

1983 నాటికి తెలుగు యూత్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వారిలోని ఎమోషన్స్‌కి తగినట్లుగా పాటలోని వరుసలు… వారి హృదయ వరుసలు ట్యూన్ అయ్యేలా రాసి గర్ల్‌ఫ్రెండ్ నచ్చిన తర్వాతి ఆనందాన్ని ఇంగ్లీష్‌ పదాలైన ఛాన్సు, రొమాన్సు, యురేకా వంటి ప్రయోగాలతో నభూతో నభవిష్యతి అన్న తరహాలో అందించాడు.

ఆదికవి వాల్మీకి ‘శోకం నుంచే శ్లోకం పుడుతుంది అన్నాడు. అలాగే ఈ సినీకవి తను రాసిన పాటల్లో అద్భుతమైన సింబాలిజమ్‌ను అలాగే కవితాత్మను సైతం ప్రవేశపెట్టారు. సప్తపది సినిమాలోని గోవుళ్లు తెల్లన… అనే పాటలోని చరణంలో ఈ భావాన్ని అనన్య సామాన్యంగా వ్యక్తీకరించాడు. పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలనీ… అందులోంచి రసవంతమైన గేయాలు వస్తాయని భావగర్భితంగా చెప్పారు.

–మామిడి హరికృష్ణ

26 Comments
 1. vinay chakravarthi September 16, 2009 / Reply
 2. Aravind R Babu September 16, 2009 / Reply
 3. laxmi September 16, 2009 / Reply
 4. వేటూరి September 16, 2009 / Reply
 5. శ్రీరామ్ వేలమూరి September 16, 2009 / Reply
 6. rAsEgA September 16, 2009 / Reply
 7. naag September 16, 2009 / Reply
 8. telugu-manishi September 16, 2009 / Reply
 9. చదువరి September 17, 2009 / Reply
 10. laxmi September 17, 2009 / Reply
 11. chandrasen September 18, 2009 / Reply
 12. రామ September 20, 2009 / Reply
  • G September 20, 2009 / Reply
 13. sheela September 20, 2009 / Reply
 14. రమేష్ పంచకర్ల September 20, 2009 / Reply
 15. jaya kiran September 21, 2009 / Reply
 16. rameshreddy September 21, 2009 / Reply
 17. rajkumar September 21, 2009 / Reply
 18. ravi s September 22, 2009 / Reply
 19. ravi September 30, 2009 / Reply
 20. lekhini October 30, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *