Menu

వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం

vande.JPGకథాసంగ్రహం:
గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘు పట్టభద్రుడు.తల్లిదండ్రుల కట్నం ఆశను ఎదిరించి అతను జానకిని వివాహమాడతాడు. కాపురానికి వచ్చిన జానకిని అత్తగారు అడుగడుగునా ఆరడి పెడుతుంటుంది. నోరులేని మావగారు నిస్సహాయంగా చూస్తుంటాడు. పేదరాలైన జానకి అన్నీ భరిస్తుంటుంది.అత్తింట ఆమెకు భర్త ప్రేమే స్వాంతన. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘుకు ఓ పట్టాన ఉద్యోగం దొరకదు. చివరికి అతను ఉద్యోగాన్వేషణలో బస్తీ బయలుదేరి వెడతాడు. అక్కడ మోసానికి గురవుతాడు. ఇక్కడ జానకికి అత్తగారి ఆరడి ఎక్కువ అవుతుంది. భర్తను వెదుక్కుంటూ కొడుకుతో ఆమె కూడా బస్తీ బయలుదేరి వెడుతుంది. ఉద్యోగాన్వేషణలో వున్న రఘు ఒకరోజు లాటరీ టిక్కెట్టు కొంటాడు. ఆ టిక్కెట్టుకు యాభై వేల బహుమతి వస్తుంది. సంతోషంగా ఇంటికి వెళ్ళిన రఘుకు తల్లి జానకి ఎటో వెళ్ళిపోయిందని లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంది. మారు మనువు చేసుకోమంటుంది. తిరస్కరించిన రఘు పుట్టెడు దుఃఖంతో బస్తీ తిరిగివస్తాడు. సహాధ్యాయి జయతో కలిసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టి తనలాంటి నిరుద్యోగులు చాలామందికి ఉపాధి కల్పిస్తాడూ. తన గురిమ్చి, జయ గురించి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నా పట్టించుకోడు. బస్తీచేరిన జానకి పూలదండలు కట్టి కొడుకుతో అమ్మిస్తుంటుంది. ఆ పిల్లవాడి రఘి, జయలను ఆకట్టుకుంటాడు. అయితే, రఘుకు అతను తన కొడుకని మాత్రం తెలియదు. అనుకోకుండా ఒకరోజు జయ, రఘులను చూసిన జానకి అపార్థం చేసుకుంటుంది. వాళ్ళమధ్యనుంచి తను తప్పుకోవాలని అనుకుంటుంది. చివరికి అపార్థాలు తొలిగి అంతా ఒకటవుతారు.

నిర్మాణ విశేషాలు:
వాహిని పతాకం మీద బి.యెన్.రెడ్డి తీసిన మొదటి సినిమా ఇది. బి.యెన్.రెడ్డి చదువంతా మద్రాసులోనే జరిగినా, ఆయ్న తరుచూ తమ స్వంత వూరు కొత్తపల్లి వెళ్ళి వస్తుండేవారు. తమ వూళ్ళో ఒఅక ఉన్నత కుటూంబంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని అంతకుముందెప్పుడో ఆయన్ ’మంగళసూత్రం’ అనే నవలిక రాశారు.మొదటి సినిమాకు కథ కోసం అన్వేషిస్తున్నప్పుడు ఆయనకు ఆ నవలిక గుర్తుకువచ్చింది. వెంటనే దాన్ని రామ్‍నాథ్ కు చూపించారు. చూసీచూడంగానే ఆ కథలో దమ్ముందని రామ్‍నాథ్ కు అర్థమైపోయింది. తనే స్క్రీన్‍ప్లే రాసి దానికి సినిమా ఆకృతి ఇచ్చారు. సముద్రాల రాఘవాచార్య మాటలు, పాటలు రాశారు. సంగీత బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు బి.యెన్ వెంటనే నాగయ్య పేరు సూచించారు. అసలు ’గృహలక్ష్మి” సినిమా తీస్తున్నప్పుడు హెచ్.ఎం.రెడ్డికి నాగయ్యను పరిచయం చేసి, ఆ సినిమాలో నాగయ్యకు నాయిక అన్న వేషం ఇప్పించింది బి.యెన్.రెడ్డే. నాగయ్యకు నటుడిగా ఇది రెండో సినిమా, సంగీత దర్శకునిగా మొదటి సినిమా.

వరకట్న దురాచారం, నిరుద్యోగ పెనుభూతం ’వందేమాతరం’ కథకు మూలదినుసులు. అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వాంఛ కూడా కొన్ని సన్నివేశాల్లో పాత్రధారులచేత బలంగా చెప్పించారు. తెలుగు సినిమాలకు అప్పటికి ఇంకా ప్లేబ్యాక్ పద్ధతి ఇంకా రాలేదు. వందేమాతరం సినిమాలో నాగయ్య, కాంచనమాల, కళ్యాణి తమ పాటలు తామే పాడుకున్నారు. పౌరాణికాలు రాజ్యమేలుతున్న ఆరోజుల్లో సాంఘికమే అయినా వందేమాతరం సినిమాలో దాదాపు ఇరవై పాటలున్నాయి. మూడు పద్యాలు కూడా వున్నాయి. రఘి తన కాలేజీ మిత్రులతో కలిసి హంపీ పిక్నిక్కు వెళ్ళినప్పుడూ అక్కడా ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మి దీనావస్థను చూసి పాడే ’ఇట తెల్గు కవికోటి…’ అన్న పద్యం ఆ రోజుల్లో బాగా ప్రజాదరణ పొందింది.

కె.వి.రెడ్డి ఈ సినిమాకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. నిబద్ధత, క్రమశిక్షణ విషయంలో ఆయన బి.యెన్.కు డిటో. కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాకు సహాయ దర్శకుడు. వీళ్ళిద్దరి సహాకారం లేకపోతే తను దర్శకత్వం మీద శ్రద్ధ చూపించడం చాలా కష్టమయ్యేదని పలు సందర్భాల్లో బి.యెన్. చెప్పారు. ఒకరినొకరు ఆప్యాయంగా ’బ్రదర్’ అని పిలుచుకునేవారు. ఈ పిలుపులే ఆ తరువాత విజయా సంస్థకు కూడా పాకాయి. అక్కడ పనిచేసిన ఎన్.టి.రామారావుకు అలావాటయ్యాయి. ఆయ్న తన జీవిత కాలమంతా అందరినీ బ్రదర్ అని పిలిచేవారు. కె.వి.రెడ్డి ఈ సినిమాలో హీరో కాలేజీ సహాధ్యాయిగా చిన్న వేషం కూడా వేశారు.

పర్ఫెక్షనిజం కోసం బి.ఎన్. పడే తాపత్రయం ఒక్కోసారి తారలకు ప్రాణాంతకం అయ్యేది. కళ్యాణికి ఇదే తొలిచిత్రం. అయినా ఆవిడ ఎలాగోలా బయటపడేది. కాంచనమాల మాత్రం పలుసందర్భాల్లో బి.యెన్.కు దొరికిపోయేది.హెవీ సీన్లలో తను అనుకున్న ఎఫెక్ట్ రావడం లేదని చాలా సందర్భాల్లో ఆయన ఆమెను విసుక్కునేవారు.దాంతో ఒకసారి సెట్లోనే కాంచనమాల బావురుమమ్ది. అయితే ఇంతటీ చాదస్తుడినీ సముద్రాల వారు మాత్రం బాగా ఆకట్టుకునేవారు. ఈ సినిమాలో పాట్లన్నీ ఆయనే రాశారు. ఒక పాటకు ఆయన ఏకంగా ఇరవై వెర్షన్లు రాశారు. నాగయ్య ఒకటికి పదిసార్లు రిహార్సిల్స్ చేయించేవారు. ఈ సంగీత సృజన కోసం గంటల తరబడి అంతా కలిసి పనిచేయవలిసి వచ్చేది.

దేశం ఇంకా తెల్లవాడీ పాలనలోనే వున్న రోజులవి. అప్పట్లో ’వందేమాతరం’ అని ఉచ్ఛరించడమే నేరం. అలాంటిది ఈ సినిమాకు ఏకంగా పేరే ’వందేమాతరం’ అని పెట్టారు. సెన్సారువారితో ఎలాంటి తకరారు రాకుండా కింద ’మంగళసూత్రం’ అని ఇంకో టైటిల్ పెట్టారు. సినిమాలో వందేమాతరం ప్రస్తావన ఒక్కచోటే వుంటుంది. కథానాయకుడు లాటరీ టిక్కెట్టు కొంటాడు. విక్రేత ఏం పేరు రాసుకొమ్మంటారని అడిగితే వందేమాతరం అని రాసుకోమంటాడు. అయితే వీళ్ళనుకున్నట్టు ఈ విషయంలో కాకుండా ఇంకో విధంగా సెన్సార్నుంచి సమస్య వచ్చింది. కథనాయకుడు రఘు సినిమాలో ఉద్యోగం దొరకలేదన్న నిర్వేదంతో తన డిగ్రీ సర్టిఫికెటున్న పటాన్ని నేలకేసి బద్దలుకొడతాడు. తరువాత ఉద్యోగం ఇక పూర్తిగా ఎండమావేనని తేలిపోవడంతో డిగ్రీ సర్టిఫికెట్ను చించి పోగులు పెడతాడు. సెన్సార్ బోర్డులో అప్పుడు శామ్యూల్ రంగనాథన్ అనే విద్యావేత్త వుండేవాడు. ఆయన ఈ రెండు సన్నివేశాల పట్లా తీవ్ర అభ్యంతరం చెప్పాడు. విశ్వవిద్యాలయ విద్యను ఇది అవమానించడమేనని వాదించారు. అయితే, కథానాయకుడు ఉద్యోగం దొరకని ఒకానొక దుర్భర పరిస్థితిలో తీవ్ర మానసిక వేదనకు గురై ఆ పని చేశాడన్న తమ ఉద్దేశ్యం తప్ప విశ్వవిద్యాలయాలను అవామానింవడం ఎంతమాత్రం కాదని బి.ఎన్. వివరించడంతో సినిమాకు సెన్సార్ గండం తప్పింది. ’వందేమాతరం’ సినిమా 1939 ద్వితీయార్థంలో విడుదలయ్యింది.దక్షిణాది అంతటా విజయదుందుభి మోగించింది, వాహినికి కాసుల పంట పండించింది.కాంచనమాల యువతరం కలరాణి అయిపోయింది.

రచన: శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి

సేకరణ: “కళాత్మక దర్శకుడు-బి.యెన్.రెడ్డి’ అన్న గ్రంధంనుండి.

నిర్మాణం:వాహినీ ఫిలింస్

కథ:బి.యెన్.రెడ్డి

స్క్రీన్‍ప్లే:కె.రామ్‍నాథ్

మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య

సంగీతం: వి. నాగయ్య

ఫోటోగ్రఫీ:కె.రామ్‍నాథ్

కళ,శబ్దగ్రహణం: ఎ.కె.శేఖర్

ఎడిటింగ్: టి.వి.ఎస్.మణి

నటీనటవర్గం: నాగయ్య,కాంచనమాల, కళ్యాణి

7 Comments
  1. vinay chakravarthi September 3, 2009 /
  2. jahnavi September 7, 2009 /
  3. jahnavi September 7, 2009 /
  4. Sowmya February 1, 2011 /
  5. Sowmya February 3, 2011 /
    • Sowmya February 3, 2011 /